శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అనుభవాలూ-జ్ఞాపకాలు…
కథక చక్రవర్తి అని పేరు పొందిన ప్రసిద్ధ తెలుగు రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ‘అనుభవాలూ-జ్ఞాపకాలున్నూ’అన్న రచన దరిదాపు 570 పేజీలతో 3 సంపుటాలుగా ఉంది. ఇది ఆత్మకథా కాదు.. ఆయన జీవిత చరిత్రా కాదు. అలాగని, ఆయన జీవిత గమనం గురించి ఆయనే రాసుకున్న చరిత్ర కాకుండానూ పోదు. ‘ఇది తెలుగు సాహిత్యంలో సరికొత్త ప్రయోగం’ అని భావించబడింది ఆ రోజుల్లో.. నీలంరాజు గారి నవోదయ పత్రికలో ప్రచురింపబడింది. లబ్ద ప్రతిష్టులయిన ఆ కాలపు రచయితలనేకులు మొదటి సంపుటం చదివి ఆశ్చర్యంతో ఆనందంతో ఎన్నో ప్రశంసలు కురిపించారు. మలి సంపుటాల కోసం ఎంతో ఆసక్తి, ఆతృత ప్రదర్శించారు. వేలూరి శివరామశాస్త్రి , జలసూత్రం, పురిపండా అప్పలస్వామి, విశ్వనాధ, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి లాంటి వారెందరో ఈ రచనా విశేషాలు సాకల్యంగా ఎత్తిచూపారు. అయితే ఈ జీవిత చరిత్ర అసంపూర్తిగానే ఉండిపోయింది. శ్రీపాద వారి అకాలమరణం కారణంగా 4వ సంపుటం రాలేదు. ఆయన చివరి ఉత్తరం (తేదీ లేదు) వీలునామా గానూ.. ‘కథక చక్రవర్తి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి’ పేర (బహుశా పురిపండ వారు..) రాసిన 2 పేజీల వ్యాసం ఈ పుస్తకం చివరి పేజీలలో ప్రచురించారు. ఈ నాటి ప్రకాశకులయినా శ్రీపాద వారు చితించని తదనంతర జీవన ఘట్టాలను రేఖామాత్రంగా నయినా రాయించి ప్రచురిస్తే బావుండేది.23 ఏప్రిల్ 1891న జన్మించి..25 ఫిబ్రవరి 1961న పరమపదించారు శ్రీపాద. ఈ70 సంవత్సరాల జీవన పరిధిలో అవధులులేని ప్రతిభా వ్యుత్పత్తులు సాధించుకుని ,తెలుగు సాహిత్యంలో సార్థక జీవిగాఎదిగారు. ఆయనకు రాజమండ్రిలో షష్టి పూర్తి మహోత్సవం, 65వ జన్మదినం సందర్భంగా 25-4-1955న ఆయనకు విశాఖలో కనకాభిషేకం జరిపి సాహిత్య కారులుమురిసి పోయారు. ఆసందర్భంలోనే ఈ ‘అనుభవాలూ-జ్ఞాపకాలూ’ ప్రచురితమైంది. ఈ ‘జ్ఞాపకాలు- అనుభవాలు’ తారీఖుల వారీగానో, జీవన క్రమంలోనో రాసినవి కావు. ఒక సజీవ చైతన్య స్రవంతిగా శ్రీ పాద వారికి గుర్తుకొచ్చిన క్రమంలో, ఆయా ఘట్టాలకు , సంఘటనలకు చెందిన, గత,భవిష్యత్ వివరాలను కూడా ఒకచోట రాయడంలో ఒకఅద్భుతమైన రచనగా ఇది ఆసక్తికరంగా సాగుతుంది.ఇది ప్రధానంగా వ్యక్తిగతం,స్వంత జీవిత చిత్రణ కనుక సహజంగానే ఆనాటి సామాజిక చరిత్రను సాంఘిక జీవితాన్ని మనంఇప్పుడు పూర్తిగా తెలుసుకోవాలంటే అనేకపరిమితులు కూడా ఏర్పడ్డాయి. ఈపుస్తకాన్ని ..