స్వర్గీయ” భరాగో’కి బహిరంగ లేఖ – గొరుసు , మూలింటామె – నామిని :

భరాగో గారూ.. మీరు కనిపించక సరిగ్గా నాలుగేళ్లు పూర్తి. సత్యభామగారి జాడ తెలుసుకొస్తానని మమ్మల్ని మభ్యపెట్టి వెళ్లడం వెళ్లడమే.. ఇప్పటికి ఐపు లేరు. ఇలా మమ్మల్ని మధ్యంతరంగా వదిలేసి వెళిపోవడం న్యాయమా చెప్పండి? మొన్న మీ అనుంగు మిత్రులు రామడుగు రాధాకృష్ణమూర్తి నాకు ఫోన్‌చేసి ‘రామగోపాలంగారి సంగతి యావైనా తెలిసిందా?’ అని కన్నీళ్ళెట్టుకుని అడిగారు. మీ గురించి ఎవరిని వాకబు చేసినా లాభం లేకపోయింది కదా. అందుకే ‘ఉండండి.. ఒకఉత్తరం రాసి పడేస్తాను’ అని రామడుగు గారికి మాటిచ్చి, ఇదిగో ఇలా మొదలెట్టాను. నాలేఖ అందగానే బయల్దేరండి!
ఇక్కడ పనులన్నీ మధ్యంతరంగా వదిలేసి వెళ్లిపోయారు మీరు. ‘నూట పదహార్లు’, ‘మరో నూట పదహార్లు’ తీసుకురాగానే సరిపోయిందా? అలాంటి నూట పదహార్లు ఇంకా ఎన్ని రావాలో. మట్టిలో మాణిక్యాలుంటాయిని తెలుసు కానీ, వాటిని గుర్తుపట్టి మాకందించేవోరు ఉండాలి కదా. మీరు ఆ నూట పదహార్లు తీసుకురాబట్టే కదా ‘ఎంత మధుర సీమ ప్రియతమా’, ‘కలల అలలపై తేలెను మనసు మల్లెపూవై’, ‘అందానికి అందం నేనే జీవన మకరందం నేనే’, ‘నిదురమ్మా.. కదలీ వేగమే రావమ్మా’, ‘పండూ వెన్నెలా మనసు నిండా వెన్నెలా’ లాంటి రసగుళికలు వినగలిగాము.
సాలూరి రాజేశ్వరరావు గారి పాట మీనోట వినడమనేది మా చెవుల్లో అమృతం పోసినట్టే కదా. సరే, అదలా ఉంచండి. సాలూరిగారి సావనీర్ తెద్దామని మాటిచ్చారు నాకు. అదీ పెండింగులో పడిపోయింది. రావిశాస్త్రి, అడవి బాపిరాజు, రావు బాలసరస్వతిదేవి, భానుమతి, సుశీల గార్ల సావనీర్లని మీరు తీసుకొచ్చిన చందంగా మరొకరు తీసుకురాగలరా? మీరు పూనుకోబట్టే కదా ఆచంట జానకీరామ్ మాకు దగ్గరయ్యారు. ఇంకా మీరు తీసుకురావలసిన పాటలు, పుస్తకాలు, సావనీర్లూ బోల్డు మిగిలిపోయాయి. వీటిని మీ అంత నాణ్యంగా ప్రజల్లోకి తీసుకెళ్లే వారు మరొకరు లేరంటే నమ్మండి.
అన్నట్టు.. నడవలేననే బెంగ మీకుందేమో! నడక మీకో సమస్యే కాదు. కుర్చీలో ఉండే పనులు పురమాయించీగల్రు. పదిహేనేళ్లపాటు మీ చుట్టూ బొంగరంలా తిరిగినోడ్ని… మీగురించి నాకు అంతమాత్రం తెలీదనుకోకండి. మీరు ‘వంటొచ్చిన మగాడే’ కాదు సుమా.. సాహిత్య, సంగీతాల ఒడుపు తెలిసిన చమత్కారులూనూ. నా మాటిని వేగిరం వచ్చీయండి. వచ్చేస్తారు కదూ.
మీరు వెళ్లిపోయారు కానీ, మీ తమాషా కబుర్లు మాటిమాటికీ గుర్తొచ్చి కురుపులా సలుపుతూ కళ్లు చెమ్మగిల్లని రోజంటూ ఉందా? కనకలతగారి పెళ్లికి ముందొకసారి ‘అబ్బాయిల్ని చూస్తున్నారా?’ అని నే మాటవరసకంటే మీరు ఒక చేతి వేలు చూపిస్తూ ‘ఒక్కడు చాలు’ అని గుంభనంగా నవ్వలేదూ? ఆనక ఆ ఒక్కడూ కళ్లెదుటే అమాంతం అదృశ్యమైపోతే భూగోళమంత బాధని మీ గుప్పెడు గుండెలో దాచుకుని మాకందరికీ ధైర్యం చెప్పలేదూ! మీకు ఏ చిన్న జలుబు చేసినా చిటికెలో మీ ముందు వాలిపోయే ధన్వంతరి నాయిక్‌గారుండగా మీకేల బెంగ? వచ్చీయండి వచ్చీయండి… బేగొచ్చేస్తారు కదూ!
‘ఇట్లు మీ విధేయుడు’
– గొరుసు

