రాజకీయ ‘మన్మథులు’

రాజకీయ ‘మన్మథులు’

  • 15/03/2015
  • – కృష్ణ తేజ

తెలుగునేలపై ఉగాది శోభ వెల్లివిరుస్తోంది. లేలేత మావిచిగుళ్లు తిన్న కోకిలలు కుహూ కుహూ అంటూ గొంతు సవరించుకుంటున్నాయి. వేపపూల గమ్మతె్తైన వాసన గుబాళిస్తోంది. గున్నమామిడి కొమ్మలకు పిందెలు అందంగా వేలాడుతున్నాయి. హోలీరంగుల్లో ఆడిపాడి అలసి సొలసిన తెలుగు లోగిళ్లకు మామిడాకుల తోరణాలు కొత్త కళ తెస్తున్నాయి. విపణివీధిలో తెలుగు పంచాంగాల అమ్మకాలు జోరందుకున్నాయి. పంచాంగ శ్రవణం, కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, రాజపూజ్యావమానాలు, ఆదాయ వ్యయాలు, కందాయఫలాల వివరాలకోసం తెలుగువారు ఆసక్తి చూపిస్తున్నారు. షడ్రుచులతో ఉగాది పచ్చడి నోరూరిస్తోంది. కవిసమ్మేళనాల సంరంభానికి తెరలేచింది. ప్రభవాది అరవై తెలుగు సంవత్సరాలలో ఇప్పుడు మన్మథనామ సంవత్సరంలో మనం అడుగుపెడుతున్నాం. పేరులో ఉన్న అందం…జీవితంలోనూ ఉంటే బాగుంటుందని అందరి ఆశ. సగటుజీవి చూపంతా ఆదాయ వ్యయాల పైనే ఉంటుంది. మధ్యతరగతి మనిషి ఆలోచనలన్నీ వీటితోపాటు రాజపూజ్యావమానాల చుట్టూ తిరుగుతూంటాయి. సంపన్నుల దృష్టి ఉగాది వేడుకలపై ఉంటుంది. సాహితీవేత్తలు, కవి పండితులు, పంచాంగకర్తల మనసంతా ఉగాది వర్ణన, మంచిచెడుల విశే్లషణపై నిలిచి ఉంటుంది. వీటన్నింటికి భిన్నం రాజకీయ ఉగాది వేడుకలు. రాజకీయ పార్టీలు వేటికవి పంచాంగశ్రవణాన్ని విన్పిస్తున్నాయి. ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే పంచాంగ శ్రవణంలో ప్రభుత్వానికి జరిగే మంచిపైనే ఫలితాలుంటాయి. ఈ మన్మథ నామ సంవత్సరంలో రాజకీయ నాయకుల మనసు ఎలా ఉంటుంది. ఉగాది ఫలితాలపై వారేమనుకుంటున్నారు…రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య నేతల మనోభీష్టం ఎలా ఉంది. ఓ సారి సరదాగా ఊహించుకుని, వాటికి అక్షర రూపం ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనే ఈ వ్యాసానికి ప్రాణం పోసింది. హాస్యప్రియులైన తెలుగువారి మనోల్లాసంకోసం ఓసారి నేతల మనసులలోకి తొంగిచూద్దాం. కెసిఆర్ జయనామ సంవత్సరంలో అడుగుపెట్టినప్పుడే చెప్పా. వచ్చే ఉగాది తెలంగాణలోనే జరుపుకుంటామని. కేసిఆర్ మాటంటే మాటే. నేనామాట అన్నప్పుడు పిచ్చోనిలెక్కన చూశారు. ఇప్పుడేమైంది? మన్మథ నామ సంవత్సరం మనది. బిడ్డల త్యాగఫలితంగా వచ్చిన తెలంగాణ గడ్డపై తొలిసారి మన ఉగాది మనం జరుపుకుందాం. అలాగని జయనామ సంవత్సరం మనకు తక్కువచేయలే. జయం మనదే. మన్మధుడూ మనవాడే. మన పంచాంగం మనమే తయారుచేసుకుందాం. ఏం మన నేలపై పండితులకు కొదవా. పాండిత్యానికి కొదవా. యాదాద్రి, భద్రాద్రినుంచి అయ్యవార్లను రాయమంటే రాయరా. పంచాంగశ్రవణం అంటే మన బిడ్డలు చెవికోసుకోరా. మంచిచెడులు చెప్పే చేవ మనకు లేదా. సోయిలేనోనికి తప్ప మనకేం తక్కువ. అయినా ఇందులో ఎవరు చెప్పేదేముంటుంది. నేనే చెబుతా. ఇక మనకు అంతా మంచే. మన పరిపాలనలో మనకు అవమానాలు ఏంది? ఆ రోజులు పోయినై. అంతా రాజపూజ్యమే. రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడితే తెలంగాణ గల్లాపెట్టె గలగలలాడుతుందని నేను చెప్పలేదా. అది ఇప్పుడు నిజం కాలేదా. మన దగ్గర డబ్బున్నప్పుడు ఇక ఆదాయవ్యయాల లెక్కలు తెలుసుకునేదేంది. మన బిడ్డలకు అంతా ఆదాయమే. బిడ్డా…డబ్బుందని లెక్కాజమా లేకుండా ఖర్చుపెట్టొద్దు. నా లెక్కలు నాకుంటయి. మన బిడ్డలకు ఎక్కువ తక్కువ చేయం. మాటతప్పని నేను దేవుడి మొక్కులన్నీ తీర్చిన. ప్రకృతి కూడా మనకు సాయం చేయాలనే దేవుడికి మొక్కుతున్నా. ఏవరేమనుకుంటరన్న భయం మనకేంది. మన పంచాంగశ్రవణం మన పండితులు చెబుతారు. మంచిచెడ్డలు విని మసలుకోవాలే. మన ఉగాది పచ్చడి తెలంగాణ గడ్డమీద పండిన వస్తువులతోనే చేసుకోవాలె. మన జగిత్యాల మామిడికన్నా ఏ మామిడి బాగుంటది. మన ఆదిలాబాద్ అడవుల్లో పండిన చింతపండుకన్నా రుచి దేనికుంటది. మన నిజామాబాద్ నేలపై విరగబూసిన వేపపూవులో చేదు ఉన్నా, ఆ పూల పరిమళం మనకు తీపిగుండదా. ఆ నేలపైనేకదా మన చెరకు తీపవుతున్నది. గుంటూరు మిర్చికేనా ఘాటున్నది. మన నల్లగొండ నేలలో పెరిగిన మిరపకాయకు కారం తక్కువా. మనకు పౌరుషం తక్కువా. మన ఆలోచనల్లో, మన భావనల్లో ఎదుగుదల రావాలె. మనకు మనం బాస్‌లమన్న భావన పెరగాలే. మన మనసులను ఆ దిశగా మన్మథ నామ సంవత్సరం మలచాలె. మన్మథ నామ సంవత్సరం తెలుగువారిది. తెలంగాణలో ఉన్న తెలుగువారికి అది..ఆది ఉగాది. ఆంధ్రోళ్లు, సీమాంధ్రులు, సెటిలర్లనేవి పిచ్చిమాటలు. నే చెబుతున్నా…మన ఉగాది పచ్చడి వీరికి నేనే స్వయంగా పంచుతా. తెలంగాణ ఉగాది పచ్చడి రుచి చూపిస్తా. మన మనసులోని మమత చాటుతా. గతం మర్వాలె. అంతా కలిసి మనగలగాలె. ఇందులో రాజకీయం లేదు. నేనేమీ టీఆర్‌ఎస్ ఉగాది చేస్తున్నానా. తొలి తెలంగాణ ఉగాది చేసుకోమంటున్నా. ఇందులో తప్పేముంది. పనిపాటాలేని ప్రతిపక్షాలకూ ఇదే చెబుతున్నా…పండగ చేసుకుందాం. పండగలో పాలిటిక్స్ వద్దు. వినకపోతే మీఖర్మ. మన తెలంగాణ మనకు వచ్చాక, జనం వారి తీర్పు చెప్పాక, మీ తీరు