|
రవీంద్రనాథ్ టాగోర్ నవల ‘ఘర్ బాహిరె’ నూరు శరత్తులు పూర్తి చేసుకొని కాల పరీక్షలో నెగ్గింది. టాగోర్ 1915లో తూర్పు బెంగాల్ (ఇప్పటి బంగ్లాదేశ్ ప్రాంతం)లోని సెలియాధా లో ఉంటూ ఈ నవలను పూర్తిచేశారు. టాగోర్ రేడికల్ మిత్రులు నిర్వహిస్తున్న ‘సబుజపత్ర’ పత్రికలో 1915-16లో ఈ నవల ధారావాహికగా అచ్చయింది. నిఖిలేశ్, అతని భార్య బిమల- వారి జీవితాల్లో ప్రవేశించి సంక్షోభం సృష్టించిన సందీప్ ప్రేమవ్యవహారం నేపథ్యంలో- టాగోర్ స్వదేశీ ఉద్యమాన్ని చిత్రించారు. టాగోర్ భావించిన నిర్మాణాత్మక స్వదేశీ ఉద్యమానికి నిఖిలేశ్ ప్రతినిధైతే, హింసాయుతంగా మారిన తీవ్ర ఉద్యమానికి సందీప్ ప్రతినిధి. ఉద్యమ నేపథ్యంలో టాగోర్ ఈ నవలలో సీ్త్రల సమస్యలు, విద్య, కుల సమీకరణలు, జాతీయవాదం మొదలైన అంశాలను చర్చించారు.
పాఠకుల వివేచనకు పదునుపెట్టే సంక్లిష్టమైన నవల ఇది. నవల ధారావాహికగా వెలువడుతున్న రోజుల్లోనే బెంగాలీ భద్రలోకం ఆ నవలను తీవ్రంగా విమర్శించింది. భారత నారీధర్మాన్ని, ఆదర్శాలను టాగోర్ పరిహసించాడని ఆరోపణ. ఈ నవల కాలాన్ని గుర్తుచేసుకుంటే ఆయన సీ్త్రలు పడ్డ సంఘర్షణను, బాధలను, దుఃఖాన్ని, వాటి కారణాలను చక్కగా విశ్లేషించారనిపిస్తుంది.
స్రాయ్ లార్డ్ కర్జన్ పరిపాలనా సౌలభ్యం నెపంపెట్టి బెంగాల్‌ను రెండుగా విభజించాడు. దేశీయుల్లో అప్పుడప్పుడే ననలువేస్తున్న స్వేచ్ఛాకాంక్షను, ఉద్యమస్ఫూర్తిని మొగ్గలోనే తుంచడానికి వలసపాలకులు ‘విభజించి పాలించు’ సూత్రాన్ని అమలు చేశారు. దేశ సమగ్రతకు భంగం కలిగించే మత, కుల, జాతి వైరుధ్యాలను పెంచి పోషించి పబ్బం గడుపుకున్నారు. బంగ విభజనతో దేశ ప్రజలు, ముఖ్యంగా బెంగాలీయులు పెద్ద ఎత్తున స్వదేశీ ఉద్యమాన్ని కొనసాగించారు. ఇదే వందేమాతరం ఉద్యమ నేపథ్యం. టాగోర్ మొదట ఉద్యమంలో పాల్గొన్నా, తర్వాత ఉద్యమాన్ని వ్యతిరేకించారు. తన కళ్ళముందే వెర్రితలలు వేసిన ఉద్యమ సంఘటనలను, చరిత్రను ఆయన ‘ఘర్ బాహిరె’ నవలగా రూపొందించారు.
దురదృష్టవశాత్తు ఆనాటి రాజకీయ నాయకులు, సాహిత్యవేత్తలు భారతీయ సంస్కృతిని, భారతీయ భాషలను, గత వైభవాన్ని అతిగా భావించుకొని ఆకాశానికెత్తారు. ఈ మిథ్యా గర్వం, మితిమీరిన జాతీయభావన భారతీయ సమాజం అంతర్ముఖీనమై తన లోపాలను సవిమర్శగా పరిశీలించుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. ప్రాచీనభావజాలాన్ని నిరంకుశంగా రుద్దడానికి ప్రయత్నించిన కొత్తరకం నిరంకుశత్వాన్ని టాగోర్ నిర్భయంగా వ్యతిరేకించడమే కాక, ఆధునిక దృక్పఽథాన్ని, ఒక మానవీయ దృక్పథాన్ని ఈ నవలలో ప్రతిపాదించారు. గోరా నవలలో ప్రధానపాత్ర నవల ముగింపునకు వచ్చేసరికి జీవితవాస్తవంతో సమాధానపడుతుంది. ‘నేను సాధారణ భారతీయుణ్ణి. ఇప్పుడు నాలో ఏ ఘర్షణా లేదు. హిందువులకు, మహమ్మదీయులకు, క్రైస్తవులకు మధ్య సంఘర్షణ లేదు. అందరూ నా వాళ్ళే. నేను వాళ్ళందరికీ చెందుతాను’. ఈ సత్యాన్ని గోరా తనలో ఆవిష్కరించుకుంటాడు. ఈ ఆలోచనాధారనే, భావజాలాన్నే టాగోర్ ‘ఘర్ బాహిరె’ నవలలో కొనసాగించారు.
