సరసభారతి శ్రీ మన్మధ ఉగాది వేడుకలు
‘’నవ్యాంధ్ర ప్రదేశ్ ‘’పై కవి సమ్మేళనం
76 వ సమావేశం గా సరసభారతి 15-3-15 ఆదివారం సాయంత్రం 4 గం .’లకు ఉయ్యూరు ఏ సి లైబ్రరీలో నిర్వహించిన ‘’శ్రీ మన్మధ నామ సంవత్సర ఉగాది వేడుకలు ‘’ఆద్యంతం నవరస భరితం గా జరిగాయి .విచ్చేసిన సాహితీ ప్రియులకు అతిధులకు ,సన్మానితులకు అందరికి ముందుగా ఆత్మీయ అల్పాహార విందు నిచ్చి తేనీరు తో ఎండవేడిలో శ్రమపడి వచ్చినందుకు కొంత ఉపశమనం కల్గి౦చా౦ . ముందే చెప్పినట్లు సరిగ్గా నాలుగు గంటలకు ‘’నవ్యాంధ్ర ప్రదేశ్ ‘’అంశం పై స్మితశ్రీ చింతపల్లి నాగేశ్వర రావు, శ్రీ దండి భొట్ల దత్తాత్రేయ శర్మ, శ్రీమతి గుడిపూడి రాధికా రాణి ఆధ్వర్యం లో కవి సమ్మేళనం ప్రారంభించాం . ఇందులో స్మితశ్రీ గారిది పండిన అనుభవమైతే దత్తాత్రేయ శర్మగారిది హాస్య చతుర సంభాషణా భరితం .గుడిపూడి ది బుడి బుడి నడకల అరంగేట్రం .ముందుగా మహిళలకు ప్రాధాన్యత నిచ్చి తర్వాత పురుష కవులకు అవకాశమిచ్చాం .కవులు తమ తమ ద్రుష్టి కోణం లో నవ్యాంధ్ర ప్రదేశ్ ఏర్పడిన తీరు తెన్నులు ,ఇప్పుడు అనుభవిస్తున్న పరిస్తితులు ,మిన్ను విరిగి మీద పడినట్లు హూద్ హూద్ తుఫాను సృస్టించిన విలయం దాన్ని తట్టుకొని ఆంధ్రజాతి నిలబడిన తీరు నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం వగైరా విషయాలపై నిర్మొహమాటం గా తమ మనోభావాలను చక్కని చిక్కని పది పంక్తులలో,నాలుగు పద్యాలలో ,పాటలుగా వచన కవిత్వంగా కవితలల్లి వినిపించి ఆమని హాయిని ఆరు రోజుల ముందే ఉయ్యూరు పట్టణానికి తెచ్చి నవ వసంతాన్ని చిమ్మారు .కవిత చదవగానే నా చేతులమీదుగాను , కవి సమ్మేళన నిర్వాహకుల చేతుల మీదుగా జ్ఞాపిక అందజేశాం .జ్ఞాపిక కూడా నవ్యాంధ్ర ప్రదేశ్ నేపధ్యం గా బెజవాడ ప్రకాశంబారేజ్ ,తెలుగుతల్లి విగ్రహం ,పైన ‘’చిలక పచ్చని రౌతు మన్మధుని ‘’చిత్రం ,మామిడి పిందెలు ,చిగుళ్ళు ,ఉగాది వేపప్రసాదం ఉన్న రజత పాత్ర ,అన్నిటికి మించి ఉగాది వచ్చిందని తెలిపే కోయిల కూత ,మధ్యలో ఎడమ చివర అడివి బాపిరాజుగారు , తర్వాత మామిడి పూడి వెంకట రంగయ్యగారు ,ఆ తర్వాత పారుపల్లి రామకృష్ణయ్యగారు కుడి చివర దేవుల పల్లి కృష్ణ శాస్త్రి గారు ,వీరికి దిగువన సాహితీ సమరాంగణ సార్వ భౌముడు కృష్ణ దేవరాయలుగారి తో జ్ఞాపిక ను సందర్భోచితం గా తయారు చేసిచ్చారు మా జర్నలిస్ట్ మిత్రుడు ప్రకాష్ .చాలా హుందాగా హృదయంగమం గా జ్ఞాపిక తయారై అందరిని అలరించింది .సుమారు రెండుగంటల సేపు కవి సమ్మేళనం ఆహ్లాదభరితం గా కరతాళ ధ్వనుల మధ్య ప్రశంసా వాక్యాలతో జరిగి విచ్చేసిన కవి బృందానికి అత్యంత ఆనందాన్ని కల్గించిందని వారి వదనాలలో ప్రస్పుటిమ్చిన హావ భావాల వలన తెలిసింది. ధన్యోస్మి అనుకొన్నాను .
