మా నవ రాత్రి యాత్ర -13
ఖజురహో కళలహో అదరహో
ఆలయ వైవిధ్యం -2
11-శిధిల శివాలయం
పదకొండవ శతాబ్దికి చెందిన ఈ శివాలయం దాదాపు శిధిలమై పోయింది .కండరీయ ,జగదాంబా ఆలయాల మధ్య ఉన్నది .శివునిచిత్రాలు ద్వారంపై చెక్కారు గర్భగుడి పాడైపోయింది .శార్దూల విగ్రహం ఆకర్షణీయం గా కనిపిస్తుంది .
12-కందరీయ మహాదేవాలయం
1025-50కాలం లో నిర్మితమైంది .102,66,102అడుగుల పొడవు వెడల్పు ఎత్తు ఉన్న బృహత్తర దేవాలయం .ఒకప్పుడు ఇది పంచాయతన దేవాలయమే .ఇప్పుడు టెర్రేస్ మూలాలు ద్వంసమైనాయి .ఖజురహో శైలి శిల్ప విన్యాసానికి గొప్ప నిదర్శనం .అర్ధ మండపం ,మండపం ,మహా మండపం ,అంతరాలయం ,గర్భాలయం ,ప్రదక్షిణ మార్గం ఉన్నాయి .అన్నీ కలిపి ఎకాముఖీనం గా దర్శన మిస్తాయి .ఇందులోని ప్రతి భాగం యొక్క శిఖరం ఒక పర్వతాగ్రం లా మలచ బడ్డాయి. చివరికి ఆమలక ,కలశాలతో విరాజిల్లు తాయి .ఖజురహో దేవాలయ సమూహం లో కందారియ దేవాలయమే సర్వోత్క్రుస్టమైనది .కట్టడపు పని తో ఒక హిమాలయాన్నే మన ముందు ఉంచిన అనుభూతి కలుగుతుంది .అగ్రం పై అగ్రం ముందుకు చొచ్చుకోచ్చే విభాగాలు ,దేనికదే అందాలను ఆరబోసే కళా ఖండాలతో అఖండ కళా రాశి గా అద్భుత పని తనానికి తార్కాణ గా అపర కళావిలాసం గా భాసించే మహోన్నతాలయం .సమాంతర సముదాయ నిర్మాణం .అద్భుతమైన మెట్ల సముదాయం .హిమాలయ పర్వతారోహణ చేస్తున్న అనుభూతి కలిగిస్తుంది కైలాసం లో పరమ శివుని దర్శనానికి వెడుతున్నామా అనే భావం మనసంతా నిండిపోతుంది .శిల్ప తోరణాలు ,దేవతా విగ్రహాలు ,మిదునాలు ,పాటపాడేవారు నృత్యభామలు ,కీర్తి ముఖాలు ,మకారాలు తో రెండు మకర తోరణాలున్న ఏకైక దేవాలయం గా గణన కెక్కింది .మహా మండపం పైభాగం లో వలయాలు ఒకదానిలో ఒకటి చొచ్చుకు పోయి పరమ వైభవం గా కని పిస్తాయి .గర్భాలయ ద్వారం గోడలపై అనేక పుష్ప జాతులు కను విందు గా శిల్పీకరించారు .గంగా ,యమునా దేవీ విగ్రహాలు వారి వాహనాలు మొసళ్ళు కూర్మము దూర్జంబ్ లపై చెక్కారు .మార్బుల్ తో చేయబడిన లింగం గర్భగుడి లో ఉంది .
800విగ్రహాలు లోపలి, వెలుపలి గోడలపై చెక్కబడ్డాయి .అపసరసల అందాలను అనేక కోణాల్లో భంగిమల్లో శిల్పీ కరించారు .మహిళ ల మానసిక ,దైహిక స్తితి గతులను అనేక రీతుల్లో ప్రదర్శితం చేశారు శిల్పాలలో .ఖజురాహో శిల్ప కళ కన్దూరియా దేవాలయం లో పరమ వైభవ స్థితి లో అత్యున్నతం గా సర్వ శ్రేష్టం గా మహా కళా విభూతిగా విరాజమాన మైనదని శిల్ప మర్మజ్ఞుల మనోభావం .నగిషీలు ,సూక్ష్మ విషయ పరిశీలనం లకు ఇది గొప్ప ఉదాహరణ .అనేక స్థానిక చరిత్ర గాధలన్నీ చుట్టూ చెక్కబడి చారిత్రిక నేపధ్యాన్ని కలిగించాడు శిల్పి .ఏదేవతా విగ్రాహమైనా సర్వ శ్రేష్టం గా సంపూర్ణం గా పూర్తీ వైభవం గా ఉంటుంది .అదీ దీని ప్రత్యేకత .
