నేటి తెలుగు కథ, నవల ఎక్కడిదాకా వచ్చింది
ఎవరిని గురించి రాస్తున్నారో వారిని పాఠకులుగా తీసుకోవాల్సిన అవసరం ఉందని 1967లో సింహగర్జనతో దళిత పాంథర్స్ మరాఠీ, హిందీ సాహిత్యాల్లో ప్రవేశించారు. ఈ ప్రశ్నను బలంగా ముందుకు తెచ్చారు. నలభయ్యేళ్ల తర్వాత వర్ణఆధిక్యవాదులు ఈ ప్రశ్నను పట్టించుకోవడం మొదలైంది. అలా వారు నలభయ్యేళ్లుగా భారతీయ సాహిత్యంలో జరుగుతూ వస్తున్న పరిణామాలు ప్రధాన సాహిత్య స్రవంతిని మార్చి తామే ప్రధాన సాహిత్య స్రవంతిగా ఎదిగిన తీరును గమనించి వాస్తవాలను విశ్లేషించడం మొదలైంది.
రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఇంగ్లీషులో వచ్చిన కథలను డిక్షనరీ ఆఫ్ షార్ట్ స్టోరీస్‌గా 1950 నుండి కథా నిఘంటువులను ప్రచురిస్తున్నారు. మా రెండో కొడుకు శ్రీకాంత్ కిరాయికున్న న్యూజెర్సీలోని కార్టరెట్ -ఎడిసన్ ప్రాంతంలో ఉన్న వాడకట్టు లైబ్రరీలో కూడా ఇవి కనపడ్డాయి. మా వాడి ఇంటి నుండి రోజూ ఆ లైబ్రరీకి నడిచి వెళ్లేవాడిని. కొన్ని గంటలు కూర్చుండే వాడిని. 50 దాకా ఇంటర్నెట్, కంప్యూటర్లు, సీడీలు, డీవీడీలతో లైబ్రరీ, అలాగే బుక్ లైబ్రరీ అందులో ఉంది. సగం బుక్ లైబ్రరీ, సగం సీడీల లైబ్రరీగా మార్పు చెందింది. అక్కడ కథల నిఘంటువులు ఆరు, ఏడు వందల పేజీలతో 15 -16 దాకా ఇటీవలి కథలతో సహా నిఘంటువులు కనపడ్డాయి. అలాగే డిక్షనరీ ఆఫ్ నావెల్స్, డిక్షనరీ ఆఫ్ సినిమాస్ ఇలా అనేక రంగాల డిక్షనరీలు అంత చిన్న లైబ్రరీలో దర్శనమిచ్చాయి. ఇంటర్నెట్ వచ్చాక మన ఇంట్లోకి టేబుల్‌పైకి ప్రపంచ గ్రంథాలయాలు అన్నీ నడిచివచ్చాయి. యుట్యూబ్ టెక్నాలజీ ద్వారా దృశ్య మీడియా ప్రక్రియలన్నీ అక్షరాల వలెనే మనింటికి చేరవచ్చాయి.
భారతీయ కథా పరిణామాలు: భారతీయ కథా పరిణామాలను ఒక విషయం తెలుస్తుంది. ఆయా సమాజాలను అనుసరించి, చరిత్రను అనుసరించి ఆయా ప్రక్రియల్లో పరిణామాలు సాగుతూ వచ్చాయి. వేల ఏళ్ళ నుండి వేదాలు, ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతాలు, బౌద్ధ అట్టకథలు, పురాణాలు, మృచ్ఛకటికం, ముద్రారాక్షసం, పంచతంత్ర కథలు, బృహత్ కథ, సతీసావిత్రి, సతీ అనసూయ కథలు, శైవ, వైష్ణవ బౌద్ధ, జైన సాహిత్యం, భక్తి సాహిత్యం, భక్తుల కథలు, ఆయా కాలాలననుసరించి వెలువడుతూ వచ్చాయి. వ్యాస వాల్మీక, ఆది కవుల రచనలు, నేటికీ భారతీయ సమాజంపై బలమైన ప్రభావం వేస్తున్నాయి. కాళిదాసు రచనలు, ప్రబంధ సాహిత్యం, యక్షగానాలు, జానపద కళారూపాలు మరొక్కదశ. ఆలీబాబా 40 దొంగలు, సింద్‌బాద్ సాహసిక యాత్రలు, గలీవర్ కథలు, అక్బర్ బీర్బల్ కథలు, పేదరాశి పెద్దమ్మ కథలు, నసీరుద్దీన్ కథలు, తెనాలి రామలింగడు కథలు, పరమానందయ్య శిష్యుల కథలు మొదలైనవి సాహసిక, హాస్య, రస ఉత్పన్నం చేయడంతోపాటు వివేచనను పెంచుతాయి. బట్టివిక్రమార్క బేతాళ కథలు, హరివశం, విక్రమోర్వశీయం, నలదమయంతిల కథలు, సత్యహరిశ్చంద్ర కథలు, సాలభంజిక కథలు మొదలైనవి ప్రేమ, సత్యాన్వేషణ వంటి వాటికై సృష్టించబడ్డాయి. ఇవన్నీ నూతన ప్రక్రియగా ప్రారంభమయ్యే క్రమంలో సినిమాల్లో అదే వరుసలో ప్రవేశించాయి. చాలా సినిమాలు రామాయణ భారతాల కథల్ని సాంఘికాలుగా మార్చి తీసిన కథలే అని కొందరు విశ్లేషించారు.
