ఆదర్శ పురుషుడు
- 22/03/2015
- -పసుమర్తి కామేశ్వరశర్మ
‘ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠితః’. ఈ విశ్వాన్ని పరిపాలించేది ధర్మం. ‘ధృ’ అనే ధాతువు నుండి వచ్చింది ‘ధర్మం’ అనే పదం. ‘ధృ’ అంటే ధరించుట, ఆధారంగా నిలుచుట అనే అర్థాలున్నాయి. ధర్మం – ఈ విశ్వానికి ఈ సమాజానికి, ఈ వ్యవస్థకి, ఈ వసుధైన కుటుంబానికి, వ్యక్తికి, ఆధారంగా నిలుస్తోంది. ధరించేది కనుక ధర్మం అన్నారు. ‘సర్వే ధర్మం ప్రతిష్ఠితం’ అన్నారు. ‘ధర్మం’ గురించిన విశేషాలను చెప్పేవి – వేదములు. ‘వేదోఖిల ధర్మమూలం’ ఉపనిషత్తులు, పురాణేతిహాసములు, భగవద్గీత మున్నగు వాటిలో ధర్మ సూత్రములు చెప్పబడ్డాయి. ధర్మాన్ని కథారూపంలో రసవంతంగా, సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా చెప్పిన ఆదికావ్యం ‘శ్రీమద్రామాయణం’ ఉత్తమ మానవ ధర్మాలను లోకానికి చాటటానికే రామాయణం రచించాడు – వాల్మీకి మహర్షి. వాల్మీకి మహర్షి పదహారు మంచి గుణాలు చెప్పి, ఈ గుణాలన్నీ కలిగిన వ్యక్తి లోకంలో ఎక్కడైనా ఉన్నాడా? అని అడిగాడు, లోకసంచారి అయిన నారద మహర్షిని. నారద మహర్షికి వెంటనే సమాధానం దొరకలేదు. కాస్త ఆలోచించి – ‘ఉన్నాడు, లేకేం’ అని, అన్ని సద్గుణాలు కలిగిన ధర్మస్వరూపుడు, దశరథ కుమారుడైన శ్రీరామచంద్రుడని’ నొక్కి వక్కాణించి చెప్పాడు. వాల్మీకి మహర్షి నారదుడు చెప్పిందంతా విని, సత్యసంధుడు, దృఢవ్రతుడు ధర్మాత్ముడయిన శ్రీరాముని సచ్చరిత్రను ఒక కావ్యంగా వ్రాయాలని సంకల్పించాడు. ఆ ఇరువురు ఒక శుభముహూర్తాన కలిశారు, ఆ సంఘటనే మానవాళికి మార్గదర్శకంగా, మొట్టమొదటి కావ్యంగా, అందింపబడింది శ్రీమద్రామాయణంగా. రామాయణంలోని ఆధ్యాత్మికతను తెలుసుకుందాం. రామ+అయనం = రామాయణం. అంటే, రామ అయనం – అనే రెండు మాటలతో ‘రామాయణం’ ఏర్పడింది. ఆయనము – అనే మాటకు, గమనము, గయ్యము అనే అర్థాలున్నాయి. ‘నాన్యః పంథా అయనాయ విద్యతే’ అన్నది వేదం. అయనం – అంటే అక్కడ చేరవలసిన స్థానం. దాన్ని చేర్చేది – పంథాః అనే మాట. దానే్న పరాయణమని కూడా పేర్కొన్నారు. పరమమైన గమ్యమేదో – అది పరాయణం. ‘సత్యజ్ఞానానంద రూపా, సామరస్య పరాయణ’ అన్నది లలితా సహస్ర నామం. కనుక, ‘రామాయణం’ అంటే – రాముడే గమ్యం. అనగా, ఆత్మ తత్త్వమే ఎప్పటికైనా మనం చేరవలసిన స్థానం. ఇదే ఆత్మారామ, తారక రామ తత్త్వం. సత్యము, ధర్మము, త్యాగము, కర్తవ్య నిష్ఠ, పితృవాక్య పరిపాలన, మాతృభక్తి, భ్రాతృ ప్రేమ, అనురాగము, క్షమ, స్నేహము, సౌశీల్యము, వాత్సల్యము, ఔదార్యము, సహనము, సౌహార్ధము – మొదలగు గుణములచే మానవ జాతికి ఆదర్శప్రాయుడైనాడు – శ్రీరామచంద్రుడు. రాముని ధర్మ నిరతి నాటికి, నేటికి, ఏనాటికి అందరికీ ఆదర్శప్రాయమే. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసా దాసేత్ సాక్షాత్ రామాయణాత్మనా పరమ పురుషుడైన శ్రీమన్నారాయణుడు దశరథాత్మజుడైన రాముడుగా అవతరించగానే, పరమాత్మ గుణ వర్ణనైక పరాయణమగు వేదము వాల్మీకి మహర్షి నోట శ్రీమద్రామాయణము రూపములో వెలువడినది. పరిపూర్ణ మానవుడుగా ప్రవర్తించి, ఎన్ని కష్టములు వచ్చినా స్వధర్మమును వీడక, ధర్మ పథాన్ననుసరించి, లోకానికి ధర్మమాహాత్మ్యమును చాటి చెప్పిన అవతార పురుషుడు -శ్రీరామ చంద్రుడు. మానవ జీవితంలో స్వార్థానికీ, ధర్మానికీ ఎప్పుడూ సంఘర్షణే. స్వార్థం – మనస్సును ఇంద్రియాల వైపు మళ్లిస్తుంది. ధర్మం, మనస్సును ఇంద్రియాల నుండి దూరం చేస్తుంది. స్వార్థం – స్వసుఖాన్ని కోరుకుంటుంది. ధర్మం – పరహితాన్ని కోరుకుంటుంది. స్వార్థం – భోగాన్ని కోరుకుంటుంది. ధర్మం – త్యాగాన్ని ప్రబోధిస్తుంది. ‘త్యాగేనైకే అమృతత్వ మానసుః’ స్వార్థానికీ, ధర్మానికీ జరిగే సంఘర్షణే – జీవితం. జీవితంలో స్వార్థాన్ని త్యజించి, ధర్మాన్ని అనుసరించే మానవుడు – అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తాడు, అందరి మన్ననలను పొందుతాడు, మహోదాత్తుడవుతాడు. అర్థ, కామాల కొరకు, అధర్మ మార్గాన్ని అవలంబించేవారు, స్వార్థబుద్ధితో పతనవౌతారు, పాపాత్ముడవుతాడు. రాముడు – స్వార్థరహితుడు, త్యాగనిరతుడు, ధర్మపరుడు. అందుకే ఎన్ని యుగాలకైనా రాముడు ఆదర్శవంతుడు. నడుస్తున్న కాలానికీ ఆయన మార్గం ఆచరణీయం. ఇదే రామతత్త్వం. పుత్ర కామేష్ఠి యాగం పూర్తి అయిన తరువాత, పనె్నండో నెల అయిన చైత్రమాసంలో, నవమి తిథినాడు, పునర్వసు నక్షత్రంలో, కర్కాటక లగ్నంలో గురు, చంద్రులుండగా, ఐదు గ్రహములు ఉచ్ఛస్థితిలో వుండగా కౌసల్యాదేవి, జగత్కల్యాణ కారకుడైన శ్రీరామచంద్రుణ్ణి ప్రసవించింది. ఇది క్రీస్తు పూర్వం 5114వ సంవత్సరం జనవరి నెల 10వ తేదీ అని కొందరు శాస్త్ర పండితులు అభిప్రాయం వెలిబుచ్చారు. అనగా రాముడు జన్మించి సుమారు 7130 సంవత్సరాలైనదని ఒక ఆంగ్ల మాస పత్రిక పేర్కొన్నది. శ్రీరాముని జీవితం – ఒక క్షీరసాగర మథనం. ఆయన జీవితంలో ఎన్నో హాలాహలం లాంటి చేదు అనుభవాలు అనేకం ఎదుర్కొన్నాడు. ధర్మాన్ని ఆశ్రయించి, స్వార్థాన్ని త్యజించి, ధార్మికునిగా జీవితాన్ని గరపిన పూర్ణ పురుషుడు – శ్రీరాముడు. రామునిలో ఈ ధార్మికతే వాల్మీకిని బాగా ఆకర్షించింది. ధర్మాన్ని రాశిపోస్తే – రాముడు. అందుకే ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అని రాక్షసుడైన మారీచుడి చేత పలికించాడు. వాల్మీకి మసర్షి, ఎవరితో – ధర్మబద్ధం గాని కాముకుడైన రాక్షసరాజు రావణునితో. ఇంతకంటె నేటితరం వారికి రామాయణం, ఇంకా ఏం చెప్పాలి. ‘అతఏవ మున యోశ్చ నాగాః గంధర్వాః గుహ్యకాః తథా ధార్మికం పూజయం తీవ న ధనాఢ్యం న కాముకం’ కాముకులైన వారిని, గుణహీనుడైన ధనవంతుణ్ణి ఈ లోకం పూజించదు, హర్షించదు. ధార్మికులైన వారిని మాత్రమే గౌరవిస్తుంది. ఇదే