వెంకయ్య ఏకపాత్రాభినయం

వెంకయ్య ఏకపాత్రాభినయం – ఎ. కృష్ణారావు (18-Mar-2015)

నేను కర్ణాటక సభ్యుడిని. ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల్లో ఎందుకు తలదూరుస్తున్నావని కర్ణాటక సభ్యులే అంటున్నారు.. అని వెంకయ్య చెప్పినప్పటికీ తన కాళ్ల క్రింద నేల ఆంధ్రప్రదేశ్‌ అని ఆయనకు తెలియనిది కాదు. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవ స్థీకరణ బిల్లు చర్చకు వచ్చినప్పుడు రాజ్యసభలో తాను వీరవిజృంభణ చేశానని, ఆంధ్రప్రదేశ్‌కు మోదీ ఏమి చేయక పోయినా అంతా తన వైపే చూస్తారని ఆయనకు తెలుసు. విభజన చట్టంలో ఉన్న వాటిని అమలుచేసేలా చూడడం వెంకయ్యకు కత్తిమీద సామే. దానిక్కూడా ఆయన వెనుకాడడం లేదు.
ఆయన కేంద్రంలో మూడు శాఖలకు మంత్రి. అయినా ఆయన ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించిన వ్యవహా రాల గురించైనా మాట్లాడగలరు. ఒక సారి హోంమంత్రి రూపంలో, ఒక సారి ఆర్థిక మంత్రి రూపంలో, మరో సారి విదేశాంగ మంత్రి రూపంలో ఆయన మనకు ప్రత్యక్షమవు తుంటారు. ఆయన బీజేపీ నాయకుడు. ఆర్‌ఎస్‌ఎస్‌ సమర్థ కుడు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు సంబంధించిన వ్యవహారా లైతే ఆయన వెంటనే రంగంలోకి దూకుతుంటారు. లోక్‌సభలో కాంగ్రెస్‌ నేతలు సోనియాగాంధీ, మల్లిఖార్జున ఖర్గే, రాజ్య సభలో గులాంనబీ ఆజాద్‌, ఆనంద్‌ శర్మ, సీతారాం ఏచూరి లతో పాటు ఏ పార్టీ నేతలు తన పార్టీని, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టినా ఆయన వెంటనే లేచి పదునైన వాగ్బా ణాలు సంధిస్తుంటారు. ఎవర్నైనా చెండాడడానికి సిద్ధంగా ఉంటారు. అప్పటివరకూ లోక్‌సభలో ఉన్న వ్యక్తి, రాజ్యసభలో కనపడుతుంటారు. రకరకాల ప్రతినిధి వర్గాలను కలుస్తుం టారు. ఉన్నట్లుండి నల్గొండలో శాసనమండలి సభ్యుల ప్రచా రంలో పాల్గొనడానికి కూడా తానే వెళతారు. టీఆర్‌ఎస్‌ అభ్య ర్థిని ఓడించమని పిలుపునిస్తారు. వారాంతం వస్తే దక్షిణా దిన నాలుగైదు చోట్ల ప్రసంగించకపోతే ఆయన ఆరోగ్యం బాగుం డదు. పార్లమెంట్‌ వార్తల కోసమో, తెలుగు వార్తల కోసమో, టీవీ వైపు చూస్తే చాలు ఆయన మాట్లాడుతున్న దృశ్యమే కన పడుతుంటుంది. పోనీ, తన మంత్రిత్వ శాఖల పనులు ఏమైనా చేయరా అనుకుంటే అది కూడా పొరపాటే. స్మార్ట్‌ సిటీల సదస్సులోనో, మరో అధికారిక సమావేశంలోనో మాట్లాడుతూ ఉంటారు. మెయిల్‌ తెరిస్తే చాలు, ఆయన మీడియా అధికారి నుంచి అంచలంచలుగా, కుప్పలు తెప్పలుగా, పుంఖాను పుంఖాలుగా వార్తలు, ఆయన ఉపన్యాస పరంపరలు వస్తూనే ఉంటాయి. ఆయన ఎవరో కాదు, వెంకయ్యనాయుడేనని ఈ పాటికి చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది.