18వ శతాబ్దినుంచి మధ్యతరగతి, కార్మికవర్గం ఎదుగుతూ వచ్చింది. కథలో వస్తువు మారింది. పాఠకులూ, ప్రేక్షకులూ మారారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రస్తుత ప్రక్రియల పరిణామం మలుపు తిరిగి ఈ దశను తీసుకుంది. ఇలా క్రీస్తుపూర్వందంతా ఒక పరిణామ దశ. తర్వాత ప్రతి 500 సంవత్సరాలకు ఒక దశగా పరిగణించి, పరిశీలించవచ్చు. 1500 నుండి 1800, 1800 నుండి 1850, 1851 నుండి 1900, 1901 నుండి 1950, 1951 నుండి 1980 అనే దశలుగా సాహిత్యాన్ని పరిశీలించవచ్చు. చివరి మూడు శతాబ్దాల్లో పరిణామాలు వేగంగా సాగాయి. సైన్స్ ఆవిష్కరణలు సమాజంలో అనేక మార్పులను తెచ్చాయి. వ్యవస్థలు మారాయి. ప్రజాస్వామ్యం, సోషలిజం, నియంతృత్వం వంటి పరిపాలనా వ్యవస్థలు ఏర్పడ్డాయి. రాజ్యాల స్థానంలో, దేశాల భావన స్థిరపడింది.
పాట, నృత్య, సంగీతాల ద్వారా సృజించబడే రసాలు, స్పందనలు, మూడ్స్ ప్రస్తుతం సినిమా, టీవీ ప్రక్రియల్లో బాగా సృష్టించబడుతున్నాయి. కథా నవల, వచన కవిత, ప్రక్రియల్లో ఈ మూడ్స్‌ని రసాలను, సాధించడం ద్వారా ధ్వని అనే సారానికి ఆకర్షణీయమైన రూపం ఏర్పడుతుంది. రూపం ద్వారా సారాన్ని చేరుకోవడమే సాహిత్యం, కళల అలంకార శాస్త్రాల జ్ఞాన శాస్త్రం.
ఇలా నేటి కథా నవల, సినిమా మధ్యతరగతి గురించి, కష్టజీవుల గురించి, ఉన్నత వర్గీయుల గురించి, సాహసికుల గురించి, వీరుల గురించి, నైతిక విలువల గురించి, సంస్కృతి గురించి, స్వేచ్ఛ గురించి, సత్యం గురించి, అస్థిత్వం గురించి, ఆత్మగౌరవం గురించి, ఆశల గురించి, వస్తువుగా స్వీకరించి చిత్రిస్తున్నాయి. జీవితంలోని అనేక పార్శ్వాలను, కోణాలను చిత్రించడం అనేది బహుముఖాలుగా సాగుతున్నది. ఆయా వస్తువును అనుసరించి వాటిని వర్గీకరిస్తుంటారు. అలాగే ఆయా శిల్పాన్ని, శైలిని, ప్రెజెంటేషన్‌ని అనుసరించి, వర్గీకరిస్తుంటారు. ఇలాఆధునిక సాహిత్యం, కళలు, నేటి దశకు చేరుకున్నాయి.
స్త్రీవాద, అస్తిత్వవాద సాహిత్యం సిద్ధాంతాలు: స్త్రీవాద సిద్ధాంతాలు 1850 నుండే ప్రారంభమైనప్పటికీ 1960 ల నుండి నూతన సిద్ధాంతాలు బలంగా, ఉద్యమాలుగా ముందుకు వచ్చాయి. ఫెమినిస్టు తాత్విక సిద్ధాంతాల నేపథ్యంలో 1980ల నుండి నూతన సాహిత్య సిద్ధాంతాలు వేగం పుంజుకున్నాయి. మా గురించి మేమే రాసుకుంటాం అని స్త్రీలు, బహుజనులు, కష్టజీవులు, కార్మికులు సాహితీవేత్తలుగా ముందుకు వచ్చారు. తమ గురించి ఇంత దాకా రాసిన సాహిత్యమంతా తమపై గల సానుభూతితో రాసిన సాహిత్యమే తప్ప అనుభవాల నుండి రాసిన సాహిత్యం కాదని విశ్లేషించారు. స్వయంగా తమ అనుభవాలను, అనుభూతులను, సంస్కృతిని, జీవన విధానాలను, ఆశలను, ఆరాటాలను, దృక్పథాలను కథలుగా, నవలలుగా రాయడం వేగం పుంజుకుంది.మరాఠి, హిందీ సాహిత్యాల్లో ఇలాంటి ఆత్మకథల సాహిత్య విస్తారంగా ప్రాచుర్యం పొందింది.
