ఆయన కలం నుంచి జాలు వారిన మాటలు ఆణిముత్యాలు. ఆయన గళం నుంచి వెలువడే గానం అణువణువునా శివతన్మయత్వాన్ని కలిగిస్తుంది.. ఆయన కవిత్వమే శివుడి నాగాభరణం. తెలుగు భాషకు ఆభరణం. తెలుగువారికి పరిచయం చేయనక్కరలేని వ్యక్తి. ఆయనే తనికెళ్ల భరణి. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు విచ్చేసిన భరణితో ‘ఆంధ్రజ్యోతి’ కాసేపు ముచ్చటించింది. ఆ విశేషాలు ఇవి..
కన్నీళ్లు, త్యాగాలు, కష్టాలు, ఆకలి కేకలు, చాలీచాలని జీతం ఇవన్నీ కలిస్తేనే మధ్యతరగతి జీవన పోరాటం. సమాజంలో గౌరవంగా బతకాలనే ఆరాటం. పై స్థాయికి ఎదగాలనే తపన, కిందిస్థాయికి దిగకూడదనే పట్టుదల. ఇవన్నీ కలసి మధ్యతరగతి వ్యక్తిని ప్రశాంతంగా ఉండనీయవు. ఎవరినీ తృప్తి పరచలేకపోయినా అందరినీ తాను తృప్తి పరిచినట్లు భావిస్తాడు. అదే నిజమనే భ్రమలో కడవరకు ఉంటాడు.
ఆలోచన మారాలి
రోజులు మారుతున్నాయి, ప్రజల ఆలోచన విధానం మారుతోంది, గురజాడ అప్పారావు కలం నుంచి జాలువారిన మహోన్నతమైన రచన ‘కన్యాశుల్కం’. ఆనాటి సామాజిక రుగ్మతలను కళ్లకు కట్టినట్లు చూపించి, ప్రజల్లో సామాజిక చైతన్యం కలిగించింది. పురుషాధిక్యం వల్ల తరువాత కాలంలో వరకట్న దురాచారం ప్రబలింది. అది ఈనాటికీ సజీవంగానే ఉంది. భ్రూణ హత్యల వల్ల నేడు పెళ్లికాని ప్రసాద్‌లు ఎక్కువయ్యారు. ఆడపిల్ల పుడితే అందరూ లక్ష్మీ, సరస్వతీ అని పిలుస్తారు కాని, కొంత మంది మాత్రం భారంగా భావిస్తారు. ఈ రకమైన ప్రజల ఆలోచన మారాలి.
పెళ్లి కీలకం
ఆడపిల్లల జీవితంలో పెళ్లి కీలకమైంది. పెళ్లి అయ్యేంతవరకు తాను గుడిసెలో నివసించినా భవంతిలో నివసించినా ఆమె ఆ ఇంటికి మహారాణి. ఆమె ఏది చేసినా చెల్లుతుంది. అయితే ఆమె జీవితంలో ద్వితీయభాగం, సువర్ణాధ్యాయం పెళ్లితో మొదలవుతుంది. అనూహ్యమైన ప్రదేశానికి ఆడపిల్ల వెళుతున్నప్పుడు తనతోపాటుగా కట్నం వెంట తీసుకువెళ్లాలి. ఇంతకన్నా ఘోరం మరోటి లేదు. ఎదిగిన ఆడపిల్లను తల్లిదండ్రులు గుండెల మీద కుంపటిలా భావిస్తున్నారు. ఈ ఆలోచనా విధానం మారాలి. ఈ విషయంపై ‘కన్యాకుమారి’ అనే కవిత రాశాను. ‘‘ఏ ఊరిలో ఆడపిల్ల నడయాడదో అక్కడ పుష్పాలు పుష్పించవు’’ అని తమిళకవి అన్నమాటలు అక్షరసత్యాలు. నేటి తరం తల్లిదండ్రులు ఆడపిల్ల ఔన్నత్యాన్ని గుర్తించాలి. పి.వి.నరసింహారావు పుణ్యమా అని ఐటి రంగంతో మధ్యతరగతి బతుకులు బాగుపడ్డాయి, కష్టాలు గట్టెక్కాయి. తల రాతలు మారాయి. ఆడపిల్ల చదువు పూర్తికాగానే క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా ఉద్యోగస్థురాలై వేలాది రూపాయలను జీతంగా తీసుకుంటోంది. తల్లిదండ్రుల ఆర్థిక భారాన్ని తగ్గించటమే కాక సమాజంలో తలెత్తుకొని జీవించేలా చేస్తోంది.