 

 

మూలింటామె – నామిని

చీమంతమ్మ యింటికి పోతే బాగుండును, లేదంటే చీమంతమ్మే యీడికొస్తే కడుప్మంట కొంచానికి కొంచిమన్నా చల్లారును అని అనుకుంటూ వుండంగా మొలకమ్మ పెట్రమాక్సు లైట్టు మాదిర్తో యెలిగిపోతా, ‘ఏమే మూలింటి మొదులా! తలకాయి నెప్పి అణసరయ్యిందా; కూతురు తిరప్తి నుంచొచ్చినాక యింగా జాస్తయ్యిందా?’ అంటా వొచ్చి పక్కన్నే బండ మింద కుచ్చునింది. వొళ్లో అబ్బనాకారంగా కుచ్చోనుండిన నల్లపిల్లి దుసబెరుక్కోని పట్టూ పరుగు!
మొలకమ్మను ఏమీ ఎక్కడా అని అనకుండా మూలింటామె నల్లపిల్లితో, ‘నువ్వు నల్లదానివి కొడకా! నరుల కన్ను నీ మిందనే వుంటాది, నువ్వు యీదల్లోకి పోబాక. నా బట్టల్ నా సవుతుల్ నిన్ను బట్టుకోని బలీయబోతారు వాళ్ల గుండాల ముందు. నల్ల పుట్టక బుట్టినావు జాగర్త.’ అనింది.
మొలకమ్మ వొళ్లు పొగలుబోతా, ‘నువ్వాడదా, గాడిదా? నీ కొంపలో యింత జరిగినా ఆ పిల్లుల్తో నీ చెళ్ల బోలేదే! తెల్లారి లేచి ఆ పిల్లుల మొకాలు జూసే నీ కొంపలో యింత జరిగుండేది లోకానికే యిచ్చిత్రంగా! ఇంగన్నా నీకు బుద్దొస్తుండాదా?’ అని పిల్లుల మిందికి పొయ్యింది.
మూలింటామెకి వుచ్చిన యెంటిక చివక్కన పైకి లేచినా, అణుసుకోని, ‘నోరూ వాయీ లేని పిల్లులేమి జేసినాయి నిన్ను మొలకా! నన్నను పడతా. వాటిని అనబాక. అవి బేదం బెట్టుకుంటాయి. వాటి కత నీకు తెల్దు. పిల్లులు పున్నాత్మురాళ్లు’ అనింది మంచిగానే.
‘నీ వాటం జూస్తా వుంటే కడుప్మంట బొయ్ నవ్వొస్తా వుండాదే మూలింటా! నీకు దోడు బొయ్యిందొగటి రాగలరాళ్లు కొట్టకపోతున్నా ఎరగనోచ్ అంటా వుండి పుల్లిస్త రాకులు ఎగిరి పోతుంటే నెత్తీ నోరూ కొట్టుకునిందట. అట్టుండాది నీ వాటం. నీ మనవరాలు జాత్తక్కవ నా బట్టతో పూడిసి వూరు మొత్తానికీ చెడ్డ పేరు దెచ్చినా నీకు లెక్కా జమా లేకుండా వుండాది. నల్ల పిల్లికి జాగర్తలు చెప్పే లంజివి నీ కోడాలికి చెప్పక పోతివా!’ అని వక్కాకెంగిలి ఎర్రంగా వూంచింది మిట్టమింద మొలకమ్మ.
****
‘నా మనవరాలు గురమ్మకు వొక పెట్ట పిల్లను పైరు జేసుకోమని యిచ్చిన కత నాకు తెలుసునా! గురమ్మ చెప్తేనే గదా తెలిసింది. మాలపల్లి దాకా పోయి ఒక కూతేసి పిల్చకొస్తే కడుపారా తిన్దా!’ అనిపించి మాలపల్లికి ఎలబారాలను కొనింది. ‘నేను లేంది జూసి వీళ్లు ఏమేమి మాట్లాడుకోని వొకరిలో వొకరు కలుసుకొని పోతారో! పోదారా వొద్దా’ అని కొంచేపు గుంజకలాడి, తీరా మాలపల్లికి పోతే దేముడి దరమ్మాన గురమ్మ వుండింది. గురమ్మ మాటతో గూడా కుశాలగా మొదుటామె యింటికి మొదుటామె యెనకాన నడస్తా, ‘ఒక మాలదాన్ని కోడి కూర తిందువు రా అని మాలపల్లికొచ్చి ఎవురన్నా పిల్చకపోదురా! మంచోళ్ల బుద్ది మాంసం కాడ తెలిస్తిందంటారు. మూలింటక్కా, నువ్వు బాద పడబాక. నీ మనవరాల్ని యీ పొద్దు అందురూ గూడా జిల్లా పటంగి అని అంటా వుండొచ్చు. నీ బిడ్డి జిల్లా పటంగో, పతివర్త కూతురో ఎవురికి తెలుసు, దేముడికి దా తెలవాల.’ అనింది.
దీనికి, ‘గురివీ! నా కొడుక్కి సమందం జూడాలంటుండాది నా కూతురు. నా కూతురికి డోలు కొడతా వుండాది దాని పెద్దం. బీమారం నుంచి దాని పెద్దం దాని అందమ్ముడికి సమందం తెచ్చినట్టే అనిపిస్తుండాది. నువ్విప్పుడు మా యింటికొస్తుండావు గదా, పెండ్లి సమందం కత నీ ముందర గాన ఎత్తినారంటే – నువ్వు గెట్టంగా చెప్పు. నా మనవరాలి బిడ్లకు సవిత్తల్లి పోరుండకుండా చెయ్ నా కూతరా!’ అని ఏడస్తా నడస్తుండాది మొదుటామె.
ఈ మిట్టూరులో పుట్టి, పెరిగి, బీమారానికి కోడాలిగా పోయ్‌న ఆడదే గదా ఎర్రక్క. మాలోళ్ల గురివిని చూడంగానే, గురివిని గుర్తుబట్టి, నడిపమ్మితో, “చూడు నడుపమ్మీ! నేను యాడ గొంతు కానేటట్టు కోడిపుంజు కూర తినేస్తానేమోనని వొప్పక, ‘మాలోళ్ల గురివి గూడా వుండాది, ఎడెనిమిది పిల్లులు గూడా వుండాయి. నువ్వు కొంచిం మితంగా తిను.’ అని చెప్పేదానికి, ఎండ మింద బడి మాలపల్లికి పోయ్ పిలచకొచ్చింది చూడు. నేను ముందు ఎంగిలి జేసిన రొమ్మును, మళ్ల ఒకట్రెండు సమచ్చరాలకు ఎంగిలి జేసిన ముండిది. నన్ను అక్క అని యిది తలిస్తే – నాతో గూడా కోడికూర తినేదానికి వొక మాలదాన్ని పిలచకొచ్చునా! అంటే దీనికి నేను అంచన బుట్టి పంచన పెరిగిన సుట్టంగాదు. యీ మాలది దీనికి సుట్టం. కాబట్టే దీని మనవరాలికీ పొద్దు వొక అరవమాదిగోడు మిండగోడయినాడు. నడిపమ్మీ, నేను తిన్నింకీ కోడికూర, నాకంత శెనిగ్గింజలూరుబిండి చెయ్.” అని కాసుకు గాకుండా మాట్లాడింది.
ఈ మాటలకు గురమ్మేం రోస పడలా. ‘మూలింటక్కా బూమ్మింద కేర్ మని పడినప్పుట్ను ంచీ యిట్టాటి మాటలే యింటుండా. మీఅక్క అన్న మాట్లకి నేను బేదం బెట్టుకోను. యీ జలమ్మకింతే!’- మూలింటామె యాడ బాద పెట్టుకుంటాదో అని నంగిగా మాట్లాడింది గురివి.
– నామిని

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.