మా నవరాత్రి యాత్ర -14 ‘’ఓర్చా’’ అచ్చా
మేము వెళ్లి చూడలేదు కాని ఓర్చా ను గురించి చెప్పగా విన్నాం .దాని విశేషాలే ఇప్పుడు తెలియ జేస్తున్నాను .పదహారవ శతాబ్ది నగరం ఓర్చా .బుందేల్ ఖండ్ ప్రాంతం లో ‘’బెట్వా నది ‘’తీరం లో నిర్మించబడిన పట్నం .ఝాన్సి –ఖజురహో రోడ్డుపై ఉంది .ఝాంసికి పదహారు కిలోమీటర్ల దూరం .బుందేల్ రాజ పుత్ర సైన్యాధికారి రుద్రప్రతాప్ నిర్మించిన నగరం .ఇతని తర్వాత కొడుకు బీర్ సింగ్ దేవ్ నగరాభి వృద్ధి చేశాడు .అనేక శతాబ్దాలుగా యాత్రికులకు ప్రత్యెక ఆకర్షణ గా’’ ఓర్చా ‘’ఉండి ‘’అచ్చా’’ అని పించుకొంటోంది ,మధ్యప్రదేశ్ లో మరుగున పడిన మాణిక్యం ఓర్చా .ప్రేమ త్యాగాలకు నిలయం .దీని గాధలు పాటలుగా పద్యాలుగా జనం పాడుకొంటారు . మధ్య ప్రదేశ్ కు ఉత్తరాన మాల్వా పీఠ భూమి లో ఓర్చా ఉంది .వేసవిలో వేడి తక్కువగా ఉండటం శీతాకాలం లో ఆహ్లాద వాతావరణం దీని ప్రత్యేకత.బుందేల్ ఖండ్ రాజులు దీన్ని రెండు శతాబ్దాల పాటు 1531నుండి పాలించారు .ఒకప్పుడు ఒక రాజ పుత్రా వీరుడు తనను విన్ధ్యవాసిని దేవికి సమర్పించుకోవాలని సిద్ధ పడ్డాడు .అప్పుడా దేవి అతని త్యాగానికి మెచ్చి అతన్ని ‘’బుందేలా ‘’ అంటే ‘’రక్త తర్పణం చేసిన వాడా ‘’అని పిలిచింది .అప్పటి నుంచి ఆ వంశీకులు బుందేల్ ఖండ్ రాజ పుత్రులై చరిత్రలో చిర కీర్తి సాధించారని కధనం .బుందేల రాజ వంశం పదకొండవ శతాబ్దిలో ఆరంభమైంది .ఒర్చాను రాజ దాని గా చేసుకొని బుందేల రాజులు మధ్య భారతాన్ని పాలించారు .మొదట్లో గర్ఖురార్ వీరి రాజధాని .తరువాత రాజా రుద్రా ప్రతాప్ 1531లో ఓర్చా కు మార్చారు . మొగలాయీ రాజులతో బుందేల రాజుల సాన్నిహిత్యం కష్టాలనే తెచ్చి పెట్టింది .1605-27కాలపు రాజు బీర్ సింగ్ దేవ్ మొగలాయీ చక్ర వర్తి అక్బర్ కి కోపం తెప్పించాడు .దీనికి కారణం అక్బర్ కొడుకు జహంగీర్ తో బీర్ సింగ్ కు మంచి దోస్తీ ఉండటమే .1602లో అక్బర్ తన కోపాన్ని బుందేల్ఖండ్ పై ప్రదర్శించి యుద్ధానికి దిగి నాశనం చేశాడు.1605లో అక్బర్ చావు తర్వాతా జహంగీర్ సామ్రాట్టు అయ్యాడు .స్నేహ భావం తో జహంగీర్ మిత్రుడిని 1606లో ఓర్చా వచ్చి కలిసి స్నేహ హస్తం చాచాడు .ఆ తరువాత ఇరవై రెండేళ్ళు జహంగీర్ బీర్ సింగ్ మంచి స్నేహితులుగా మెలిగారు .రెండు రాజ్యాలమధ్య స్నేహ పూర్వక వాతావరణం ఉండేది .జహంగీర్ మరణం తర్వాత షాజహాన్ రాజయ్యాడు అప్పుడు బీర్ సింగ్ షాజహాన్ పై దాడి చేశాడు .కాని ఔరంగ జేబు దీన్ని అణచేశాడు .