ఆ డైలాగే నాకు టర్నింగ్ – డబ్బింగ్ ఆర్టిస్ట్ స్వగతం – ఆమెకు న వాయీస్ సుట్ అవ్వదు – డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఘంటసాల గారి మనవ రాలు

ఆ డైలాగే నాకు టర్నింగ్

 

‘‘కళ్ళతో కోటి భావాలు పలికిస్తే సరిపోదు.. ఉచ్ఛారణలో జ్ఞానాన్ని కూడా పలికిస్తేనే అదీ అసలైన నటన. అందుకే వాచికం సర్వవాంగ్మయం అన్నారు. ఇప్పటి కథానాయికల్లో ఒకరిద్దరిని మినహాయిస్తే మిగిలిన అందరి దృష్టి అభినయం, ఆహార్యంపైనే ఉంటుంది. వాచికంతో వాళ్ళకు పనిలేదు. ఇది బాధకరమైన విషయం. తెలుగురాని ఈ ముద్దుగుమ్మల పుణ్యమాని అందమైన హస్కీ వాయి్‌సలను వినే అవకాశం మన
ప్రేక్షకులకు దక్కింది. అలాంటి వాయిస్‌లతో తమన్నా, శ్రుతిహాసన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, హన్సిక, రెజీనా, నందితలకు డబ్బింగ్‌ చెబుతున్నది ఎవరో తెలుసా? హరిత. ఈ అమ్మాయి కోవలోనే ‘హార్ట్‌ ఎటాక్‌’ సినిమాలో అదాశర్మతోపాటు అనుష్క, హన్సికల పాత్రలకు డబ్బింగ్‌ చెప్పిన మరో అమ్మాయి ఘంటసాల వీణ. డబ్బింగ్‌ కెరీర్‌లో దూసుకుపోతున్న వారిద్దరే ఈ వారం మన సండే సెలబ్రిటీలు..
‘‘చెన్నైలో పుట్టాను. పాఠశాల చదువంతా అక్కడ, కాలేజీ చదువంతా హైదరాబాద్‌లో సాగింది. బీకామ్‌ కంప్యూటర్స్‌ పూర్తి చేశాను. మా పిన్ని అనురాధ సీనియర్‌ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌. గతంలో చాలామంది నటీమణులకు ఆమె గొంతు అరువిచ్చారు. ప్రస్తుతం ‘చిన్నారి పెళ్లికూతురు’లో అవికాగోర్‌ బామ్మ పాత్రకు డబ్బింగ్‌ చెబుతున్నారు. ఆమె ప్రోత్సాహంతో నేనీ రంగంలోకి అడుగుపెట్టాను. చిన్నప్పటి నుంచే డబ్బింగ్‌ స్టూడియోలకు వెళ్ళి అన్నీ పరిశీలించేదాన్ని. 13 ఏళ్ళ వయసులో చిన్న క్యారెక్టర్లకు, సీరియల్‌ ఆర్టి్‌స్టలకు డబ్బింగ్‌ చెప్పాను. ‘ఛత్రపతి’ సినిమాలో అజయ్‌ చెల్లి పాత్రకు డబ్బింగ్‌ చెప్పాను. కాంచబాబుగారి ద్వారా ‘కొత్త బంగారులోకం’ ఆడిషన్స్‌కి వెళ్లాను. అక్కడికొచ్చిన ముఫ్పై మందిలో నేనొకదాన్ని. నేను చెప్పిన ట్రాక్‌ నచ్చడంతో శ్వేతాబసు ప్రసాద్‌కి డబ్బింగ్‌ చెప్పే అవకాశం వచ్చింది. ఆ సినిమాలో ‘యే..కడా.. ఏ..పుడూ…’ (ఎక్కడ ఎప్పుడు) అనే డైలాగ్‌ బాగా పాపులర్‌ అవ్వడంతో తొలి సినిమాతోనే గుర్తింపు లభించింది. అక్కడి నుండి డబ్బింగ్‌ ఆర్టి్‌స్టగా నా కెరీర్‌ ప్రారంభమైంది. ‘కిక్‌’తో ఇలియానాకు మొదలుపెట్టాను. ప్రస్తుతం తమన్నా, శ్రుతిహాసన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, హన్సిక, రెజీనా, నందితలకు రెగ్యులర్‌గా డబ్బింగ్‌ చెబుతున్నాను. అవికాగోర్‌, (లక్ష్మీ రావే మా ఇంటికి), పూజా హెగ్డే (ముకుంద), రాశిఖన్నా (జోరు), మిష్టీ (చిన్నదాన నీకోసం), ఎమీజాక్సన్‌ (ఐ), యామీగౌతమ్‌ (కొరియర్‌బాయ్‌ కల్యాణ్‌)కు కూడా డబ్బింగ్‌ చెప్పాను. ఇప్పటి వరకు 350 సినిమాలకు పనిచేశాను. ప్రస్తుతం మెటర్నటీ లీవ్‌లో ఉన్నాను. ఏప్రిల్‌ నుండి మళ్ళీ బిజీ అవుతాను.
