ఏదండీ మహాభారతం!
- రంగనాయకమ్మ గారి మహాభారత మహా పరిజ్ఞానం!
మొన్న ‘రామాయణ విషవృక్షం’ రాసి, అఖండకీర్తి ప్రకీర్తుల్ని మూటగట్టుకొన్న రంగనాయకమ్మ ఇప్పుడు ‘ఇదండీ మహాభారతం’ అన్న ఉద్గ్రంధాన్ని రచించి, వ్యాసుని బొడ్లో వ్రేలెట్టి, నడిబజారులోకి ఈడుస్తోంది! శ్రీకృష్ణుణ్ణి, ధర్మజునీ, ద్రౌపదినీ కడిగేస్తోంది!
ఆమె మాటల్లోనే చెప్పాలంటే;
”మొగ్గా పువ్వూలేని, కాయా పండూ లేని మోడు/ మాయల, మంత్రాల, వ్యర్థాల, వైరుధ్యాల, వికృతాల, వికారాల, క్రూరత్వాల, అబద్ధాల, కట్టుకథల, పుక్కిటి పురాణాల పుట్ట మహాభారతం!” (అట్టమీద)
ఇంతటి పనికిరాని చెత్తపుస్తకాన్ని ఇంతకాలంగా బుద్ధిలేని హైందవజాతి ఎలా తలెకెత్తుకు పూజిస్తోందీ అర్థంకావడం లేదు నాకు, ఇప్పటికైనా బుద్ధితెచ్చుకొని, ఏ చెత్తకుండీలోనో, ఏ మూసీ నదిలోనో, ఏ మురిక్కాలవలోనో పారేసి, డెట్టాలుతో చేతుల్ని కడిగేసుకోవడం మంచిది.
చివరి మాటగా ఈ రచయిత్రి ఏమంటోందో చెప్పమంటారా?…
”మహాభారతం గురించి ఒక్కమాటతో చెప్పుకోవాలంటే, అది వ్యర్థమహాభారతం!” అని. (పి.474)
మన చెవిటి మేళానికి అనగా హైందవజాతికి ఈ మాట వినిపించిందో లేదో? ఈ పుస్తకం కనిపించిందో లేదో? కళ్ళూ, చెవులూ, ముక్కూ… పంచేంద్రియాలూ మూసుక్కుచుందో తెలీదు!
రామాయణ భారత భాగవతాదులూ, పురాణాలూ, జరిగిన కథలేననీ, చరిత్రలేననీ, చాలామంది అమాయకుల ప్రగాఢ విశ్వాసం. దాన్ని ‘క్యాష్’ చేసుకోవాలని చూస్తోంది ఈ నోటిదురుసు మేధావురాలు!
ఒకప్పుడు స్త్రీవాదులంటే వేశ్యలేనని అరచి గగ్గోలుపెట్టింది. మరోసారి హిందువులకు జుట్టెందుకు? బొట్టెందుకు? నామాలెందుకు? గడ్డాలూ మీసాలూ ఎందుకు? అంటూ వెక్కిరించింది, ఆ పై రామాయణాన్ని ‘విషవృక్ష’మంటూ ఖూనీ చేసింది. ఇప్పుడు ఏకంగా మహాభారతాన్నే ఖైమా చేసేస్తోంది. అఖిల భారత జనానీకం సాక్షిగా!
భేషు! రంగనాయకమ్మా! నీకు నీవేసాటి! మా మగధీరులంతా నీపాద గోటికి సరికారు!
భారతం ఒక చరిత్రనుకోవడం మన అమాయకత్వమే, విజ్ఞాన రాహిత్యమే. చివరికి రామాయణమైనా, పురాణాలైనా అంతే! అవి ప్రతీకాత్మక కావ్యాలు. అనగా మహాప్రహేళికలు.
అసలు పేరులోనే ఉంది అర్థం. భారతం (భా ్శ రతం) అంటే, కిరణాల క్రీడ! వెలుగూ చీకట్లయుద్ధం!
‘విశ్వమ్’ అంటే ‘శివమ్’ అనీ, ‘వేదమ్’ అంటే ‘దేవమ్’ అనీ, ‘కురుక్షేత్రం’మంటే ‘రుక్ క్షేత్రం’ (వేదభూమి) అనీ అర్థం చేసుకోవాలి.
‘ధృతరాష్ట్రుడు’ ఒక విశ్వప్రతీక. (దశరథుడూ అంతే!) అనగా ‘ధరించిన రాష్ట్రం కలవాడ’ని అర్థం. ‘రాష్ట్ర’ మనగా శరీరం, దేశం, విశ్వం. అందువల్ల ఇక్కడ ధృతరాష్ట్రుడనగా విశ్వాన్ని ధరించిన వాడన్న అర్థాన్ని చెప్పుకోవాలి. విశ్వంలో వెలుగులకన్నా చీకట్లే ఎక్కువ. అందుకే, అతడు పుట్టుగ్రుడ్డి.