గ్రందాల ఆవిష్కరణ
సాయంత్రం ఆరు గంటలకు గ్రంధా విష్కరణ ,పురస్కార ప్రదాన సభ మొదలు పెట్టాం .అధ్యక్షునిగా సరసభారతి ఆవిర్భావం ,ప్రగతిని శ్రీ మైనేని గోపాల కృష్ణగారి వితరణను క్లుప్తం గా వివరించి నేను రాసిన ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’గ్రంధాన్ని శ్రీ మైనేని వారికి అంకితం ఇస్తున్నవిషయం ,గ్రంధ రూపం గా వారి మేనకోడలు డా .శ్రీమతి జ్యోతి ,ఆమె సోదర సోదరీమణులు (అమెరికా)ఖర్చు భరించి వెలువరిస్తున్న సంగతి తెలియ జేశాను .ఈ గ్రంధాన్ని ఆకాశ వాణి హైదరాబాద్ కేంద్ర మాజీ డిప్యూటీ డైరెక్టర్ జెనరల్ మాన్య శ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ గారు ఆవిష్కరించి మొదటి ప్రతిని ఆచార్య శ్రీ శలాక రఘు నాద శర్మ గారికి అందజేశారు . గ్రంధం పై డా .శ్రీ రామడుగు వెంకటేశ్వర శర్మ గారు సంక్షిప్తం గా అందులోని విషయాలను సభా సదులకు అవగాహన కల్గించే రీతిగా మధుర మంజుల వాక్కులతో కవితాత్మకం గా వివరించి నిండుదనం చేకూర్చారు .146 మంది ప్రాచీన ,నవీన గీర్వాణ కవులపై రాసిన గ్రంథమని ,నాలుగు వందలకు పైన పేజీలతో బృహత్తరంగా వెలువడిందని ,రచయిత కృషి ఆదర్శప్రాయమని అన్నారు .శ్రీ రామడుగు వెంకటేశ్వర శర్మగారి అభినందన పద్యాలు
త్యాగి కలం పేరుగల ప్రముఖ హాస్య రచయిత శ్రీ తాడిమేటి సత్యనారాయణ గారు ‘’త్యాగి ‘’పేరే’’డీలు +’పేరిట రాసి ముద్రణ ఖర్చులు భరించి ,సరసభారతి ద్వారా ప్రచురించిన పుస్తకాన్ని కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు ఆవిష్కరించి మొదటి ప్రతిని నాకు అందజేశారు .దీనిని ప్రముఖ కవి కధకురాలు శ్రీమతి కోపూరి పుష్పాదేవిగారు సంక్షిప్త పరిచయం చేశారు .ఈ పుస్తకాన్ని స్వర్గీయ బాపు రమణ జంట కు అంకితం ఇవ్వటం ఏంతో సముచితం గా ఉందని వారిద్దరి పేర అంకితమిచ్చిన మొదటి గ్రంధం గా ఆంద్ర దేశం లో చిరస్తాయిగా నిలిచి పోతుందని అన్నారు .ఇందులోని పేరడీలు ,కవితలు రసభరితం అన్నారు . మైనేని వారు బాపు రమణ స్మారక పురస్కారాన్ని ఏర్పరచి సరసభారతి ద్వారా శ్రీ వేదగిరి రాంబాబు గారికి ,శ్రీ శీలా వీర్రాజు గారికి అందజేసి ఆంద్ర దేశం లో ఇలా వారిద్దరి పేరిట మొట్టమొదట పురస్కారం అందించిన ఘనత పొందాం .ఇప్పుడు ఈ అంకితానికీ మేమే ముందున్నాం .గీర్వాణం ,పెరేడీలు రెండు గ్రంధాలను హాజరైన సదస్యుల౦దరికి అందజేశాం .రామడుగు వారి ముందుమాటలు ‘
ఉగాది పురస్కార ప్రదానాలు
