మా నవ రాత్రి యాత్ర -8
చారిత్రకాంశాలు
ఆర్.వి రసెల్ పండితుని దృష్టిలో మధ్య భారతం లో సుప్రసిద్ధులైన ‘’భారులు ‘’అనే శిల్ప వంశానికి చెందినవారే చండేలా రాజ వంశ మూల పురుషులు .954కాలపు శిలా శాసనం ప్రకారం ఈ వంశ మూల పురుషుడు ‘’చంద్రాత్రేయ మహర్షి ‘’.కనుక చంద్రాత్రేయుడు లేక చంద్ర వర్మ ఈ వంశానికి మూలపురుషుడు .చంద్రవర్మ ఖజురహో లో రాజదానినేర్పరచి పాలించాడు .కన్నింగ్ హాం ఊహించిన దాని ప్రకారం కాశీ కి చెందిన ఘద్వారా రాజు ఇంద్రజిత్ పురోహితుడు హేమరాజే చంద్ర వర్మ గా క్రీ.శ.168లో ఖజురహో రాజు గా అభిషిక్తుడయ్యాడు .చరిత్ర లోతుల్లోకి వెడితే తొమ్మిదో శతాబ్ది పూర్వభాగం లో పాలించిన ‘’నన్నూకుడు ‘’ఈ వంశానికి మొదటి రాజు .ప్రతీహార రాజులు బలహీన పాలకులుగాతయారై విచ్చిత్తి చెందే సమయం లో చందేలీ రాజులు స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకొన్నారు .నన్నూకుడే మొదట స్వాతంత్ర చండేలా రాజు .అతని తర్వాత కొడుకు’’ వాక్ పతి’’ రాజు అయి తొమ్మిదో శతాబ్దం ఉత్తరార్ధం అంతా పాలించాడు .సామ్రాజ్యాన్ని క్రమం గా విస్తరిస్తూ వింధ్య పర్వత భాగాలలో కొన్ని స్వాధీన పరచుకొన్నాడు వాక్ పతి ..అతని ఇద్దరుకోడుకులు జయ శక్తి ,విజయ శక్తి తండ్రి తరువాత చందేలా రాజులై పాలించారు .అన్నదమ్ములిద్దరూ ధైర్య సాహస వంతులై నందున అనేక రాజ్యాలను జయించి సామ్రాజ్యాన్ని విస్తరించారు .మొదట జైశక్తి రాజై రాజ్యం చేశాడు .ఇతనినే ‘’జైజక్ ‘’లేక ‘’జేజకా ‘’అనే వారు .తను పాలించిన ప్రాంతాన్ని అంతటిని ‘’’’జైజక భుక్తి ‘’గా ప్రకటించుకొన్నాడు .కొడుకులు లేనందున వారసుడిగా తమ్ముడు విజయ శక్తిని ప్రకటించి రాజ్య పాలన చేయించాడు .
శిలా శాసనాదారాలను బట్టి విజయ శక్తి అనేక యుద్ధాలు చేసి చాలా రాజ్యాలను వశపరచుకొని రాజ్య విస్తరణ చేసి విజేత అయ్యాడు .అన్నదమ్ములైన జయ ,విజయుల వీరగాదలను కధలుగా గేయాలుగా పాడుకొనే వారు .ఇద్దరూ కలిసి పాలించినట్లే భావించేవారు ప్రజలు .విజయశక్తి తర్వాత కొడుకు రాహిల్ రాజయ్యాడు .రెండేళ్ళు పాలించాడు మహోబా కు దగ్గరలో రహీలా గ్రామం అతని పేర ఏర్పడింది .’’రహీల్ సాగర్’’ సరస్సు నిర్మించాడు .అతని తర్వాత కొడుకు హర్షదేవుడు క్రీ.శ900లోరాజై, 25 ఏళ్ళు సుదీర్ఘ రాజ్య పాలన చేశాడు .అతనికాలమే మహోన్నతమైన్డిగా చరిత్రాకారులు భావిస్తారు .’’ఓద్’’ కు చెందిన కనోజ రాజ్యానికి ప్రతీహార రాజు మొదటి మహీ పాలుడిని రాజు గా చేయటానికి హర్ష దేవుడు కృషి చేశాడు .అంతకు ముందు రాష్ట్ర కూటులు మహీపాల్ ను ఓడించి రాజ్యాన్ని లోబరచుకొన్నారు .ఇది 915లో జరిగింది .ఈ వరుస విజయాలతో హర్ష దేవ రాజు ఖజురాహో లో ‘’మాతం గేశ్వరాలయం ‘’నిర్మించి శివుడికి కానుకగా సమర్పించాడు .