అసలు వెంకయ్యనాయుడుకు ఈ శక్తి ఎలా వచ్చింది? అని ఆశ్చర్యపోయే నాయకుడుండరు. బహుశా అంతటా సర్వంత ర్యామిలా తానే కనపడకపోతే, రోజుకు కనీసం పదిసార్లైనా మాట్లాడకపోతే ఆయనకు ఈ శక్తి ఉండేది కాదేమో. పని, మాట్లాడడం రెండూ ఆయన శక్తికి ఇంధనాల్లా కనపడుతాయి. హర్యానాలో ఒక చర్చిని కూల్చివేస్తే, పశ్చిమ బెంగాల్‌లో 72 ఏళ్ల ఒక వృద్ధ క్రైస్తవ సన్యాసినిపై అత్యాచారం జరిగితే మంగళవారం జీరో అవర్‌లో సభ్యులు గందరగోళం సృష్టిం చారు. నిజానికి ఇలాంటి సంఘటనలపై పార్లమెంట్‌లో హోం మంత్రి ప్రకటన చేయాలి. కాని హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పార్లమెంట్‌కు రాక రెండు మూడు రోజులైంది. ఎక్కడో జపాన్‌లో ఏదో సదస్సులో పాల్గొనేందుకు వెళ్లారు. హోంశాఖ సహాయమంత్రి ఉన్నా ఆయనకు ప్రతిపక్షాలకు దీటుగా జవాబిచ్చే శక్తి లేదు. అంతే, అదే సమయంలో లోక్‌సభలో ఉన్న పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు రంగంలోకి దిగారు. ఒక్కో సభ్యుడికి దీటుగా సమాధానమిచ్చి వారి నోళ్లు మూయించారు. సంఘటన నిందించదగ్గదే.. కాని రాజకీయం చేయవద్దు. హర్యానా, బెంగాల్‌లో ఏదో జరిగితే కేంద్రం ఏమి చేస్తుంది? ఒకవేళ కేంద్రం ఏమైనా చేసినా మీరు ఊరుకుంటారా.. అని విరుచుకుపడ్డారు. సంఘ్‌పరివార్‌పై ఒక్క మాట కూడా ఆయన పడనీయకుండా అడ్డుకున్నారు. చేసేది ఏమీ లేక కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె పార్టీ సభ్యులు వాకౌట్‌ అని ప్రకటించి వెళ్లిపోయారు. రాహుల్‌ గాంధీపై గూఢచర్యం చేస్తున్నారని ఆరోపిస్తూ సోమవారం రాజ్యసభలో సభను స్తంభింపచేసిన కాంగ్రెస్‌ సభ్యులను కూడా వెంకయ్యే ఎదుర్కొన్నారు. అధికారులు ముఖ్య నాయకుల గురించి ఆరా తీయడం మామూలేనని, అది గూఢచర్యం కాదని కొట్టి పారేశారు. మీ హయాంలో మీ ఆర్థిక మంత్రి (ప్రణబ్‌ ముఖర్జీ) స్వయంగా తన కార్యాలయంలో హోంమంత్రి (చిదంబరం) బగ్గింగ్‌ చేయించారని ప్రధానికి లేఖ రాసిన విషయం మరిచిపోయారా.. అని ఎద్దేవా చేశారు. ఒక ప్రైవేట్‌ డిటెక్టివ్‌ ఏజెన్సీని నాటి ఆర్థిక మంత్రి స్వయంగా నియమించుకుని బగ్గింగ్‌ పరికరాలను తీసేసిన విషయం ఆయన గుర్తు చేశారు. పనికిరాని ఆరోపణలు చేసి సెల్ఫ్‌గోల్‌ చేసుకోకండి.. అని ఆయన వ్యాఖ్యానించారు.
