నా దారి తీరు -90
ఇప్పటికి 15 ట్రాన్స్ ఫర్లు రుచి చూశాను. ఇది పదహారవ బదిలీ కం ప్రమోషన్ .వత్సవాయి చిల్లకల్లు –బోనకాల్ రోడ్డుమీద ఉంది. చిల్లకల్లు నుంచి తిరుమలగిరికొండ దూరం గా కనిపిస్తుంది .అడిదాటితే కన్నెవీడు వస్తుంది తర్వాత మక్క పేట .ఇక్కడినుంచి తూర్పుకు వెడితే పెనుగంచిప్రోలు . మక్కపేటనుండి మునేరు దాటి తే వత్సవాయి వస్తుంది .వత్సవాయి నుండి బోనకల్ రైల్వే స్టేషన్ అయిదు కిలో మీటర్లు .అది హైదరాబాద్ –విజయ వాడ రైల్వే లైన్ లో ఉంది .శాతవాహన గోల్కొండ లాంటి ఎక్స్ప్రెస్ ట్రెయిన్లు ఈ స్టేషన్ లో ఆగుతాయి .అందుకని ఉద్యోగస్తులు ఈ ట్రెయిన్ లో అప్ అండ్ డౌన్ చేస్తారు . వత్సవాయి హైస్కూల్ గ్రౌండ్ లో పెద్ద వాటర్ టాంక్ దాదాపు రెండు కిలోమీటర్ల దూరం నుండే కనిపిస్తుంది .ఊరందరికీ నీటి సప్ల్లై ఇక్కడి నుంచే .
వత్సవాయి హైస్కూల్ హెడ్ మాస్టార్ లింగం వెంకటేశ్వర రావు గారు లాంగ్ లీవ్ పెడితే నన్ను ప్రమోషన్ మీద ఇక్కడికి వేశారు .పెద్ద స్కూలే అన్నీ డబల్ సేక్షన్లే .అందరూ వెనకబడిన , ఎస్ టి విద్యార్ధులే .కోమట్లూ ఎక్కువే .వత్సవాయి నుంచి ఎనిమిదికిలోమీటర్ల దూరం లో పొలం పల్లి ఉంది .ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది .ఇక్కడి హైస్కూల్ హెడ్మాస్టర్ విల్సన్ గారు ఉయ్యూరు హైస్కూల్ లో నా ఎస్ ఎస్ ఎల్ సి క్లామేట్ చంద్రా నిర్మల భర్త గారే .ఆమె అక్కడే తెలుగు పండిట్ .కొండూరు అనే ఇంకొక ఊరు కూడా ఎనిమిది కిలోమీటర్ల దూరం లో ఉంది .ఇక్కడా కొత్తగా హైస్కూల్ పెట్టారు .బ్రాహ్మణ్యం ఎక్కువ. స్కూల్ కమిటీ వారి అధీనం లోనే ఉంది .ఆప్రేసిడెంట్ట్ మునసబుగారుకూడా అనిజ్ఞాపకం .
వత్సావాయి స్కూల్ స్టాఫ్
స్కూలు రమణయ్య అనే లెక్కల మాష్టారు ఇంచార్జిలో ఉంది .ఆయనకు ఇక్కడ ట్యూషన్లు కూడా ఉన్నాయి జగ్గయ్యపేట నుండి వచ్చేవాడు .రెండో లెక్కల మేస్టారేవరోగుర్తులేదు .సైన్స్ మేష్టారు అప్పారావు దగ్గరలో ఉన్న జొన్నలగడ్డ వాసి. మంచి కుర్రాడు .బాగా చెప్పేవాడు .సోషల్ కు విజయవాడ ప్రాంతం ఆవిడా .ఆమె భర్తసీనియర్ తెలుగుపండిట్ . ఇద్దరి ఆరోగ్యాలు అంతంత మాత్రమె .ఎప్పుడూ సెలవలె .తెలుగాయన మూడీ పర్సన్ .ఆస్తమా పేషెంట్ ఆవిడ కూడా .పిల్లలు లేరు .డ్యూటీ మైండెడ్ కాదు ఇద్దరూ..హిందీ పండిట్ శంకర రావు గారనే పెద్దాయన .యు టి ఎఫ్ కార్య కర్త .పంచె కట్టి చొక్కా తో వచ్చేవారు ఆయన అందరికి పెద్ద ఆయన మాట అందరికి ఇష్టమే .డ్రిల్ మాస్టారు ఆలీ గారు దాదాపు రిటైర్ మెంట్ స్టేజ్ లో ఉన్నాడు .దీనికి తోడూ పక్షవాతం వచ్చి కర్ర సాయం తో వచ్చేవాడు . హాజరు పట్టీ లో సంతకం పెట్ట టానికే స్కూల్ కు వచ్చేవాడు .ఆ తర్వాత స్కూల్ వదిలి సెంటర్లో చేరి టీలు తాగుతూ గఫ్ఫాలు కొట్టేవాడు .‘’ఏదైనా అంటే ‘’సార్ !ఇప్పుడు ఇట్లా ఉన్నాకాని మంచి డ్రిల్ మాస్టర్ గా నాకు పేరుంది .