అతని కుమారుడు యశోవర్మ హర్షదేవుని తర్వాత రాజయ్యాడు . అతన్ని లక్షవర్మ అనీ అంటారు .యశోవర్మనే చండేలా రాజ్య పాలకులలో మహా శ్రేస్టూడని అంటారు .ధీర ,వీర శూరుడైన యశో వర్మదక్కన్ పాలకులు రాష్ట్ర కూటుల్ని జయించి ,దక్షిణాన మాల్వా వరకు తూర్పున గండా ,మిధిల వరకూ రాజ్య విస్తరణ చేశాడు .తానే సర్వ స్వతంత్ర రాజు గా ప్రకటించుకొన్న ధీశాలి యశోవర్మ .ఇతని కాలం లో చండేలా రాజులు మధ్య భారతం లోనే మహా శక్తి వంతులుగా సమర్ధులుగా గణన కెక్కారు .యశోవర్మ సర్వ సమర్దుడే కాక కళా పిపాసి .అందువల్లనే ఖజురాహో లో ఇంత విశేష దేవాలయ సముదాయ నిర్మాణం జరిగింది .’’లక్ష్మణ దేవాలయాన్ని’’ యశోవర్మ నిర్మించాడిక్కడ .దీన్ని శ్రీ మహా విష్ణువుకు అంకితమిచ్చాడు .
యశోవర్మ కొడుకు ‘’దంగా ‘’తరువాత రాజై 954-1002కాలం లో రాజ్యం చేశాడు .ప్రతీహారులకు తండ్రి లాగే కప్పం కట్టకుండా కనోజ్ రాజులకు విదేయుడైనాడు .చాలా రాజ్యాలు జయించి రాజ్య విస్తరణ చేశాడు .’’మహా రాజాది రాజు ‘’అని పించుకొన్నాడు .యుద్ధ నిపుణుడేకాక కళా సంస్కృతులపై అపారమైన అభినివేశం ఉన్నవాడు దంగా రాజు .అతనికాలం లోనే మహోత్రుస్టమైన ‘’విశ్వనాధ దేవాలయం’’ ,’’పార్శ్వనాధ దేవాలయం ‘’నిర్మించాడు .పదవ శతాబ్దం లో ఉత్తర భారత దేశం లో దంగా మహా శక్తి వంతమైన మహా రాజు గా వెలిగి పోయాడు .దంగా తర్వాతా కొడుకు ‘’గండ ‘’రాజయ్యాడు .ఇతను(1108-1017) కాలం లో రాజ్య పాలన చేశాడు .తొమ్మిదేళ్ళు మాత్రమె పాలించి రాజా గండ ‘’చిత్ర గుప్త ‘’దేవాలయం ‘’ శ్రీ జగదాంబా దేవాలయాల’’ను నిర్మించాడు .
రాజా గండ మరణం తర్వాత కుమారుడు ‘’విద్యాధరుడు ‘’రాజై1017-1029పాలించాడు .యుద్ధ వీరుడు ,శక్తి వంతుడు అయిన విద్యాధరుడు మహమ్మద్ గజనీ తో రెండు సార్లు యుద్ధం చేసి (1019,1022)కల్చారీలను ,పాలమారులను ఓడించి మధ్యభారతం లో విశిస్టస్తానాన్ని సంపాదించాడు ఇతనికాలం లో చండేలా రాజ్యపాలన ప్రఖ్యాతమైంది .యుద్ధ వీరుడేగాక కళాభిమాని సంస్కృతీ గౌరవం ఉన్న మహారాజు .ఖజురాహో లో ‘’కందారియా మహా దేవా ‘’ఆలయాన్ని అత్యద్భుత శిల్ప కళా నికేతనం గా నిర్మించాడు .ఇతని కొడుకు ‘’విజయపాలుడు ‘’తండ్రి రాజాన్ని సుస్తిరం చేసి దేవాలయ నిర్మాణాలను కొనసాగించాడు .యితడు నిర్మించినదే ‘’వామన దేవాలయం ‘’.ఇతని పెద్దకొడుకు దేవవర్మ తండ్రి మరణానంతరం రాజయ్యాడు .రాజ్యాన్ని కల్చూరీల వరకు వ్యాపింప జేశాడు .ఇతను చనిపోయిన తర్వాతా 1060లో తమ్ముడు ‘’కీర్తివర్మ’’ రాజయ్యాడు .అనేక యుద్ధాలు గెలిచి కల్చూరియాలు ఆక్రమించిన భాగాలన్నితిని కైవశం చేసుకొన్నాడు .