జీవన మాధుర్యాలు ఆస్వాదించండి
మదర్‌కు సాయం చేస్తే మదర్‌థెరీసా అంత గొప్పవాళ్లవుతారు. పిల్లల కోసం తమ చిన్న చిన్న సంతోషాలను, సుఖాలను త్యాగం చేసే తల్లిదండ్రుల శ్రమను, వారికి మీపై ఉన్న వాత్సల్యాన్ని గుర్తించండి. చదువుతో పాటుగా తల్లిదండ్రులకు చిన్నచిన్న పనుల్లో సాయం చేయండి. పిల్లలు చేసే చిన్నచిన్నపనులే తల్లిదండ్రులకు అమితానందాన్ని ఇస్తాయి. అవే జీవితాంతం తియ్యటి జ్ఞాపకాలను పంచే జీవన మాధుర్యాలను మిగుల్చుతాయి.
బతకటం నేర్చుకోండి
బతకటం నేర్చుకోండి. తనకోసం బతకటంలో ఏ మజా ఉండదు. సమాజం కోసం బతికితే దానిలోని మజా తెలుస్తుంది. సమస్త జీవకోటిలో మానవుడికే ఇతరుల కోసం బతికే పరమోత్తమమైన అవకాశం లభించింది. దీన్ని సద్వినియోగం చేసుకుందాం. ఒకరికోసం ఒకరు బతకాలి. మానవ సంబంధాలు అంటే ఇదే.
బ్రాహ్మీముహూర్తంలో చదివితే…
’తెల్లవారుజామున లేవకుండా గొప్పవాడైన వాడిని చూడలేదు’ అనే కొటేషన్ నన్ను విపరీతంగా ఆకర్షించటమే కాక నా జీవనగతిని మార్చివేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా (30 సంవత్సరాలు) నేను సూర్యోదయానికి ముందే నిద్రలేస్తాను. భారతీయ శాస్త్రంలో కాలాన్ని మూడు భాగాలుగా విభజించారు. తెల్లవారుఝామున 2 గంటల నుంచి ఉదయం 10 గంటల మధ్య కాలాన్ని సరస్వతీ కాలంగానూ, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య. కాలాన్ని శక్తి కాలంగానూ, సాయంత్రం 6. నుంచి అర్ధరాత్రి 12 మధ్య కాలాన్ని లక్ష్మీ కాలంగా పేర్కొన్నారు. బ్రాహ్మీముహూర్తం తెల్లవారుజామున 2 నుంచి 4 గంటలదాకా ఉంటుంది. ఈ సమయంలో చదివితే ధారణశక్తి పెరుగుతుంది.
వాళ్లు మార్గదర్శకులు
ఏ కళ్లలో కరుణ ఉంటుందో ఆ కళ్లే ప్రపంచానికి దివ్వెల వెలుగులిస్తాయి. బాహ్య సౌందర్యం కన్నా అంతః సౌందర్యం మహోన్నతమైనది. అది ఎప్పటికీ నశించదు. వారు అంతః సౌందర్యంతో కోట్లాది హృదయాలలో పదిలంగా ఉన్నారు. మదర్‌థెరీసా, గాంధీ, వివేకానంద… ఇలాంటి వారు అంతః సౌందర్యంతోనే ప్రపంచానికి మార్గనిర్దేశకులుగా మారారు. లక్షలాది మంది వారి మార్గాన్ని అనుసరిస్తున్నారు.
అలా చేయండి
కృష్ణుడు బుద్దికి, అర్జునుడు మనసుకు సంకేతం. బుద్ధి, మనసులకు పంచేంద్రియాలను జతచేసినపుడే అద్భుతాలు సృష్టించవచ్చు. ఎన్ని కష్టాలు వచ్చినా నిజాయితీగా జీవించాలి. ‘రామో విగ్రహవాన్ ధర్మః’ – రాముడు నిలువెత్తు ధర్మంతో మూర్తీభవించినవాడు. రాముడు దేవుడు అని ఎక్కడా చెప్పలేదు. సామాన్యుడుగానే బతికాడు. రాముడు ఓ మంచి భర్త, అన్న, స్నేహితుడు, రాజు, కుమారుడు. ఓ వ్యక్త్తి ఆదర్శంగా ఎలా జీవించాలో ఆచరించి చూపిన మహోన్నతమైన వ్యక్తి. కృష్ణుడు ఏ కార్యాన్ని ఎలా చేయాలో చెప్పాడు. అందుకే పెద్దలు రాముడు చేసినట్లు చేయమని, కృష్ణుడు చెప్పినట్లు చేయమని చెపుతారు.
