శ్రీరామాయణ పరమార్ధం
‘’భక్త మహాకవి తులసీ దాసు ‘’’సీతారామ మయంబీ జగతి ‘’అన్నా ,భువన మెల్ల నీవై ఉండగా బ్రోవ భారమా ?’’అని త్యాగరాజు ప్రశ్నించినా అందరి అనుభూతిలో ఒకే ఒక విభూతి వెలుగుతున్నట్లు గోచరిస్తుంది.అది లౌకికం గా భవభూతి .,పారమార్ధికం గా ఆత్మ విభూతి ‘.అదే రామాయణ పరమార్ధం బోధించే ఆత్మాను భూతి ‘’అన్నారు శ్రీమద్రామాయణాన్ని 18 సంవత్సరాలు దీక్షగా పారాయణం చేసి జీర్ణించుకొని అను భూతి పొంది ,అదొక అఖండ ప్రాణాయన మని భావించిన స్వర్గీయ శ్రీ ఇల పావులూరి పాండు రంగా రావు గారు .రామాయణం తనను ‘’జీవిని ‘’చేసిందన్నారు .ఏదో ఒక సమాజానికి సంబంధిన రచన కాదు రామాయణం .అందరికీ సంబంధిన అను భూతిని ఎవరికి వారి వారి అను భూతి అని పించేట్లు పంచి పెట్టిన’’ జీవరసాయనం’’ అన్నారు ఏంతో భక్తిగా .జీవ కోటికి జీవ లక్షణాలు ప్రసాదించే ‘’రామకోటి’’ అంటారాయన .కౌసల్య గర్భం లోనుంచి ఆవిష్కరించుకొన్న ‘’ఆదిత్య హృదయం ‘’శ్రీ రామ చంద్రోదయం అని పులకించి పోతారు ‘’కారుణ్యాలయ ,భక్త వరద నిను కన్నది కానుపు రామా !’’అని భక్త రామ దాసు రామ జననం లో రామ –ఆయనాన్ని సందర్శించి తరించాడని మెచ్చారు .ఈ ఆయనాన్ని ఆవిష్కరించిన తపస్వి ఆదికవి వాల్మీకి మహర్షి అని కీర్తిస్తారు ఇలపావులూరి వారు .

![]()
వాల్మీకి పెట్టు కొన్న పేరు లో నే రామాయణ పరమార్ధం ఇమిడి ఉంది .’’రామ’’ శబ్దం లోని రామణీయకత ,,’’ఆయన ‘’ శబ్దం లోని ఆచార్యత రెండింటి సహజ సమ్మేళనమే రామాయణ రసాయనం అంటారు పాండురంగా రావు గారు .తనలో తానూ రమిస్తూ ,తనతో బాటు తోటి వారిన్నీ రమింప జేస్తూ ,,ఆనంద పరుస్తూ నిరంతర నిర్విరామం గా నిత్య సత్య సందీప్తి తో నిర్లిప్తం గా నియత కర్మలను ఆచరిస్తూ ,సమభావం తో సంచరించటమే ‘’రామాయణీయత ‘’అన్నారు .ఇది అన్నికాలాలకు అన్ని దేశాలకు , ,అందరికి వర్తించి ప్రపంచాన్ని ప్రవర్తింప జేసే చిరంతన చైతన్యం అన్నారు ఇలపావులూరి .ఈ పరమ తత్వాన్ని రమణీయం గా ప్రసన్నం గా తన జీవిత –ఆయనం లో సాధించి అందరికి అందులోని ఆనందాన్ని ప్రసాదించిన ప్రసన్న రాఘవుడు రామ భద్రుడు .
సామాన్య మానవులు ఎలా ప్రవర్తించాలి అనేదే రామాయణం లోకానికి చెప్పే హితవు .అసత్యాన్ని సత్యం తో ,అన్యాయాన్ని న్యాయం తో ,స్వార్ధాన్ని పరమార్ధం తో ,హింసను అహింస తో ,మాయను మమ కారం తో ,అసూయను అనురాగం తో ఎలా జయించాలి అనేదే రామాయణం ప్రపంచానికి అందించే సందేశం .వీటిని చాటి చెప్పేందుకే,సాధించటానికే సీతా రాములు అష్టకష్టాలు పడ్డారు .అందుకే వారి చరిత్ర ఈ నాటికీ నిలిచి ఉందంటారు .’’ఇదం హాయ చరితం లోకే ప్రతిస్టాస్యతి శాశ్వతం ‘’అని మంత్రం కోవిదుడు అయిన సుమంత్రుడు దుఖం తో కుమిలి పోతున్న కౌసల్యా దశరధులకు చెప్పాడు .కాని ఆ సుమంత్రుడే రామాదులను అడవిలో వదిలేసి వచ్చేందుకు ఏంతో బాధ పడతాడు .ఇది ప్రతి వ్యక్తీ జీవితం లో ప్రతి దినం ఎదుర్కొనే చిక్కు ప్రశ్న .రామాయణం లో ఇలాంటి వి అడుగడుగునా కాని పిస్తాయి .వాటిని వివేకం తో పరిశీలించి మనసుకు నచ్చ చెప్పు కుంటూ ఉండటమే జీవితం మనకు నేర్పే గుణ పాఠంఅని వివరిస్తారు .ఈ గుణ పాఠాన్నేరమణీయం గా మనకు బోధిస్తుంది రామాయణం .
