యుద్దం చేస్తేగానీ… స్వరాజ్యం రాదు

రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య ధాటికి ధీటుగా మన్నెం ప్రజల హక్కుల పరిరక్షణ కోసం.. స్వరాజ్యం కోసం పోరాడిన వీరుల్లో అల్లూరి సీతారామరాజు ఒకరు. అయితే ఆయనతో నేరుగా మాట్లాడి, వాటిని ప్రచురించిన సందర్భాలు అతి తక్కువ. అలాంటి సందర్భం ఒకటి 1923లో చరిత్రలో నమోదయింది. 1923, ఏప్రిల్ 17వ తేదీన సీతారామరాజు తూర్పుగోదావరి జిల్లా అన్నవరానికి వచ్చినప్పుడు-చెరుకూరి నరసింహమూర్తి అనే స్థానికుడు ఆయనను కలిసి మాట్లాడారు. సీతారామరాజుతో నరసింహమూర్తి సంభాషణను, నరసింహమూర్తితో ఆంధ్రపత్రిక విలేకరి సంభాషణను ఆంధ్రపత్రిక ఏప్రిల్ 21వ తేదీన ప్రచురించింది. ఈ ఇంటర్వ్యూలను, సీతారామరాజుకు సంబంధించిన అనేక ఇతర ఆసక్తికరమైన విషయాలను, సూపర్ స్టార్ కృష్ణ తీసిన ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా విశేషాలను సేకరించి సీనియర్ పాత్రికేయుడు యు. వినాయకరావు ‘విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు’ అనే పుస్తకాన్ని ఇటీవల వెలువరించారు. ఆ పుస్తకంలో నుంచి ఒక ఆసక్తికర భాగం..
అల్లూరి సీతారామరాజు అన్నవరం వెళ్లినపుడు ఆయనతో చెరుకూరి నరసింహమూర్తి జరిపిన సంభాషణ.
మూర్తి: మీరిక్కడ ఎంతసేపు ఉంటారు?
రాజు: రెండు గంటలసేపు ఉంటాను. పది గంటల సమయంలో బయలుదేరుతాను. నర్సీపట్నం, కాకినాడలకు ఎస్ఐ తంతి వార్తలు పంపేందుకు కనీసం అరగంట ఆలస్యం కాక మానదు. ఆపై మాత్రమే పోలీసులు మోటారుబళ్లలో బయలుదేరుతారు. పది గంటల ప్రాంతంలోనే వారంతా ఆ గ్రామానికి చేరగలుగుతారు.
మూ: మీరెక్కడకు వెళ్లదలిచారు?
రా: నేను ముందుగా మకాములను నిర్ణయించుకోలేదు.
మూ: ఇక్కడికి ఎందుకు వచ్చారు?
రా: నా ఉత్తర్వులను అనుచరులు సరిగా గ్రహించలేదు. దారిలో తుపాకులను కాల్చారు. దాంతో నా జాడ తెలుస్తుందేమోనని నా ప్రయాణాన్ని మార్చి వెంటనే ఇక్కడికి వచ్చాను.
మూ: మీరేమి సంకల్పంతో పితూరిని నడుపుతున్నారు?
రా: ప్రజలకు స్వాతంత్య్రం లభించాలనే ఉద్దేశంతో.
మూ: ఏ సాధనంతో?
రా: దౌర్జన్యంతోనే. యుద్ధం చేస్తే గానీ మనకు స్వరాజ్యం రాదు.
మూ: స్వాతంత్య్రం పొందగలమన్న నమ్మకం మీకు ఉందా?
రా: రెండేళ్లలో స్వరాజ్యం తప్పక లభిస్తుందన్న నమ్మకం నాకు ఉంది.
మూ: రెండేళ్లలో స్వరాజ్యమెలా లభిస్తుంది? మీరవలంబిస్తున్న పద్ధతిలోనే స్వరాజ్యం వస్తుందా?
రా: తప్పక వస్తుంది. నాకు అనుచరుల సంఖ్య చాలా ఎక్కువ. అందులో లోటు లేదు. అయితే తుపాకులు, మందుగుండు సామాగ్రి కావాలి. వాటి కోసమే ఈ సంచారం చేస్తున్నాను.
