మా నవరాత్రి యాత్ర -7 అదరహో ఖజురహో విశేషాలు

మా నవరాత్రి యాత్ర -7

అదరహో ఖజురహో విశేషాలు

ఇండియా లో  ఆగ్రా తర్వాత ఎక్కువ మంది సందర్శించే క్షేత్రం ఖజురాహో .’’ఇండో ఆర్యన్ కళకు’’ అద్దం పట్టే శిల్ప వైభవం ఇక్కడే చూస్తాం .దేవాలయ శిల్పకళకు అపూర్వ శిల్పాలకు ప్రపంచం లోనే గొప్ప ప్రదేశం ఖజురహో .తొమ్మిదో శతాబ్దం నుండి పదకొండవ శతాబ్ది లోపు నిర్మితమైన దేవాలయ సముదాయం ఇది .చండేలా రాజ వంశీకుల అద్వితీయ కళా తృష్ణ కు శిల్పుల  కళా సృష్టికి దర్పణం .85దేవాలయాలలో ఇప్పుడు మిగిలింది కేవలం 25మాత్రమె .ఖజురహో సాగర్ ఒడ్డున ఖజురహో గ్రామం ఎనిమిది వేల జనాభా తో ఉంది .మధ్యప్రదేశ్ లో చట్టర్పూర్ జిల్లాలో ఖజురహో ఉంది .నర్మదా, చంబల్ నదుల పరివాహక ప్రాంతం .ఉత్తర దక్షిణ భారత దేశాలను వేరు చేసే వింధ్య పర్వత శ్రేణులలో ఉన్న ఈ ప్రదేశం శిల్ప కళ కు కాణాచి గా వెలసిల్లింది .సాత్నా రైల్వే స్టేషన్ దీనికి దగ్గర గా ఉంటుంది .వాతావరణం ఉష్ణ మండల శీతోష్ణ స్తితి .పూర్వకాలం లో వర్షపు నీటిని నిలవ చేయటానికి 60తటాకాలున్దేవి .ఇప్పుడు మూడు తటాకాలు మాత్రమె ఉన్నాయి .అవే ఖజురహో సాగర్ ,శివ సాగర్ ,ప్రేమ సాగర్ లు .ఇ క్కడ ఇప్ప పూల చెట్లు విపరీతం .వీటిని సాగు చేసి పెంచుతారు .ఇవి సారా పరిశ్రమకు తోడ్పడి ఆదాయం పెంచేవి .

16వ శతాబ్దికి ఖజురహో వైభవం అంతా హారతి కర్పూరం అయి పోయింది .1838వరకు దీని గురించి బయటి ప్రపంచానికి తెలియ లేదు .కెప్టెన్ టి ఎస్ బర్ట్ పల్లకీ లో వెడుతూ ఉంటె అది ఒరిగి పడిపోతే బాగు చేయిస్తూ ఈ కళా ఖండాలను చూసి ఆశ్చర్య పడ్డాడు .’’భారత దేశం లోని అన్ని దేవాలయాల వైభవం ఇక్కడే దర్శించ వచ్చు ‘’అని రిపోర్టు రాశాడు .’’దంగాకు చెందిన 1002నాటి  శిలా శాసనాన్ని’’ కాపీ చేసి పెట్టుకొన్నాడు .ఇది విశ్వనాధ దేవాలయం లో ఉంది .అలేక్సాందర్ కన్నింగ్ హాం ఖజురాహో అంటే ‘’ఖర్జూర వనం’’ అని అర్ధం చెప్పాడు .’’ఖర్జూర వాటిక ‘’అనే వారు ఆ నాడు .అది ఉచ్చస్తితి లో ఉన్నప్పుడు ఇక్కడ ఖర్జూరం విపరీతం గా పండేది .దీనికి సాక్ష్యం గా రెండు బంగారు ఖర్జూరాలు సిటీ గేట్ల వద్ద త్రవ్వకాలలో లభించాయి .ఈ ఆలయాలపై బూతు బొమ్మలు అధికం .వాటిని విడి గా చూడకుండా మొత్తం ఒకే ద్రుష్టి తో చూడాలని చరిత్రకారులన్నారు .1864లో కన్నింగ్ హాం దర్శించి 872విగ్రహాలున్నాయని ,అందులో గోడలకు వెలుపల 646ఉన్నాయని రిపోర్ట్ రాశాడు .అవన్నీ చెల్లా చెదరుగా పడి కుప్పలు గా ఉండిపోయాయని ఆ శిలాశిల్ప నిధి అపూర్వమనీ చెప్పాడు .