పార్లమెంట్‌ జరుగుతున్న సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు, మూడు దేశాల పర్యటనకు వెళుతున్నారంటే అర్థం ఉంది. ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తన భార్య ఆరోగ్యం బాగులేదని అమెరికాకు వెళ్లారంటే కూడా అర్థం చేసుకోవచ్చు. కాని అదే జైట్లీ మళ్లీ లండన్‌లో మహాత్మాగాంధీ విగ్రహావిష్కరణకు వెళ్లడం, హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ జపాన్‌లో జాతీయ విపత్తు సదస్సుకు, ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా కార్యక్రమాలకు వెళ్లడం అవసరమా… అని అనుకోకుండా ఎవరూ ఉండలేరు. ఆర్థికమంత్రి సభలో లేకుండానే లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చను ప్రారంభించేందుకు పూనుకుంటే ప్రధాన ప్రతిపక్షం తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చింది. ఆర్థిక మంత్రి లండన్‌కు వెళ్లేందుకు అనుమతించిన స్పీకర్‌ తన రూలింగ్‌ను సభ్యులే ధిక్కరిస్తుంటే ఏమీ చేయలేక పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వైపు చూశారు. మిమ్మల్ని వారు ధిక్కరిస్తుంటే, మీరు మాత్రం ఏమి చేయగలరు? సభను వాయిదా వేయండి.. అని వెంకయ్య సూచించారు. హమ్మయ్య.. అనుకుంటూ మహాజన్‌ సభను వాయిదా వేశారు. ఇలా రోజుకు పలు సార్లు వెంకయ్య వైపు చూడకుండా స్పీకర్‌ సభను నిర్వహించలేని పరిస్థితి నెలకొన్నది. పార్లమెంట్‌ అంటే వెంకయ్యే అనుకునే స్థితి ఏర్పడింది.
స్పీకరే కాదు, పార్లమెంట్‌ నడుస్తుంటే మిగతా కేంద్ర మంత్రులేమయ్యారో, వారేమి చేస్తున్నారో ఎవరికీ తెలియదు. మీరు వెంకయ్య చెప్పినట్లు నడుచుకోండి.. అని నరేంద్రమోదీ చెప్పినట్లున్నారు.. అందుకే సభ కార్యక్రమాల గురించి వెంకయ్యతో చర్చించకపోతే సంబంధిత మంత్రి సభలో ఏమీ చేయలేరు. భూసేకరణ బిల్లుపై ప్రతిపక్షం చేస్తున్న గందర గోళంపై వ్యూహరచన చేసేందుకు వెంకయ్య పిలిస్తే సుష్మా స్వరాజ్‌, నితిన్‌ గడ్కరీ, స్మృతి ఇరానీతో సహా మొత్తం 35 మంది మంత్రులు ఆయన ఛాంబర్‌లో సమావేశమయ్యారు. ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కోవాలో, నియోజకవర్గాల్లో ఏ విధంగా ప్రచారం చేయాలో ఆయన సూచించారు. ఇదే అదనుగా ఆంధ్రప్రదేశ్‌కు మీరేమి చేశారో చెప్పండి.. అని ఒక్కొక్కరి నుంచీ ఆయన వివరణలు కోరారు. భూసేకరణ బిల్లుపై ఆర్‌ఎస్‌ఎస్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తే పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా కూడా వెంకయ్యతో చర్చించి సవరణలను చేర్చారు. మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నరేంద్రమోదీ ఉన్నప్పటికీ వెంకయ్యే ప్రధాన వక్త. మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది, పార్లమెంట్‌కు హాజరై మీ బాధ్యతలు నిర్వహించడానికి. గైరు హాజరు చేయడం సరైంది కాదు.. అని ఆయన మోదీ సమక్షంలోనే క్లాసు పీకారు. కీలకమైన భూసేకరణ బిల్లు ఓటింగ్‌ జరిగినప్పుడు ప్రీతమ్‌ ముండే, వరుణ్‌ గాంధీ, పూనం మహాజన్‌, శత్రుఘ్న సిన్హా తదితరులు రాలేదని ఆయన వారందరి పేర్లూ చదివారు.