మూ: దౌర్జన్యంతో కూడిన యుద్ధాలతో ప్రపంచం విసుగు చెందింది. దౌర్జన్యరహిత సిద్ధాంతాన్నే ఇప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఆదరిస్తున్నారు. జర్మనీవారు కూడా సాత్విక విరోధాన్నే ఆరంభించారు. గాంధీ మహాత్ముడు బోధించిన దౌర్జన్యరాహిత్య సాధనాల్లో మాత్రమే మాకు నమ్మకం ఉంది. సకల ప్రపంచానికి శాంతి మార్గాన్ని బోధించేందుకు దేవదూత గాంధీరూపంలో వచ్చిందని ప్రపంచ ప్రజలంతా నమ్ముతున్నారు.
రా: దౌర్జన్యరాహిత్యంపై నాకు నమ్మకం లేదు. దౌర్జన్యంతోనే స్వాతంత్య్రం సాధించగలమని గట్టిగా నమ్ముతున్నాను.
మూ: దౌర్జన్యంతో ప్రాణనష్టం, వినాశనం కలుగుతుంది. శాంతి సాధనతోనే స్వరాజ్యం లభిస్తుంది. ఇంతకుపూర్వం మీకు, పోలీసులకు జరిగిన యుద్ధాల్లో మీ పరిస్థితి ఎలా ఉంది?
రా: మొదటి అయిదు యుద్ధాల్లో నేను సులభంగా గెలుపొందాను. ఆరోది, చివరి యుద్ధంలో మాత్రం అలసి మేము నిద్రపోతుండగా పోలీసువారు హఠాత్తుగా మాపై దాడిచేసేందుకు ప్రయత్నించారు. వారు దూరంగా ఉండి మందుపాతరలను, తుపాకులను కాల్చారు. అరగంటసేపు విడవకుండా కాల్చిన శబ్దాలకు మా జట్టులోని వారికి మెలకువ వచ్చింది. మరి రెండు నిమిషాలకు నాకు కూడా మెలకువ వచ్చింది. నేను లేచి చూసేసరికి పోలీసుల సంఖ్య ఎక్కువగా ఉంది. మా వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. తుపాకి రవ్వలు తగిలి నా పరుపంతా చిల్లులు పడింది. అయితే, నాకు ఒక్కటీ తగలలేదు. మా వారితో కలిసి అక్కడి నుంచి తప్పించుకొన్నాం.
మూ: ఈ నాలుగు నెలలుగా మీరేమి చేస్తున్నారు?
రా: నేను జపం చేస్తున్నాను.
మూ: గయలో జరిగిన కాంగ్రెసు మహాసభలకు మీరు వెళ్లారని ప్రజలు బాగా చెప్పుకొన్నారు. నిజమేనా?
రా: నా స్థూల శరీరం గయకు పోలేదు. నా ఆత్మ మాత్రమే అక్కడికి వెళ్లింది.
మూ: అక్కడ జరిగిన విషయాలన్నీ మీకు తెలియవన్న మాటేనా?
రా: నేనంతా స్వయంగా చూడగలిగాను. అక్కడ రెండు వర్గాలు ఏర్పడ్డాయి. కొందరు శాసనసభలను బహిష్కరించాలని, మరికొందరు వెళ్లాలని అన్నారు. వెళ్లాలనే వారికి దాసుగారు నాయకుడు. వారి సంఖ్య అల్పం. ఉప్పు పన్నుని హెచ్చించినందుకు, ధర్మాదాయాల చట్టాన్ని ఆమోదించినందుకు భారత శాసనసభ్యుల్లోనూ, చెన్నపురి రాష్ట్రీయ శాసన సంఘ సభ్యుల్లోనూ ఎవరైనా రాజీనామాలు ఇచ్చారా?
మూ: ఎవరూ రాజీనామాలు ఈయలేదు. అసలు మీకీ రాజకీయ విషయాలన్నీ ఎలా తెలుస్తున్నాయి?
రా: నేను అందుకు తగు ఏర్పాట్లు చేసుకొన్నాను.
విప్లవజ్యోతి
అల్లూరి సీతారామరాజు
రచయిత: యు. వినాయకరావు
పేజీలు: 80, ధర: 100 రూపాయలు
ప్రతులకు: 98851 79428