మారకపోతే ఏం చేస్తాం. మంచిగ చేసిన మన ఉగాది పచ్చడి తిని, మన పండితులు చెప్పిన మంచిమాటలు విని మన భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవాలె. కాదంటే కేసీఆర్ ఒప్పుకుంటాడా. వెంకయ్యనాయుడు రెండు తెలుగు రాష్ట్రాలకు మన్మధ నామ సంవత్సరం మంచి చేస్తుందని విశ్వసిస్తున్నా. ప్రత్యేక హోదా దక్కలేదని ఆంధ్ర ఉగాది వేడుకలను మరచిపోనక్కర్లేదు. ప్రధాని మోదీ మనతోపాటు ఉగాది పచ్చడి తిని వేడుకలను రసవంతం చేస్తారు. ఆంధ్రను ఆదుకుంటారు. అసలు రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌ను అనాలి…జయ నామ సంవత్సర ఉగాదికి ఆంధ్రులకు పచ్చడిమెతుకులుకూడా లేకుండా చేశారు. మన్మధలో మేం ఏం చేద్దామన్నా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ముందు చంద్రబాబు కొత్తపంచాంగం చూడాలి. గ్రహగతులను బట్టి ముందడుగు వేయాలి. కొత్త రాష్ట్రం అన్నాక రాజపూజ్య అవమానాలు తప్పవు. రాష్ట్రంకోసం, ప్రజల అభివృద్ధికోసం అవమానాలు దిగమింగాలి. నా వరకు నాకు నాయుడు ముద్రవేసి జయనామ సంవత్సరంలో అవమానించారు. ఇప్పుడిప్పుడే రోజులు మారుతున్నాయి. తిట్టినవాళ్లే కండువాలు కప్పుతున్నారు. చేతులు కలుపుతున్నారు. అభివృద్ధికోసం కలసి పనిచేయడం తప్పదు. అప్పుడు ఉగాది పచ్చడీ కలసి తినొచ్చు. ఇరుగుపొరుగు తెలుగువారు షడ్రుచుల ఉగాది పచ్చడిని ఇచ్చిపుచ్చుకోవాలి. రెండు రాష్ట్రాల నాయకులు ఉప్పూకారం తగ్గించి, కాస్త తీపి ఎక్కువ వేసి పచ్చడి తినాలి. ఆదాయవ్యయాల లెక్కలు పంచాంగ కర్తలకన్నా చంద్రబాబు బాగా నేర్చారు. ఆయనకు మేం కన్పిస్తేచాలు చిట్టా విప్పుతున్నారు. ఇక కేసీఆర్‌కు ఖజానాకష్టాలు లేవు. అంటే ఆంధ్రతో పోలిస్తే తెలంగాణకు ఇబ్బందులు లేవు. ఉగాది సంబరంలో అసలు విషయం మరిచిపోవద్దు. వచ్చే వేసవికి తెలంగాణ చల్లగా ఉండాలంటే ఆంధ్రతో కలిసిమెలిసి పనిచేయాలి. ఏమైనా రెండు తెలుగు రాష్ట్రాలు మాకు సమానమే. తెలుగువారికి రాష్ట్రాలు వేరైనా ఉగాది ఒక్కటే. భాజపా చెప్పే పంచాంగం ఇదే. జానారెడ్డి జయనామ సంవత్సరంలో అరవై ఏళ్ల తెలంగాణ కలం నిజం చేసింది మా పార్టీనే. అయితే మాకు ఏ గ్రహం అడ్డొచ్చిందో తెలీదు. ఫలితం కేసీఆర్‌కు వెళ్లిపోయింది. ఏ గ్రహమో అనుకుని ఏం లాభం. మా గ్రహాలే ఈ పని చేసుంటాయి. ఆ ఎన్నికలప్పుడు నాకు, మా పార్టీకి మంచి జరగలేదు. ఏం చేస్తాం. మన్మథ నామ సంవత్సరమైనా కలిసొస్తుందని అనుకున్నా. సూచనలు అలా లేవు. ఈ ఏడాదికూడా రాజపూజ్యం పూజ్యంలా ఉంది. అవమానం