న్యూయార్కు, సింగపూరు… తేట తెలుగు ‘నమూనా’లు!
- – హెబ్బార్ నాగేశ్వరరావు

ఇప్పుడు స్వజాతీయత గురించి ఎవ్వరూ పట్టించుకొనడం లేదు. అన్నింటికీ అంతర్జాతీయ ‘ఉపమానాలు’ మాత్రమే నడిచిపోతున్నాయి. అంతకంటే పై స్థాయి ఉన్నట్టు తెలియకపోయినప్పటికీ, ‘సూపర్’ ‘డూపర్’ ‘మెగా’ ‘దగా’ వంటి పదాలను వాడేసి, అంతర్జాతీయ స్థాయికంటే ‘విస్తృతమైన’ ‘ఉన్నతమైన’ది ఇంకా ఏదో ఉందన్న భ్రమను కల్పించడానికి ఊదర గొట్టేస్తున్నారు… బంగారు తెలంగాణ, స్వర్ణాంధ్రప్రదేశ్ వంటి పదజాలం సృష్టిస్తున్న సహజమైన అనుభూతిని ‘అంతర్జాతీయ’ కృత్రిమ అనుబంధం ఆలింగనం చేసుకుంటున్న క్షణాలు ఆవిష్కృతవౌతూనే ఉన్నాయి!! ‘సశక్త భార త్’ను ‘సమృద్ధ భారత్’ను ‘స్వావలంబక స్వర్ణ భారత్’ను నిర్మించడానికి నడుములు బిగించిన వారు సైతం ప్రత్యేక ఆర్థిక మండలాలు- సెజ్‌ల-ను రద్దు చేశామని చెప్పడం లేదు… విదేశీయ సంస్థల ప్రత్యక్ష నిధుల – ఎఫ్‌డిఐ – అవసరం లేకుండా స్వదేశీయ నిధులలోనే ‘సశక్త భారత్’ను నిర్మించడం గురించి ప్రచారం చేయడం లేదు. రైల్వేలలో ‘విదేశీయ నిధుల’ను ‘విదేశీయ ప్రత్యక్ష భాగస్వామ్యాన్ని’ అనుమతించే విషయంపై చర్చ మొదలైంది. ప్రభుత్వ సంస్థల వాటాలను భారీగా అమ్మేస్తారట… స్వదేశీయ సంస్థలకు మాత్రమే అమ్ముతామన్న ‘స్వావలంబక’ సిద్ధాంతం మాత్రం ఈ అమ్మకాలను నిర్వహించదలచిన ప్రభుత్వ నిర్వాహకులకు గుర్తు రావడం లేదు!! ‘‘వాల్‌మార్ట్ వంటి అమెరికా సంస్థను మన దేశంలో చిల్లర దుకాణాలను తెరవనివ్వం…’’ అని ఎన్నికలకు పూర్వం లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకురాలు సుషమా స్వరాజ్ కఠోర ప్రతిజ్ఞ చేశారు. ఇప్పుడు విదేశ వ్యవహారాల అమాత్య పదవిని నిర్వహిస్తున్న ఈ నాయకురాలికి ఆ సంగతి గుర్తుందా?? ‘వాల్‌మార్ట్’ను వెళ్లగొట్టినట్టు ఆధికారిక ప్రకటన ఏదీ వెలువడినట్టు లేదు…
అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హైదరాబాద్ మహానగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆదర్శ నగరంగా తీర్చిదిద్దేసినట్టు క్రీస్తుశకం 2004 నాటి ఎన్నికల పరాజయానికి పూర్వమే ‘్ఢమఢమఢమ’ అని ‘డప్పు’ మారుమోగిపోయింది! 