‘దుర్యోధనాదులు’ కాలమేఘ ప్రతీకలు. వాళ్ళు నూరుగురు. అనగా మేఘాలు అనంతమని అర్థం.
‘శ్రీకృష్ణుడు’ సూర్యప్రతీక. ‘కృష్ణ’ శబ్దానికి నలుపులేదా నీలి రంగనీ, ‘ఆకర్షణ’ అనీ అర్థాలు. సూర్యుడు ‘నీలలోహిత కిరణుడు’, ఆపై ఆకర్షణ శక్తికలవాడు’ కదా? (సైన్సు) ‘పాండవులు’ చంద్రవంశం వారు. అనగా చంద్రప్రతీకలు. భీష్ముడు, కర్ణుడు, ధర్మజుడు, అభిమన్యుడు మొదలైనవారలంతా చంద్రప్రతీకలే!
పంచపాండవులు పంచభూతాలకు ప్రతీకలన్నది తప్పుడు అభిప్రాయం. మహాభారతం లోని ‘రాజసూయయాగ’ ఘట్టాన్ని చూస్తే, తెలుస్తుందది. ధర్మజుడు ‘ఇంద్రప్రస్థపురాన్ని’ (ఆకాశం లేదా అంతరిక్షాన్ని) ఏలుకొంటే, మిగతా నలుగురూ నాలుగు దిక్కుల్ని ఏలుకున్నారు. అనగా ఆ మిగతానలుగురు దిక్పాలకులని ధ్వని.
ద్రౌపది ధరిత్రీప్రతీక. అందుకే ఐదుగుర్నీ కట్టుకుంది. అలాగే కుంతీ, గాంధారీ, సత్యభామా మొదలైన పాత్రలూ భూప్రతీకలే!
అర్జునుడు సూర్యునకు వెనకనున్న ప్రకాశం. సూర్యుడు కదిలితేనే ఈ ప్రకాశం కదుల్తుంది. అందుకే, కృష్ణుడు ‘విజయసారధి’ కావడం.
బలరాముడు. సూర్యునకు ముందున్న ప్రకాశం. భూమ్మీద ముందుకాలు పెట్టేవాడు. అందుకే కృష్ణునికి అన్న.
ఇలా, ఇవి ‘మహాభారతం’లోని ప్రధాన పాత్రల వెనకనున్న ప్రతీకలు. ఆపై, వాల్మీక వ్యాసాది ఋషి, మునులంతా నక్షత్రప్రతీకలు. శ్రీకృష్ణుని అష్టభార్యలు సూర్యుని చుట్టూ తిరిగే అష్టగ్రహాలు. తెల్లనిమబ్బులు యక్ష, గంధర్వ, కిన్నెర కింపురష, అప్సరాదులు. పదహారు వేలమంది కన్యలూ నక్షత్ర ప్రతీకలే! ‘రాధ’ ఒకనక్షత్ర కాంతి ‘ధార’. ఈ విషయం ఎందరికి తెలుసు? ముఖ్యంగా ఈ రచయిత్రికి ఎంతవరకు తెలుసు? అన్నదే ప్రశ్న.
ఆమె మరో పెద్దపొరపాటే చేశారు. వ్యాసుని మూలగ్రంథాన్ని చూడలేదు. కవిత్రయ భారతాన్ని చూశారు. అది వ్యాసభారతానికి ఛాయామాత్రమే! ఆపై గంగూలీ గారి ఆంగ్లానువాదాన్నీ, పురిపండావారి వచన భారతాన్ని చూశారు. అవి ప్రచ్ఛాయలు మాత్రమే!
అనగా, నీడల్ని పట్టుకు వేలాడారన్నమాట. ‘యజ్ఞమంటే వీరికి సరియైన అవగాహన లేన’ట్టుగా ఉంది. అందుకే, యజ్ఞాలనీ తిట్టిపోసింది. క్యాపిటల్ (మూలధనం) అంటే పెట్టుబడి (ఇన్వెస్ట్‌మెంట్) అని తప్పుడర్థం చెబుతూ, సంపుటాలు సంపుటాలుగా వెలువరించిన ఘనత వీరిది? అంతటి పరిజ్ఞానం మనకెక్కడిది?
‘యజ్ఞా’నికి అనేకార్థాలున్నాయి. ‘ప్రకృతి యజ్ఞం’ ఒకటి, ‘వికృతి యజ్ఞం’ మరొకటి. ఆమె మాట్లాడేది వికృతి యజ్ఞాల గురించే. విశ్వమే ఒక యజ్ఞశాల యనీ, విశ్వవ్యాపారమే ఒక యజ్ఞమనీ, అణువణువూ యజ్ఞకుండమేననీ, చివరికి మనిషి కూడా ఒక యజ్ఞ కుండమేననీ, జీవితమే ఒక యజ్ఞమనీ, నేను చెబితే వీరికర్థమవుతుందా?…
నాకు తెలిసినంతవరకు దశరథుని యజ్ఞంలో కానీ, రాముని యజ్ఞంలో కానీ, (రామాయణం) చివరికి ధర్మజుని యజ్ఞం (భారతం)లో కానీ, జంతుబలి జరిగినట్లు చెప్పబడలేదు. వీరు ఏ రామాయణ భారతాల్ని తిరగేశారో నాకు తెలీదు.