తప్పేట్టు లేదు. పార్టీ పదవి మళ్లీ తప్పిపోయింది. ఇది జయనామ సంవత్సరం ఖాతాలో వేసినా మన్మథ నామ సంవత్సరానికి సంకేతంగా పరిగణించాలేమోనన్న భయం పట్టుకుంది. ఆదాయవ్యయాలతో నాకు పనేం లేదు. ఈ విషయంలో పంచాంగంపై ఆధారపడను. నేను ఒకప్పటి టీచర్‌ను. పాఠాలు చెప్పడం, పాఠాలు నేర్వడం మామూలే. ఎటొచ్చీ ఎవరికి రాజకీయ పాఠాలు చెప్పాలో తేల్చుకునేలోగానే నాకు గుణపాఠాలు ఎదురవుతున్నాయి. నాకన్నా నాలుగాకులు ఎక్కువ చదివినవారు వెళ్లి పదవులు కొట్టేస్తున్నారు. నవ తెలంగాణలో తొలి ఉగాదిని ప్రభుత్వం పెద్దఎత్తున చేయాలి. ప్రతిపక్షానికి అందులో భాగస్వామ్యం కల్పించాలి. ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు ఉగాది జరుపుకుంటే సరిపోదు. అవసరమైతే అసెంబ్లీలో ఈ విషయం మాట్లాడతా. ఉగాదిపచ్చడిలో ఆరు రుచులుంటాయి. నా మాటల్లోను అంతరార్థం అలాగే ఉంటుంది. నచ్చినవాడికి నచ్చుతుంది. నచ్చనివాడికి నచ్చదు. నచ్చినా నచ్చకపోయినా ఉగాది చేసుకోవాలె. చేదు ఉందని ఉగాది పచ్చడి తినడం మానేస్తామా. అది సరికాదు. ఓడిపోయామనో, అధికారంలోకి రాలేదనో, పదవి రాలేదనో బాధపడితే ఉగాది పచ్చడిలోని తీపి చేదుగానే అన్పిస్తుంది. మనసును బట్టి రుచి. మన్మథుడిని బట్టి మనసు. అర్థమైందనుకుంటాను. నా మాట అర్థంకాకపోతే నేనేం చేయగలను. నిజానికి నేను చంద్రుడిలాంటివాడినని చెప్పుకున్నా. అదే తప్పైనట్టుంది. చంద్రుడికి కళ తగ్గినట్లు…నాకు పార్టీ పదవి తప్పిపోయింది. అసలే నా మాట అర్థంకాందంటారు…చాలామంది. ఇప్పుడు నామాట నాకే అర్థం కాలేదు. మన్మథలోనైనా నా మాట అందరికీ అర్థం కావాలి. చంద్రబాబు ఉగాది అయినా, ఉగాది పచ్చడయినా సమపాళ్లలో సరుకులు పడకపోతే రుచి సరిగ్గా ఉండదు. జయనామ సంవత్సరంలో ఆంధ్రకు ఉగాది చేదునే మిగిల్చింది. మనకు రాజపూజ్యం లేదు. అంతా అవమానమే. మనది రెండు పచ్చళ్ల సిద్ధాంతం. రెండు పంచాంగాల సిద్ధాంతం. ఆంధ్రలో పచ్చడి, ఉగాది బాగోలేదని బాధతప్ప, తెలంగాణకు ఉగాది బాగోలేదని, బాగోకూడదనికాదు దీనర్థం. ప్రతిపక్షాలకు పనేముంది. నేనేం చెప్పినా పచ్చడి చేసేద్దామనుకుంటారు. చతికిలపడతారు. జయనామ సంవత్సరంలో మనకు ఆదాయ వ్యయాలూ సరిగాలేవు. మన గల్లాపెట్ట ఖాళీగా ఉంది. రాష్ట్ర విభజనతో వట్టిపోయాం. కేంద్రం సాయం కావాలి. జయ నామ సంవత్సరంలో కేంద్రం వట్టిచేయే చూపింది. మన్మథనామ సంవత్సరంలో కేంద్రం మనసుమార్చేలే ఈ ఉగాది ఉండాలి. ఆదాయవ్యయాల లెక్క చూస్తే గాభరాగా ఉంది. తెలుగువారి