2004 శాసనసభ ఎన్నికల నాటికే మన భాగ్యనగరం ‘మోడల్ సిటీ’! కనీసం అప్పటి ముఖ్యమంత్రి, వారి వందిమాగధ బృందమైనా గుర్తించిన మహా విషయమిది… పారిశుద్ధ్యపు గొట్టాలు పగిలిపోయినచోట, మురికినీటి గుబాళింపు ముక్కుల పుటాలను మత్తెక్కించినచోట, ‘మధుర’ గీతాలను వినిపించిన ‘మశక’ మహాశయలు ఈ సంగతిని గుర్తించి ఉండకపోవచ్చు! ఆ ‘మశక’ సమూహాల దాడికి విలవిలలాడి రుధిరగీతాలను ఆలపించిన మధ్యతరగతి జనం సైతం ఆ ‘ఆదర్శ నగరాన్ని’ లేదా ‘నమూనా నగరాన్ని’ గుర్తించి ఉండకపోవచ్చు!! అంతర్జాతీయ స్థాయిలో ‘దోమలు’, ఇతర లోకాలకు చెందిన ‘వైతరణి’ స్థాయిలో మురికికాలువలు విస్తరించడం కూడా అంతర్జాతీయ స్థాయి హైదరాబాదు నమూనా నరకానికి నిదర్శనం…. పదేళ్లు గడిచిపోయాయి! ఒక రాష్ట్రం స్థానంలో రెండు రాష్ట్రాలు వెలసి ఉన్నాయి. అందువల్ల అవశేష ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని నిర్మాణం అనివార్యమైంది! ‘హైదరాబాదు’నకు దీటుగా కొత్త రాజధానిని నిర్మించగలమని అవశేషాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పడం బాగుంది! ఎందుకంటే హైదరాబాద్‌ను ‘నమూనా నగరం’గా తీర్చిన ‘ఘనత’ పదేళ్లకు పూర్వమే ఆయన గరిమలో భాగం. కాని అంతటితో ఆయనకు తృప్తికలగడం లేదు!! ‘‘సింగపూర్ స్థాయి’’లో నూతన రాజధానిని నిర్మించి తీరుతానని ప్రతిజ్ఞ చేశారు! ఆదర్శప్రాయమైన నగరాలు తెలుగు నేలపై ఎక్కడ కూడా ఆయనకు కనిపించలేదు. ‘‘తెలుగువారి ఆత్మాభిమానాన్ని నిలబెట్టడం’’ అని అంటే ఇదేనేమోమరి! భారత జాతీయ భౌగోళిక సీమల పరిధిలో సైతం చంద్రబాబునాయుడికి నూతన రాజధానికి స్ఫూర్తినివ్వగల సుందర నగరం కాని పట్టణం కాని కనిపించక పోవడం వర్తమాన చరిత్ర! అందువల్ల ఆయన ‘సంకుచిత’ జాతీయతా దృష్టిని విదిల్చుకొని అంతర్జాతీయ అనే్వషణను సాగించాడు! సింగపూర్ సాక్షాత్కరించింది… అందంగా కనిపించింది! ‘సింగపూర్’ను చూడని సామాన్య జనాలకు భాగ్యనగరాన్ని చూసిన మధ్య తరగతి వారు వివరిస్తున్నారట! ‘‘అయితే దోమలు, మురికికాలువలు ఉండవా?’’ అన్నది విన్న వారి సందేహం… ఈ ‘మామూలు’ నాసిరకం దోమలుండవు. అంతర్జాతీయ స్థాయి ‘జిఎం’ – జన్యుసంకరమైన – మహా ‘మశకాలు’ దిగుమతి అయిపోతాయి…’’ అన్నది సందేహ నివృత్తి! ప్రతి దానికి ముందు ‘‘అంతర్జాతీయ’’ పదాన్ని తగిలించందే మనకు గుర్తింపు ఉండబోదన్న ఊహ రాజకీయ మేధావులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అంతర్జాతీయ రసాయనాలు, అంతర్జాతీయ వ్యాధులు…!