ఆజీవితాన్ని, సరిగ్గా అవగాహన చేసుకోవాలంటే మనకు కొంత చారిత్రక జ్ఞానం ఉండాలి. ఈనాటి పాఠకునకు తెలియని ఎన్నోసంగతులు, సందర్భాలు, ఈనాటి ఆలోచనలతో చూస్తే హాస్యాస్పదంగా ఉండేవి ఎన్నో ఉన్నాయి. ఒక ప్రత్యేక ప్రాంతం తూర్పు గోదావరి జిల్లా మునికొడవలి, పొలమూరు గ్రామాలు. అందుబాటులో ఉన్నపిఠాపురం, కాకినాడ, రాజమండ్రి పట్టణాలు, ఆతరువాత చెన్నపట్నం ఈ రచనకు భౌగోళిక భూమిక. మధ్య తరగతి వైదిక (బ్రాహ్మణ) కుటుంబాల స్థితిగతులు, ఆలోచనా విధా నాలు, అంతరంగాలు,ఛాందసాలు, చాపకింద నీరులా ప్రవేశిస్తున్న మార్పులు,వాటిని అంగీకరించలేని శ్రోత్రియ పెద్దల నిస్పృహలు, నిరసనలు- వాటిని సరకు చేయక ముందుకెళుతున్న మరోతరం తపనలు, తాపత్రయాలు, సంకోచాలు, సంఘర్షణలు వారి లొంగుబాట్లు, ఎదురు దాడులు చాలా స్పష్టంగా మనకు తెలుస్తాయి. ప్రధానంగా బ్రాహ్మణ అగ్రహారీకుల గురించే చిత్రించినా.. సంఘటనల రూపేణా ,వైదిక-నియోగుల విభేదాలు,ఆచార వ్యవహారాలు,భావ వైరుధ్యాలు, రెడ్డివారు, కమ్మ దొరలు, క్షత్రియ (రాజుల) కుటుంబాలు, భ్రటాజులు, తదితరుల శ్రమలు, దర్పాలు, లౌక్యాలు, సంస్కారాలు, భాషా భెెదాలు సామాజిక అంతస్తుల స్థాయి భేదాలు తారసపడతాయి. అతి చిన్న కాన్వాసు మీద అత్యంత ప్రతిభా విశేషంగా రూపొందిన సజీవ జీవచిత్రం కనుక ..ఈ పుస్తకం మనకు అనేక చోట్ల కళ్లు తెరిపిస్తుంది. కన్నీళ్లు కురిపిస్తుంది. స్ఫూర్తినిస్తుంది. శ్రీపాదవారు శిల వంటి జీవితాన్ని శిల్పంగా ఎలా మలచుకున్నారో శ్రద్ధతో, పూనికతో జీవితాన్ని ఎలా సాధించుకున్నారో తెలుస్తుంది. ఆయన కృషి విలువ తెలియాలంటే మనం ఆనాటికి ముందున్న చారిత్రిక నేపధ్యాన్ని తెలుసుకోవాలి.
గోదావరి ప్రాంతం కరువు, తుపానులతో దయనీయంగా వుండేది. ‘భూమి శిస్తు కట్టడమే దండగ’ అని అనేక గ్రామాల్లో వ్యవసాయం కూడా చేసేవారు కాదు. కాస్త మెరుగయిన జీవితం కోసం ప్రజలు తమ నివాసాలు మార్చుకుంటూ ఉండేవారు. కుటుంబాలు ఇతర గ్రామాలకు తరలివెళుతుండేవి. బ్రాహ్మణ కుటుంబాలు ఇందుకు మినహాయింపేమీ కాదు. (శ్రీపాద వారి పూర్వీకులు , తల్లిదండ్రులు కూడా ఇలా ఇక్కట్లు పడ్డవారే) ఆయా కులాల వారు తమతమ కులవృత్తులు, విద్యలు నేర్చుకుంటూ, వారస త్వంగా వస్తున్న ఆచార వ్యవహారాల పరిధిలో బతుకు లీడుస్తుండేవారు. కష్టమో, నిష్టూరమో ఉన్నదాంతో సర్దుకుని పెద్దల, గ్రామ పెద్దల, మాటల చట్రంలో ఒదిగి బతుకుతుండేవారు. దీనికి తోడు పరాయి పాలన బరువు. ఆ పాలకుల ప్రయోజనాలు, అవస రాలు, అభిప్రాయాలకు అనుగుణంగా ప్రభుత్వ చర్యలు.. మత మార్పుడులు, విద్యలు,కళలు అన్నింటా వారి ప్రభావం ఉండేది. గోదావరి మీద ధవళేశ్వరంలో 1852 కల్లా ఆనకట్ట వచ్చింది. 1855కి కృష్ణా నదికి ఆనకట్ట నిర్మించారు. దాంతో కాలవల ద్వారా సాగు..ఇక వ్యవసాయ రంగంలో అనేక మార్పులు ..ఉత్పత్తులు పెరగడం..మిగులు సంపాదన వైపు అడుగులు పడటం జరిగింది. రైతు కుటుంబాలలో..ముఖ్యంగా బ్రాహ్మణతర కుటుంబాలలో చదువుకోసం, ప్రభుత్వ ఉద్యోగం కోసం, ఆరాటం మొదల య్యింది.అనేకచోట్ల మిషనరీలు, కిరస్తానీ మతప్రచారం, ఆసు పత్రులు, విద్యాలయాలు మొదలుపెట్టారు.విస్తరించారు. విద్యార్థులకు ధనికులు ఉదార దృష్టితో ఆర్థిక సహాయం (విద్యా దానం)అందించడం ఒక స్థాయిలో పెరిగింది. అప్పటి వరకు ఉన్న శిథిలమవుతున్న గురుకుల విద్యా వ్యవస్థ అదీ బ్రాహ్మణ కుటుంబాలలోనే అమలవుతున్న స్థితి విచ్ఛిన్నమవుతోంది.