అన్నీ ఆడేవాడిని బాగా నేర్పెవాడిని నందిగామ వాడిని డబ్బా కొట్టే వాడు .డ్రాయింగ్ మాస్టారు పెంటపాటి అప్పారావు గారని గుర్తు .ఆయన చాలా క్రమ పద్ధతిలో ఉండేవాడు .బ్రాహ్మణులు .ఒకటి రెండు సార్లు వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచాడు వెళ్లి తిన్నాను. చాలా మర్యాద గా చూశారు .సెకండరీ గ్రేడ్ టీచర్ గా కోసూరు వాడు పరుచూరి బ్రహ్మానందం ఉండేవాడు .ట్యూషన్ లో చాలామంది పిల్లలు ఉండేవారు .శంకర రావు గారికి ముఖ్య శిష్యుడు .వారానికో సారి మమ్మల్ని ఇంటికి పిలిచి సాయంత్రం వేల కాఫీ టిఫిన్ ఇచ్చేవాడు భార్య బాగా అచేసేది . ఇంకొక సెకండరీ గ్రేడ్ టీచర్ ఆచార్యులుగారు కుర్రాడే .క్రికెట్ పిచ్చి ఎక్కువ .బందరు దగ్గర నుండి దుర్గాంబ అనే గ్రేడ్ టు తెలుగుపండిట్ వచ్చారు .క్రాఫ్ట్ మేష్టారు వెంకటేశ్వరరావు మానికొండలో నేను సైన్స్ మేస్టర్ గా పని చేసినపుడు లాబ్ అసిస్టంట్ గా ఉన్నవాడు .చికినాల నేటివ్ .పంచె చొక్కా తో ఉండేవాడు మాంచి మాటకారి .ఇక్కడ గార్డెనింగ్ మాత్రమె క్రాఫ్ట్ పని .స్కూల్ కు ఒకే ఒక రైటర్ లగడపాటి కృష్ణ మూర్తి ఉండేవాడు ఆన్నీ బాగా తెలిసిన వాడు .దాదాపు ఇరవై ఏళ్ళనుండి ఇక్కడే పని చేస్తున్నాడు .ఇక్కడే రిటైర్ అయ్యాడు .అన్ని పనులు చాలాశ్రద్దగా స్పీడ్గా చేసి నాకు ఏంతో సహకరించేవాడు .టెన్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ నామినల్ రోల్స్ రాయటం దగ్గరనుండి పరీక్షలకు సీటింగ్ విషయం పేపర్లు పెట్టటం ఫైల్స్ మెయింటేన్ చేయటం ,కరేస్పాడేన్స్న్స్ అంతా పకడ్బందీ గా చేసేవాడు .ఏ అనుభవం లేకుండా హెడ్ మాస్టర్ కుర్చీలో కూర్చున్న నాకు ఇ౦ త అనుభవం ఉన్న క్క్లార్క్ ఉండటం నక్కను తొక్కినట్లు అయింది కమ్మవారే అయినా తలలో నాలుకలా ఉండేవాడు ఇలాంటి గుమస్తా నాకు దొరికి నందుకు అందరూ ణా అదృష్టాన్ని మెచ్చుకొనేవారు .ఒక సారి ఇంటికి పిలిచి టిఫిన్ పెట్టించాడు సంస్కారి .విద్యార్ధులకు ఆయన అంటే గురి ఎక్కువ ఏ పనైనా చక చకా చేసేవాడు .టి సి లు వగైరాలకు ఎంతోకొంత పిల్లల దగ్గర తీసుకొనే వాడు అని విన్నాను .ఇది తప్పని సరే .దీనిపై నేనేమీ స్పందించలేదు .మధిర దగ్గర ఎర్రుబాలెం ఆయన స్వగ్రామం .కొన్ని పోస్ట్లు లేవు .లైబ్రేరియన్ లేడు ఇంతపెద్ద స్కూల్ కి .అటెండర్ మంగళా పురం దగ్గర లక్ష్మీ పురానికి చెందిన వెంకటేశ్వరరావు అనే కుర్రాడు .ఈ మధ్యనే వచ్చాడు నైట్ వాచర్ ముసలాయన రిటైర్ అయ్యాడు .అతనికొడుకు తో పని చేయించి అతనిని కొన్ని నెలల తర్వాత చైర్మన్ గారితో చెప్పి రెగ్యులరైజ్ చేయించాను .బలరాం అనే లైబ్రేరియన్ నాతో పామర్రులో చేశాడు .అతన్ని సస్పెండ్ చేస్తే చైర్మన్ గారి దృష్టికి తెచ్చి పోస్ట్ ఫిలప్ చేయమంటే అతన్నేవేశారు .పెద్ద దేశ ముదురు కబుర్ల పోగు . ఇలాంటి నేపధ్యం లో నేను హెడ్ మాస్టార్ బాధ్యతలను మొదటిసారిగా వత్సవాయి హైస్కూల్ లో చేపట్టాను .