మహాత్మా గాంధి ఈ ఆలయాలను చూసి ‘’చాలా జుగుప్సా కరమైన శిల్పాలనీ వీటిని వెంటనే తొలగించేయాలని ‘’హితవు పలికాడు .దానికి స్పందించిన గురుదేవులు రవీంద్ర నాద టాగూర్ ‘’ఖజురహో జాతీయ నిధి అని దాన్ని కూల్చేయ మనటం అవివేకమని ,అలా చేస్తే మన పూర్వీకులు మరీ శృంగార జీవులు అనే అభిప్రాయం ఏర్పడుతుంది ‘’అని గాంధీకే ‘’క్లాస్ ‘’పీకాడు .ఖజురహో పద్నాలుగో శతాబ్దపు చండేలా వంశ రాజుల మతాత్మక రాజధాని అన్నారు ఆరబ్ యాత్రికుడు’’ ఐబాన్ బుటూటా’’దీన్ని1335 లో చూసి దీన్ని ‘’కజర్రా ‘’అనే వారని ఇక్కడ యోగులు బారు గడ్డాలతో జటాజూటాలతో ఉండేవారని నిరాహారం  వలన వారి శరీరాలు పాలిపోయి పసుపు రంగులోకి మారాయని రాశాడు .ఇప్పుడున్న ఖజురహో సాగర్ ఎనిమిది వందల మీటర్లు పడమటి దేవాలయాలకు దూరం గా ఉండేది .అప్పుడిది ఖజురహో నగరానికి గుండె కాయ గా వర్ధిల్లిందని చెప్పాడు .ఇప్పటికీ శివరాత్రి నాడు వేలాది  భక్తులు వచ్చి దర్శించితరిస్తారు .అప్పుడు గొప్ప ఉత్సవాన్ని నిర్వహిస్తారు .ఖజురహో వచ్చిన వారు ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘’లైట్ అండ్ సౌండ్ ‘’ప్రోగ్రాం తప్పక చూసి అనుభూతి పొందాలి .ఇక్కడ సాంస్కృతిక ఉత్సవాలు జరిగేవి .భారతీయ సర్వకళా ప్రదర్శన నిర్వహిస్తారు .ఖజురహో సంప్రదాయాన్ని ఇప్పటికీ గౌరవించి కొనసాగిస్తారు .ఎన్నో రకాల సెమినార్లు జరుగుతాయి .స్థానికం గా తయారైన అనేక కళాత్మక వస్తువులను విశాలమైన ప్రాంతం లో ప్రదర్శించి అమ్ముతారు .ఈ ఉత్సవం భారత దేశానికే కాదు ప్రపంచమంతటికీ ఆకర్షణీయమే .

ఖజురహో వృత్తాంతం

చండేలా రాజులు రాజపుత్ర వంశానికి చెందిన చంద్ర వంశ రాజులు. చండేలా రాజులు మధ్య భారతాన్ని చాలా కాలం ఏలారు .తొమ్మిదో శతాబ్ది నుండి పద్నాలుగో శతాబ్ది వరకు వీరి పాలన సాగింది .వీరిని ‘’జేజక భుక్తి’’రాజులనే వారు ఇప్పుడు’’ బుందేల్ ఖండ్ ‘’రాజులంటారు .చాంద్ బర్డాయి అనే ప్రాచీన కవి ధిల్లీ అజ్మీర్ ల పాలకుడైన పృధ్వీరాజుచౌహాన్ ఆస్థాన కవి గా ఉండేవాడు .ఆయన రాసిన దాని ప్రకారం కాశీకి చెందిన గాహద్వారా రాజు ఇంద్ర జిత్ ఆస్థాన పురోహితుడి కూతురు   హేమవతి.హేమావతి గొప్ప అంద గత్తే .ఇంద్రుడే ఆమె సౌందర్యానికి నీరైపోయాడు. అతన్ని పెళ్లి చేసుకొనంది. ఇంద్రుడి శాపం వలన విధవ రాలైంది .అప్పటికి ఆమె వయసు పదహారే .ఒక రాత్రి విరహ వేదన భరించలేక ‘’రతి తాలిబ్ ‘’అనే సరస్సులో నగ్నం గా స్నానం చేస్తుంటే చంద్రుడు ఆమెను మోహించి ఆమెను చేరి సల్లాపాలాడాడు .ఆమె కన్యత్వం కోల్పోయింది .ఈ పరాభవాన్ని దాచుకోవటానికి ఎంతో ప్రయత్నించింది .చంద్రుడు ఆమెనుకర్ణావతి నదీ తీరం లోని ఖజూర వాటిక లో తల దాచుకోమని సలహా ఇచ్చాడు .ఆమెకు పుట్టబోయే కుమారుడు అద్వితీయ బల సంపన్నుడై పదహారవ ఏట రాజు అవుతాడని రాజ్య విస్తరణ చేస్తాడని అనునయింఛి అదృశ్యమైనాడు  చంద్రుడు .

హేమావతి కాశీ లో తండ్రి ఇంటికి చేరింది .మళ్ళీ కలన్జార్ కు తిరిగొచ్చింది .కొడుకును కన్నది .చంద్ర వర్మ అనే పేరు పెట్టింది .అతడు పెరిగి పెద్దవాడై బల పరాక్రమ సంపన్నుడైనాడు .పదహారో ఏట ఒక సింహాన్ని పులిని సునాయాసం గా పోరాడి చంపాడు .సంతోషించిన తల్లి హేమావతి చంద్రుని ప్రార్ధించింది .చంద్రుడు దిగి వచ్చి కొడుక్కి ‘’ఒక పరుస వేది’’నిచ్చాడు అది దేన్నీ తాకితే అది బంగారం అవుతుంది .క్రమంగా ధనమూ పెరిగి ‘’మహోబా ‘’కు రాజై  రాజ్య విస్తరణ చేశాడు .కాశీ లోని గాహద్వారా రాజును ఓడించి కాశీని కూడా తన రాజ్యం లో కలిపేశాడు హేమావతి కొడుకు చంద్ర వర్మ రాజు .వివాహం చేసుకొని రాణీ తో ఖజురాహో చేరి ‘’భంద్య యజ్ఞం ‘’చేసి తల్లి పై పడిన మచ్చను అవమానాన్ని తొలగించాడు .తల్లి కోరిన వన్నీ తీర్చాడు .విశ్వ కర్మ ను ఆహ్వానించి ఖజురహో లో 85దేవాలయాలను నిర్మించి తల్లి హేమావతికి కానుక గా సమర్పించాడు .అందుకే ఇక్కడ ఏ దేవాలయం లో చూసినా ఆలయం ముందు సింహం తో పోరాడే బాలుడి శిల్పం కని  పిస్తుంది .ఆ బాలుడే చంద్ర వర్మ .100_2416

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-4-14-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నవ రాత్రి యాత్ర and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.