నా దారి తీరు -87
గండ్రాయి –సహచరులు – నా ఐడియా
గండ్రాయి స్కూల్ జీవితం సరదాగానే ఉంది .సోషల్ మేష్టారు రాఘవులు ఇదివరకు పెదఓగిరాల అప్పర్ ప్రైమరీ స్కూలో లో పని చేసి ,అక్కడ మంచి పేరుతెచ్చుకొన్నారు .అప్పుడు కొంత దూరపు పరిచయం ఉండేది .క్రిస్టియన్ అయిన ఆయన చాపకింద తేలులాగా బోధ చేసేవాడు .పాఠాలు చెప్పటం కంటే నీతి బోధ ఎక్కువ .హెడ్ గారికి తలలో నాలుక .ఇద్దరూ జగ్గయ్యపేట నుండే వచ్చేవారు .రాఘవులు తిరుమల గిరి లో మామిడి తోట వేశారు .ఆ కబుర్లే ఎక్కువగా చెప్పేవాడు .కొంచెం స్వార్ధం ఉన్నమనిషి పైకి సాదు లోపల వ్యతిరేకం .అదీ స్ప్లిట్ పర్సనాలిటి .లెక్కల మేష్టారు కృష్ణ మూర్తి కూడా’’ పేట ‘’నుండే వచ్చేవాడు .అక్కడ హైస్కూల్ లో అవినీతి ఆరోపణ మీద సస్పెండ్ అయి కాళ్ళూ గడ్డాలు పట్టుకొని ఇక్కడికి బదిలీ చేయి౦చు కొన్నాడు .సబ్జెక్ట్ లో సరుకు లేదు. చెప్పటం అసలు వచ్చేదికాదు .సొల్లు కబుర్లు చెప్పేవాడు .కాని మంచి స్నేహితుడు అనిపించాడు. నాతొ బాగా ఉండేవాడు .అతని సస్పెన్షన్ పీరియడ్ రాటిఫై అయితే కాని జీతం రాదు .రోజూ గోల పెట్టేవాడు .నేనొక ఉపాయం చెప్పాను .కృష్ణా జిల్లాలో కమ్యూనిస్ట్ హెడ్ మాస్టారు గా పేరొందిన వారు ,ఉయ్యూరు హైస్కూల్ ప్రారంభకులు అయిన శ్రీ వై గోపాలరావు గారురిటైరై ఉయ్యూరులో ఉండగా చనిపోయారు .ఆయన కొడుకు రవీంద్ర కు జిల్లాపరిషత్ లో కంపాషనేట్ గ్రౌండ్స్ మీద గుమాస్తా ఉద్యోగం వచ్చింది .కొద్ది కాలం లోనే ఆతను ముదిరి పోయి లంచాలు మరిగి ట్రాన్స్ ఫర్లు ,బిల్లులు సాంక్షన్ చేయించటం పాస్ చేయించటం చాలా ఈజీ గా చేసేవాడని చెప్పుకొనేవారు .జిల్లాలో బాగా అందరికీ తెలిసిన విషయమే ఇది .మంచి అవకాశం ఈ విషయం కృష్ణ మూర్తికి చెప్పి అతన్ని మేనేజ్ చేసి పని చేయించుకోమని సలహా ఇచ్చాను .అది క్లిక్ అయింది బందరు వెళ్లి కావాల్సినవి ‘’చూసి ‘’తన సస్పెన్షన్ పీరియడ్ ను రాటిఫై చేయించుకొని ఆర్డర్ తెచ్చు కొన్నాడు. హెడ్ మాస్టారు బిల్ చేశారు , బందరు వెళ్లి డబ్బు వెదజల్లి బిల్ సాంక్షన్ చేయిన్చుకొన్నాడు .ఆల్ హాపీస్ .నన్ను ఈ సలహా ఇచ్చినందుకు ఏంతో అభినందించాడు కృష్ణ మూర్తి .’’తిలాపాపం తలా పిడికెడు ‘’.ఒక రోజు మా మొత్తం స్టాఫ్ కు జగ్గయ్య పేట లో వాళ్ళ స్వంత ఇంట్లో బ్రహ్మాండమైన విందు ఇచ్చాడు .కార్య సాధకుడు కృష్ణ మూర్తి .ఒక ఐడియా ఆయన జీవితాన్నే కాదు కాదు’’ జీతాన్నే’’ మార్చేసింది .