స్వర్గీయ శ్రీమతి గబ్బిట భవానమ్మ శ్రీ మృత్యుంజయ శాస్త్రి గారల స్మారక ఉగాది పురస్కారప్రదానం
సాయంత్రం ఆరున్నరకు శ్రీ మన్మధ నామ సంవత్సర ఉగాది పురస్కార ప్రదానం ప్రారంభించాం .ముందుగా మా తలిదంద్రులైన స్వర్గీయ శ్రీమతి బ్బిట భవానమ్మ ,శ్రీ మృత్యుంజయ శాస్త్రి గరాల స్మారక ఉగాది పురస్కారాన్ని మాన్యశ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ గారికి ప్రత్యేక ఆసనం పై ఆసీనులను చేసి నుదుట కుంకుమ బొట్టు పెట్టి ,చందనం చేతులకు అలిమి ,తాంబూలాన్ని ఫల భరితం గా అందజేశాం నేనూ నా శ్రీమతి ప్రభావతి .తర్వాతా సెంట్ చల్లి శాలువా కప్పి పుష్పహారాన్ని వేసి నూతన వస్త్రాలుగా పంచ ఉత్తరీయ౦ అందజేసి నగదున్నకవర్ చేతిలో ఉంచి, జ్ఞాపిక నందజేసి శిరసుపై గులాబీ రెక్కల వాన కురిపించి మా గౌరవాన్ని చాటుకున్నాం .మా ప్రక్కన వేదికనలంకరించిన పెద్దలందరూ నిలబడి వేడుక చేసి తామూ గులాబి రేకులను చల్లి మధురానుభూతి కలిగించారు .ఈ సంఘటన చిరస్మరణీయం గా నిలిచింది .ముందుగా నేనే శ్రీ ఆదిత్య ప్రసాద్ గారిని సభకు వారి సేవలను ప్రస్తుతిస్తూ ఆహ్వానించి ఆసీనులను చేశాను .సంగీత సరస్వతిని సన్మానించిన అనుభూతి గొప్పగా కలిగి కనులు చెమర్చాయి .
తర్వాత ఆచార్య శ్రీ శలాక రఘునాధ శర్మగారిని శ్రీమతి మాదిరాజు శివ లక్ష్మి వారి పాండిత్య వైదుష్యాన్ని వివరిస్తూ వేదికపైకి ఆహ్వానించింది .మా దంపతులం శ్రీ శర్మగారికి పైన పేర్కొన్న విధంగానే అదే రీతిలో ఘనం గా సన్మానించి సర్సాభారతి ప్రచురణలన్నీ అందించాం .గీర్వాణ వాణిని సత్కరించిన మధురానుభూతికి లోనయ్యాం .
పిమ్మట కృష్ణాజిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తి కొండ సుబ్బారావు గారి సాహితీ ప్రస్థానాన్ని విశదీకరిస్తూ శ్రీ జి వేణుగోపాల రెడ్డి ఆహ్వానించారు .ఉచితాసనాసీనులను చేసి పైన చెప్పిన తీరునననే శ్రీ సుబ్బారాగారిని సత్కరించి మా సహ్రుదయతను ఆత్మీయతను ,ఆప్యాయతను సాహిత్య సభా నిర్వహణ సామర్ధ్యానికి అందించిన పురస్కారం గా భావించాం .
గీర్వాణ గ్రంధానికి ‘’అంత రి౦ద్రజాలం ‘’పేర ముందుమాటలు రాసి ,వేదిక పై గ్రంధాన్ని పరిచయమూ చేసి నాకు అత్యంత ఆప్తులైన డా .శ్రీ రామడుగు వెంకటేశ్వర శర్మగారి కవితా శ్రేస్టతను వారుపొందిన పురస్కారాలను వివరిస్తూ శ్రీ మాదిరాజు శ్రీనివాస శర్మ గారు ఆహ్వానించారు .శ్రీ శర్మగారికీ పై రీతిగానే ఘనం గా సత్కరించి మా అభిమానాన్ని చాటు కోన్నాం.తెలుగు కవితా సరస్వతీ సత్కారం చేశామని సంత్రుప్తిపొందాం .