యదార్ధం గా రామాయణం కేవలం కద కాదు .ఆయనమూ కాదు ఇది ఒక ‘’ఆత్మ దర్శనం’’ .రామాయణ పాత్రలు నిత్య జీవితం లో మనకు కనిపించేవే .అందుకే రామాయణం ప్రతి రోజు మనకు కనిపించే వ్యక్తుల్లో ,జరిగే వృత్తాంతాలలో ,అనుభవించే కష్టాల్లో ప్రతి ఫలిస్తూనే ఉంటుంది .వాల్మీకి భాషా ప్రపంచానికి ప్రసాదించిన వాగ్విభూతి నే తాను తన మాటల్లో చెప్పానని ఇలపావులూరి వారు వినయం గా చెప్పారు .తనది వాల్మీకి ప్రవచించిన’’ ప్రణవ నాదానికి అను నాదం ‘’మాత్రమె నని నిగర్వం గా చాటుకొన్నారు .ఆదికవిది ఆర్ష హృదయం చూసిన యానం అయితే తను చెప్పింది ఆర్త హృదయం చేసిన పయనం అంటారు వినమ్రం గా .శ్రీకారం లాంటి సేతమ్మ ,ఓంకారం లాంటి రామయ్య చేదోడు వాదోడుగా ఉంటె జీవితం సఫలం అన్నారు .
దశరధ రాముడు తారక రాముడు కావాలి .చైత్ర శుక్ల నవమి పునర్వసు నక్షత్రం లో కర్కాటక లగ్నం లో చంద్ర గురు మొదలైన అయిదు గ్రహాలూ ఉచ్చస్తితి లోస్వక్షేత్రం లో ఉండగా కౌసల్య గర్భం నుండి శ్రీ రామ చంద్రోదయమైంది .రాముడికి రాత్రి నిద్రపట్టదట .కారణం ఆదిశేషుడు పానుపుగా లేక పోవటమేనేమో ?సత్య పరాక్రముడు రాముడైతే సత్య సంధుడు దశరధుడు .విశ్వామిత్రునికి కొత్త ఆయుధాలను సృష్టించే శక్తి ఉందని అవి రాముడికి ఉపయోగ పడుతాయని వసిస్టమహర్షి దశరధుడికి నచ్చ చెప్పి వెంట పంపించేట్లు చేస్తాడు .ధనుర్బాణాలతో శ్రీరామ లక్ష్మణులు అగ్ని దేవతల్లాగా అంటే కుమార స్వామి విశాఖుడు లాగా స్థాణువు అంటే శివ స్వరూపం అయిన మహర్షి వెంట వెళ్ళారు అంటాడు మహర్షి వాల్మీకి .
రామాయణానికి మూల కందమైన రాక్షస సంహారం తాటక వధ తో పునాది ఏర్పడింది .ముందు యానం .తరువాత సంహారం .మారీచ సుబాహు వధ ముందు తాటక సంహారం తమో నివృత్తి సూచకం .తమోప సంహారమే తాటక వధ .రాముడు సందేహిస్తే పూర్వం మంధర ను ఇంద్రుడు చంపిన వృత్తాంతం ,భ్రుగు మహర్షి భార్య లోకాన్ని అనింద్రం చెయ్యాలని ప్రయత్నిస్తే విష్ణువు ఆమె ను సంహరించటం చెప్పి ‘’ఇది నా. శాసనం ‘’అని విశ్వామిత్ర ముని ప్రేమగా హితవు బోధిస్తాడు .శిరసావహించి రాముడు తాటకను చంపేస్తాడు .దుస్ట శిక్షణకూ ,రాక్షస సంహరానికీ రామాయణం లో ఇది నాంది .