భారతీయ భాషల్లో స్త్రీవాద సాహిత్యం అనేక కోణాలను ముందుకు తెచ్చి ఇంతదాకా కొనసాగిన సాహిత్యంలో పితృస్వామిక పురుషాధిపత్య భావాలు, సంస్కృతి, దృక్పథం ఎలా కొనసాగాయో కథలు, నవలల్లో చిత్రించారు. అలాగే బహుజనులు అనగా బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు ఇంతదాకా సాహిత్యంలో వర్ణాధిక్య, కులాధిక్య దృక్పథం కొనసాగుతూ తమ జీవితాలను, సంస్కృతిని తమపై గల అణచివేతను ఆధిపత్యాన్ని ఎలా కొనసాగిస్తూ వస్తున్నాయో విశ్లేషించారు. దాంతో సాహిత్యం రెండు చీలిపోయింది. ఎవరి గురించి, ఎవరి కోసం రాస్తున్నారో అనే ప్రశ్నబలంగా ముందుకు వచ్చింది.
నేను 1990 నుండి ఈ విషయమై వందలాది ప్రసంగాలు, వ్యాసాలు అనేక గ్రంథాలు వెలువరించడం జరిగింది. ఇంతకుముందే చెప్పినట్టు వీటిని సమగ్ర సామాజిక కథ యాభయ్యేళ్ల తెలుగు కథ తీరుతెన్నులు, కథలబడి కథా సాహిత్య అలంకార శాస్త్రం, గతితర్క తత్వదర్శన భూమిక, సాహిత్య చరిత్ర కొత్త చూపుతో తిరగరాయాలి, వ్యక్తిత్వ వికాసం సామాజిక నాయకత్వం, జీవితం అంటే ఏమిటి? అరవయ్యేళ్ల తాత్విక సామాజిక పరిణామాలు తదితర గ్రంథాల్లో కొంతమేరకు పొందుపరచడం జరిగింది. తెలుగు లేదా భారతీయ కథ గురించి పరిశీలించే ముందు ఈ ప్రక్రియ పుట్టిన ఐరోపా సమాజం గురించి ఆలోచించాలి. ఐరోపా సమాజంలోనూ, దాని నుండి పుట్టిన అమెరికా సమాజంలోనూ ప్రధాన మతం క్రైస్తవం. కథానిక పుట్టే నాటికి శారీరక కన్నా, ఆర్థిక కారణాల వల్ల దేవుడు చెప్పిన సిన్ (పాపం) చేసేవారు హెచ్చారు. సంపన్న వర్గాలు, రైతాంగం అన్న విభజిత సమూహాల మధ్య మధ్య తరగతి వచ్చింది. వీరు వర్తక వ్యాపారులు ధనం కలిగి వుండడం ద్వారా గౌరవనీయులు, సామాన్యులు అన్న విభజన వచ్చి సామాన్యులను న్యూనతగా చూడ్డం వచ్చింది. యూరోపియన్ కథ గొగోల్ ఓవర్ కోట్ నుండి పుట్టిందంటారు. అందులో కథకుడు న్యూనతగా చూడబడిన సామాన్యుడిని కథా నాయకుడ్ని చేస్తారు. మపాసా, చెకోవ్, లారెన్స్ వంటి తొలి విఖ్యాత కథకుల కథలన్నీ న్యూనతగా చూడబడేవారు ఎంత మాన్యులో, న్యూనతకు కారణమైన ఆర్థిక లేమి ఎటువంటిదో చెబుతాయి. వ్యక్తుల నైతిక స్థాయిని చూపిస్తారు. పాత్రలో పాఠకుడు తనను గుర్తు పడతాడు. (వివిన మూర్తి -ఒక దినపత్రిక, సాహిత్య వేదిక 24 జనవరి 2011) సాహిత్యం, కళలు జీవితంలో భాగంగా మారాలంటే అవి వారి జీవితాలకు కాలక్షేపాన్నయినా ఇవ్వాలి. మంచి సాహిత్యం, కళలు, సామాజిక శాస్త్రాలు జీవితంలో కాస్త స్ఫూర్తిని, ఉత్తేజాన్ని, వెలుగును, ఆత్మవిశ్వాసాన్ని, ఆనందాన్ని కలిగించాలి.