చివరగా ఆచార్య శ్రీ మన్నవ సత్యనారాయణగారి సాహితీ గరిమను విశిష్టతను వివరిస్తూ శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి ఆహ్వానించారు .మన్నవ వారిని ఉచితాసీనులను చేసి పై విధం గా అన్ని హంగులతో సత్కరించి మా కున్న గౌరవాన్ని చాటుకున్నాం .అంతర్ ద్రుష్టి తో లోకాన్ని చదివి విద్యార్ధుల జ్ఞాన నేత్రాలను వికసింప జేసిన విశిష్ట సాహితీ మూర్తిని సంమాని౦ చామని మహదానందాన్ని పొందాం .
శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ శ్రీమతి ప్రభావతి గారల ప్రోత్సాహక ఉగాది ప్రత్యెక పురస్కార ప్రదానం
ముందుగా ‘’స్వయం సిద్ధ ‘’పురస్కారాన్ని శ్రీమతి పెద్దిభొట్ల సౌభాగ్యవతి గారికి చందన తాంబూలాది సత్కారాలతో ,పుష్పాహారం తో చీరే జాకెట్ లతో శాలువాతో మేమిద్దరం మిగిలిన అతిధుల సహకారం తో అందజేసి సత్కరించాం .శ్రీమతి శివలక్ష్మి ఈమెను సభకు పరిచయం చేసింది .
ఉయ్యూరు పోస్ట్ మాస్టర్ శ్రీ గొట్టుముక్కల రామారావు గారిని ,మన చానల్ రిపోర్టర్ శ్రీ రాజా గారిని స్థాయి ఏమాత్రమూ తగ్గకుండా అందరికీ చేసినట్లే సన్మానించి వారి విశిష్ట సేవలను అందరికి తెలియ జేశాం .
సభ మధ్యలో ఉయ్యూరు ప్రధమ పౌరులు ఉయ్యూరు నగర పంచాయితీ చైర్మన్ శ్రీ జంపాన పూర్ణ చంద్ర రావు గారు విచ్చేసి సభకు నిండుదనం చేకూర్చారు .ఇంతమంది మహా కవి పండితులమధ్య తానూ కూర్చోవటం జీవితం లో మరచిపోలేని ఘట్టం అన్నారు .దుర్గాప్రసాద్ గారు తనకు బాగా తెలుసునని ఇంత పాండిత్యం ఆయనకు ఉందని ఇంతమంది చెప్పే దాకా తానూ తెలుసుకోలేక పోయానని అని అందరి సన్మానాలు స్వయం గా దగ్గరుండి జరిపించి ఆనందాను భూతి పొందారు .సన్మానాలు అయ్యేసరికి గులాబీ రేకుల రాసి పోగై అందరి మనసులలో సంతోష గులాబీలు వికసించి నట్లయింది .
ప్రసంగ ప్రశంశలు
శ్రీ ఆదిత్య ప్రసాద్ గారు మాట్లాడుతూ ‘’ఇలాంటి అనుభూతి తనకు చాలా తక్కువ చోట్ల మాత్రమె లభించిందని ఇక్కడి వీరి ఆత్మీయతకు మాటలు రావని సహృదయం తో చేసే సరసభారతి కార్యక్రమాలకు ఎన్నిటికో తానూ హాజరయ్యానని ,దుర్గాప్రసాద్ గారితో ఆత్మీయ మైత్రీ బంధం చాలా కాలం నుండి ఉంది’’అని ఆనందంగా చెప్పారు .శ్రీ శలాక వారు ‘’తెలుగును మరచిపొవద్దని ,తనది బెజవాడ దగ్గర గొల్లపల్లి అని కృష్ణా జిల్లా వాసినని ఆకిరిపల్లి సంస్కృత కళాశాల విద్యార్దినని తమ వ్యాకరణ గురువు పేరి వారు ప్రపంచం లోనే గొప్ప వ్యాకర వేత్త అని వారిని మించిన వారు లేనే లేరని ,వారి శిష్యుడిని అని చెప్పుకోవటం అందరికి గర్వకారణమని ,ఆకళాశాల స్థాపకుల తల్లిగారు నిరాడంబరం గా జీవిస్తూ కళాశాల విద్యార్ధుల భోజబాలు అయ్యాయి అన్న గంట వినబడిన తర్వాతే భోజనం చేసేవారని అంతటి ఆదరణం విద్యార్ధులపై ప్రేమ ఎక్కడా చూడ లేదని కృతజ్ఞతా భావం గా తెలియజెసి ఉయ్యూరు లొ తనకు జరిగిన సన్మానం స్వంత ఇంట జరిగినట్లు ఉంది అని సంతోషం గా చెప్పారు .