పరకాయ ప్రవేశం చేస్తా
తెలియని వ్యక్తికి వాయిస్‌ ఇవ్వడం అంటే సవాల్‌తో కూడిన పనే. వాళ్ళ మాట తీరు, బాడీ లాంగ్వేజ్‌ వేరుగా ఉంటాయి. వారు చేసిన పాత్రను, సన్నివేశాన్ని అర్థం చేసుకుంటే డబ్బింగ్‌ చెప్పడం చాలా ఈజీ. నేనయితే చెప్పాల్సిన సన్నివేశాన్ని ఓసారి చూస్తే చాలు పట్టేస్తా. ఒక్కోసారి ఎమోషన్స్‌ సీన్స్‌లో హీరోయిన్లు హై లెవల్‌ ఎమోషన్స్‌ క్యారీ చేస్తారు. మేము కూడా ఆ ఎమోషన్స్‌ క్యారీ చేస్తూనే వాయిస్‌ తగ్గించి, ఇంకోసారి పెంచి చెప్పాల్సి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో కాస్త జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. సెంటిమెంట్‌, కామెడీ, రొమాన్స్‌ ఏదైనా అలవోకగా చెప్పగలను. ఫన్నీ సీన్స్‌, ఎమోషన్‌ సీన్స్‌కి వాయిస్‌ ఇవ్వడం అంటే చాలా ఇష్టం. హీరోయిన్‌ ఎవరైనా సరే వారి డైలాగ్‌లు ఒక్కసారి చదివితే చాలు. ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తాను, ఇలియానాకు డబ్బింగ్‌ చెబితే ఇలియానా, తమన్నాకు చెబితే తమన్నాగా మారిపోతా. చెన్నైలో పుట్టాను కాబట్టి మొదట్లో నాకు తెలుగు సరిగా వచ్చేది కాదు. ఐదేళ్ళ క్రితమే తెలుగు రాయడం, చదవడం నేర్చుకున్నాను. ఇప్పుడు తెలుగులో పర్‌ఫెక్ట్‌ నేను.
డిమాండ్‌ను బట్టి పారితోషికం
ఎన్నో కెరీర్‌ల మాదిరి ఇది కూడా ఒక కెరీరే! ఆసక్తితో వచ్చాం కాబట్టి.. ఇష్టంగా పనిచేస్తున్నాను. ఇక, పారితోషికం సంగతికొస్తే – డబ్బింగ్‌ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ నిర్ణయించిన పారితోషికాన్నే మేం తీసుకుంటాం. అది సినిమా మీద, క్యారెక్టర్‌ లెంగ్త్‌ మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో హీరోయిన్‌ను బట్టి డిమాండ్‌ ఉంటుంది. పెద్ద సినిమాలకు వారం రోజులు పనిచేయాల్సొస్తుంది. చిన్న సినిమాలకు రెండు, మూడు రోజులు, ఇంకొన్ని సినిమాలకైతే కేవలం ఒక్కరోజు చెప్పేస్తాను. కొందరు దర్శకులు సింగిల్‌ టేక్‌లో చెప్తే అంగీకరించరు. ఇంకా బెటర్‌మెంట్‌ కావాలంటారు. అలాంటప్పుడు కాస్త సమయం పడుతుంది. ఇటీవల కాలంలో నన్ను బాగా ఇబ్బంది పెట్టిన సినిమా ‘చక్కిలిగింత’. డబ్బింగ్‌ ఆర్టి్‌స్టగా నేను అందుకున్న తొలి పారితోషికం రూ.300. పదమూడేళ్ళ వయసులో అది.
ఊహించని నంది
నంది అవార్డ్‌ వంద సినిమాలు చేస్తే వస్తుందేమో అనుకునేదానిని. కానీ నా రెండో సినిమా ‘నచ్చావులే’కి తొలిసారి నంది అవార్డ్‌ రావడం మధురమైన జ్ఞాపకం. అసలు నేను ఊహించని అవార్డ్‌ అది. టీవీలో న్యూస్‌ చూసి మా అంకుల్‌ కాల్‌ చేసి ‘నీకు నంది అవార్డు వచ్చింది’ అని చెబితే నమ్మలేదు. న్యూస్‌ చూసి నన్ను నేను గిల్లుకుని చూసుకున్నాను. ఆ రోజు అనుభవించిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. అలాగే ‘రాధామధు’ సీరియల్‌కి కూడా ఓ నంది వరించింది. ఎప్పుడైతే నంది అవార్డ్‌ అందుకున్నానో అప్పటి నుంచి వృత్తిపై మరింత బాధ్యత పెరిగింది. ఇంకా కష్టపడి మరింత మంచి పేరు తెచ్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. నా వాయిస్‌ నచ్చి చాలామంది పాటలు పాడమని అడిగారు. సున్నితంగా తిరస్కరించా.
