ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకూ, పూలిమ్మనీ రెమ్మ రెమ్మకూ
‘ఈనాటి ఈ బంధమేనాటిదో’ అన్న సినిమాలోని దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన ఈ పాట పల్లవి వినగానే ఎద ఝల్లుమంటుంది. అసలింత సున్నితమైన అత్యంత సుందరమైన ఆలోచనలు ఈ కవులకు ఎలా వస్తాయన్న ఆలోచన కలుగుతుంది. పొద్దున్నే పూచే పూలు దేవుడి పూజలో పాలుపంచుకోవాలని ఆత్రపడుతూ సిద్ధంగా ఉన్నాయన్న సుందరమైన భావనను కలిగిస్తూ, ఇలా దైవపూజ కోసం పూలిమ్మని కొమ్మకొమ్మకూ ఎవరో (దైవం) నేర్పారన్న భావనను కలిగిస్తూ, దైవం పేరెత్తకుండా దైవ భావనను స్ఫురింపజేసి ఒక పవిత్రపుటాలోచనను కలిగిస్తుందీ పల్లవి. ఇలాంటి పల్లవులు రచించటం తెలుగులో కృష్ణశాస్త్రి ప్రత్యేకత. ఈపాట అచ్చమైన సినీ గేయ రచనకు అసలైన ఉదాహరణ లాంటిది.
సినిమాలకు మాటలొచ్చినప్పటినుంచీ పాటలొచ్చాయి. ఆరంభ సినిమాల్లో మాటలకన్నా పాటలే ఎక్కువ ఉండేవి. నాటక రంగం నుంచి సినిమా ప్రత్యేక కళగా ఎదుగుతున్న సమయంలో నాటకం నుంచి పాటలు సినిమాల్లోకి వచ్చి స్థిరపడ్డాయని కొందరంటారు. ముఖ్యంగా పార్సీ నాటకాల ప్రభావమిది అని అంటారు. కానీ, పాటలు అన్నది భారతీయ జీవన విధానంలో ఒక విడదీయరాని భాగం.
‘లయ’ అన్నది సృష్టిలో నిబిడీకృతమైన ఒక అంశమని వేదం ప్రకటించింది. వేదమంత్రాలన్నీ లయబద్ధంగా ఉంటాయి. లయబద్ధంగా ఉండేందుకు ఛందస్సు ఏర్పడింది. భారతీయ సంగీతానికి వేదం ప్రాతిపదిక. అందుకే మన దగ్గర లాలిపాటలు, జోలపాటలతో ఆరంభమై జీవితంలో ప్రతి క్షణానికీ, ప్రతి సందర్భానికీ, ప్రతి సన్నివేశానికీ పాట ఉంటుంది. కాబట్టి పాటలు మనకు పార్సీ థియేటర్ నుంచో ఇంకెవరినుంచో రావాల్సిన అవసరం లేదు. నాటకాలలో ఛందోబద్ధమైన పద్యాలు రాయటం, మాటలను కవిత్వపు పాదాల్లో రాయటం మనకు ప్రాచీన కాలం నుంచీ ఉంది. వేదాల్లో సైతం మంత్రాల నడుమ సంభాషణలు, చర్చలు, నాటకాలను పోలిన కథనాలు ఉన్నాయి. అందుకే మన సినిమాలలో పాటలు స్థిరపడటమే కాదు. సినిమాలను దాటి ఎదిగాయి. ఆధునిక సమాజంలో సాహిత్యం స్థానాన్ని ఆక్రమించాయి.
కృష్ణశాస్త్రి రచించిన పాటను చూస్తే, పల్లవిలో మనకు కవిత్వం ఎక్కడా కనబడదు. కవి కనబడడు. ఒక అందమైన ఊహ కనిపిస్తుంది. ఒక చక్కని ఆలోచన కనిపిస్తుంది. ఇది గేయాన్ని కవిత్వంకన్నా భిన్నమైన సృజనాత్మక ప్రక్రియగా నిలబెడుతుంది. కవిత్వానికి సినిమా పాటల్లో స్థానం లేదు. కానీ కవులు అనేకులు సినిమాల వైపు ఆకర్షితులు అవటంతో సినీ గేయాలలో కవిత్వం జొరబడింది. అంతే తప్ప పాట వేరు, కవిత్వం వేరు. సినిమా గేయం ఇంకా భిన్నమైనది. కానీ సినీ గీతానికి సాహిత్య ప్రపంచంలో సముచితమైన స్థానం కల్పించి, గౌరవం పొందాలన్న సినీ కవుల తపన వల్ల సినిమా పాటలు కవితమయం అయ్యాయి. కానీ, ప్రతి కవిత పాట అవవచ్చేమోగానీ ప్రతి గేయం కవిత కాదు.
