డింగిరి ప్రశ్నకు టింగిరి జవాబులు (తొక్కలో ప్రశ్నకు తిక్క జవాబులు )(డిం .టిం .ప్ర .జ)
డింగిరి –గురూ !చంద్ర బాబు ఎక్కిన దగ్గర్నుంచీ వర్షాలు వెనక్కి పోతున్నాయే?
టింగిరి –బాబు ది ఐరన్ లెగ్ అని మళ్ళీ రుజువు అయింది .వరుణుడు భయపడి పారి పోతున్నాడేమో .
డిం –ఏంతో నమ్మకం తో ప్రజలు అధికారం కట్ట బెట్టారు ?
టిం –అధికారం తో బాటు అదృస్టమూ కలిసి రావాలి నాయనా .చంద్ర బాబు పేరులో చంద్రుడనే చల్లదనం ఉన్నా చంద్రుడికి బాబు సూర్యుడు అంటే సూర్య కాంతి వల్లనే చంద్ర ప్రకాశం కనుక సూర్యుడు పేట్రేగి పోతున్నాడు .’’బాబు బాబు’’ ప్రభావం అన్నమాట .
డిం –వరుణ యాగాలు చేస్తే వర్షాలు పడతాయికదా గురూజీ
టిం –వాతావరణ కాలుష్యం పెంచుకొని ,అరణ్యాలను నరుక్కుంటూ ,ఫ్రిజ్ ,టి వి.మొదలైన ఆధునియా సామగ్రిని పెంచుకొంటూ పోతున్న ఫలితానికి ఎన్ని వరుణ యాగాలు జపాలు చేస్తే మాత్రం సమతుల్యతః సాధించ గలం ?వివేకం కోల్పోయిన దాని ఫలితమే ఇది .వాతావరణం లో వేడి పెరిగి ,కొంప కొల్లేరు అవుతోంది .
డిం –తెలంగాణా లో కాంగ్రెస్ దళం గులాబీ కండువాలు కప్పుకొందే ?
టిం –తెలంగాణా ఇచ్చిన’’ సోనీ ‘’కి తగిన ప్రతి ఫలం ఇది .కాంగ్రెస్ గూడు ఖాళీ .నెత్తిన చేతులే భస్మాసుర హస్తమే .పొన్నాలలు జానాలు, బెత్తేడ్లు ఎవరూ ఆపలేరు .
డిం –మరి సెంటర్ లో?
టిం –యదా రాజ తదా ప్రజా .అక్కడ ‘’కూడా ‘’చెయ్యి ‘’జారి పోయి మిగిలేది ‘’హాండ్ ఫుల్ ‘’మందే .మోడీ పాలన కాలం పెరిగిన కొద్దీ వచ్చే ప్రమాదం ఇదే కాంగీ కి .
డిం –జగన్ అసెంబ్లీలో రెచ్చి పోతున్నాడే ?
టిం –గురివింద తన కింది నలుపును మర్చి పై మెరుపు ,ఎరుపు కు మురిసి పోతుంది .నిజం తెలిసే సరికి మునిగిపోయే ప్రమాదం ఉంది .
డిం –‘’దాడి’’ దాడి గురించి ?
టిం –జగన్ లొసుగులు తెలిసి ఇప్పుడిప్పుడే బయట పెట్టి దాడి చేస్తున్నాడు దాడి .కొందరికి జ్ఞాన దంతాలు లేట్ గా వస్తాయి శిష్యా .బ్రాహ్మణి గుట్టు రట్టు చేశాడు కదా .ఇక నెమ్మదిగా ఒక్కో చిట్టా విప్పి చిత్తూ చిత్తూ చేస్తాడు .దానితో ఖజానా ఖాళీ .సభ్యులు మోళీ చేసినట్లు జంప్ జిలానీ .
డిం –వలసలను ప్రోత్సహించద్దని పొన్నాల ఉవాచ ?
టిం –నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష .కొంప ఖాళీ అవుతూంటే ఉక్రోషం ఉడుకు మోటు తనం .ఎవరికైనా తానదాకా వస్తే కాని తెలీదు డింగరీ .
డిం –తెలంగాణా లో తెలుగు దేశం స్థితి ?
టిం –ఎవరూ దేనికీ అతీతులుకారు .ప్రలోభాలు ఎంతవారినైనా లొంగ దీస్తాయి .కాలమే చెప్పాలి దేశం భవిష్యత్తు గురించి .తెలుగు దేశమూ గులాబీలను ఆకర్షించే ప్రయత్నం చేయచ్చు .
డిం –పి వి .ఉత్సవాలు జరిపిస్తాడట గులాబీ నేత .
టిం –అధికారం లోకి వచ్చాక ‘’రావు’’ చెప్పిన మంచిమాట ఇది ఒక్కటే .కాన్గీలు మర్చి పోయిన మన జాతి రత్నాన్ని ,ఆంధ్రుల గర్వాన్ని నెత్తి కేత్తుకొన్నందుకు కే సి ఆర్ అభినందనీయుడు .పివి కి అవమానం జరుగుతున్నా కౌరవ సభలో పెద్దల్లా ఇన్ని వందల మంది ఖద్దరు బాబులు ఒక్కమాట కూడా అధినేత్రికి ఎదురు చెప్పలేక నోరు మూసుకున్న ఫలితాన్ని ఇప్పుడు అనుభ విస్తున్నారు .ఒక రకం గా పి వి భూతం వారిని నిలువ నీడ లేకుండా చేసినట్లు గా ఉంది .కుక్క కాటుకు చెప్పు దెబ్బ కొట్టాడు జ్ఞాని మాజీ ప్రధాని నరసింహా రావ్ జీ .ఇక ఆపి మళ్ళీ కలుద్దాం డింగరీ
టిం -సరే గురు టింగరి-వస్తా వెళ్ళొస్తా .
కేవలం లాఫింగ్ కే నని మరువద్దని మనవి
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ – 25-6-14-ఉయ్యూరు