నచ్చిన సన్నివేశాలు
నేను డబ్బింగ్‌ చెప్పిన సినిమాల్లో ‘కొత్త బంగారులోకం’లో వరుణ్‌, శ్వేతా సినిమాకెళ్ళొచ్చి కాలేజీ టెర్రస్‌ మీద మాట్లాడుకొనే సందర్భం, ‘కిక్‌’లో ఇలియానా రవితేజను తిట్టే సన్నివేశం, ‘ఊసరవెల్లి’లో తమన్నా.. నాకు సహాయం చెయ్యి అనడిగే సీన్‌, ‘రేసుగుర్రం’లో శ్రుతిహాసన్‌ మనసులో నవ్వుకున్నాను అనే సీన్‌, ‘ఓ మై ఫ్రెండ్‌’లో వర్షం సీన్‌ అంటే చాలా ఇష్టం. ఇవన్నీ డబ్బింగ్‌ చెబుతూ నేను ఎంజాయ్‌ చేసిన సన్నివేశాలు.
పర్సనల్‌ టచ్‌
అమ్మానాన్న చాలా సపోర్టివ్‌ పర్సన్స్‌. నాది ప్రేమ వివాహం. పెద్దల అంగీకారంతోనే పెళ్ళి చేసుకున్నాము. ఆయన పేరు రఘు. సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తే. అన్యోన్యమైన జంట మాది. ఖాళీ సమయంలో పాటలు ఎక్కువగా పాడతా. పజిల్స్‌, కంప్యూటర్‌ గేమ్స్‌ ఆడతాను. ఒకప్పుడు సౌందర్య, రమ్యకృష్ణలకు, ఇప్పుడు నదియాకు డబ్బింగ్‌ చెబుతున్న సరితగారు నాకు స్పూర్తి. అలాగే సునీతగారంటే చాలా ఇష్టం..’’
ఆమెకు న వాయీస్ సుట్ అవ్వదు
పదేళ్ళ వయసులోనే డబ్బింగ్‌ చెప్పడం ప్రారంభించాను. చిన్నతనంలో నాన్నతోపాటు డబ్బింగ్‌ స్టూడియోలకు వెళ్ళేదాన్ని. అప్పుడు నాన్న ‘అభినందన’, ‘మౌనరాగం’, ‘రోజా’ చిత్రాలకు డబ్బింగ్‌ చెబుతున్నట్లు గుర్తుంది. నేను కూడా డబ్బింగ్‌ చెబుతా అని నాన్నని అడిగాను. తొలిసారి ‘మోగ్లీ’ సీరియల్‌కి నా గొంతు అరువిచ్చా. మంచి పేరొచ్చింది. ఆ తర్వాత ‘సూర్యవంశం’ సీరియల్‌లో ఒక ప్రధాన పాత్రకు డబ్బింగ్‌ చెప్పాను. అలా చిన్నతనంలోనే డబ్బింగ్‌ ఆర్టి్‌స్టగా కెరీర్‌ ప్రారంభమైంది. తర్వాత వెన్నెలకంటి శశాంక్‌ పని చేసిన మాగ్జిమమ్‌ సినిమాలకు తెలుగులో డబ్బింగ్‌ చెప్పాను. బింధుమాధవి (సెగ), జెనీలియా (ఉరిమి), పియా బాజ్‌పయ్‌ (గోవా), కంగనారనౌత్‌, హన్సిక (బిరియాని), ‘ఏమాయ చేశావె’లో నాగచైతన్య సిస్టర్‌ పాత్రకు ఇలా చాలా సినిమాలకు పనిచేశాను. ఉరిమిలో ‘చిన్ని చిన్ని వెన్నెల’ ‘అందాల రాక్షసి’లో ‘నిన్ను చేరవచ్చేలా’ పాటలు కూడా పాడాను. నాన్న చదువు పూర్తి చేసి ఈ రంగంలోకి అడుగుపెట్టు అనడంతో ఎమ్‌బీఏ పూర్తి చేశాను. నేను పనిచేసిన తొలి స్ర్టెయిట్‌ సినిమా ‘హార్ట్‌ ఎటాక్‌’. డబ్బింగ్‌ ఆర్టి్‌స్టగా నాకెంతో గుర్తింపు, ఎన్నో అవకాశాలను కూడా తెచ్చిపెట్టింది. ‘కరెంట్‌ తీగ’లో సన్నిలియోన్‌కి కూడా వాయిస్‌ నాదే.
