|
|
|||||
|
సాహితీ బంధువులకు17-2-15 మంగళవారం శ్రీ మహా శివ రాత్రి శుభాకాంక్షలు -దుర్గాప్రసాద్
మనం ఏటా మాఘ కృష్ణ చతుర్దశి నాడు మహాశివరాత్రి జరుపుకుంటున్నాము. దీనికి కారణం? పురాణాలు ఏం చెబుతున్నాయో చూద్దాం.
ఒకసారి బ్రహ్మ విష్ణువుతో ‘‘నేను ఈ విశ్వానికి సృష్టికర్తను కనక నేనే గొప్ప’’ అని అన్నారు. దానికి విష్ణువు ‘‘నీవు నా బొడ్డులో పుట్టావు కనక నేనే గొప్ప’’ అని తిరిగి సమాధానం చెప్పారట. ఇద్దరికి ఘోర యుద్ధం మొదలయ్యింది. వారిద్దరికి బుద్ధి చెప్పడానికి పరమేశ్వరుడు ఆకాశము, పాతాళము వ్యాపించి ఒక అగ్నిస్తంభ ఆకారంలో జ్యోతిర్లింగమై ఆవిర్భవించారు. దాన్ని చూసి బ్రహ్మకు, విష్ణువుకు భయం కలిగింది. అప్పుడు ‘‘మీలో నా మొదలూ తుదీ ఎవరు తెలుసుకొని వస్తారో వారే గొప్ప’’ అని శివుడి యొక్క అదృశ్యవాణి వినిపించింది. బ్రహ్మ హంస రూపం ధరించి జ్యోతిర్లింగం పైభాగాన్ని తెలుసుకోవడానికి వెళ్లాడు. విష్ణువు వరాహరూపంతో ఆ జ్యోతిర్లింగం మొదలు ఎక్కడ ఉందో వెదుకుతూ బయలుదేరాడు. ఇలా వారిద్దరు ఎన్నో సంవత్సరాలు వెళ్లినా వారికి ఆ జ్యోతిర్లింగము ఆది అంతాలు కనబడలేదు. అయితే వారు పూర్తిగా అలసిపోయి శివుడిని ప్రార్థించగా శివుడు జ్యోతిర్లింగం మధ్య ప్రత్యక్షమై ‘‘నేను గొప్ప నేనేగొప్ప అని మీరు అనవసరంగా తగువుపడుతున్నారు. మీకందరికీ నేనే మూలం. మీలోని శక్తికి నేనే కారణం. ఈ పవిత్రమైన రోజును ప్రజలు మహాశివరాత్రిగా జాగరణము, ఉపవాసము మొదలగు వాటి చేత నా నిజస్వరూపాన్ని తెలుసుకుని ముక్తులు అవుతారు’’ అని అనుగ్రహించి అదృశ్యమైపోయాడని శివపురాణంలోని విశ్వేశ్వర సంహితలో ఉంది. ఈ జ్యోతిర్లింగ విషయమై ఆపాతాలనభస్థలాన్త భువన బ్రహ్మాండ మా విస్పుర జ్యోతి స్ఫాటిక లింగ.. అని మొదలుగు విధాల వర్ణన మహాన్యసంలో కూడా ఉంది. కనక భారతీయులు అనాదిగా ఈ శివరాత్రి రోజు ఉపవాసం ఉంటూ, రాత్రి జాగరణం చేసి శివునికి నాలుగు జామల్లో పూజాభిషేకాలు చేస్తూ, మరుసటి రోజు ఉదయం ప్రసాదం తీసుకుంటారు. శివజాగరణ రహస్యం ‘‘ఇతిహాస పురాణాఖ్యానం వేదం సముప బృహయేత్ (భారతం)’’ అంటే ఇతిహాస పురాణాలు వేదార్థాన్ని తెలుపుతాయి అని ఉంది. అందుకే పురాణాల్లో ఈ శివరాత్రి కథకి వేదార్థాన్ని గ్రహించాలి. తైత్తిరీయ నారాయణంలో మనోబ్రహ్మ అని ఉంది. కనక ఈ విశ్వాన్ని సృష్ట్టించే మనస్సే బ్రహ్మదేవుడు. ‘విష్ణుంకృత్వాథ సారథికు’ అను శృతి ప్రకారము, ‘బుద్ధింతు సారధిం విద్ధి’ ప్రకారం స్థూల శరీరాన్ని రషించే బుద్ధియే విష్ణువు. మనస్సు అనే బ్రహ్మ ఇంద్రియాల రూపంలో అంటే హంసరూపంతో ఎంత ప్రయత్నించినా, బుద్ధి అనే విష్ణువు తర్కరూపం అంటే వరాహరూపంలో ఎంత ప్రయత్నించినా వారిద్దరు ఆత్మ అయిన జ్యోతిర్లింగము యొక్క ఆది అంతాలను తెలుసుకోలేకపోయారు. ‘యతోనాచో నివర్తంతే అప్రాప్యమనసాసహ’ అంటే ఆత్మ మనస్సు, ఇంద్రియాలకు తెలియబడేది కాదు. అది అనుభవంతోనే తెలియబడుతుంది.. అని ఈ తైత్తిరీయ ఉపనిషత్ వివరణే ఈ కథ. శివరాత్రి నాడు నిద్ర చేయకూడదు అని జాగరణ చేయాలి అని, ఉపవాసం చేయాలని పురాణాలలో ఉంది. ఇక్కడ నిద్ర అంటే ఏమిటి? అంటే శ్రీ గౌడపాదులు నిద్రా తత్త్వ మజానతః (గౌ.