శ్రీ గుత్తికొండ సుబ్బారావు సరసభారతి తాము ఎన్నో కార్యక్రమాలను కలిసి నిర్వహించామని ,ఉయ్యూరు అంటే తమకు సరస భారతి దుర్గాప్రసాద్ గారే గుర్తుకోస్తారని ఇక్కడి వారి ఆత్మీయత ముగ్ధులను చేస్తుందని ఏది చేసినా అంకితభావం తో చేయటం ప్రత్యేకత అని అన్నారు .శ్రీ రామదుగు వారు దుర్గాప్రసాద్ పై అభినందన పద్యాలు రాసి చదివి వినిపించి ప్రత్యేకమైన అనుభూతిని అందరికి కలిగించారు. ఆచార్య మన్నవ గారు తమకూ సరసభారతికి ఉన్న అనుబంధాన్ని గుర్తుకు చేసుకొన్నారు ఇక్కడి వాతావరణం ఏంతో ఆహ్లాదం గా ,సహృదయం గా ఉందని కృతజ్ఞతలు తెలిపారు .శ్రీమతి సౌభాగ్య లక్ష్మి ఇందరి సమక్షం లో తనను ఆహ్వానించి గౌరవించి సత్కరించిస్వయం సిద్ధ పురస్కారం అంద జేసినందుకు ‘’ఆంటీ అంకుల్ ‘’లకు కృతజ్ఞతలు అన్నారు .పోస్ట్ మాస్టారు శ్రీ రామా రావు గారు తమ పనిలో తామెప్పుడూ మునిగి ఉంటామని ,కాని అదొక సేవగా దుర్గా ప్రసాద్ గారు గుర్తించి పోస్టాఫీస్ చేస్తున్న సేవలకు ఈ విధం గా గౌరవం కృతజ్ఞత కలిపించి సిబ్బంది అందరి తరఫున తనను సత్కరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు .మన చానల్ రిపోర్టర్ శ్రీ రాజా ‘’సరసభారతి శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం కార్యక్రమాలన్నిటిని తాను వచ్చి రికార్డ్ చేసి మన చానల్ లో ప్రసారం చేశామని ఈ సంస్థ మర్యాదకు మన్ననకు తానూ పరవశించి పోతానని రిపోర్టర్ కు ఇంతటి ప్రాధాన్యతను కల్పించే సంస్కారం సహృదయత దుర్గా ప్రసాద్ గారిలో ఉందని చెమరించిన కనులతో ఆనందాన్ని వ్యక్తీకరించారు .చివరగా కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్య దర్స్ది డా జి వి పూర్ణ చంద్ ‘’ఇంతటి సహృదయ వాతావరణం లో ఇంతమంది విశిష్ట సంగీత సాహిత్య కవి పండితులను స్వయం గా అభివృద్ధి చెంది ఆదర్శం గా నిలిచినా వారిని నిత్య జీవితం లో ఉద్యోగాలలో ఉంటూ విశిష్ట సేవలు చేసేవారిని గుర్తించి సత్కరించటం అపూర్వ విషయమని దుర్గాప్రసాద్ గారు రాష్ట్ర దేశ పరిధులు దాటి అంతర్జాతీయ ఖ్యాతిని అందుకొని ఉయ్యూరుకే గర్వ కారణం అని ,సరసభారతి ప్రతి కార్యక్రమాన్ని నిర్దుష్టం గా మహా విశిష్టంగా నిర్వహిస్తుందని 75 ఏళ్ళ వయసులో ప్రసాద్ గారు ఒక ముఖ్య కార్య కర్తగా ,గ్రంధ రచయితగా వక్తగా ,బ్లాగుల నిర్వాహకునిగా విభిన్న పాత్రలలో రాణిస్తూ తమందరికి ఆదర్స్ధం గా ఉన్నారని తెలిపారు .