నన్ను మార్చేద్దాం అన్నారు
డబ్బింగ్‌ పట్ల నాకున్న ఇంట్రెస్ట్‌ గురించి డబ్బింగ్‌ ఇంజనీర్‌ పప్పుగారి ముందుంచాను. ‘హార్ట్‌ ఎటాక్‌ ’ సినిమా హీరోయిన్‌కి ఓ ఫ్రెష్‌ వాయిస్‌ కోసం పూరీగారు ట్రై చేస్తున్నారని చెప్పి నన్ను సజెస్ట్‌ చేశారు. హయాతీ క్యారెక్టర్‌కి డబ్బింగ్‌ స్టార్ట్‌ చేశాక కొత్త హీరోయిన్‌కి కొత్త డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ సూట్‌ కాదు. రిస్క్‌ చేయడం ఎందుకు ఇంకెవరితోనైనా చెప్పిద్దాం అని చాలామంది పూరి జగన్నాథ్‌గారిని భయపెట్టారు. ఆయన మాత్రం నాతోనే చెప్పించారు. నేను పాటలు పాడతాను అని తెలిసుంటే ఇందులో ఓ పాట కూడా పాడించేవాణ్ణి.. అని ఆయన నాతో అన్నారు కూడా. సినిమా ప్రివ్యూ అయిన వెంటనే మా టీమంతా నన్ను మెచ్చుకున్నారు. మీ గొంతు సూపర్‌’ అని మెసేజ్‌లు, మెయిల్స్‌ రావడం నాకు మరింత బలానిచ్చింది. కొత్త ఆర్టి్‌స్టకి ఇంతకన్నా గొప్ప ప్రశంస ఇంకేం ఉంటుంది. అలాగే తొలిసాని ఓ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ పనితనం గురించి పలు వెబ్‌సైట్లలో ప్రస్తావించడంతో నేను ఇక్కడ రాణించగలను అనే నమ్మకాన్ని కలిగించింది. ఇప్పటి వరకు డబ్బింగ్‌ చెప్పిన సినిమాలన్నీ ఒక ఎత్తైతే ‘హార్ట్‌ఎటాక్‌’ మరో ఎత్తు. ఆ సినిమా ఇచ్చిన కిక్‌తో ఇంకా ఏదో నేర్చుకోవాలనే తపన మొదలైంది. అందుకే పప్పుగారి దగ్గర డబ్బింగ్‌ మెళకువలు నేర్చుకున్నా.
తాతగారి పాటలే నాకు పాఠాలు
ఘంటసాల వారి కుటుంబంలో పుట్టడం నా అదృష్టం. తాతయ్యని నేను చూడకపోయినా సినీ పరిశ్రమలో ఆయన ఎలా నిలదొక్కుకున్నారనే విషయాన్ని నానమ్మ తరచూ చెబుతుండేవారు. ఆయన పాటలు వింటుంటాను. సంగీతం మీదు నాకు పట్టుంది. తాతగారి పాటలే ఈ రంగంలో నాకు పాఠాలు. తాతయ్య, నాన్న నాకు స్ఫూర్తి. వారిద్దరూ నా రియల్‌ లైఫ్‌ హీరోలు. చిన్నతనం నుంచే వారిద్దరిలా పేరు తెచ్చుకోవాలని ఆశ పడేదాన్ని. గాయనిగా తాతయ్య వారసత్వాన్ని, డబ్బింగ్‌ ఆర్టి్‌స్టగా నాన్న వారసత్వాన్ని నిలబెట్టాలనేది నా తాపత్రయం. తెలుగు స్పష్టంగా మాట్లాడడం నా కుటుంబం నాకిచ్చిన గొప్ప బహుమతి. మాట్లాడేటప్పుడు తప్పులు దొర్లితే నాన్న అస్సలు ఊరుకోరు. నాన్న గైడెన్స్‌ ఇవ్వరు. జస్ట్‌ ప్రీడమ్‌ ఇస్తారంతే.
నా వరకు రొమాంటిక్‌ సీన్స్‌కి డబ్బింగ్‌ చెప్పడం కాస్త కష్టంగా ఉంటుంది. ఏడుపు సన్నివేశాలను చాలా బాగా పండించగలను. అలాగే పాజిటివ్‌ సీన్స్‌కి కూడా చక్కగా చెప్పగలను. రొమాంటిక్‌ సినిమాలకు గౌతమ్‌మీనన్‌ పెట్టింది పేరు. తాజాగా ఆయన దర్శకత్వంలో అజిత్‌, అనుష్క, త్రిష నటించిన ‘ఎన్నై ఆరిందాళ్‌’ సినిమాలో అనుష్కకు నా వాయిస్‌ ఇచ్చాను..’’
 ఆలపాటి మధు, చిత్రజ్యోతి
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.