అయోధ్య నుంచి శ్రీ రామ చంద్రుని యానం అంటే గమనం ప్రారంభం అవగానే బల ,అతి బల అనే విద్యలు మహర్షి స్వాధీనం చేశాడు .ఆ విద్యా బలం తో రామ యానం అంటే రామాయణం సుఖం గా సాగుతుంది . రాముడికి మాత్రమె ముని అస్త్ర బలాలను ఉపదేశించాడు .లక్ష్మణుడికేమీ ఇవ్వలేదు .కాని అన్నదమ్ములిద్దరిలో రాగ ద్వేషాలు లేనే లేక పోవటం గమనించాలి . ఇద్దరిలో ఒకే ప్రాణం ప్రచరిస్తూ ఉంటుంది .శరీరాలు వేరైనా తత్త్వం ఒకటే .పయనం గమనం లేక యానం రాముడిది మాత్రమె .లక్ష్మణుడు సాక్షీభూతుడు మాత్రమె .రాముడు అభ్యసించినవన్నీ లక్ష్మణ స్వామికి చూచినంత మాత్రానే ఆకళింపు అవుతాయి. ఆయన అది శేషావతారం సకల విద్యా సారం కదా .రాముడు అంతరంగ వీక్షణానికి ప్రతినిధి అయితే తమ్ముడు బహిర్లక్షణ మైన లోక దృష్టికి నిదర్శనం .రాముడు పరంధాముడు .లక్ష్మణుడు లక్ష్యకాముడు అని విశ్లేషిస్తారు డాక్టర్ ఇల పావులూరి .విశ్వామిత్రుడు ప్రసాదించిన ‘’మానవాస్త్రాన్ని ‘’మారీచుని పై ప్రయోగించగానే వాడు సముద్రం లో పడిపోతాడు .అస్త్రం అమోఘం గా పని చేసినందుకు రాముడు సంతసిస్తాడు .ఇది రామ సత్య పరాక్రమానికి మొదటి విజయం .తాటక వధ రామ కారుణ్యానికి పరీక్ష మాత్రమె .మారీచ మదం సుబాహుని ప్రాణం హరించటం నిజం గా రామ భద్రుడికి గర్వ కారణం .విశ్వామిత్రునికి ముని గణానికి ఆనంద కారణం అవుతుంది .
రామాయణం ప్రారంభం నుంచి సంధ్యలను ,సంద్యోపాసన ను వాల్మీకి మహర్షి ప్రత్యేకించి స్మరించటం గమనించాల్సిన విషయం .ఆ నాటి సంధ్యకు ఒక ప్రత్యేకత ఉంది అది’’ విజయ సంధ్య ‘’ అంటారు పాండురంగా రావు గారు .గాయత్రీ మంత్రం లోని రెండవ బీజాక్షరం ఇక్కడ దర్శన మిస్తుంది .’’నాహత్వా రాక్షసాన్ సర్వాన్ యజ్నఘ్నాన్ రఘు నందనః –రుశిభిహ్ పూజితః సమ్యగ్ యదేన్ద్రో విజయే పురా ‘’.రామాయణం లో బాల కాండ వరకు నాలుగు యజ్ఞాలు వస్తాయి మొదటిది అశ్వ మేధం ,రెండవది పుత్రకామేష్టి .మూడవది విశ్వామిత్రుడు సిద్ధాశ్రమం లో చేసిన యజ్ఞం నాల్గవది జనకుడు మిధిల లో చేస్తున్న యజ్ఞం .ఇలా యజ్ఞం తర్వాత యజ్ఞం ఒక ఆశ్రమం తరువాత మరో ఆశ్రమం ఒక రుషి మండలి తర్వాత మరో రుషి మండలి రావటం రామాయణ క్రమం .ఈ యానం లో సంధ్యలకు కూడా ప్రాశస్త్యం ఉంది . యజ్ఞంఅంటే ఇష్టి .సంధ్యలోని సారం ద్రుష్టి .కనుక రామాయణం లో ఇష్టికీ దృష్టికీ ప్రత్యెక ప్రాధాన్యం ఉంది .అని వివరించారు డాక్టర్ ఇలపావులూరి పాండురంగా రావు గారు. ఈ విషయాలన్నీ వారు రాసిన ‘’అనుదిన రామాయణం ‘’లో ఉన్నాయి .వాటినే శ్రీరామ నవమి సందర్భం గా అందరికి అంద జేశాను .
![]()
శ్రీ రాఘవం దశరధాత్మజ మప్రమేయం -సీతాపతిం రఘుకులాన్వయ రత్న దీపం -ఆజాను బాహుం అరవింద దళా య తే క్షం -రామం నిశాచర వినాశకరం నమామి . .
8-4-14 మంగళ వారం శ్రీ రామ నవమి సందర్భం గా శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -7-4-14-