ఇక్కడితో పడమర వైపు దేవాలయాల సందర్శన పూర్తీ అవుతుంది .
తూర్పు వైపు దేవాలయ సముదాయం
బ్రహ్మ ,వామన ,ఆదినాధ ,జవేరి ,జైన దేవాలయాలు ఇందులో ఉన్నాయి .
1-బ్రహ్మ దేవాలయం
తొమ్మిది వందల కాలం లో నిర్మితం .సాదా సీదా ఆలయం .ఇసుక రాయి గ్రానైట్ తో నిర్మాణం .వీటిని ఖజురహో సాగర్ అనబడే ‘’నినోరా తాల్ ‘’నుండి తెచ్చారు .నాలుగు ముఖాల విగ్రహం ఉంది. కనుక బ్రహ్మ గుడి అని పొరపాటుగా అంటున్నారు .నిజానికి విష్ణు గుడి .ఈ విషయం గర్భ గుడి ద్వారం పై చెక్కబడిన శిల్పాలను బట్టి తెలుస్తోంది .పిరమిడ్ ఆకారపు శిఖరం ఉన్నది .ద్వారం పై యమునా గంగా ప్రతిమలు ప్రతి చిన్నచిన్న విషయాలతో సహా స్పష్టం గా చెక్క బడ్డాయి .మహాదేవాలయం నమూనా ఇది .
2-హనుమంతుడి విగ్రహం
పడమటి దేవాలయాలకు ,ఖజురహో గ్రామానికి మధ్య నిర్మించిన భారీ ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్నది .హర్షుడి కాలం అంటే922కు చెందినదిగా బేస్ మీదున్న శాసనం వలన తెలుస్తోంది .ఇదే అతి ప్రాచీన శాసనం .
3-వామనాలయం
1050-75 కాలం లో నిర్మింప బడిన వామనాలయం శ్రీ మహా విష్ణువుకు అంకితం .గర్భాలయం లో బలిని కాళ్ళ కింద తొక్కి పాతాళం లోకి పంపే వామన మూర్తి దర్శన మిస్తాడు .చండేలా శిల్ప కళ ఈ ఆలయం లో పూర్తిగా వికసిన్చిందని అంటారు .గర్భాలయ గోడపై బుద్ధుడు భూమి స్పర్శ ముద్ర తో ఆసీనుడైనట్లు చెక్క బడింది .ద్వారం పై అద్భుత శిల్ప విన్యాసం ఉంది .చతుర్భుజ వామన మూర్తి నాలుగున్నర అడుగుల ఎత్తు ఉంటాడు .
4-శాంతి నాద జైనాలయం
పార్శ్వనాధ ,జైన ఆలయానికి దక్షిణాన కొత్త ‘’శాంతి నాదాలయం ‘’ఉంది . 14అడుగుల శాంతినాధుడు దిగంబరం గా దర్శన మిస్తాడు .అనేక జైన దేవీ దేవతల విగ్రహాలున్నాయి
5-పార్శ్వనాధాలయం
ఖజురాహో లోని అతి ముఖ్య జైన దేవాలయం ఇది . పదవ శాతాబ్డిది .ఆదినాదుడికి అంకితం .ఇప్పుడున్న పార్శ్వనాధ విగ్రహాన్ని 1860లో ఏర్పాటు చేశారు .’’సాన్దార ప్రాసాదం ‘’ఉన్న గుడి .ఆదినాధ శాంతి నాదాలయాల మధ్య ఉంది .బయటి గోడలపై శిల్ప కళ వర్ణించ లేనంత గొప్పగా ఉంటుంది .వైష్ణవ జైన విగ్రహాలూ ఉండటం విశేషం .చక్రేశ్వారి ,పరశురాముడు ,రేవతీ బలరాములు ,సీతారాములు హనుమాన్ ఉండటం ప్రత్యేకత .ఒక నాయిక ప్రియుడికి ఉత్తరం రాస్తున్నట్లు చెక్కిన శిల్పం మనోహరం .స్త్రీ తన గారాల పట్టి కొడుకును ముద్దాడే దృశ్యమూ మరువలేనిదే .