ఈ విషయం తొలి నాటి సినిమాల గేయ రచయితలకు స్పష్టంగా తెలుసు. అందుకే వారు తమ గేయాలలోంచి కవిత్వాన్ని పరిహరించారు. వీలైనంత సరళంగా, సూటిగా పాటలను రచించారు.
‘దోనైనా మత్వారే, తిహారే హమ్ పర్ జుల్మ్ కరే’ అని పాడతాడు సైగల్. నాయిక అందమైన రెండు కళ్లు అతడిపై అధికారం చలాయిస్తున్నాయట. ఇది కవిత్వం అనటం కష్టం. చమత్కారభరితమైన భావం కలిగించే గేయం అవుతుంది. ‘బాలమ్ ఆయో బసోమోరె మన్‌మే’ అంటాడు పాత సినిమా హీరో. అంటే ప్రేయసి వచ్చి అతడి హృదయంలో స్థిర నివాసం ఏర్పరచుకుందట. ఇది ఒక నిజాన్ని చెప్పటం. ఓ స్టేట్‌మెంట్.
కృష్ణశాస్త్రి రచించిన అధిక శాతం పాటలు ఇలాంటి స్టేట్‌మెంట్లే. ‘ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకూ’ పాట కూడా ఇలాంటి స్టేట్‌మెంట్లు, ప్రశ్నలతో కూడుకున్నదే తప్ప కవిత్వం ఏ మాత్రం లేనిది.
కొలువయితివా దేవి నా కోసము తులసి.. తులసి.. దయాపూర్ణ కలిసిమల్లెలివి నా తల్లి వరలక్ష్మికి, మొల్లలివి నన్నేలు నా స్వామికి
ఇందులో కవిత్వం ఏది? అన్నీ స్టేట్‌మెంట్లే. పదాల కూర్పులోని లాలిత్యం,
యే లీల సేవింతు? యేమనుచు కీర్తింతు?
కృష్ణశాస్త్రి గేయరచన పద్ధతి సిసలైనది అని ‘మల్లీశ్వరి’లోని ‘పరుగులు తీయాలి’ తిరుగులేని విధంగా నేర్పుతుంది.
పరుగులు తీయాలి, గిత్తలు ఉరకలు వేయాలి
హోరు గాలి, కారుమబ్బులు ముసిరేలోగా, మూగేలోగా
గలగల గలగల కొమ్మల గజ్జెలు
అవిగో అవిగో నల్లని మబ్బులు గుంపులు గుంపులు
మనసున మల్లెల మాలలూగెనే
ఎంత హాయి ఈ రేయి నిండెనో
అత్యుత్తమ గేయ రచన పద్ధతి ఇది. ప్రియుడి దర్శనం కోసం తపిస్తున్న ప్రేయసికి, ఇంకాస్సేపటికి ప్రియుడిని కలవబోతున్నానన్న భావన ఎంత ఆనందాన్ని కలుగచేస్తుందో, ఆ ఆనందం తాలూకూ హర్షాతిరేక భావనను అత్యంత మృదువుగా, సాత్వికంగా ఈ పాటలో సందర్శించాడు గేయ రచయిత కృష్ణ శాస్త్రి. అందుకే ఈ పాట ఈనాటికీ కాదు.. మానవ మనస్సుల్లో మృదుత్వం, శంగార భావనలలో సున్నితత్వాలు సజీవంగా ఉన్నంత కాలం మల్లెల మాలలను, వెన్నెల డోలల ద్వారా అలౌకికానందం కలిగిస్తుంటుంది. ఈ పాటను భానుమతి మరింత ప్రత్యేకంగా తన ఆత్మతో పాడిందనిపిస్తుంది. ఆమె స్వరంలోని మృదుత్వం, శృంగార భావన, ప్రియుడిని కలవబోతున్నానన్న ఆనందాన్ని అదుపులో ఉంచుకుంటూ, తన భావనలను పాటలో వ్యక్తీకరించిన విధానం ఈ పాటను తెలుగు సినిమాలలోనే కాదు, ఇతర భాషల సినిమాల పాటలన్నింటిలోనూ విశిష్టంగా నిలుపుతుంది. ఇక్కడే సంగీత దర్శకుడి చమత్కారం గమనించాలి.