లైబ్రేరియన్ శ్రీ సంపత్ కుమార్ గారికి ,శ్రీమైనేని గోపాల కృష్ణగారికి ఆంధ్రా యూని వర్సిటీలో సహాధ్యాయి ,గురజాడ మాజీ సర్పంచ్ ,ప్రముఖ సంఘ సేవకులు ,జ్ఞాన వయో వృద్ధులు శ్రీ గురజాడ వెంకటేశ్వర రావు గారిని సత్కరించాం ‘’శ్రీ గురజాడ వారు’’సరస భారతి కార్యక్రమాలకు అబ్బుర పడి ప్రోత్సాహం గా సంస్థకు 1,000 రూపాయలు కానుకగా అందజేశారు కృతజ్ఞతలు ..గండిగుంట వాసి ,నాగార్జున విశ్వ విద్యాలయ మాజీ లైబ్రేరియన్ ప్రస్తుత హైదరాబాద్ నివాసి శ్రీ సుంకర కోటేశ్వర రావు గారు నెల రోజుల ముందే సరసభారతికి రెండు వేలరూపాయలు (2,000-)చెక్ పంపి ప్రోత్సహించారు .వారికి కృతజ్ఞతలు . . శ్రీ గురజాడవారికి , మాకూ మిత్రులు శ్రీ వీణెం గోపాల క్రిష్ణయ్యగారికి ,మాజీ డ్రిల్ మాస్టారు మా గురువుగారు శ్రీ ఎస్ వి సుబ్బా రావు గారికి ,శ్రీ వి బి జి రావు ,శ్రీమతి శివలక్ష్మి ,శ్రీనివాస శర్మ ,,వేణుగోపాల్ ,మొదలైన వారందరికీ పుష్పహారాలు వేసి జ్ఞాపికలను అందజేశాం .దాదాపు నాలుగు గంటల సేపు సభ చాలా నిండుగా సుమారు తొంభై మంది హాజరీతో దేదీప్యమానం గా జరిగి అందరికి సంతృప్తి ని కలిగించి సరసభారతి ధన్యమైంది .
సభ అనంతరం పైన అందరికి విందు ఏర్పాటు చేశాం .పదార్ధాలు బాగా రుచికరం గా ఉన్నాయని మెచ్చి తృప్తిగా అందరూ భోజనం చేయటం మాకు ఎంతో సంతృప్తిని సంతోషాన్ని కల్గించింది .ఇలా మా ఉయ్యూరు కు ఆరు రోజుల ముందే ఉగాది శోభ సరసభారతి కలిగిస్తే మా కవితాకోవిలలు కూడా ముందే హాయిగా నవ్యాంధ్ర ప్రదేశ్ లో నవ వసంత గానం చేసి పరవశాన్ని కల్గించాయి .శుభం భూయాత్ .
సందట్లో సడేమియా
ఎప్పుడూ ప్రార్ధన తో మొదలు పెట్టి ,జాతీయ గీతం తో ముగిసే మా సభలు ఈ సారి ఆ రెండూ’’పర’’వశం లో మర్చిపోయి గొప్ప తప్పే చేశాం . అంతా అయ్యెదాకా గమనించక పోవటం నాదే ప్రధాన దోషం అని సవినయంగా నా తప్పును ఒప్పుకొంటున్నాను .
పిలిచిన అతిదులలో శ్రీ వై వి బి ,శీ చలసాని ,శ్రీకలిమిశ్రీ లు పురస్కార గ్రహీతలలో ‘’శ్రీకళాసాగర్ ,శ్రీమతి శిరీష ,,శ్రీ బాషా ,శ్రీ ఫజులాల్ మొయిద్ శ్రీమతి శ్యామలాదేవి ‘’పే’’రెడీ’’ రచయితా ‘’రెడీ’’ గా రాకపోవటం బాగా నిరాశ పరిచింది .
ప్రపంచ సభలలో ఉయ్యూరు కవి సమ్మేళనానికి మేమొస్తాం మా పేరు రాయండి అని మరీ అడిగి రాయించుకొని ,ఆహ్వాన పత్రం లో పేరు చేర్చినా దాదాపు సగం మంది పైగా కవులు రాకపోవటం కొంత బాధ కలిగించింది .ఎవరికారణాలు వారికి ఉంటాయి .ఇంతే అని సరి పెట్టు కోవటమే మంచిది .