నిఖిలేశ్ చిన్నపాటి జమీందారు. అతని బాల్యంలోనే తల్లిదండ్రులు చనిపోతారు. నాయనమ్మ గారాబంగా పెంచుతుంది. నిఖిలేశ్ అన్నలిద్దరికీ నాయనమ్మ జాతకాలు, నక్షత్రాలు చూపించి గొప్ప సౌందర్యవతులతో పెళ్ళి జరిపిస్తుంది. అన్నలిద్దరూ వ్యసనాలకు బానిసలై యవ్వనంలోనే పోతారు. పెద్దవదిన ఆధ్యాత్మిక జీవనాన్ని ఎంచుకొంటుంది. చిన్నవదిన జీవితంమీద ఆసక్తి కోల్పోదు. నాయనమ్మ నిఖిలేశ్‌కు ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన బిమలతో పెళ్ళి జరిపిస్తుంది. అందరూ జమిందారి బంగళాలో ఉంటారు. టాగోర్ ఈ నవలను పాత్రల స్వగతాల రూపంలో, పాత్రల దృష్టికోణం నుంచి రచించారు. ఈ పద్ధతిని ఇంగ్లిషు నవలాకారులు విడిచిపెడుతున్న సమయంలో టాగోర్ ఈ విధానాన్ని నవలామాధ్యమంగా గ్రహించారు. ఇందులోని పాత్రలు అంతర్‌దృష్టితో తమ జీవితాన్ని, బతుకు బాధలను పాఠకుల ముందు పరుస్తాయి. బిమల, నిఖిలేశ్, సందీ్‌పల ప్రతిస్పందన ఉత్తమపురుషలో సాగుతుంది.
బిమల స్వగతంతో నవల మొదలవుతుంది. ఆమె సంప్రదాయ భద్రలోకానికి ప్రతినిధి. పతిసేవే జీవితాదర్శంగా భావించిన తల్లి ఆమెకు ‘రోల్‌మోడల్’. నిఖిలేశ్ కలకత్తా విశ్వవిద్యాలయంలో ఎంఏ చదివిన విద్యావంతుడు. పాశ్చాత్య రాజకీయ, ఉదార మానవతా భావాలు అతనిలో బలంగా నాటుకుంటాయి. తన భార్యను పరదా నుంచి వెలుపలికి తెచ్చి, ఆమెను విద్యావతి, సంస్కారవతి చెయ్యాలనే కాంక్షతో ఇంగ్లీషు దొరసానిని ట్యూటరుగా నియమిస్తాడు.
తన జమిందారి కేంద్రం ‘సుఖ సాయర్’లో కళాశాల విద్యార్థులు లేవదీసిన ‘స్వదేశీ’ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న సందీ్‌ప అనే తన పాతమిత్రుణ్ణి నిఖిలేశ్ భార్య బిమలకు పరిచయం చేస్తాడు. అతను నిఖిలేశ్ బంగళాలోనే ఉంటూ సెలవులకు ఊళ్ళకు వచ్చిన విద్యార్థి కుర్ర గుంపును వెంటవేసుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తాడు. సందీప్ ఉద్వేగపూరితమైన ఉపన్యాసాన్ని విన్న బిమల స్వదేశీ ఉద్యమం పట్ల అభిమానం పెంచుకుంటుంది. తన వాక్చాతుర్యం, ఆకర్షణీయమైన రూపంతో ఒక రంగుల కల సృష్టించి, సందీప్ బిమలను తన మాయాజాలంతో సమ్మోహితురాలిని చేస్తాడు.