చండేలా రాజు కీర్తి వర్మ 40ఏళ్ళు ఖజురహో ను పరిపాలించాడు .కళలను సాహిత్యాన్ని సంస్కృతినీ అభివృద్ధి చేశాడు ఇతని కాలం లోనే ‘’ప్రబోధ చంద్రోదయం ‘’రచింప బడి కీర్తి వర్మ ఎదుట ప్రదర్శింప బడింది .’’ఆదినాధ దేవాలయం’’ ,’’జవేరి అంటే బలరామ దేవాలయం’’ ‘’,చతుర్భుజ కృష్ణ దేవాలయం ‘’మొదలైన వాటిని నిర్మించాడు .కీర్తివర్మ పాలన1100తో పూర్తీ అయింది .అతని తర్వాతి రాజులు అనేక క్లిష్ట పరిస్థితుల నెదుర్కొన్నారు .వారి పాలన అంతా యుద్దాలతోనే గడిచి పోయింది .ఉత్తర ,మధ్య భారతాలలో ఈ యుద్ధ వాతావరణం పరమ భీభత్సం గా ఉండేది .చాళుక్యులు కల్చూరియలు ఎప్పుడూ ఖజురహో పై దండ యాత్ర చేస్తూనే ఉండేవారు .కీర్తివర్మ తర్వాతి రాజు’’ సల్లక్షన్ ‘’లేక హోల్లక్షన్ వర్మ రాజై ,తర్వాత జైవర్మ కు పాలన అప్పగించాడు .జయవర్మ గాహర్వార్ రాజుగోవింద వర్మ చేతిలో చేతిలో1120లో ఓడిపోయాడు .రాజ్యం వదిలి అరణ్యాలకు చేరాడు .
పృధ్వీ వర్మ అనే ఇతని పిన తండ్రి రాజయ్యాడు .ఏదో విధం గా ఖజురహో రాజ్యాన్ని కాపాడాడు .తర్వాత పృధ్వీ వర్మ కొడుకు’’ మండన వర్మ’1130 లో సింహాసనం ఎక్కిపోయిన రాజ్యాన్ని కీర్తిని మళ్ళీ సంపాదించి పునర్వైభవం కల్పించాడు కలిన్జార్ ,మహోబా ,అజైగర్ లను లోబరచుకొని పరాక్రమోన్నతుడు అయ్యాడు .’’దులాదేవ ‘’ఆలయాన్ని ఖజురాహో లో నిర్మించాడు . 1163వరకు మండన వర్మ పాలన సాగింది .తర్వాత కొడుకు’’ యశోవర్మ’’ రాజయ్యాడు .రెండేళ్ళు మాత్రమె పాలన చేశాడు. తండ్రి హతాన్మరణం వలన కొడుకు ‘’పరమార్ధ దేవుడు’’ రాజ్యానికి వచ్చాడు .చండేలా రాజ వంశానికి పారమార్ధి దేవుడే చివరి రాజు .35ఏళ్ళు సమర్ధ వంతం గా రాజ్యం ఎలాడు .డిల్లీరాజ పుత్రారాజు పృధ్వీరాజ చౌహాన్ పారమార్ధి దేవుడిపై దాడి చేశాడు .పారమార్ధి కుమారులు అలహా ,ఉదాల్ లు వీరోచిత యుద్ధం చేశారు .వారి సాహసోపేత ధైర్య సాహస పోరాటాలను ఈ నాటికే పాటలుగా పాడి కీ ర్తిస్తూనే ఉంటారుజనం .’అలహా ఉదాల్ ‘’అనే జాన పద గీతం ఇందులో బాగా ప్రసిద్ది, ప్రచారం పొందింది .ముఖ్యం గా ఉత్తరభారతం లోను బుందేల్ ఖండ్ ప్రాంతం లోను .1182లో ప్రుద్వీ రాజు పరమార్ధ దేవ మహా రాజును యుద్ధం లో జయించాడు .మహోబా ,ను కోల్పోయాడు .1202లో కుతుబుద్దీన్ ఐబక్ అనే మహమ్మద్ ఘోరి బానిస కలన్జార్ పై దాడి చేసి ఓడించాడు .పారమార్ధి దేవుడు లొంగి పోయాడు .అతని మంత్రి ఈ పిరికి తనానికి ఇతన్ని చంపేశాడు .అప్పటి నుంచి చండేలా రాజ్యం సుల్తానుల పాలన లోకి వచ్చింది .ఇంతకాలం ఖజురహో ను కాపాడుకుంటూ కళా సాంస్కృతిక విస్తరణ చేస్తూ దేవాలయ నిర్మాణాలకు కొత్త జవం జీవం ఇస్తూ సాగిన చండేలా రాజ్య పాలన ఇలా అర్దాంతరం గా ముగిసింది .
ఇంత మంది రాజుల చరిత్ర తో సుత్తి కొట్టానను కొంటున్నారా? వారందరూ లేక పోతే ఖజురహో దేవాలయ శిల్ప చాతుర్యం ప్రపంచానికి తెలిసేదే కాదు .అందుకే ఈ ప్రయత్నం
ఖజురహో శిల్ప సంపద విశేషాలను తరువాత అంద జేస్తాను .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-4-14-ఉయ్యూరు