6-ఆదినాదాలయం
జైన తీర్ధంకరుడు ఆదినాదునికి అన్కితామివ్వ బడిన ఈ ఆలయం పదకొండవ శాతాబ్డిది .గర్భాలయం లోని విగ్రహం కనపడక పోతే కొత్త విగ్రహం పెట్టారు .వామనాలయం నమూనా గా ఉంటుంది .శిఖరం కొంచెం భిన్నం గా సరళం గా ఉంటుంది .హిందూ దేవతా విగ్రహాలు గోడలపై ఉంటాయి .
7-ఘంట దేవాలయం
పదో శతాబ్ది ఆలయం .ఇక్కడ క గంట ,గొలుసు ఉండటం వలన గంటాలయం అనే పేరొచ్చింది. జైన దేవత గరుడ వాహనం పై ఉండటం ప్రత్యేకత .ద్వారం పై మహా వీర ,నవగ్రహాలు ఉండి పార్శ్వ నాదాలయం లా కని పిస్తుంది .
8-జవేరీ దేవాలయం
చిన్న ఆలయమే అయినా శిల్ప కళకు పుట్టినిల్లుగా ఉంటుంది .పెద్ద విశాలమైన టెర్రేస్ ఉండి దానిపై ఆలయం నిర్మితమైంది .1075-1100నాటి ఆలయం .నిరాధార ప్రాసాదం మోడల్ .అర్ధ మండప మహా మండప గర్భాలయాలున్నాయి .చతుర్భుజుడైన విష్ణు మూర్తి ముఖ్య దేవత .ఈయన్నే బలరాముడి గా భావిస్తారు .
దక్షిణ దిశ దేవాలయాలు
దక్షిణ దిశాలయాలలో దులాదేవ్ ,చతుర్భుజ ,జత్కారి ఆలయాలున్నాయి .
1-దులాదేవ్ దేవాలయం
దీన్ని 1100-50మధ్య కట్టారు .దీనికి ‘’కున్వార్ మఠ’’ఆలయం అంటారు పెళ్లి చేసుకొన్నా నవ వధూ వరులు తప్పక ఈ ఆలయానికి వచ్చి దైవ దర్శనం చేసుకొంటారు కనుక ఆ పేరొచ్చింది .గంటాలయానికి దక్షిణాన ఉంది .ఖుదార్ నాలా ఒడ్డున ఉన్న ఆలయం .ఇదే ఖజురహో ఆలయాలలో ఆధునికమైనది .శివుడికి అంకితం .నిరాదారాలయం .గర్భ గుడి మహా మండపం చిన్న శిఖరాలు ఇరవై మంది అప్సరస ప్రతిమలు గుండ్రని సీలింగు తో’’సింప్లీ సూపర్బ్ ‘’అని పిస్తుంది .నృత్యం చేసే అప్సరసల హావ భావాలు చేష్టలు ఆభరణాల బరువుతో వంగిపోయినట్లు కని పిస్తారు .అద్భుత శిల్పకళా సృష్టికి నిదర్శనం .అష్ట వసువు విగ్రహాలు మకర వాహనాలపై ఉండటం ప్రత్యేకత .ఖజురహోశైలీ వైవిధ్యం దర్శన మిస్తున్దిక్కడ .
2-చతుర్భుజాలయం
పదకొండవ శతాబ్దికి చెందిన ఈ ఆలయం జకారి గ్రామానికి అరకిలో మీటర్ల దూరం లో ఉంది .నిరాదారాలయం .మహాశిఖరం తో శోభాయమానం .చతుర్భుజ విష్ణువే ఇక్కడి ముఖ్య దేవుడు .దక్షిణా మూర్తి విగ్రహం పడమటి ముఖం గా ఉంటుంది .దక్షిణా మూర్తి పది అడుగుల భారీ విగ్రహం .కిరీట దారిగా ఆభారణాలతో మెరసి పోతూ దర్శన మిస్తాడు .ఈఏక శిలా విగ్రాహం శివుని కిరీటం తో బుద్ధుడి ముఖం తో ,విష్ణు మూర్తి శరీరం తో శ్రీ కృష్ణుని ముఖ భంగిమలతో ఉండటం విశేషం .సింహ శిరస్సు కలిగిన స్త్రీ ఉత్తరం వైపు ఉండి వింత గొలుపుతుంది . ఈమె నరసింహావతార విష్ణు మూర్తి కి భార్యా మణి అని స్థానికులు భావిస్తారు .అర్ధ నారీశ్వర శివుడున్నాడు .