శివుడే దేవుడు
మనిషి కూడా తను చేసే పనుల ద్వారా శివుడిగా మారొచ్చు. శివతత్వం అంటే మంగళకరం అనే అర్థం ఉంది. మంగళకరమైన పనులు నిరంతరం చేస్తూ ఉంటే శివస్థాయికి చేరుకుంటాం. శివుడిని మనిషిగా భావించవద్దు. ప్రతి మనిషిని శివుడిగా భావించటం అలవరుచుకోవాలి. శివుడి మీద నాకున్న ప్రేమే నాతో ’ఆటగదరా శివా!’ రాయించింది.
కారణం తల్లిదండ్రులే
నైతిక విలువలు తగ్గటానికి ప్రధాన కారణం తల్లిదండ్రులదే. తమ పిల్లలను డబ్బు సంపాదించే యంతాల్రుగానే చూస్తున్నారు. ఆ విధంగానే చదివిస్తున్నారు. ఆ విధంగానే పెంచుతున్నారు. కొడుకు చెడిపోతే తల్లిదే బాధ్యత, కూతురు చెడిపోతే తండ్రిదే బాధ్యత. భారతీయ సంస్కృతిలో గురువుకు విశిష్ట స్థానం ఉంది. నేటి యువత చాలామంది గురువు ముందు సిగరెట్ తాగుతున్నారు. సిగరెట్ తాగినందువల్ల గురువు దండించకపోవచ్చు. ఈ విధంగా చేయటం వల్ల భారతీయ సంస్కృతి, సంస్కారం చచ్చిపోతాయి.
అనాడు ఆచార్యదేవోభవ, నేడు…
’ఆచార్య దేవో భవ’ నేడు జీరోగా మారిపోయింది. పూర్వం మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిధి దేవోభవ అని పెద్దలు చెపుతుండేవారు. తల్లిదండ్రులే ఈ విలువలు పాటించనప్పుడు వారి వారసులు ఎలా అనుసరిస్తారు? ఈ రోజు ఉపాధ్యాయులు తమ విద్యార్థులను దండించే పరిస్థితులు లేవు. ఎవరైనా దండిస్తే తల్లిదండ్రులు ఆ పాఠశాల యాజమాన్యంపై గొడవకు దిగుతున్నారు. దీంతో ఉపాధ్యాయులకు పిల్లలను తీర్చిదిద్దాలనే కాంక్ష రోజురోజుకు తగ్గిపోతోంది. మా జీతం మాకు వస్తే చాలనుకుంటున్నారు.
సమాజంలో మార్పు రావాలి
మంచి సినిమాలు తీయటానికి, ప్రయోగాలు చేయటానికి సినిమా పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుంది. ప్రేక్షకుల అభిరుచి మారితేనే సినిమాల్లో మార్పు వస్తుంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో పాటు ప్రేక్షకుల ఆదరణ ఉంటే మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉంటుంది.
ప్రోత్సాహం అవసరం
పొరుగు రాష్ట్రాల్లో మాతృభాషకు ఆదరణ ఎక్కువ. ఇక్కడ అలాంటి పరిస్థితులు లేవు. తమిళనాడులో సంగీత అకాడమీలో సాహిత్య, నృత్య కార్యక్రమాలు 365 రోజులు జరుగుతూ ఉంటాయి. రెండు నెలలకు ముందే షో టిక్కెట్లన్నీ అమ్ముడవుతాయి. ఇక్కడ మాత్రం ఫ్రీగా చూపించినా స్పందన మాత్రం నామమాత్రంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు సొంత లాభం కొంత మానుకొని సంగీత, సాహిత్య కళలను ప్రోత్సహించాలి.