ఒకటి కాదు, రెండు కాదు, ఏఅంశంపైనైనా, ఆఖరుకు శ్రీలంకలో తమిళుల అంశంపైనైనా వెంకయ్య మాట్లాడగలరు. ఆయన వద్ద ఏ అంశంపైనైనా రెడీమెడ్‌గా సమాచారం ఉంటుంది. కాంగ్రెస్‌ హయాంలో ఎన్ని ఆర్జినెన్స్‌లు జారీ చేశారో, ఎన్ని సార్లు వారి మంత్రులు సభకు రాలేదో.. ఏఏ అక్రమాలు చేశారో.. ఆయన వద్ద సమాచారం సిద్ధంగా ఉంటుంది. మోదీ, మరికొందరు ముఖ్యమైన మంత్రులు సభలో లేరు కదా.. అని ప్రతిపక్షాలు విజృంభించాలని చూస్తే వారికి వెంకయ్య అరివీర భయంకరుడులా, కొరకరాని కొయ్యలా కనపడుతున్నారు. ఒకటి రెండు సార్లు ఆయనను ఇరకాటంలో పెట్టాలని కాంగ్రెస్‌ నేతలు చూశారు. ఆయన తమను అవమానించారని ఆరోపణలు చేశారు. సోనియా కూడా ఆయనపై దాడి చేశారు. వెంకయ్య ఒక్కరోజు వెనక్కు తగ్గినట్లు కనపడ్డారు. కాని మరునాటి నుండి మళ్లీ వెంకయ్య సహజరూపంలో దర్శనమిచ్చారు. ఇప్పుడెందుకురా ఆయనతో పెట్టుకోవడం.. అని భయపడే పరిస్థితిని కల్పించారు. అలా అని వెంకయ్య ప్రతిపక్షాలతో స్నేహం చేయరా అంటే అదీ లేదు. నెయ్యం నెయ్యమే, కయ్యం కయ్యమే.. అన్నట్లుగా ఆయన వైఖరి కనపడుతోంది. ఇదేమిట్రా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రే తమను ఢీకొంటున్నారని ప్రతిపక్షాలు అనుకున్నప్పటికీ వెంకయ్య ఇలాగే ఉంటారని వారు సర్దుకోక తప్పడం లేదు. బీమా, తదితర బిల్లులను ఆమోదించక తప్పలేదు. ఇక తృణమూల్‌, టీఆర్‌ఎస్‌ వంటి పార్టీలను మచ్చిక చేసుకోవ డంలో వెంకయ్య సిద్ధహస్తులు. మీ అపాయింట్‌మెంట్‌ లేకుండా మీ ఆఫీసుకు వచ్చాను.. అని మమతా బెనర్జీ అంటే, సోదరీ.. నా వద్ద మీకు అపాయింట్‌మెంట్‌ ఎందుకు. ఎప్పుడైనా రావచ్చు.. అని వెంకయ్య అనగలరు.
నేను కర్ణాటక సభ్యుడిని. ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల్లో ఎందుకు తలదూరుస్తున్నావని కర్ణాటక సభ్యులే అంటున్నారు.. అని వెంకయ్య చెప్పినప్పటికీ తన కాళ్ల క్రింద నేల ఆంధ్రప్రదేశ్‌ అని ఆయనకు తెలియనిది కాదు. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవ స్థీకరణ బిల్లు చర్చకు వచ్చినప్పుడు రాజ్యసభలో తాను వీరవిజృంభణ చేశానని, ఆంధ్రప్రదేశ్‌కు మోదీ ఏమి చేయక పోయినా అంతా తన వైపే చూస్తారని కూడా ఆయనకు తెలుసు. మోదీని, సర్కార్‌లో మంత్రుల్నీ ఒప్పించి, విభజన చట్టంలో ఉన్న వాటిని అమలుచేసేలా చూడడం వెంకయ్యకు కత్తిమీద సామే. కాని దానిక్కూడా ఆయన వెనుకాడడం లేదు.
– ఎ. కృష్ణారావు
ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.