అప్పుడు మా రెండో అబ్బాయి శర్మ హర్యానా రొహ్ టక్ లో మహర్షి దయానంద యూని వర్సిటి లో ఏం ఎస్ సి చదువుతున్నాడు .వాడికి డబ్బు పంపాలంటే గండ్రాయిలో ఆంధ్రా బ్యా౦క్ ద్వారా పంపేవాడిని .ఒకోసారి నా దగ్గర డబ్బు లేకపోతె తెలుగు మేష్టారు సుధాకరరావు సర్దేవాడు .జీతం రాగానే ఇచ్చేసేవాడిని .ఆ బ్యాంక్ మేనేజర్ కూతురు ఎనిమిదో క్లాస్ చదువుతూ నా దగ్గర ట్యూషన్ చదివేది .సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడు సుబ్బారావు బ్రాహ్మణుడు . ఏలూరు వాడు .ఇక్కడికొచ్చి చేరి ఇక్కడే పని చేసి ఇక్కడే రిటైర్ అయ్యాడు .హెడ్ గారికి ఆఫీస్ వర్క్, టైం టేబిల్ వేయటం ఎక్సట్రా వర్క్ వేయటం అన్నీ ఆయన పనే .లేక పొతే హెడ్ మాస్టారే చూసుకునేవారు .మాలో సీనియర్ రాఘవులు కనుక ఆయనే ఇంచార్జి హెడ్ .పరీక్షల నిర్వహణ ఆయనపనే .కృష్ణ మూర్తి వచ్చిన తర్వాత సీనియర్ అయినా ఈ బాదర బందీ అంతా పట్టేదికాదు.రాఘవులే చూసేవాడు .లేకపోతె తరువాత నేనే సీనియర్ ను నేను చూసేవాడిని .రాఘవులు ఊరి పెద్దలతో బాగా పరిచయం ఉంది .చాలాకాలం నుంచి ఇక్కడే ఉన్నాడు .అందరి ఇళ్ళకు వెళ్లి పలకరించేవాడు ,దీన్ని మేము ‘’గడప పూజ ‘’అనే వాళ్ళం .కొద్దిరోజులు కాపురం పెట్టి ప్రైవేట్ కూడా చెప్పాడు .
నా గండ్రాయి శిష్యుదు బాబ్జీ
నాకు మంచి శిష్యులు దొరికారు గండ్రాయి లో .పిచ్చయ్యగారి అబ్బాయి ప్రసాద్ చాలా అణకువ గా ఉండేవాడు ఎప్పుడూ చేతులు కట్టుకొని తల వన్చుకొనే మాట్లాడేవాడు .బాబ్జీ అనే కుర్రాడు పిచ్చయ్యగారి ఇంటికి కొద్ది దూరం లో ఉండేవాడు .వాళ్ళనాన్న ఏదో వ్యాపారం చేసేవాడు. ఎనిమిదీ తొమ్మిదీ బాబ్జీ నా దగ్గర ట్యూషన్ చదివేవాడు .చాలా మంచికుర్రాడు .లీడర్షిప్ లక్షణాలున్నవాడు.టెన్త్ పాసై డిగ్రీ చదివి ,బెజవాడ నారాయణ లో ఫిజిక్స్ లెక్చరర్ అయి ,ఇప్పుడు ఈడుపుగల్లు లో గాయత్రి జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ గా ఉన్నాడు .ఆ నాటి అభిమానం, గౌరవం ఇప్పటికీ చూపిస్తాడు ఫోన్లు చేస్తుంటాడు .గృహ ప్రవేశానికి కూడా పిలిస్తే వెళ్లి వచ్చాం .నా దగ్గర చదివిని మిగిలిన పిల్లల నందర్నీ కలుపుకొని ఉయ్యూరు వచ్చి చూసి వెళ్తాడు .అతని భార్య బెజవాడలో టీచర్ .