పదో తరగతి వరకు చెప్పులు లేవు
నేను పదోతరగతి వరకు చెప్పులు లేకుండానే పాఠశాలకు వెళ్లేవాణ్ణి. ఓ రోజు మార్కెట్ నుంచి సరుకులను నాన్నతో కలసి ఇంటికి మోసుకు వస్తున్నాను. దారిలో బాటా షాపు కనిపించింది. ఎలాగైనా నాన్న చేత చెప్పులు కొనిపించాలని స్థిర నిర్ణయానికి రావటంతో షాపు దగ్గరకు రాగానే కాలుతున్న సిగరెట్ ముక్కను తొక్కాను. అలా చేస్తే కాళ్లకు చెప్పులు లేకపోవటంతోనే కాలిందని నాన్న గ్రహించి ఎదురుగా ఉన్న బాటాషాపులో చెప్పులు కొంటాడనుకున్నాను. కాలు కాలి పెద్దగా అరవటంతో నాన్న చూసుకొని నడవమని నా తల మీద గట్టిగా చరిచాడు. కొత్త చెప్పులు రాకపోగా కాలు కాలింది. దీంతో కుంటుకుంటూనే ఇంటికి వెళ్లాను. నాన్న జేబులో చెప్పులు కొనేంత డబ్బు లేకపోవటంతో చూసుకొని నడవమని నాపై నాన్న అరిచారే కాని, నాపై ప్రేమ లేక కాదు. ఈ విషయం అర్ధం చేసుకోవటానికి నాకు చాలా రోజులే పట్టాయి.
ఆకలి కేకల మధ్య నుంచి….
కష్టాలు, కన్నీళ్లు, ఆకలి కేకల వాతావరణం నుంచే నా జీవన సమరం మొదలైంది. మేము ఏడుగురు అన్నదమ్ములం. నాన్న జీతం అప్పట్లో నెలకు రు.700 మాత్రమే. అది కుటుంబ అవసరాలకు చాలీచాలని జీతం. నాన్న తెచ్చే జీతంతో అమ్మ ఎంతో నేర్పుగా, ఓర్పుగా నెట్టుకువచ్చేది. మధ్యతరగతి వెతలు ఇంతింత కాదు. చిన్న చిన్న కోరికలు, సంతోషాలు తీరాలంటే గగనమైపోయేది. ప్రతి రోజు ఓ యుద్ధం, ఓ అలక, ఓ నిట్టూర్పు, ఓ కన్నీరు. ఒకరికి సంతోషం కలిగించాలంటే కుటుంబంలో మరొకరు త్యాగం చేయవలసిందే. ఇది అక్షర సత్యం. తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తేనే పిల్లలు ఎదుగుతారనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. మధ్యతరగతి జీవితాలు చాలా విచిత్రంగా ఉంటాయి. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ కూడా మధ్యతరగతి నుంచి వచ్చినవాడే. ‘‘నా చిన్నప్పుడు ఆక లేసినపుడు ఇంకో రొట్టె పెట్టమని అమ్మను అడిగితే, తలా ఒకటి మాత్రమే వస్తుంది, అంతగా ఆకలి వేస్తే నాకోసం ఉంచుకున్న రొట్టె తీసుకుని తినమంది, కుటుంబం కోసం ఎంతో శ్రమించే అమ్మ తన ఆకలిని చంపుకొని మరీ నాకు రొట్టె పెట్టింది. అలాంటి మాతృమూర్తి రుణం ఎలా తీర్చుకోగలం’’ అని రజనీకాంత్ ఓ సందర్భంలో చెప్పారు. ప్రతీ ఇంట్లో ఇలాంటిదే మధ్యతరగతి పరిస్థితి.
మా గురువు రాళ్లపల్లి
మా గురువైన రాళ్లపల్లి ఓ రోజు డైరెక్టర్ వంశీని నాకు పరిచయం చేసారు. వంశీతో పరిచయం నా సినీ జీవితంలో ఓ మైలు రాయి. వంశీ చెప్పినట్లుగా పంచ్ ఉండే విధంగా మాటలు రాయటంతో ‘లేడీ్‌స్‌టైలర్’ సూపర్ హిట్టయింది. ఆ తరువాత ఎప్పుడూ వెనుదిరిగి చూసుకోలేదు.
నక్షత్రం పేరే నాపేరు
నేను దశమి తిధినాడు, భరణి నక్షత్రం రోజున జన్మించాను. మనకున్న 27 నక్షత్రాలలో భరణి రెండోది. తిధి, నక్షత్రం కలిసి వచ్చేవిధంగా నాన్న నా పేరును దశ భరణిగా నామకరణం చేశారు. ఇందులో పెద్ద విశేషం లేదు. నా పూర్తి పేరు తనికెళ్ల దశ భరణి.
ఇంటర్వ్యూ: పెద్దింటి కృష్ణచైతన్య, విజయవాడ