కా) అన్నారు. అందరి స్వరూపమైన ఆత్మ యొక్క పరమార్థాన్ని తెలియకపోవడమే అంటే అవిద్యయే నిద్ర. ‘అన్యథా గృహ్లాతః స్వప్నః’ అన్నారు గౌడపాదులు. అంటే ఉన్న ఆత్మను ఉన్నట్లు తెలుసుకోక దానిని దేహమని, మనస్సని, ఇంద్రియాలని తప్పుగా తెలుసుకోవడమే స్వప్నము. ఈ రెండు నిర్వచనాల వల్ల యధార్థ గ్రహణమే జాగ్రత్త (మెలకువ) అని గౌడపాదులు అన్నారు. అంటే తన స్వరూపాన్ని ఉన్నది ఉన్నట్లు తెలుసుకోవడమే జాగరణము. ఆ రోజే మన జీవితంలో శివరాత్రి. గౌడపాదులు అనాది మాయయా సుప్తః యదా జీవః ప్రభుద్యతే.. అజమనిద్రమస్వప్నం అద్వైతం బుధ్యతే తదా.. అన్నారు. అంటే పరమ కరుణామూర్తి అయిన గురువులు ఆత్మోపదేశం చేయగా అనాది మాయానిద్ర తొలగి, అజము, అనిద్రము, అస్వప్నము, అద్వైతము అయిన తన ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోవడమే నిజమైన జాగరణ. ఇలా తెలుసుకోకుండా ప్రజలు ఈ రోజు శివరాత్రి కనక జాగరణ చేయాలని రాత్రంతా సినిమాలు చూడటం, వేరే వేరే పనులు చేయడం సరికాదు. శివరాత్రి నాడు అన్నం తినకూడదు అని రకరకాల తిండి తీర్థాలను జాముజాముకి తీసుకుని, ఉపవాసం చేసామని భావించకూడదు. ఉప అంటే దగ్గర. జీవాత్మ పరమాత్మకు సమీపంలో ఉండడం. గురువుల వద్ద శ్రవణం చేసి తన ఆత్మ పరమాత్మయే అని గుర్తించడమే నిజమైన ఉపవాసం. అంతేగాని శరీరం ఎండబెట్టడం ఉపవాసం కాదు. అయితే శివరాత్రి రోజు ఆహారం స్వీకరించకుండా ఉపవాసం చేస్తే మంచిదే అది ఆరోగ్యానికి, అంతఃకరణశుద్ధికి ఉపయోగం కాని ఇదే పరమార్థం అనుకోకూడదు. ఇక యామ పూజ, యామం అంటే జాము. ఆ రోజు రాత్రి ప్రతి యామం శివునికి అభిషేకం చేయాలి. ప్రథమయామం రెండవ యామంలోను, మూడవ యామంలో మొదటి రెండు యామాలను అంతర్గతాలు. ఇలాగే నాలుగో యామం చివర తెల్లవారుతుంది. ఈ నాలుగు యామాలు వాస్తవంగా మాండుంక్యంలోని (స్నోయమాత్మా చతుస్పాత్’) ఆత్మకి నాలుగు పాదాలు ఉన్నాయి అని తెలుపుతుంది. విశ్వపాదం తైజసపాదంలోను విశ్వతైజసపాదాలు ప్రాజ్ఞపాదంలోను ఈ మూడు పాదాలు తురీయపాదంలోను అంతర్గతాలు. ‘త్రయాణాం’ విశ్వాదీనాం పూర్వపూర్వ ప్రవిలాపనేన తూరీయస్య ప్రతిపత్తిరితి’ అని శ్రీ శంకర భాగవతాదులు మాండూక్య భాష్యంలో చూపారు. ఈ విశ్వ, తైజస, ప్రాజ్ఞ, తురీయములు అద్వితీయ ఆత్మలో వికల్పాలని గుర్తిస్తే ఆ నాల్గవ యామం చివరిలో తెల్లవారినట్లు అప్పుడు పరమార్థ జ్ఞానోదయం కలుగుతుంది. ఇదే శివ జాగరణ రహస్యం. స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి, విశాఖ శారదాపీఠాధిపతి, ఫోన్ : 9966669658 |