ఇక ‘సతీ సహగమనం’ గూర్చి ఒకమాట. అది దురాచారమే. దాన్ని ఖండించాల్సిందే! కానీ, భారతంలో స్త్రీలతో బలవంతంగా సహగమనం చేయించినట్లు ఎక్కడా లేదు. మాద్రి తన యిష్టప్రకారం, తనకు తానుగా సహగమనం చేస్తే, కుంతి చేయనంది. చేయలేదు. ఈ విషయాన్ని మనం విస్మరిస్తే ఎలా?
చివరిగా ‘కులవ్యవస్థ’ గురించి మరోమాట. క్షసగశn|d ాు-|షా (పటిష్టమైన వ్యవస్థ)కు అది అవసరమే. కులవ్యవస్థలో తప్పులేదు. కులవివక్ష తప్పు. అంటరాని తనం తప్పు.
ఐనా, హిందువులు ఎంతో మారారు. జైన బౌద్ధమతాలనుండీ, ఆర్య సమాజం నుండీ ఎన్నో నేర్చుకున్నారు. ఇప్పుడు సతీసహగమనాలు లేవు. అంటరాని తనమూ లేదు. యజ్ఞాల్లో బలులూ లేవు. బాల్య వివాహాలూ తగ్గాయి. వితంతు వివాహాలూ కోకొల్లలు. ఆపై మతాంతర. కులాంతర వివాహాలకూ లెక్కలేదు. బ్రాహ్మణాధిపత్యమూ తగ్గింది. ఇవన్నీ మార్పులు కావా?… మనిషన్నవాడు రెండు కళ్ళతో చూడాలికదా?…
ఇక్కడ మరో విషయాన్ని గుర్తుంచుకోవాలి మనం. ఋషి ప్రోక్తలైన వేదాలకీ, రామాయణ భారత భాగవతాది మహాకావ్యాలకీ నాలుగేసి అర్థాలుంటాయి. అవి (1) ఆదిభౌతిక (2) ఆధిదైవిక (3) ఆధ్యాత్మిక (4) ఆధియాజ్ఞిక దృక్కోణాలు వాటిని మనం విస్మరించకూడదు (వివరాలకు చూడుడు నా పరిశోధనలు (1) రాముడంటే ఎవరు? రామాయణమంటే ఏమిటి? (2) కృష్ణాయనం ఒక నక్షత్ర మహాయానం (3) ఋషి హృదయం, (4) చతుర్వేద సాగర మధనం)
ఇక ద్వ్యర్థి, త్య్రర్థి కావ్యాలూ ఉన్నాయి. ఏకాక్షర రామాయణమూ ఉంది. ముందునుండి ఒక అర్థం, వెనకనుండి మరో అర్థం వచ్చే శ్లోకాలూ ఉన్నాయి. అవి మనకందుతాయా? మన మిడి మిడి జ్ఞానం సరిపోతుందా? అన్నవి ప్రశ్నలు.
వీరొకచోట ‘కుక్కతిట్లకి జడిసిన చక్రవర్తి’ (పి.36) అంటూ వెక్కిరించారు. ఇక్కడ కుక్కంటే కుక్కకాదు తల్లీ! అది నల్లని మేఘానికి సంకేతం. అది అరచిందంటే మేఘం గర్జించిందని ధ్వని. ఈ విషయం వేదాల్లోనూ ఉంది. ‘సోమరసాన్ని నల్లకుక్కకి దూరంగా, భద్రంగా ఉంచండి!’ అంటూ ఓ వేదమంత్రం (సామవేదంలో ఉంది. అక్కడా కుక్కంటే మేఘమే!
అమ్మా? తమరెక్కడ చదువుకున్నారు తల్లీ? శబ్దాలకి అనేకార్ధాలుంటాయి. ఒక్క వాచ్యార్థాన్నే పట్టుకుంటే ఎలా? అంతరార్థాల్నీ, ప్రతీకాత్మకతల్నీ, శ్లేషార్థాల్నీ, ధ్వనినీ విస్మరిస్తానంటే కూడదు తల్లీ?
ఇప్పటికైనా కళ్ళు తెరవండి! మన వేదాల్ని పాశ్చాత్యులు తలకెత్తుకుంటున్నారు. వాటిపై విశ్వవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. వాటిల్లో బోలెడు సైన్సుంది. మన రామాయణ భారత భాగవతాదులూ విశ్వవిఖ్యాతి నందాయి. గ్రీకుల ‘ఇలియడ్’ ‘ఒడిస్సీ’ గ్రంథాలు వీటికి ఛాయాప్రచ్ఛాయలని విదేశీ మేధావులే అంటున్నారు. ఆకాశమ్మీదా, నక్షత్రాలమీదా, సూర్యచంద్రులమీదా దోసిళ్ళకొద్దీ మట్టిపోస్తానంటే ఎలా?