అక్కడ ఆయనకు సింగపూర్ నగర రాజ్య – సిటిస్టేట్ – శోభ స్ఫురిస్తే ఇక్కడ ఈయనకు న్యూయార్క్ బృహత్ నగర పటిమ ప్రస్ఫుటించింది! హైదరాబాద్ మహానగర పోలీసు వ్యవస్థను ‘న్యూయార్క్’ తరహా పోలీసు వ్యవస్థ తరహాలో తీర్చిదిద్దనున్నదట తెలంగాణ ప్రభుత్వం! వెంటనే మన రచయితలు రంగంలోకి దిగిపోయి ‘ఇంటర్ నెట్’ నుంచి సరకు దించేసి – డైవ్ లోడింగ్ – న్యూయార్క్ సిటీ పోలీసు డిపార్ట్‌మెంట్ – ఘనతను చరిత్రను పటిమను వ్యూహరచనా నైపుణ్యాన్ని, కుక్కల బృందాన్ని గురించి కథనాలను దృశ్యమాధ్యమ అక్షరమాధ్యమ వీక్షకులకు పాఠకులకు వివరించి తన్మయత్వానికి గురి చేస్తున్నారు. భారతదేశం అంతర్జాతీయ సమాజంలో సగర్వంగా తలెత్తుకొని నిలబడేలా చేయడం తమ లక్ష్యమని మన రాజకీయ వేత్తలు చెప్పుకొస్తున్నారు! మన దేశం నుండి ఇతరులు స్ఫూర్తిని పొందినప్పుడు మనకు ‘సగర్వమైన తల ఎత్తుకునే స్థితి’ సంభవించవచ్చు! కానీ అరవై ఆరేళ్ల స్వతంత్రం తరువాత కూడా ‘న్యూయార్క్’ ను చూస్తే కాని హైదరాబాదు పోలీసులకు పని చేయడం రాదన్న ‘కీర్తి’ మనదేశాన్ని తల ఎత్తుకునేలా చేస్తుం దా?? నాలుగు వందల ఏళ్ల చరిత్ర అమెరికా దేశానిది… భారతదేశానికి నాలుగు యుగాల చరిత్ర ఉంది, వెయ్యి మహాయుగాల చరిత్ర ఉంది! సింగపూర్ ఎలా ఉందో? న్యూయార్క్ ఎలా ఉందో? అక్కడ పోలీసులు సగటు ఎత్తు ఎంతో కనిపెట్టగల ‘మేధావులు’ మన దేశంలో ప్రపంచానికి ‘నమూ నా’లుగా పనికొచ్చే మహా విషయాలను మాత్రం కనిపెట్టరు. ఎవరైనా కనిపెడితే సహించలేరు, కనిపెట్టిన వారిని మూఢ విశ్వాసాలకు, ప్రగతి నిరోధక విధానాలకు ప్రతినిధులుగా చిత్రీకరిస్తారు! ఎప్పటికీ మనం ఇతర దేశాలను చూసి అనుసరించే ‘జాతి’గానే మిగిలిపోవాలన్నది ఈ మేధావుల లక్ష్యం! ఇప్పుడు తెలంగాణలో మాత్రమే కాదు దేశమంతటా ‘న్యూయార్క్’ పోలీసుల బొమ్మలను చూసి జనం మురిసిపోతున్నారట! పాపం హైదరాబాద్ పోలీసులు…!
పోలీసు వ్యవస్థను మార్చడమంటే పనితీరు, సామర్థ్యం, పటిష్టమైన వ్యూహాలు, నేరనిరోధక పద్ధతులు, నేర పరిశోధక విధానాలు మెరుగుపడడమని సామాన్యజనాలకు సైతం తెలుసు! కానీ ఇవేవీ కాదట! మన పోలీసులు ‘బట్టలు’ మార్చుకుంటే చాలు… సర్వం మారిపోతుందట! ఇంతవరకు హైదరాబాద్ పోలీసులు తెలంగాణ పోలీసులు ధరిస్తున్న ‘గణవేషం’ పనికిరాదట! ఐక్యరాజ్య సమితి దళాల తరహాలోని గణవేషం – యూనిఫారమ్ – మన పోలీసులు ధరించాలట! చీకటి నీలం – డార్క్ బ్లూ – రంగు ట్రౌజర్లు, ఆకాశపు నీలం – స్కైబ్లూ – రంగు షర్టులు హైదరాబాద్ పోలీసులు తక్షణం ధరించడం ఆరంభం కావాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశించారట! పోలీసులలో కర్తవ్యనిష్టను, నైతిక నిష్టను, బౌద్ధిక శారీరక పటిమను పెంచడం ద్వారా వారి స్వభావంలో గుణాత్మక ప్రగతిని కలిగించడానికి ప్రయత్నాలు జరుగవలసిన సమయంలో బట్టల రంగును మాత్రం మార్చి వేస్తే ఏమి సాధించగలరు?? ఇప్పుడున్న ‘యూనిఫారమ్’ ఈ కర్తవ్యనిష్ఠకు, నైతిక నిష్ఠకు, పనితీరునకు పటిమకు అవరోధంగా మారిందా?? న్యూయార్క్‌పట్ల, సింగపూర్‌పట్ల, జిబ్రాల్టర్ శిలపట్ల టింబక్టూ నగరంపట్ల గౌరవం ఘటించే విధంగా జనాన్ని తీర్చిదిద్దడంవల్ల ఈ కర్తవ్య నిష్ఠకాని, నైతిక పటిమ కాని పెరగవు…
బ్రాండ్ హైదరాబాద్‌కాని గ్రాండ్ హైదరాబాద్ కాని పోలీసుల బట్టలను వాటి రంగును మార్చినంత మాత్రాన ఏర్పడదు! ఆవును, అడవినీ రక్షించడంవల్ల మాత్రమే భవ్యమైన భాగ్యనగరం మాత్రమే కాదు దివ్యమైన భారతదేశం కూడా అవతరించగలదు! నూతన రాజధానిని నిర్మించడానికి పూనుకుంటుంటున్న నీ పెద్దలు నైతం గుర్తించవలసిన అంశమిది! ఆవులున్న చోట అడవులున్నచోట ఆరోగ్యం వెల్లివిరుస్తుంది, అమరిన ప్రగతి పరిమళిస్తుంది. రెండువందల ‘జాతు’ల దేశవాళీ ఆవులలో ఇప్పుడు భారతదేశంలో మొత్తం మీద ఇరవై తొమ్మిది ‘జాతు’ల అవులు మాత్రమే మిగిలి ఉన్నాయట!
అందువల్ల ‘బిటి’ పత్తి, ఎండోసల్ఫాన్, చైనీస్ సిజ్లర్, కెంచుకీ చికెన్ – అమెరికాలోని ‘కెంటుకీ’ రాష్ట్రంలోని కోడిమాంసమట – వంటి ‘నత్తల’ గురించి తెలిసినవారికి ఆవులు, అడవుల వంటి ‘వౌక్తిక మణుల’ సంగతి కూడా తెలుసుకోవడం ఇప్పుడైనా అనివార్యం! భారతీయ ప్రాచీన రాజధాని నగరాలు ‘నిలువున’ పెరగలేదు, అడ్డంగా విస్తరించాయి. ముంబయి ‘కంపాకోలా’ ప్రాంగణంలో అక్రమంగా నిర్మించిన ఇరవై ఆరు అంతస్థులను కూల్చివేయమని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించింది. నిలువునా అంతస్థుల భవనాలు నిర్మించడం కొత్త రాజధాని శోభనీయదు! హంపీ విజయనగరం ఏడు ప్రాకారాలుగా విస్తరించి ఉండేదట! కాకతీయుల రాజధాని ఓరుగల్లు కూడా ఏడు ప్రాకారాలుగానే విస్తరించి ఉండేది! ఈ ప్రాకారాలలో కొన్నింటిలో పొలాలు, కొన్నింటిలో ఆవులు అడవులు (వనాలు) కూడా ఉండేవి!! శాతవహన రాజదాని ధాన్యకటకం – అమరావతి – కూడా ఇలా అడ్డంగానే విస్తరించి ఉండేది! ‘నిలువున’ అంతస్థుల భవనాలు పెరగడంవల్ల కాలుష్యం కేంద్రీకృతమైపోతుంది. అడ్డంగా విస్తరించడంవల్ల అమరిక, స్వచ్ఛమైన పరిసరాలు నెలకొంటాయి! న్యూయార్క్, సింగపూర్ వంటిని నిలువున పెరిగిన నగరాలు! అమరావతి, హంపీ, ఓరుగల్లు – ఏకశిలానగరం – వంటి మన ప్రాచీన నగరాల నమూనాలను అనే్వషించండి!!

