ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -21

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -21

11-     లిటరరీ రియలిజం కు ఆద్యుడు గుస్టేవ్ ఫ్లాబర్ట్

‘’మంచి ,చెడు అనే విషయాలు శైలీ అనేవి  లేవు .వస్తువులను మనం చూసే దృష్టిని బట్టే అవి ఏర్పడతాయి .’’అని ఫ్లాబర్ట్ అన్నా కూడా ఆయన రాసిన సబ్జెక్ట్ వల్లనే ప్రసిద్ధి చెందాడు .ఇదే ఆయన వ్యతిరేకులకు విమర్శనాయుధం గా మారింది కూడా .ఫ్రాన్స్ దేశం లో నార్మండిలోని రోఎన్ లో 12-12-1821న అక్కడే స్తిరనివాసం గా ఉంటున్న ఫిజీషియన్  చీఫ్ సర్జన్ అయిన తండ్రికి జన్మించాడు .తల్లి తండ్రి అయిన తాతకూడా గ్రామ వైద్యుడే .అందుకే పాత్రలను చక్కగా వైద్య రీతిలో కత్తిరించి సొగసు చేకూర్చగాలిగాడు ఫ్లాబర్ట్ . ఫ్రెంచ్ ‘’లిటరరీ రియలిజం కు ఆద్యుడు ఫ్లాబర్ట్ .మొదటినవల ‘’మేడం బావేరి ‘’తో విఖ్యాతుడయ్యాడు.అనితర సాధ్యమైన శైలీ విన్యాసం ,సౌందర్య దిదృక్ష ఫ్లాబర్ట్ సొంతం  .’అన్న అచిల్లీ తండ్రి వారసత్వాన్ని నిలబెట్టి డాక్టర్ అయ్యాడు .దీనికి విరుద్ధం గా ఫ్లాబర్ట్ చిన్నతనం నుండి రచనా వ్యాసంగం లో ఉన్నాడు .స్నేహితుడికి ఒక ఉత్తరం ఆనాడే రాస్తూ తనతోకలిసి రచనకు చేయూతనిమ్మని కోరాడు .ఫ్లాబర్ట్ యవ్వన దశలో ఆల్బర్ట్ లీ పోటేవిన్,లూయీ బుల్ హెర్ట్ ,మాక్సిం డు కాంప్ లతో సాన్నిహిత్యం పెంచుకొన్నాడు .అందులో ఆల్బర్ట్ 27 ఏళ్ళకే చనిపోతే తట్టుకోలేక పోయాడు .లూయీ కవి .మాక్సిం జర్నలిస్ట్ .