స్వదేశీ ఉద్యమానికి ముందే నిఖిలేశ్ స్వదేశీ వస్తూత్పత్తి, సహకార ఉద్యమాలతో చేతులు కాల్చుకొని, వాటిపట్ల భ్రాంతిని తొలగించుకున్నాడు. స్వదేశ ఉద్య మం బెంగాలీయులను మతం, కులం ప్రాతిపదికన చీల్చివేసిందని, బెంగాలీ నిరుపేదలను నిట్టనిలువుగా చీల్చివేసిందని, ఉద్యమం ముస్లింలకు ‘నామ’ శూద్రులకు (శూద్రుల్లో ‘తక్కువ’ కులాలవారు) చెడుపు చేస్తుందని అతను గ్రహిస్తాడు. పేదల జీవనోపాధిని లాగివేసుకోవడంలో, జీవించే హక్కును నిర్మూలించడంలో ఉద్యమం ఒక సాధనంగా మారిందని కూడా అతడు భావించాడు. జమిందార్లు, భూస్వాములు పేదప్రజలకు వ్యతిరేకంగా లేవదీసిన కుట్రగా ఉద్యమాన్ని వ్యాఖ్యానించుకొంటాడు. తన జమిందారి ప్రాంతంలో విదేశీవస్తువులను నిషేధించమని ఉద్యమకారులు కోరినపుడు ‘మీ నిర్ణయాన్ని బలవంతంగా ప్రజలమీద రుద్దకండి’ అని సమాధానమిస్తాడు.
ఉవ్వెత్తున లేచిన ఉద్యమకెరటాలమీద స్వారీ చేస్తూ, అవకాశాన్ని అందిపుచ్చుకొని సందీప్ సెల్ఫ్‌స్టైల్డ్ లీడర్‌గా చెలామణి అవుతూంటాడు. నిఖిలేష్ అతిథిగా ఉంటూ బిమలను ఆకర్షించి, ఆమెను ఉద్యమానికి స్ఫూర్తిగా, ఊపిరిగా వర్ణించి భారతమాత ఆమె రూపంలో సాక్షాత్కరించిందని నిస్సిగ్గుగా భర్త సమక్షంలోనే కీర్తిస్తాడు. బిమల అతని మాయాజాలంలో చిక్కుకునిపోతుంది. ‘ఉద్యమానికి అవసరం’ అంటూ అతను అడగగానే బిమల అన్ని బాధ్యతలను, వివాహ బంధాన్ని పణంగా పెట్టి తన వంటిమీది నగలనే కాక, భర్త ఇనప్పెట్టెలోంచి కూడా బంగారు నాణాలు దొంగిలించి అతని దోసిట్లో పోస్తుంది. ఆ డబ్బు ఉద్యమం కోసం కాదు, అతని అవసరం కోసం అని సందీప్ అనుచరుడిద్వారా విన్న ఆమె భ్రమలన్నీ తొలగిపోతాయి. అప్పటికే తన పొరపాటును సరిదిద్దుకొనే అవకాశం చేజారిపోతుంది.
‘ఘర్ బాహిరె’లో రెండు ఉప కథలున్నాయి. ‘పంచు’ నామశూద్రుడు. భార్య వైద్యం, కర్మకాండలు వగైరా ఖర్చులకు ఉన్న భూమిని పోగొట్టుకొని నిరుపేదలు నివసించే ప్రాంతాల్లో సలీసయిన విదేశీ ఉన్నిబట్టలు, ఇమిటేషన్ నగలు అమ్మి జీవిస్తుంటాడు. పంచూకు మిగిలిన చిన్న భూమినీ, అందులో ఉన్న ఇంటినీ కాజేయడానికి భూస్వామి హరీశ్‌కు ఉద్యమం ఒక సాఽధనం అవుతుంది. భూస్వామ్య వ్యవస్థ, స్వదేశీ ఉద్యమం, సాంస్కృతిక జాతీయవాదం పంచూమీద దాడిచేస్తాయి. ఉద్యమం మొదలవగానే బెంగాల్లో ముస్లింల పరిస్థితి దిగజారుతుంది. భూస్వాములు ‘ఈశ్వరబత్తి’ పేరుతో ముస్లిం కౌలుదారులనుంచి ప్రత్యేక పన్ను వసూలు చేస్తారు. ఆ కరువురోజుల్లో ధనరూపంలో కాక, ధాన్యరూపంలో శిస్తు చెల్లించాలని కొత్తగా డిమాండ్ చేస్తారు.
గ్రామీణప్రాంతాల్లో జమిందార్లు, భూస్వాములు ఉద్యమంలో పాల్గొనడం ఒక ఉటోపియన్ ఆదర్శం మాత్రమే. భూస్వాములు, కౌలుదార్ల మధ్య సంబంధాలలో మార్పురాలేదు. మీర్‌జాన్ వంటి పేదముస్లింలు విదేశీనూలు, విదేశీ చవకబట్టలు, ఉన్ని వస్త్రాలు అమ్మి బ్రతికే పేదలు. ‘సుఖసాయర్’ సంతలో వాళ్ళు ఉన్ని వస్త్రాలు అమ్మకూడదని ఉద్యమకారులు ఆదేశించినపుడు పేద వ్యాపారులు తమ కష్టాలు చెప్పుకుంటారు. దేశం కోసం అన్నీ త్యాగం చెయ్యాలని సందీప్, అతని వెంట ఉన్న విద్యార్థులు వాదిస్తారు గాని, వీళ్ళకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను గురించి ఆలోచించరు. మీర్‌జాన్ వంటి వాళ్ళు ఉద్యమకారులను ధిక్కరిస్తారు. ఉద్యమకారులు మీర్‌జాన్ పడవను ధ్వంసం చేస్తారు. పంచూ బట్టల మూటను దగ్ధం చేస్తారు. పంచూ ఇంటినీ, తోటనూ హరీశ్ పరంకాకుండా నిఖిలేశ్ గురువు చంద్రనాధబాబు అడ్డుకోగలుగుతాడు.