ఉగాది వేడుకలను ఇంటర్నెట్ ఉన్నవారందరూ చూసే వీలుగా లైవ్ అంటే ప్రత్యక్ష ప్రసారం చేసే ఏర్పాట్లు చేశాం .దూరప్రాంతాలవారు విదేశాలలో ఉన్న తెలుగువారూ చూసి సంతోషించారు .కొందరు ప్రసారం బాగా ఉంది అంటే కొందరు వీడియో’’ భేష్’’ ఆడియో ‘’ట్రాష్ ‘’అని సన్నాయి నొక్కులు నొక్కారు .ఎక్కువ మందినే సంతృప్తి పరిచింది అని అని పించింది .సరసభారతి కార్యవర్గ సభ్యులు ఇచ్చిన చక్కని సహకారం మరువలేనిది అందరికి కృతజ్ఞతలు .అందరి సమష్టి కృషి ఈ విజయానికి కారణం .’’వన్ మాన్ షో ‘’గా ఉండకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోన్నాననే అనుకుంటున్నాను .తీర్పు చూసిన వారు చెప్పాల్సిన విషయం .
హై టెన్షన్
వ్యవధి రెండు నెలలో లోపే ఉంది మాకు ఈ రెండు గ్రందాల ముద్రణకు .శ్రీ చలపాక ప్రకాష్ గారింట్లో కుమార్తె వివాహం మార్చి 7 వ తేదీ తో బిజీ బిజీ .అయినా పట్టు వదలని విక్రమాదిత్యునిగా పుస్తకం డి టిపి చేయించి ,ముద్రణకు సమయానికి అందించి ఫోటోలుపెట్టి , కవర్ పేజీ డిజైన్ శ్రీకళాసాగర్ తో చేయించి, చివరి వారం రోజులూ పగలూ రాత్రీ విశ్రాంతి కూడా తీసుకోకుండా మాకోసం శ్రమించి పుస్తకాలను రెడీ చేయించారు .బెజవాడలో పేరడీలను శుక్రవారం రాత్రికి ఏ యెన్ ఎల్ పార్సిల్ సర్వీస్ లో పంపితే అవి శనివారం ఉదయానికి రావాల్సింది రాలేదు నేనూ ప్రకాష్ గారు ఇక్కడి పార్సిల్ సర్వీస్ ఆతను ఫోన్ల మీద ఫోన్లు పోద్దుటినుంచీ చేస్తూనే ఉన్నాం . శని వారం మధ్యాహ్నం పంపిస్తామని బెజవాడ వాళ్ళు చెప్పటం తర్వాత అక్కడ ఆఫీసులో ఇన్ కం టాక్స్ వారి రైడింగ్ ఉందని కనుక పంపలేదని తెలియటం తో మాకు హై టెన్షన్ వచ్చింది .చివరికి ఆది వారం అంటే సభ జరిగే రోజు పొద్దున పంపితే ఉదయం పదింటికి వచ్చాయి .అప్పుడు వెళ్లి తెచ్చుకొని ఆవిష్కరణకు పదిపుస్తకాలు పాక్ చేయించాను .
ఇక అసలైన గీర్వాణం గ్రంధాలు చాలా పెద్ద సైజు కనుక వాటిని అదే పార్సెల్ సర్వీస్ లో వేస్తె ,అందవు అని నేనూ ప్రకాష్ అనుకోని ,సభరోజు ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఆటోలో పంపే ఏర్పాటు చేసుకోన్నాం .అవి సరిగ్గా రెండు గంటలకు ‘’కులాసాగా’’ చేరాయి .వాటినీ పది కాపీలుఆవిష్కరణకు పాక్ చేయించాను ..మొత్తం మీద శని, ఆదివారాలంతా టెన్షనే టెన్షన్.హై టెన్షన్ . అన్నీ తీరిపోయి మధ్యాహ్నం రెండుగంటలకు ఊపిరి పీల్చుకొన్నాం .ఇంతహడావిడి ఇంతవరకు ఎప్పుడూ లేదు .శ్రీ చలపాక ప్రకాష్ గారికి ఏమిచ్చి మా ఋణం తీర్చుకో గలం “?ఆయన సౌజన్యం సౌహార్ద్రతలకు జేజేలు పలకటం తప్ప .?మంచి మనీషి శ్రీ ప్రకాష్ .అలాంటి వారు నాకు, శ్రీ మైనేనిగారికి పరిచయమవటం మా అదృష్టం .సరసభారతి అదృష్టం .
శ్రీ మన్మధ ఉగాది శుభాకాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -17-3-15- ఉయ్యూరు