19 వయసులో లా చదివాడు .ఆ పాఠ్య గ్రందాలంటే  విపరీతమైన విసుగు ,అసహ్యం వచ్చింది  .సివిల్ కోడ్ ను ‘’నాన్సెన్స్ ‘’అన్నాడు .నాటక శాలకు క్రమం తప్పకుండా హాజరవుతూ దానిపై వ్యామోహం పెంచుకొన్నాడు .తనకొచ్చే అలవెన్స్ డబ్బులన్నీ సరదాగా దీనికే ఖర్చు చేసేవాడు .స్త్రీ వ్యామోహం లో మాత్రం పడలేదు .కాని మిగిలిన జల్సాలన్నీ అనుభవించాడు .అందం గా ఆకర్షణీయం గా ఫ్లాబర్ట్ ఉండటం తో అమ్మాయిలూ బాగానే ‘’వలపుల వల’’ విసిరే ప్రయత్నాలు చేసేవారు.’’యువ గ్రీకు  వీరుడు ‘’గా ఉండేవాడని మనసుపారేసుకొన్న ఒకావిడ అన్నది .అతనిది ‘’హీరోయిక్ బ్యూటీ ‘’.రోమన్ సైనికులతో వీరోచితం గా పోరాడిన ‘’గాలిక్ చీఫ్ ‘’లాగా ఉండేవాడని ఒకామె కామెంట్ చేసింది . అప్పటికే ఫ్లాబర్ట్ ఒక సారి లోతుగా ప్రేమ వ్యవహారం లో దిగి కూరుకుపోయాడు. పదిహేనేళ్ళ వయసులో కుటుంబం తో వేసవిని ట్రౌవిల్ లో గడపటానికి వెళ్ళినప్పుడు పెళ్లి అయి, పిల్లను సాకుతున్న ఇరవై ఆరేళ్ళ ఎలీషా స్లీసిన్గర్ అమ్మాయి కి మనసు పారేసుకొన్నాడు .ఆమె భర్త మన ప్రేమపిచ్చోడి వాలకం కనిపెట్టి తనతో నౌకాయానం చేయించాడు .ఆరేళ్ళ తర్వాత పారిస్ లో చదువుతున్నప్పుడు ఆ దంపతులుఒక  సాయం వేళ తమతో గడపటానికి ఆహ్వానించారు .సిగ్గుల మొగ్గై ముడుచుకు పోయాడుకాని ఆంతర్యాన్ని ఆవిష్కరించలేక పోయాడు ఫ్లాబర్ట్ .ఆమె మాత్రం ఇతని నిజాయితీని ,నిష్కపట ప్రేమను, ఆరాధనను గుర్తించింది .ఆమె జీవితం లో చోటు చేసుకోలేక పోయినా జీవితాంతం ఎలీషా అంటే పరమ ప్రేమారాదనాభావం మాత్రం వదలలేదు .ఆ తర్వాత మూడేళ్ళ దాకా ప్రేమా సెక్సూ లేకుండానే గడిపేశానని రాసుకొన్నాడు .చచ్చేదాకా అలానే ఉన్నానని ఎక్కడో రాసుకొన్నాడు .కాని 23 ఏళ్ళదాకా వర్జిన్ బాయ్ లానే ఉన్నాడు .కాని ఒక పని చేసే అమ్మాయితోనో లేక ఏదో హోటల్ లో ఉంటె వేరొక అమ్మాయితోనో ఒక రాత్రి గడిపాడు అనే పుకారు పారిస్ అంతా షికారు చేసింది .

చదువు మీద దృష్టిపెట్టి ఉన్నా ,అది అబ్బక పరీక్షలు తప్పాడు .ఏదో తన్ను ఆవహించిన ఫీలింగ్ లో ఉండేవాడు .దాని నుంచి బయటపడినప్పుడు ఆ విషయాలను తెలియ జేసేవాడు .యేవో కాంతులు మెరుపులు అస్పష్ట ధ్వనులు అపస్మారక స్తితిలో వినిపించేవని చెప్పేవాడు .ఇవి ప్రముఖ అమెరికన్ రచయిత ఎడ్గార్ అలెన్ పో,సెయింట్ తెరెసా ,జర్మన్ పో అనిపించుకొన్న ఇ టి ఏ హాఫ్మన్ ల  ఫాంటసీ కధల్లా అనిపించేవి . .ఇతన్ని పరీక్షించిన డాక్టర్లు మూర్చ లక్షణం కాదని అతని ప్రవర్తన ‘’A plethora vitality ‘’అన్నారు ఇదే క్రమంగా హిస్టేరియో –ఎపిలెప్టిక్ ‘’ ఎటాక్స్ గా మారతాయని చెప్పారు .దీనికి తండ్రి చేసిన వైద్య ప్రక్రియ దారుణం గా ఉండేది .రక్తం వచ్చేట్లు కొట్టేవాడు అన్నం లేకుండా మాద్చేసేవాడు ఎప్పుడూ తలనిండా స్నానాలు చేయించేవాడు ..ఈ లక్షణం ఫ్లాబర్ట్ బతికి ఉన్నంతకాలం వెటనంటే ఉండి పోయింది పాపం .తల్లి నిరంతరం అతన్ని కనిపెట్టుకొనే ఉండేది .ఇవన్నీ నెర్వస్ వీక్నెస్ కు, దానినుంచి డిప్రెషన్ కు  దారి తీశాయి .చాలాకాలం తర్వాత జీవితం అంటే తనకు భయమేస్తోందని జార్జ్ సాండ్ కు తెలుపుకొన్నాడు .