బుందేల రాజ్యాన్ని కోల్పోయినా తిరిగి వారికే స్వాధీనం చేశాడు చక్ర వర్తి .1783బుందేల్ రాజులు రాజధానిని ఓర్చా నుండి’’ తికం గర్’’ కు మార్చారు. ఓర్చా వైభవమంతా కోటలో ఉంది .అనేక రాజ భవనాలు, ఆలయాలు, తోటలు స్మ్రుతి చిహ్నాలు ఉన్నాయి బుందేల స్కూల్ ఆఫ్ పెయింటింగ్ ప్రసిద్ధమైనది .పుష్పాలఅలంకరణ కు ప్రసిద్ధి .బెట్వా నది ఒడ్డున ఓర్చా కోట ఉంటుంది .మొగల్ చక్రవర్తి సందర్శన సందర్భం గా బీర్ సింగ్ రాజు స్మారక మందిరం నిర్మించాడు .కోర్టు ,దర్బారు గొప్పగా ఉంటాయి . హిందూ మొగల రాజ భవనాలు ఆకర్షణీయం గా తీర్చి దిద్దారు . రాజా ఇంద్రమణి అనే కవి ,సంగీతజ్నురాలు పేర ‘’రాజ్ ప్రవీణ్ మహల్ ‘’నిర్మించారు .ఆమె గొప్ప అంద గత్తే నాట్యకారిణి .జహంగీర్ ఆమెను ప్రేమించాడని కధనం .వీరిద్దరి ప్రణయ గాధ పాటలుగా కావ్యాలుగా ప్రసిద్ధమైనాయి .ఆమె భర్తను వదిలి వెళ్ళటం ఇష్టపడని రాజ పుత్ర స్త్రీ పతివ్రత . .. ఆనంద మహల్ ,హర్దు వాల్ మందిరాలు వైభవం గా ఉంటాయి .హర్దువాల్ బీర్ సింగ్ కుమారుడు .అన్న ఝుహార్ కు తన అమాయకత్వాన్ని నిరూపించటానికి ప్రాణ త్యాగం చేశాడు .మరణం తరువాత అతనిని దేవతా భావం తో విగ్రహం నెలకొల్పి పూజిస్తూ ఆరాధిస్తున్నారు . మధుకర్ షా భార్య రాణి గణేష్ కున్వారీదేవి అయోధ్య నుంచి శ్రీరాముని విగ్రహం తనతో ఒర్చాకు తీసుకొచ్చింది .దాన్ని రాజ ప్రాసాదం లో ఒక చోట తాత్కాలికం గా ఉంచింది .వేరొక చోట దాన్ని ప్రతిష్టిద్దామని ప్రయత్నం చేస్తే విగ్రహం ఊడి రాలేదట .చివరికి ఈ రాజ ప్రాసాదాన్నే శ్రీరాముని సమర్పించారు రాణీ రాజు .ఇక్కడ శ్రీరాముడు రాజు గా పూజింప బడుతున్నాడు .భారత దేశం మొత్తం మీద ఎక్కడా శ్రీరాముడు రాజుగా అర్చింప బడటం లేదు ఇక్కడే అది జరుగటం తో ఓర్చా తన ప్రత్యేకతను నిలుపు కొంటోంది . కున్వారి రాణీ కోసం మధుకర్ షా చతుర్భుజ దేవాలయాన్ని ఓర్చాలో నిర్మించాడు .ఉన్నతమైన శిఖరం తో మహా గొప్ప కళా నికేతన్ గా ఉంటుంది .రామ రాజ ,లక్ష్మీ నారాయణ దేవాలయాలూ ఉన్నాయి .’’బుందేల్ చిత్రకళ ‘’విశేష ప్రాముఖ్యత పొందింది ..విప్లవ వీరుడు స్వాతంత్ర సమరం లో వీర మరణం పొందిన చంద్ర శేఖర ఆజాద్ ఓర్చా లో1926-27లో నివసించటం దీని విఖ్యాతిని మరింత పెంచింది .సిద్ధ బాబా మందిర్ ,జుగల్ కిషోర్ మందిర్ ,జానకీ మందిర్ దర్శింప దగినవి .ఇక్కడ రాజస్తాని ,జైన, మొగల్ శిల్ప కళలు వర్ధిల్లి కళా త్రివేణీ సంగమ స్థానమైంది .
![]()
![]()
రాజ రుద్రా ప్రతాప్ సింగ్ రాజా బీర్ సింగ్ దేవ్ ఇక ఉజ్జయినీ యాత్ర సాగిద్దాం సశేషం మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-4-14—ఉయ్యూరు

