|
అద్భుతమైన కెమెరా పనితనంతో వెండితెరకు కొత్త సొగసును తెచ్చిన భారతదేశం గర్వించదగ్గ సినిమాటోగ్రాఫర్లలో ఒకరైన సీనియర్ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు అలోసియస్ విన్సెంట్ (86) ఇక లేరు. దక్షిణాది భాషలన్నింటిలోను ఆణిముత్యాలుగా చెప్పుకోదగ్గ అనేక చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించిన ఘనత ఆయనది. వృద్ధాప్యంతో చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కుమారులు జయనన్, అజయన్ ఉన్నారు. కుమారులు కూడా తండ్రిలాగానే సినిమాటోగ్రాఫర్లుగా మంచి పేరు తెచ్చుకున్నారు. 1953 నాటి ‘చండీరాణి’ తెలుగు చిత్రంతో విన్సెంట్ సహాయ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. భానుమతి భర్త, దర్శకుడు పి.రామకృష్ణ ప్రోత్సాహంతో ‘బ్రతుకు తెరువు’ చిత్రంతో సినిమాటోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభమైంది. ఇక ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగుతోపాటు తమిళం, కన్నడం, మలయాళ భాషల్లో అగ్రహీరోలు, దర్శకుల చిత్రాలకు సినిమాటోగ్రఫి అందించారు. పలు హిందీ చిత్రాలకూ పనిచేశారు. ‘సొంతవూరు’, ‘ఇల్లరికం’, ‘పెళ్లికానుక’, ‘కులగోత్రాలు’, ‘లేతమనసులు’, ‘భక్త ప్రహ్లాద’, ‘సోగ్గాడు’, ‘జ్యోతి’, ‘సెక్రటరీ’, ‘అడవిరాముడు’, ‘గడుసుపిల్లోడు’, ‘ప్రేమలేఖలు’, ‘రాధాకృష్ణ’, ‘మేజర్ చంద్రకాంత్’, ‘ఆపద్భాందవుడు’, ‘యమజాతకుడు’, ‘అల్లరి ప్రియుడు’, ‘సాహసవీరుడు సాగరకన్య’, ‘బొబ్బిలిసింహం’, ‘అన్నమయ్య’ చిత్రాలు విన్సెంట్ కెరీర్‌లో కొన్ని ఆణిముత్యాలు. తెలుగు ‘ప్రేమనగర్’కు తమిళ రీమేక్ ‘వసంత మాళిగై’, హిందీ రీమేక్ ‘ప్రేమ్‌నగర్’కు అద్భుతమైన ఛాయాగ్రహణాన్ని అందించింది ఆయనే. హిందీలో ‘మెహర్బాన్’, ‘బందిష్’, ‘మహాన్’ వంటి సినిమాలు ఆయన కెమెరా పనితనంతో ఉత్తమ స్థాయి చిత్రాలుగా రూపొందాయి. కెమెరాతో విన్సెంట్ ఎన్నో ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. తమిళంలో శివాజీ గణేశన్ నటించిన ‘ఉత్తమపుత్తిరన్’ చిత్రం ద్వారా భారతీయ సినిమాకి జూమ్ షాట్‌ని పరిచయం చేసిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. అంతకంటే ముందు, బ్లాక్ అండ్ వైట్ సినిమాలకు పనిచేస్తున్నప్పుడే సెట్స్‌పై నేచురల్ కలర్స్‌ను ఉపయోగించిన మొదటి సినిమాటోగ్రాఫర్ ఆయనే. దర్శకుడిగా కూడా విన్సెంట్ సత్తా చాటారు. తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో 30కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు.
|