పాటను నాయిక రాత్రిపూట ప్రశాంతమైన పరిస్థితిలో ఒంటరిగా ఆనందకరమైన ఘడియలను ఊహిస్తూ పాడుతుంది. గేయం భావమూ అలాంటిదే. ఈ పాటను స్వరపరచిన రాజేశ్వరరావు సందర్భాన్ని సంపూర్ణంగా ఉద్దీపితం చేసే రాగాన్ని ఎంచుకుని పాట బాణీని స్వర పరిచాడు. ‘కళ్యాణి’ రాగం అత్యంత శుభప్రదమైన రాగం. ‘కళ్యాణం’ అంటేనే అత్యంత శుభకరం అని అర్థం. అంటే ఆనందకరమైన, పవిత్రమైన సమయాల్లో గానం చేసే రాగం అన్నమాట ఇది. కళ్యాణి రాగాన్ని అర్ధరాత్రి దాటిన తరువాత తొలిజాములో గానం చేస్తారు. నాయిక పాటను అర్ధరాత్రి తొలి జాముననే గానం చేస్తుంది. అందుకే ఈ పాట అంత ప్రభావం చూపగల శక్తిని సంతరించుకుంది.
16వ శతాబ్దానికి చెందిన మేష కర్ణుడు రాగాలలోకెల్లా కళ్యాణి రాగాన్ని అతిగొప్ప రాగంగా ప్రస్తావించాడు. ముఖ్యంగా, ఒకరికోసం ఒకరు ఎదురుచూస్తున్న ప్రేయసీ ప్రియుల భావనలను ఈ రాగం ప్రదర్శించేందుకు ఉపయోగపడుతుందని భావించాడు. ఆ కాలంనాటి ఓ పాట, ఈ రాగంలోనిదీ ‘నా ప్రియుడు నన్ను విడిచి వెళ్లాడు, అతడి రాక కోసం ఎదురుచూస్తూ తారలు లెక్కిస్తూ’ రాత్రులు గడుపుతున్నానన్న అర్థంలో ఉంటుంది. సాంప్రదాయం పద్ధతి తెలిసి భాషపై పట్టు, ఉన్నవారు సందర్భం తెలుసుకుని ఉత్తమ కళను ప్రజలకు అందించాలన్న తపనతో సృజించే అత్యుత్తమ కళకు అతి చక్కని నిదర్శనంగా ఈ పాట నిలుస్తుంది.
కొమ్మల గువ్వలు గుసగుస మనినా
ఇంత గొప్ప కళాత్మకతను తమ హృదయం లోతుల్లోంచి నిజాయితీగా ఆనాటి కళాకారులు ప్రదర్శించారు. కాబట్టి సినిమా పాటలు ఇతర ప్రక్రియలను దాటి సమాజంలో ప్రజల నిత్య జీవితంలో విడదీయరాని భాగమయ్యాయి. ఈనాడు సినిమాలు కానీ, పాటలు కానీ ఇంతగా ప్రాచుర్యం పొందటానికి కారణమయ్యాయి. అయితే, ఇదే పాట, ఇదే సాహిత్యం, ఇదే బాణీతో దృశ్యాన్ని మార్చితే పాట నచ్చక పోవటమే కాదు సినిమా కూడా నచ్చదు. ఊహించండి.. నాయిక నాయకుడి కోసం ఎదురుచూస్తూ నృత్యం చేస్తుంటే, వెనకే ఓ వందమంది చెలికత్తెలు లయబద్ధంగా ఊపుతూ, ఊగుతూంటే… అందుకే ఈనాటి పాటలు మనకు నచ్చవు. గుర్తుండవు. పాత పాటలు మరపుకు రావు. మనసుకు అమిత ఆనందం కలిగిస్తాయి. ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు అని అడుగుతూ మనసులో మల్లెల మాలలు పూయిస్తాయి.