దివిజగంగను భువికి పారించిన భగీరథ ప్రయత్నానికి తక్కువ కాని చిరదీక్షా తపస్సమీక్షణ ఫలితమే శ్రీపాద తెలుగుకథ ఆవిష్కరణ. కథ పాశ్చాత్య సాహిత్యరూపమని, పాశ్చాత్య విద్య ద్వారానే దాన్ని అవగతం చేసుకోగలమని వాదించిన వారికి భిన్నంగా తెలుగు జీవితాన్ని ,మధురమైన తెలుగుతో కథల బస్తాలకెత్తిన వాడు, జాతి ఆత్మగౌరవాన్ని ఎత్తిపట్టినవాడు, ప్రతిభా సమున్నతుడు శ్రీపాద. రాజకీయ స్వాతంత్య్రం కోసం పోరాటం , సాంఘిక సంస్కరణోద్యమాలు ఆనాటి జీవన స్రవంతిలో రెండు ప్రధాన పాయలు. వాటి ఫలితంగా వ్యక్తుల జీవితాల్లోనూ ,ఆచరణలోనూ వస్తున్న మార్పులు ఎన్నో..శ్రీపాదలో తలెత్తిన వ్యక్తిగత మార్పులను వాటికి ప్రోది చేసిన వ్యక్తుల ఊహల ఊసులు,వాళ్ల వ్యక్తిత్వాలు ,వాళ్లు ఇచ్చిన ఊతం, సాయం ఎంతో సంస్కారయుతంగా చిత్రించారీ రచనలో ..శిఖలు తీసి క్రాఫింగులు పెట్టుకోవడం, ఒంటిమీద చొక్కాలు ధరించడం, పొరుగూరు వెళ్లినపుడు హోటళ్లలోభోజనం చేయడం, నాటకాలు ఆడటం, నాట్యాలు చూడటం, సంగీతం పాడటం లాంటి (ఈనాటి) అతి సాధారణ వ్యవహారాలు కూడా సదాచార వైదికులు చేయరానివిగా,నీతి దూరమైనవిగా నట, విట, కవి, గాయకులను పంక్తి బాహ్యులుగా చూసే స్థితులన్నింటినీ ఈ శ్రీపాద చిన్నవాడు ఎంతో దృఢచిత్తంతో ఎదిరించాడు. కుటుంబ కట్టుబాట్లను వ్యతిరేకిస్తూ తన అభీష్టాలను సాధించుకున్నాడు. అప్పుడు జరిగిన భావ సంఘర్షణ ఎంత చికాకు కలిగించినా తన పథం వీడలేదు.మాండలికాలలో ఉన్న సొగసు, సొబగు, వ్యక్తీకరణ, ఆయా ప్రాంతాలలో జనసామాన్యం వాడుకలో ఉన్న పదాల అర్థ సంపన్నతకు ఎంతో పరవశించేవారు. ఈ భిన్నత్వమంతా ప్రతిఫలించేదే పటిష్టమయిన తెలుగు అని భావించేవారు. ” జాతీయమైన తెలుగుభాష నేర్చుకోవాలంటే స్త్రీల దగ్గరే నేర్చుకోవాలి. అది పరభాషలతో సంకరం కాని పలుకు బడుల భాష. పురుషుల భాషలో కంటే స్త్రీల భాషలో మాధుర్యము, హృదయాలను పట్టివేసే జాతీయత కనపడింది నాకు” అని తన మధురమైన తెలుగు నుడికారం నేర్చుకున్న విధానం తెలిపారు. ఆ రోజుల్లో వచ్చిన మదనకామరాజు కథలు, అరేబియన్ నైట్సు, యవన యామినీ కథలు, భోజకాళిదాస కథలు, భట్టి విక్రమార్క కథలు, చార్‌దర్వీష్ కథలు, రేచుక్క పగటిచుక్క కథలువంటి కథల పుస్తకాలు కంటపడినవన్నీ ఈయన చదివేశారు. వాటిల్లో తెలుగు భాష చాలా అసహ్యంగా ఉండేది. అయినా కథ చెప్పడం..ఆసక్తి కరంగా చెప్పడం ఎలానో తెలుసుకోవడానికి అవి చదివేవారు. ‘