అతని తండ్రికూడా ఏంతోఆప్యాయం గా ఉంటాడు. అతని తల్లి గండ్రాయి సర్పంచ్ గా పని చేసింది . బాబ్జీ స్నేహితులను అందర్నీ కలుపుకొని గండ్రాయి స్కూల్ లో అయిదేళ్ళ క్రితం స్వాతంత్ర దినోత్సవం జరిపాడు .విద్యార్ధులు బహుమతులు అందించారు ఈ స్నేహ బృందం .నన్ను గెస్ట్ గా ఆహ్వానిస్టే వెళ్లాను. నాకు సత్కారం చేయించారు హెడ్ మాస్టారితో ..అప్పుడు నేను ఆ ఏడాది టెన్త్ పబ్లిక్ లో స్కూల్ ఫస్ట్ వచ్చిన విద్యార్ధికి 500 రూపాయలు పారితోషికం అందజేసి ప్రతి ఏడాది ఇస్తానని ప్రకటించి ,అలా చేస్తూనే ఉన్నాను .ఒక వేళ హెడ్ మాస్టారు నాకు ముందుగా తెలియ జేయక పొతే, బాబ్జీ తో డబ్బు సర్దు బాటు చేయించి నేను తర్వాత అతనికి మని ఆర్డర్ పంపుతాను .అలాంటి కత్తి లాంటి శిష్యుడు బాబ్జి .స్కూల్ స్వర్నోత్సవానికి మళ్ళీ ఆహ్వానించి అక్కడ పని చేసిన వారందరినీ సత్కరించారు నాతొ సహా .హెడ్ సుబ్రహ్మణ్యం గారు రెండు సార్లూ రాలేదు రాఘవులు వచ్చాడు .మళ్ళీ పాత శిష్యులను కలిసే అవకాశం వచ్చింది .జగ్గయ్య పేటలో రాముడూ వాళ్ళింటికి వెళ్లి చూసి వచ్చాను .గంద్రాయిలో పిచ్చయ్యగారింటికీ వెళ్లి మాట్లాడాను .పాత రోజులన్నీ గుర్తు చేసుకోన్నాం .ఆ నాటి ఆప్యాయతే ఆ దంపతులు చూపారు .
మిగిలిన శిష్యులు
అప్పుడే నా దగ్గర చదివిన శిష్యులు అందరూ ఒక్కసారి కనిపించారు .దాదాపు అందర్నీ గుర్తు పట్టాను అందులో జానకి రామయ్య గోపయ్య ,మొదలైన వారున్నారు .అందరికి భోజనాలు పెట్టారు .మొత్తం ఖర్చు మిత్ర బృందమే భరించింది .అప్పటినుండి ప్రతిఏడాది స్వతంత్ర దినోత్సవం జరుపుతూనే ఉన్నారు మిత్ర బృందం .తారకేశ్వరి కూడా కనిపించింది ,నా దగ్గర ప్రైవేట్ చదివిన వారిలో బుడ్డి శిరీష అనే అమ్మాయి ,పోతిన రజని అనే అమ్మాయి చాల మంచి విద్యార్ధినులు .బాగా చదివేవారు .ఎప్పుడు ట్యూషన్ కు రమ్మంటే అప్పుడు వచ్చేవారు.శ్రద్దగా చదివి అభిమానం పొందారు .కాని శిరీష కు పెళ్లి అయి భర్త చనిపోయాడట బాబ్జీ చెప్పాడు .బెజవాడలో ఉంటోందట .రజని గుంటూరు అమ్మాయి అదే యాస తో మాట్లాడేది .నవ్వుముఖం .సరదాగా మాట్లాడేది. వాళ్ళ నాన్న వాళ్ళు ఇక్కడ పొలాలు కౌలు కు తీసుకొని పొగాకు పండించేవారు .