లెక్కాజమా పక్కాగా చూస్తా. చేతికి చిల్లిగవ్వ ఇచ్చే అవకాశాలు కన్పించడం లేదు. అయితే ఏదోవిధంగా డబ్బు లేదా బాండు ఇస్తా. మన్మథనామ సంవత్సరంలో రాజపూజ్యం కన్పించడం లేదు. అవమానాలు పూర్తిగా తగ్గిన సూచనలు కన్పించడం లేదు. కందాయ ఫలాలు చూస్తే కంగారుపెడుతున్నాయి. అయితే అంతా పకడ్బందీగా నడిపిస్తున్నా. మన్మథనామ సంవత్సరం మనదే కావాలని ప్రణాళిక ప్రకారం ముందుకెడుతున్నా. ఉగాదిపచ్చడి చేయడం, తినడం, అడ్డొచ్చేవారిని పచ్చడి చేయడం తెలుగువారికి, తెలుగుదేశానికి కొత్తకాదు. తిరుమల వేంకటేశ్వరుడి దయతో ఈ ఉగాది తెలుగువారికి మంచినే తెస్తుందని మనవి చేస్తున్నాను. ఆంధ్రను సింగపూర్‌గా మార్చినా ఉగాదిపచ్చడి మరవను. తుళ్లూరు రూపం మారిపోయినా అక్కడే ఎప్పుడూ ఉగాది చేసే ఏర్పాటు చేస్తా. ఐటీ సాయంతో ఆధునిక ఆంధ్రను తీర్చిదిద్దినా తెలుగుసౌరభమైన ఉగాది వేడుకలను మరవను. తెలుగుదేశం పంచాంగం, తెలుగువారి పంచాంగం రెండూ విన్పించే ప్రయత్నం చేస్తా. అటు తెలంగాణలోనూ అదే ఏర్పాటు చేస్తా. మాకు ఆంధ్ర అభివృద్ధి ముఖ్యం. తెలంగాణ వెలుగు ముఖ్యం. ఎక్కడున్నా తెలుగువారి శ్రేయస్సు ముఖ్యం. అంతేతప్ప, లెక్కాజమా లేకుండా, బొక్కసం నింపుకుని, ఊచలు లెక్కపెట్టొచ్చిన నేతల ఊసరవెల్లి మాటలు నమ్మొద్దు. వారిచ్చిన ఉగాది పచ్చడి తినొద్దు. తెలుగువారికోసం నేను అవసరమైతే ఒకమెట్టు దిగొస్తా. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇచ్చే ఉగాదిపచ్చడి తింటా. నాక్కావలసింది తెలుగువారి భవిష్యత్. అంతేతప్ప ఎక్కడి పచ్చడి అన్నది కాదు. హైదరాబాద్‌లో ఉన్నా ఉగాదిని మాత్రం ఆంధ్రలోనే జరుపుకుంటా. జగన్ ప్రజలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా. అంతా విజయమే అనుకున్నా. జయనామ సంవత్సరం దెబ్బేసింది. అయితే అది బయటకు ఎందుకు ఒప్పుకోవాలి. మా కొత్తపార్టీకి జవసత్వాలు ఇచ్చింది జయ నామ సంవత్సరమే కదా. గతేడాది రాజపూజ్యం, అవమానం సరిసమానమనే అనుకుంటున్నా. ఇక మన్మథ నామ సంవత్సరంలో కొత్తగా వచ్చేదేముంటుంది. కాకపోతే భవిష్యత్‌కోసం మన్మధపైనే ఆధారపడాలి. పంచాంగాలు, పంచాంగశ్రవణాలు నాకన్నా జనానికి అవసరం. ఆంధ్రలో రాజధాని లేదు. ఉద్యోగులకు జీతాల భరోసా లేదు. పేదలు, రైతుల భూములు పోతున్నాయి. ఇక ఉగాది వేడుకలు ఎక్కడ. పచ్చడి తినకముందే చేదెక్కిపోయింది. నేను ఈ మధ్య తుళ్లూరు వెళ్లా. అక్కడి రైతులు ముఖం చూస్తే చేదుమింగినట్లుంది. వేలాది ఎకరాలు భూసేకరణ పేరుతో గుంజుకుంటే..