మళ్ళీ ఒకే గదిలోపుల్లయ్య నాయుడు ఇంట్లో కాపురం
కొత్తలో హైస్కూల్ లోనే ఒక వారం పడుకొన్నాను .క్రాఫ్ట్ మేస్టారు, ఆచార్యులు , అటెండర్కూడా అక్కడే పడుకొనేవారు బల్లల మీదే నిద్ర. నేను హెడ్ మాస్టారు రూమ్ లో ఉండేవాడిని స్టవ్ తెచ్చాను కనుక ఖాళీ రూమ్ లో వంట చేసుకొనే వాళ్ళం .అటెండర్ ,క్రాఫ్ట్ కూరలు అవీ తరిగిస్తే నేనే వండే వాడిని పప్పూ కూర సాంబారు చేసేవాడిని బాగా నే కుదిరి తెగ మెచ్చుకొంటూ అందరం తినే వాళ్ళం ..క్రాఫ్ట్ మేష్టారు ఖర్చు లెక్కలు రాసి పదిహేను రోజులకోసారి సమాన వాటాలు వేసి సర్డుకొనే వాళ్ళం తర్వాత హెడ్ గా స్కూల్ లో నేను పడుకోవటం చెడు సంప్రదాయం అనిపించి స్కూలు ప్రక్కనే ఒక సాలీల పుల్లయ్య నాయుడు ఇంట్లో వాకిలి వైపు గదిలోకి మారాను .మడత మంచం పట్టే ఖాళీ .వంటకు సరిపడా స్థలం ఉండేది. అన్నీ కిటికీలలోనే నేనే వండేవాడిని ఆచార్యులు క్రాఫ్ట్ అటెండర్ నేనూ తినేవాళ్ళం ఎవరి కంచాలు వాళ్ళు కడుక్కొనే వాళ్ళం అంట్ల గిన్నెలు అటెండర్ తోమేసే సేవాడు. సరదాగా ఈ’’ మగ కాపురం ‘’ రెండు నెలలు చేశాం తర్వాత క్రాఫ్ట్ ఫామిలీ తెచ్చుకొన్నాడు .అటెండర్ స్కూల్ లోనే వండుకోనేవాడు. ఆచార్యులూ వేరే గది తీసుకొని ఉన్నాడు .పుల్లయ్య నాయుడు భార్య పిల్లలు సారూ గారు అంటూ ఏంతో అభిమానం గా ఉండేవారు .హెడ్మాస్టారు వాళ్ళ ఇంట్లో అద్దేకున్నందుకు గర్వ పడే వారు నా రూమ్ స్కూల్ కు అతి సమీపం ‘.ఫెన్సింగ్ దాటి స్కూల్ లోకి వెళ్ళటమే .నాయుడు ఇంట్లో ఇడ్లీ చేస్తే నాకు పిల్లలతో పంపేవాడు అతనిది సైకిల్ మీద వెళ్లి చేసే వస్త్ర వ్యాపారం .కొత్తగా డాబా ఇల్లు కట్టుకొన్నాడు .కాఫీ కూడా ఇచ్చేది ఆ మహా ఇల్లాలు .మధ్యాహ్నం స్కూల్ నుంచి వస్తే టీ చేసి పంపేది .ఒకే కుటుంబ సభ్యులం గా ఆత్మీయత తో ఉన్నాం .నాయుడు ఆ తరాత నేను అక్కడినుంచీ వచ్చేసినాక కూడా ఉయ్యూరు కు అడ్రస్ కనుక్కొని వచ్చి పలక రించి పోయేవాడు .ఈ మధ్య ఖమ్మం వెళ్లి నేను మా శ్రీమతి, మా పెద్ద కోడలు, మా అమ్మాయి విజ్జి వత్సవాయి మీదుగా తిరిగి వచ్చి పుల్లయ్య నాయుడి ఇంటికి వెళ్లి పలకరించాం .నేనున్న గది చూపించా .