” సంస్కృత సాహిత్యం అంటనివాడే తెనుగున ప్రవేశిస్తాడు”,” చచ్చు తెనుగు పోనిస్తూ”అన్నారు కొందరు .అయినా తెనుగు చదువుతూ , కథలు రాయడమూ మొదలుపెట్టారు. ‘తెలుగు భాష చచ్చుదయితే మరి తెనుగు జాతి? పైగా తెలుగువాడే ఇలా అనడమా’ అని మహా కసి పుట్టింది. ఆ కసి నుండే ప్రసన్న కథా యుక్తి వెలువడింది. కులము, వేశ్యకాంతలు అనే వీరేశలింగం గారి ఉపన్యాసాలు చదివి దాంతో శుద్ధ ప్రచ్ఛన్న బ్రహ్మ సామాజికుడిగా అయిపోసాగారు కానీ ‘స్వాంతంత్య్రము లేదు. ఎదిరించే సత్తా లేదు. ..లోపల్లోపల ప్రతీకార భావము చాటుచాటుగా ఆచార బహిష్కారము’ జరిగిపోసాగాయి. ఈ ఎదిరించే లక్షణం తోటే అనేక గ్రంథాల మీద ఇది వరకు ఎవరూ చేయని రీతిలో విమర్శలు రాశారు. మహాభారతం మీద, కొన్ని చారిత్రక నవలల మీద సృజనాత్మకమైన విమర్శలు చేశారు. చారిత్రక గాధలు భారత సంస్కార దర్పణాలుగా, భారత వీరుల విశిష్ట ప్రవృత్తి జాతికి ఉద్దీపనగా సాహిత్య సృష్టి జరగాలని భావించారు. ఈ ప్రయత్నంలో ప్రభుత్వ వ్యతిరేకంగా అనిపించే అభిప్రాయాలు ప్రకటించారు. వీరపూజ గ్రంథం ప్రకటించడానికి ‘ప్రభుత్వం రాజద్రోహ నేరమారోపిస్తుందేమో’నని కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గారు తటపటాయిస్తుంటే, వారికి చిక్కులు రావడం తన కిష్టం లేదంటూనే శ్రీపాద వారు ” వల్ల కాదంటే ఈ గ్రంథమే ప్రకటించడం మానుకుంటాను కానీ నా సిద్ధాంతాలు, నా ఆక్షేపణలు మారుకోనూ, ఉపసంహరించుకోను”అని విస్ఫష్టంగా చెప్పారు. దేశంలో అన్ని భాషాజాతుల మధ్య సామరస్యం, సమాన గౌరవం పెంపొందించడానికి ,జాతీయులు ఆత్మగౌరవంతో తమ తమ మాతృభాషలను, సంస్కృతులను పరిరక్షించుకోవడానికి కావలసిన ఆత్మస్థైర్యం, స్ఫూర్తి కలిగిస్తుంది శ్రీపాద సుబ్రహ్మణ్యం గారి అనుభవాలు రచన. ప్రతికూల పరిస్థితులలో వ్యక్తి తన అభిలాషలను సాధించడానికి చూపించ వలసిన తెగువ, పూనిక , ప్రయత్నాలను సోదాహరణంగా ఎతి ్తచూపుతుంది ఈ జీవిత కథ . ఒక శతాబ్ద కాలంలో తెలుగుదేశంలో వచ్చిన సాంస్కృతిక మార్పులను అవగతం చేసుకోవడానికి చరిత్రను అర్థం చేసుకోవడానికి తప్పక చదవవలసిందీ ఆత్మకథా కథనం.