సంపాదించిన సొమ్ముతో తండ్రి క్రాసేట్ లో ఒక ఇల్లుకోనుక్కొని కుటుంబాన్ని  ప్రక్రుతి సౌందర్య విలసిత ప్రదేశానికి మార్చాడు ఒకటి రెండు సార్లు తూర్పు దేశ పర్యటనలు తప్ప మిగిలిన కాలమంతా ఫ్లాబర్ట్ ఇక్కడే గడిపాడు .ఒక్కమాటలో చెప్పాలంటే ‘’ఇంట్లోనే ఉండి  రాశాడు ‘’.కొద్దికాలం తర్వాత తండ్రి కేన్సర్ తో మరణించాడు .కొన్ని నెలల తర్వాత సోదరి ప్రసవించి చనిపోయింది .ఈ రెండూ కు౦గ దీశాయి ఫ్లాబర్ట్ ను .దురదృష్టం వెంటాడుతోంది అని భావించాడు .లోపల ఏదో ఆందోళన భయ పెడుతోంది .మేకుల బూట్ల తో మనుషులు విపరీత శబ్దం చేస్తూ మేడ మెట్లు దిగుతున్నట్లు ,సోదరి కరోలిన్ నల్ల వస్త్రదారణ తో తలనిండా గులాబీలతో  చాలా పొడవుగా కనిపించినట్లు భావించేవాడు .

ప్రాడీర్ స్టూడియో లో గడపటానికి పారిస్ వెళ్ళినప్పుడల్లా లూయీ కోలేట్ ను కలిసేవాడు .అప్పటికే ఆమెకు పెళ్లి అయి  ఆరేళ్ళ కూతురు తో ముప్ఫై ఏళ్ళ వయసులో ఉండేది .మనవాడివయసు ఇరవైనాలుగు.ఆమె సెలెబ్రిటి అనిపించేది .భర్తనుండి విడాకులు పొంది ఫిలాసఫర్ ఎకడేమీషియన్ అయిన విక్టర్ కజిన్స్ కు మిస్త్రేస్ గా ఉన్నది .ఆయన ప్రోత్సాహం తో ఆమె అనేక అకాడెమీ ప్రైజులను కవిత్వానికి పొందింది .ఆమె తానను తాను  ప్రాచీన గ్రీకు కవయిత్రి సాపో గా భావించుకొనేది .ఆమెను అందరూ గొప్ప ప్రేరకురాలిగా భావించేవారు .కజిన్స్  ఫ్లాబర్ట్ ను ఆమె అపార్ట్ మెంట్ కు ఆహ్వానించాడు .తనకవిత్వాన్ని కమ్మగా చదివి వినిపించి మురిపించింది .ఇలా కొంతకాలం జరిగి ఇద్దరూ ప్రేమలో పడిపోయారు .ఫ్లాబర్ట్ ను పారిస్ వచ్చి ఆమెతో ఉండిపొమ్మని కోరిందామే .స్వంత ఇంటినీ ఊరిని తల్లినీ వదిలి వెళ్లాలని పించలేదు ఫ్లాబర్ట్ కు. ‘’ప్రేమించటం కంటే ప్రేమించబడటం  ‘’కు ఫ్లాబర్ట్ ప్రాధాన్యత నిస్తాడు .అప్పుడప్పుడు వెళ్లి లూసీ దర్శనం చేసి సంతృప్తి పడేవాడు .ఆమెతో తరచూ ఉత్తర ప్రత్యుత్తరాలు రాస్తూ ఉంటానని వాగ్దానం చేసి నిలబెట్టుకొన్నాడు ఫ్లాబర్ట్ .

 

Inline image 1

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-3-15 –ఉయ్యూరు .

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.