ఎలా అందులో ఉన్నానో నని వీళ్ళు ఆశ్చర్య పోయారు .వాళ్ళ మర్యాద మాటలతో చెప్పలేనిది .నాయుడు కొడుకు బి టెక్ పాసై ఉద్యోగ ప్రయత్నం చేస్తూమా శర్మ ద్వారా ఏవైనా ఉద్యోగాలున్నాఎమో నని కనుక్కోమని ఫోన్ చేసేవాడు మా వాడు లేవని చెప్పేవాడు .అతనికి ఏమీ సాయం చేయలేకపోయానే అనే బాధ మనసులో ఉంది రుణాను బంధం ఇది .
వంకాయ కూర బాగా చేసేవాడిని .బంగాళా దుంప వేపుడు రసం సాంబారు పప్పూ బాగా కుదిరేవి .కొంత మిగిల్చి నాయుడు కుటుంబానికి ఇచ్చేవాడిని తెగ మురిసిపోతూ తినేవారు .ఆ గదిలోనే హాస్టల్ ఆడపిల్లలకు ట్యూషన్ చెప్పాను మద్దెల రా మొండి తోక జ్యోతి అనే టెన్త్ కాస్ నైంత్ క్లాస్ పిల్లలు వచ్చేవాళ్ళు .రాణి అంట్లు తోమి పెట్టేది .చదువు పెద్దగా వచ్చేదికాదు .బాగా పాడేది జ్యోతి కొంతనయం .క్రాఫ్ట్ కూతురు టెన్త్ తప్పితే ట్యూషన్ చెప్పమంటే చెప్పాను లెక్కలు ఇంగ్లీష్ .పాసైంది పెద్దమ్మాయికి కూడా ట్యూషన్ చెప్పిన జ్ఞాపకం .ఉదయం తోమ్మిదికే భోజనం చేసి స్కూల్ లో టెన్త్ క్లాస్ హాస్టల్ పిల్లలకు సైన్స్ లెక్కలు ఇంగ్లీష్ చెప్పేవాడిని .కస్టపడి చదవటం ఎలాగో నేర్పాను. సాయంత్రం స్కూల్ అవగానే డాబా మీద టెన్త్ వాళ్ళను ‘’మల్లేసే వాడిని ‘’ స్టోరీలు పద్యాలు అప్పగించుకోవటం రాయించటం చేసేవాడిని వాళ్ళల్లో చురుకు దనం పెరిగింది .ప్రతి బుధవారం ఎనిమిది తొమ్మిది పది తరగతుల పిల్లలకు చివరి పీరియడ్ లో కధలు చెప్పటం రాజకీయ నాయకుల గురించి వివరించటం సైన్స్ లో వచ్చిన కొత్త విషయాలు చెప్పించటం క్విజ్ నిర్వహించటం చేయటం తో వాళ్ళలో జనరల్ నాలెడ్జి కొంత పెరిగింది ఇన్ని యాక్టివిటీస్ ఇ౦త దూరం గా ఉన్న స్కూల్ లో ఏ హెడ్ మాస్టారు నిర్వహించి ఉండరు .ఇక్కడకి వచ్చిన మేస్టార్లు హెడ్ లు అందరూ కృష్ణా జిల్లా నడిగడ్డ నుండి ఏదో రకం గా ట్రాన్స్ ఫర్ అయి చెప్పుల్లో కాళ్ళు పెట్టుకొని ఎప్పుడు ఇక్కడి నుండీ బయట పడదామా అని ఎదురు చూసేవాల్లె .నేనూ అదే టైప్ అయినా డ్యూటీని ఏనాడూ అలక్ష్యం చేయలేదు .అందుకే ఒకరకం గా సక్సెస్ అయ్యాను .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -18-2-15- ఉయ్యూరు
..