హిందూ, ముస్లింల మధ్య హింసాపూరిత ఘర్షణలు మొదలు కాగానే సందీప్ ప్రాణభయంతో కలకత్తా పారిపోతాడు. గిరీశం మానసపుత్రుడులాగా ఇతడు మనకు అనిపిస్తాడు. ఘర్షణల్లో యువ ఉద్యమకారుడు అమూల్య చనిపోతాడు. ఘర్షణలను నివారించడానికి వెళ్ళిన నిఖిలేశ్ గాయపడి, చావుబతుకుల మధ్య ఊగిసలాడుతున్నట్లుగా చెప్పి టాగోర్ ఈ నవల ముగింపును పాఠకుల ఊహకే విడిచిపెడతారు. బిమల వితంతువయిందా? నిఖిలేశ్ కోలుకున్నాడా? వాళ్ళ సంసారం కుదుటపడిందా? సత్యజిత్ రే ‘ఘర్ బాహిరె’ సినిమాలో వితంతు రూపంలో ఉన్న బిమలను చూపి సినిమాను ముగించారు. పాఠకుల వివేచనకు పదునుపెట్టే సంక్లిష్టమైన నవల ఇది. నవల ధారావాహికగా వెలువడుతున్న రోజుల్లోనే బెంగాలీ భద్రలోకం ఆ నవలను తీవ్రంగా విమర్శించింది. భారత నారీధర్మాన్ని, ఆదర్శాలను టాగోర్ పరిహసించాడని ఆరోపణ. అప్పట్లో బెంగాలీ నవలను ఇంగ్లీషులోకి అనువదిస్తున్నప్పుడు కొన్ని మార్పుచేర్పులు జరిగాయి. కానీ, 1980 దశకంలో బెంగాలీ మాతృకకు యధాతథమైన, ప్రామాణికమైన ఇంగ్లీష్ అనువాదం వచ్చింది. అలాగే, ‘ఇంటా బయటా’ పేరుతో 60-70 ఏళ్ళకిందే ఈ నవల తెలుగు అనువాదం అందుబాటులోకి వచ్చింది.
టాగోర్ ఈ నవలను ఏభైయేళ్ళ వయసులో రాశారు. ఆ వయసులో మనుషులు సాధారణంగా సంప్రదాయం వైపు మొగ్గుచూపుతారు. టాగోర్ ప్రయోగాత్మక సృజనాత్మక ఈ నవలలో గొప్పగా అభివ్యక్తమయింది. ఆయన మార్పువైపు చూపుసారించడం గమనిస్తాం. ఈ నవలలో సీ్త్రల సమస్యలు, కులసమీకరణలు, జాతీయవాదం చర్చకు వచ్చాయి. అందువల్లే ఈ నవలకు ప్రాముఖ్యం తగ్గలేదు. సంప్రదాయవాదులు ఈ నవలలో టాగోర్ నైతిక పతనాన్ని చిత్రించారని నిందించారు. ఇప్పుడు సీ్త్రవాదులు ‘ఘర్ బాహిరె’ నవలలో సీ్త్ర పాత్రలను ’ఖీడఞజీఛ్చిజూజూడ ఝ్చఛ్ఛీ జ్ఛఝజీుఽజీట్ట’ అని తేలిక చేయడం కూడా లేకపోలేదు. టాగోర్ ఈ నవలను, కధలను రాసిన కాలాన్ని గుర్తుచేసుకుంటే ఆయన తన రచనల్లో సీ్త్రలు పడ్డ సంఘర్షణను, బాధలను, అనుభవించిన దుఃఖాన్ని, వాటి మూల కారణాలను విశ్లేషించారనిపిస్తుంది. సమస్త మానవాళిలోని మంచి తనాన్ని తన తాత్వికతలో సంలీనం చేసుకొని రచనల ద్వారా అభివ్యక్తం చేశారని తోస్తుంది.
– కాళిదాసు పురుషోత్తం
9247564044
|