ఆ భూముల్లో మామిడితోటలు ఏమవ్వాలి. కోకిలగానం విన్పిస్తుందా. మన్మధనామ సంవత్సరమేకాదు…ఇక ఏ ఉగాదికీ ఆనందం లేనట్టే. సింగపూర్ తరహా రాజధాని అని చంద్రబాబు అంటున్నారు. సింగపూర్‌లో ఉగాది ఉంటుందా. ఉగాదిలేని సింగపూర్ మనకెందుకు. నేనడుగుతున్నా…ఉషోదయం, మామిడితోటలు, కోకిలకూతలు, చెరకుపంట, బెల్లం తయారీ లేని నగరం అవసరమా. అభివృద్ధి అవసరమే కానీ…మన సంస్కృతిని చెరిపేసే అభివృద్ధి అవసరమా. జనానికి అదే చెబుతున్నా. ఈ ఉగాది సంగతి చెప్పలేనుకానీ వచ్చే ఉగాదిలోగా నేను అధికారంలోకి వచ్చేస్తా. చూస్తూ ఉండండి నేనే మీకు ఉగాది పచ్చడి తినిపిస్తా. అధికారపక్షాన్ని పచ్చడిపచ్చడి చేస్తా. ఆదాయవ్యయాల లెక్కలు నేను చూసుకునే వీలు లేకుండా పోయింది. ఆదాయపన్ను శాఖే నా లెక్క చూస్తోంది. గ్రహాలు ననే్నం చేస్తాయి. నేను తప్పు చేయలేదు. నా పచ్చడి తిని, నాకు వెన్నుపోటు పొడిచి వెళ్లిపోయిన నేతలే నా రోజులు బాగున్నప్పుడు పంచన చేరతారు. అంతవరకూ ఓర్పు, ఓదార్పుతో ముందుకెళతా. చంద్రబాబు, ఇతర నేతలు ఈ ఉగాదిగురించి ఆలోచిస్తున్నారు. నేను అలా కాదు. అధికారంలోకి రావడమే అసలు ఉగాది అని భావిస్తున్నా. అదే జరిగితే ఇంటింటికి ఉగాదియాత్ర చేసి వారి నోటికి తియ్యటి పచ్చడి అందిస్తా. పవన్‌కల్యాణ్ జనం మధ్య జేజేలు పలికించింది జయనామ సంవత్సరం. ఇంతవేగంగా అయిపోతుందని అనుకోలేదు. ఇక మన్మథనామ సంవత్సరంలోనూ మనం స్టార్‌గానే కొనసాగాలి. ఏం చేయాలి. జనంలోకే వెళ్లాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అడుగేయాలి. సింహమైనా, నేనైనా జూలు విదిలించి ముందుకువెళితేనే విలువ. అందుకే ఆంధ్ర రాజధాని ప్రాంతానికి వెళ్లా. జనం తెచ్చిన పెరుగన్నం తిన్నా. రేపొచ్చె ఉగాదికి జనం పెట్టే ఉగాది పచ్చడికూడా తింటా. తినొద్దన్నవారిని పచ్చడిపచ్చడి చేస్తా. జనం వెంట నేనున్నా. జనాన్ని బాధపెట్టే ఏ నిర్ణయాన్నైనా ఎదిరిస్తా. పోరాడతా. చంద్రబాబు, మోదీ..ఎవరైనా జనం కంట కన్నీరు తెచ్చే నిర్ణయాలు వద్దు. మన్మథలో వారి మనసు బాధపెట్టొద్దు. మీకు ఆలోచనలు రాకపోతే నేను చెబుతా. నాక్కొంచెం తిక్కుందని, అయినా దానికో లెక్కుందని ఎప్పుడో చెప్పా. నా పంచాంగం నాది. రాజపూజ్యానికి తిరుగులేదు. అవమానమంటారా. గతంకంటే ఏముంటుంది. కందాయఫలాలు, కందమూలాలు మనకక్కర్లేదు. కవిసమ్మేళనాలు మనకు సరిపడవ్. జన సమ్మేళనమే నాకు సరిపోతుంది. జనసేనే నా ఆయుధం. **

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.