పురావస్తుశాఖ మ్యూజియం
పడమర దేవాలయ సమూహానికి దగ్గర గేటు సమీపం లో మ్యూజియం ఉంది .ఇక్కడ 2,000పైగా శిల్పాలున్నాయి .వీటిని యాభై ఏళ్ళుగా కస్టపడి త్రవ్వి తీసి ఇందులో అమర్చారు. నృత్య గణపతి ,అనేకమంది జైన తీర్ధంకరుల విగ్రహాలున్నాయి వైష్ణవ గాలెరి లో విష్ణుమూర్తి అనేక అవతారాల శిల్పాలుంటాయి .అలాగే బుద్ధుడు అయిదు శిరస్సుల శివుడు ఉంటారు ‘.
ఇదీ ఖజురహో దేవాలయ వైవిధ్యం .ప్రతి ఆలయాన్ని చూస్తె నాకు ఒకటి అనిపించింది .’’ఎండు ఖర్జూర కాయను’’ నిల బెడితే ఎలా వంపులు సొంపులు తో కని పిస్తుందో అదే రంగుతో ప్రతి ఆలయం అలానే కని పిస్తుంది అనేకత్వం లోఏకత్వం గోచరిస్తుంది .అన్ని సముదాయాల నిర్మాణం ఒకే వైపుకు కలిసి పోయి ఏక నిర్మితమని అఖండత్వం అనంతత్వం కలిసి శిఖరీ భూతమై ముగుస్తుందని అని పించింది .ఉత్తర దేశం లో ఖజురాహో ను మించిన శిల్ప సంపద మరెక్కడా కనిపించదు .కాని మన దక్షిణ దేశానికి ఇదేమీ కొత్త కాదు .మన దక్షిణ దేశ దేవాలయాలన్నీ మహా బృహత్తరమైనవి, శిల్ప కళా శోభితమైనవీను .ముఖ్యం గా కర్నాటక రాష్ట్రం లోని హాలీ బీడు లాంటి దేవాలయాలలో రాయి మైనం ముద్దలా జిలిబిలి వంపుసోమ్పులు పోయి మహా నాజూకుగా శిల్ప శిరోమణులు తీర్చి దిద్దిన వైభోగం మనకు అనుభవమే .కాని ఉత్తరాది వారికి ఖజురహో ను మించిన కళా సంపద లేదని పిస్తుంది .ఈ రెండు శిల్ప కళా శైలీ విన్యాసాలను చూసిన అదృష్టం. నాది అనుభూతి పొందిన జీవితం నాది .దేనికదే గొప్పదని నాభావన .ఎక్కువ తక్కువల ప్రసక్తి లేదిక్కడ. ఆ మహా శిల్పుల శిల్ప విన్నాణానికి చేయెత్తి జేజేలు పలకాలిసిందే అందరం ‘’కళాజిందాబాద్ ‘’అనాల్సిందే .నేను చూసిన వాటిని నేను అర్ధం చేసుకొన్న వాటిని నేను చదివి తెలుసుకొన్న వాటిని నాకు తెలిసిన భాషలో రాశాను .ఇది ఆసక్తి కలవారికి మరింత ఆసక్తి కలిగి అందులోని లోతులు తరచి చూడటానికి ఒక దారి మాత్రమె .ఇదే సమగ్రం ,సంపూర్ణం కాదని మనవి .
ఖజురహో దగ్గర ఉన్న ‘’ఓర్చా ‘’శిల్ప కళా వైభవం గురించి తరువాత తెలియ జేసి ఈ ఖజురాహో సీరియల్ ను పూర్తీ చేసి మా యాత్రలో మిగిలి ఉన్న ఉజ్జయిని ఓంకారేశ్వర్ యాత్ర గురించి రాస్తాను .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -23-4-15-ఉయ్యూరు