పొగాకు నారు పెంచటాన్ని ‘’మట్లు ‘’పెట్టటం అని అంటారని రజని ద్వారానే తెలిసింది .ఇద్దరూ మంచిమార్కులతో పాసైనారు టెన్త్ క్లాస్ .శిరీష అన్న టెన్త్ లెక్కల్లో తప్పి నాదగ్గర అక్టోబర్ పరీక్ష కు లెక్కలు ట్యూషన్ కు వచ్చాడు .బాగా తెలివి ఉన్నవాడే .రెండు నెలల్లో మొత్తం సబ్జెక్ట్ అంతాబోధించాను బిట్స్ అన్నీ బాగా చేయించాను పాత పేపర్లు ఆన్సర్ చేయించాను .యిట్టె అందుకోనేవాడు పేరు. శ్రీనివాసని గుర్తు .సప్ప్లిమెంటరిపరీక్ష లో ఆతను 85 శాతం మార్కులు తెచ్చుకొని పాసవటం అతనికంటే నాకు చాలా ఆనందం గా ఉండేది .చెల్లెలు శిరీష ఎంతగానో పొంగిపోయింది .క్రాఫ్ట్ మేస్టారి బంధువుల అమ్మాయి లెక్కలు, సైన్స్ లో తప్పితే ఆయన నన్ను ప్రైవేట్ చెప్పమని కోరితే టైం లేక మధ్యాహ్నం ఒంటి గంటకు లంచ్ టైం లో ఇంటికి వచ్చిన సమయం లో రమ్మంటే వచ్చేది .ఆ ముప్పావుగంట కాలం ,సాయంత్రాలలో చెప్పితే ఆ అమ్మాయి శ్రద్ధగా చదివి పాసయింది .ఇదికూడా క్రెడిటే.అంత తెలివైన అమ్మాయికాకపోయినా కస్టపడి ఫలితం సాధించింది .హాస్టల్ కుర్రాడు హనుమంతరావు కూడా చాలా అణకువగా ఉండి చదివాడు .అలాగే ఇద్దరన్న దమ్ములు ఎనిమిదీ తొమ్మిదీ చదివారు బుద్ధిమంతులు ఇద్దరూ .మంచి ఉద్యోగాలలో స్తిర పడ్డారు .జానకి రామయ్య అనే కుర్రాడు తొమ్మిదో తరగతి నా దగ్గర ట్యూషన్ చదివాడు
.ఏంతో వినయ విదేయతలున్న వాడు .పాలుపోసేవాడు .డబ్బిస్తే మంచి వెన్నపూస తెచ్చిపెట్టేవాడు . బాగా చదువుకొని డిగ్రీ పాసై ఇప్పుడు ఉయ్యూరు బాంక్ ఆఫ్ ఇండియా పని చేస్తూ ఈ మధ్యనే ఇంటికి వచ్చి కలిసి వెళ్ళాడు .ఇప్పుడూ అతని పద్ధతిలో ఏ మాత్రం తేడాలేదు . శ్రీరామ మూర్తి అనే కుర్రాడు వైశ్యుడు .బాగా చదివి వ్యాపారం లో స్తిరపడ్డాడు .కొండపల్లి లక్ష్మి చివర్లో ట్యూషన్ లో చేరింది టెన్త్ లో .చురుకైన అమ్మాయి .మంచిమార్కులతో పాసై ఖమ్మం లో ఇంటర్ చదవటం తెలుసు ఒకసారి వాళ్ళ నాన్న గారు ఇంటికి రమ్మంటే వెళ్లాను .ఇంటివాడు ప్రసాద్ చదువులో ప్రగతి పెద్దగా సాధించలేదు .అసలైన ఇంకో సేలిబ్రటి శిష్యుడు గోపయ్య ది ఒక చరిత్ర .తర్వాత తీరికగా తెలియ జేస్తాను .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -11-2-15- ఉయ్యూరు

