మన రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న మాలాంటి ఢిల్లీ వాసులకు ఆంధ్రప్రభుత్వం మాత్రమే జవాబుదారీ అంటూ నాటక నవలల పోటీ కొత్త మనస్తాపాన్ని తెచ్చిపెట్టింది. న్యాయనిర్ణేతల తీర్పు అన్యాయంగా అనిపిస్తోంది. గతంలో చాలాచోట్ల పలుమార్లు జరిగిన రచనల పోటీల్లో అత్యుత్తమ బహుమతి ప్రమాణాలకు స్థాయికి తగినవి రాకపోతే ఎలాంటి తటపటాయింపు లేకుండా బహుమతికి అనర్హంగా ప్రకటించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వం విభజన సంధికాలంలో నాటకం -నవలల పోటీల్లో బహుమతులు పంచిన తీరు చాలా విడ్డూరంగా అసంబద్దంగా ఉంది. నాటకంలో పద్యం, చారిత్రికం సాంఘికం ప్రక్రియలతో పాటుగా నవలకు ప్రాధమ్యం కల్పిస్తూ ఒక్కోదానికి లక్ష నగదుతో పాటు ప్రచురణ, ప్రదర్శనలకు ప్రోత్సాహం కల్పిస్తామని ప్రకటించారు. అందుకు సంబంధించిన విధి విధానాలు రూపొందించి ఆయా రచనలకు ఆహ్వానం ప్రకటిస్తే మహత్తర స్పందన వచ్చిందని చాటుకుంటూ పోటీల గడువు తేదీని పొడిగించారు.
అద్భుత రచనలు వెలువడుతున్నాయని మాలాంటివాళ్ళం మురిసిపోతూ ఎదురుచూసాం. అన్నీ అయిన తరువాత పోటీల్లో మొత్తంగా 3 నాటక ప్రక్రియలకు సంబంధించి 150 నాటకాలు 57 నవలలు వచ్చాయని వెల్లడించారు. మన రాష్ట్రంలో నందితో సహా ఇతర పోటీల్లో ఎంట్రీలుగా ప్రతిఏటా ఇంచుమించుగా అదే సంఖ్యలో రావటం పరిపాటిగా ఉంది. తెలుగు నాటకరంగంలో ఎక్కువగా ప్రదర్శనలు ప్రేక్షకుల ఆదరణ పొందే సాంఘిక నాటకాలల్లో ఉత్తమంగా లక్ష రూపాయల బహుమతికి దాపుల్లో ఏదీలేదని న్యాయనిర్ణేతలు నిర్ధారించారు. రావికొండలరావు, దుగ్గిరాల సోమేశ్వరరావు, కందిమళ్ల సాంబశివరావు, శంకరమంచి పార్థసారధి జడ్జిలుగా వ్యవహరించారని తెలిసింది. తక్కువ సంఖ్యలో వచ్చిన నవలల్లో ప్రథమ బహుమతి పొందగల అర్హత లేనేలేదని అంపశయ్య నవీన్, నవ్య జగన్నాధశర్మ, వాడ్రేవు చినవీరభ ద్రుడు, మృణాళిని, మధురాంతకం నరేంద్ర నిర్ధారించారు. సాంస్కృతిక శాఖ 12 నవలలకు 10 నాటకాలకు ఒక్కోదానికి 25,000 చొప్పున బహుమతుల పందేరం ప్రకటించారు. వాటిల్లో కొందరి రచనలు వేరే వాళ్లు నిర్వహించిన పోటీల్లో బహుమతులు గెలుచుకుని ఉండడం గమనార్హం. గతంలో ప్రభుత్వపరంగా వరుసపెట్టు సత్కారాలు పురస్కారాలు పొందిన వారికే మళ్లా కన్సొలేషన్‌గా పేర్కొనతగ్గ బహుమతుల్లో సింహభాగం దక్కింది. తాము ఆశించిన ప్రమాణాలు, వాసి లేదని నిర్దారిస్తూనే మళ్లా మళ్లా బహుమతులు ఇచ్చి ప్రోత్సా హం అనటంలో హేతుబద్దత ఎంత ? ప్రభుత్వ నిధులతో మళ్లా మళ్లా బహుమతులు ప్రశంసలు కురిపించటంలో సాంస్కృతిక శాఖ సంస్కారం ఇంకో సారి విమర్శలు పెంచుకుంటోంది. తెలుగుతనానికి సంబంధించిన ఈ పొటీలు, బహుమతుల నిర్ణయాన్ని పూర్తిగా సీమాంధ్ర ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారమని అప్పగింతలు పెట్టిన అధికారుల విజ్ఞతను ఆయా నాటకాలవాసి నాణ్యత తెలుసుకునేలా ఎప్పుడు చేస్తారని అడిగితే కప్పదాటు జవాబులు చెబుతున్న సాంస్కృతిక శాఖ శైలిని పలువురు కళారంగ మిత్రులం తీవ్రంగా నిరసిస్తున్నాం.
– దేవరకొండ సుబ్రమణ్యం
గురుగాం, ఢిల్లీ 08800968130