రామునిలోని ధార్మికతా తత్త్వం. అయోధ్యకు వచ్చాడు విశ్వామిత్రుడు. యాగ రక్షణకై – రాముణ్ణి తీసుకొని వెళ్లటానికి. దేహమే శాశ్వతమనుకొన్న దశరథుడు, అంతరార్థాన్ని తెలుసుకోలేక, తానే వచ్చి ఆ కార్యాన్ని నెరవేరుస్తానంటాడు. అప్పుడు దశరథుని వారించి, విశ్వామిత్రుడు- ‘నీ కొడుకును గైకొని చని మాకాకలియంచు దిందుమా పిచ్చి నృపా, మాకడ బ్తిశస్త మన్త్ర వ్యాకృతికలదద్ది నేర్పెదమింతే’ అని అంటారు విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షంలో. దీనినిబట్టి ఎక్కడ ధార్మికత ఉంటుందో, ఎక్కడ స్వార్థరహితం ఉంటుందో, ఎక్కడ విశ్వజనీనత ఉంటుందో, ఎక్కడ అతి పరాక్రమము ఉండి, సత్వగుణంతో నైతిక ధర్మపాలన ఉంటుందో, ఎవరు తనకు ప్రాప్తించిన ‘శక్తి’ని విశ్వ కల్యాణానికి ఉపయోగిస్తారో – వారికి ఆ శక్తి ప్రదానం జరుగుతుంది. తన వద్ద ఉన్న శక్తివంతమైన అస్తశ్రస్త్రాలను జగత్కల్యాణానికి ఉపకరించేవాడు రాముడని గ్రహించి, అతనికి వాటిని ప్రదానం చేసే నిమిత్తం రాముణ్ణి తీసుకొని వెళ్లటానికి అయోధ్యకు వచ్చాడు – విశ్వామిత్రుడు. ఇన్ని అస్త్ర శస్తమ్రులున్న విశ్వామిత్రుడు, తన యాగాన్ని తను రక్షించుకోలేడా? రక్షించుకోగలడు. ఇందులో మనకి రాముని లోకకల్యాణ తత్త్వాన్ని విశ్వామిత్రుని పరంగా విశదపరచబడింది. శ్రీరామునికి, శస్త్రాస్త్ర విద్యను బోధించిన గురువు – పరమ సాత్విక మూర్తి వశిష్ఠుడైతే, ఆయన చేసే దుష్ట విక్షణ శిష్ట రక్షణకు అవసరమైన శస్త్రాస్తమ్రులను అందించిన గురువు – రజస్తమో గుణ రాశియై చివరకు సత్వ గుణాతీతుడైన రాజర్షి, బ్రహ్మర్షి విశ్వామిత్రుడు. విద్య నేర్పిన గురువు పరమ సాత్విక మూర్తి బ్రహ్మర్షి వశిష్ఠుడు. అందుచేత శస్త్రాస్త్ర సామర్థ్యం లోకోపకారణమయింది. రాముడు లోక పూజ్యుడయినాడు. ఇది ఈనాటి అణు విజ్ఞానాన్ని విశ్వకళ్యాణానికి వినియోగించాలని హెచ్చరిస్తోంది. రాముడు సత్యవాక్య పరిపాలకుడు. రెండు మాటలు మాట్లాడడు. ‘రామోద్విర్నాభి భాషతే’ పితృవాక్య పరిపాలకుడు. ఒక భయంకర శబ్దం వినపడింది. బీభత్స భయానక రూపం కనపడింది. కొండ గుహలాంటి నోరు తెరుచుకుంది. రామలక్ష్మణులను మ్రింగటానికి మీదికి వస్తోంది – తాటకి. స్ర్తి హత్య, దోషం అని సంశయిస్తున్న రామునితో – ‘వ్యవధి లేదు రామా, దుర్మార్గమైనా, సన్మార్గమైనా, పాతకమైనా దోషమైనా – ప్రజారక్షణకై కర్తవ్యాన్ని నిర్వర్తించు అది ప్రభు ధర్మం’ అన్నాడు విశ్వామిత్రుడు. వింట బాణం దూసుకు పోయింది – ప్రాణాలు విడిచింది తాటకి. ‘మా తండ్రి దశరథుడు నన్ను తమతో పంపునపుడు, మీ మాటను వేదవాక్కుగా ఆచరించి శిరసావహించి ఆచరించమని చెప్పారు.’ ఎంత పితృభక్తి, ఎంత వినయం, రామునికి తండ్రి పట్ల ఉన్నదో తెలుస్తుంది. ఒక సందర్భంలో రాముడు తల్లితో తను తండ్రి వాక్యమును ఎన్నడూ అతిక్రమించనని ‘పితృవాక్యం న యతిక్రమితుం మమ’ అన్నాడు. ఎప్పుడూ ఒకే మాట – అదే రామతత్త్వం. రాముడు, స్థూల రూపమున దశరథ రామునిగా, సూక్ష్మ రూపమున అంతరా రామునిగా ఉన్నాడు. అతడే, తారకరాముడు. ఆ తారకరాముని నిజ తత్త్వమును ఉపాసించి తరించిన వారు – ఎందరో మహానుభావులు. ఎన్ని జన్మముల నుండి చూచినను ఏకో నారాయణుడని, అన్ని రూపులై యున్న ఆ పరమాత్ముని నామము కథ విన్నా, ఎన్ని జన్మముల చేసిన పాపులీ జన్మమున వీడునని, రామమంత్రముచే ఇది కడసారి జన్మమని, శాశ్వత నిత్యానంద మోక్షగతి మొదలగు విషయములను మనకందిస్తూ ‘తారకమంత్రము కోరిన దొరకెను ధన్యుడనైతిని ఓరన్నా’ అని తారకరాముని ఆర్ద్రతతో కీర్తించాడు – భద్రాచల భక్త రామదాసు. ఇది శ్రీరామనవమికి స్ఫూర్తినిస్తుంది. త్రేతాయుగంలో, ధర్మవిరుద్ధమైన కామము ఎంత అనర్థాల్ని తెస్తుందో చెప్పింది – రామాయణం. ఎంతో శక్తిసంపన్నుడైనా, ధర్మవిరుద్ధమైన కామానికి తెగబడిన దుర్మార్గుడు రావణుడు ఎలా నశించాడో, సామాన్య మానవుడిగా ఆవిర్భవించి, ధర్మబద్ధమైన జీవితాన్ని గరపిన రాముడు ఎంత ఉన్నత స్థితిని చేరుకున్నాడో, ఆదర్శంగా నిలిచాడో, చెప్పింది – శ్రీరామకథ. ధనాంధకారం వల్లనో, అధికార దర్పం వల్లనో, మరింకేమైనా గానివ్వండి తమకు ఎదురులేదని అధర్మంగా తప్పుడు పనులు చేసే అహంకారులు ఎప్పటికైనా వాళ్ల అధర్మ ఫలం అనుభవించక తప్పదని హెచ్చరిస్తుంది – శ్రీరామకథ శ్రీరామచంద్రుడు ఏకపత్నీవ్రతుడు, జితేంద్రియుడు. దశరథుడు అలా కాదు. ముచ్చటగా మూడవ భార్యను, కైకను పెళ్లి చేసుకొనేటప్పుడు, ఆమెకు పుట్టే కొడుకునే, అయోధ్యా సామ్రాజ్యానికి పట్ట్భాషిక్తుణ్ణి చేస్తానని కేకయ రాజుకి వాగ్దానం చేశాడు – దశరథుడు. అయితే రాముడు ముందు పుట్టాడు. ఆనందోత్సాహాలతో ముందు రోజు కైకేయి మందిరానికెళ్లాడు దశరథుడు. రామ పట్ట్భాషేకం ఆగిపోయింది. వంశ క్రమానుగత రాజధర్మానికి విఘాతం కలిగించింది, దశరథుని మరణానికి కారణమయిందీ – దశరథుని అధర్మకాముకత. ఇది రామాయణం చెప్పే అతిముఖ్యమైన సూక్తి. అరణ్య వాసం చేస్తూ, చిత్రకూటలో ఉన్న రాముణ్ణి మరల అయోధ్యకు తీసికొని వెడదామని, స్వచ్ఛందంగా వచ్చిన బంధువులు, ప్రజావాహినితో వచ్చాడు – తమ్ముడు భరతుడు. ప్రియమార, భరత శతృఘు్నలను కౌగిలించుకున్నాడు. భరతుణ్ణి తన తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. కుశల ప్రశ్నలు వేస్తూ, ఉత్తమోత్తమ ప్రభు ధర్మాలు రాజనీతి విశేషాలు, తాత్త్విక విషయాలు, పరోక్షంగా భరతుడికి చెప్పాడు. సూర్యోదయం కాగానే అధర్మంగా ధనార్జన చేసుకోవచ్చని సంతోషించేవారు, సూర్యాస్తమయం అవగానే అధర్మంగా విశృంఖలంగా కామోపభోగాల్ని అనుభవించవచ్చని సంతోషించేవారు, సూర్యోదయ సూర్యాస్తమయముల మధ్య, తమ జీవితాల్లో ఒకరోజు ఆయుష్షు తగ్గిపోతోందని, ఒకరోజు వయస్సు పెరిగిపోతోందని తెలిసికోలేక పోతున్నారని, కాల ప్రాముఖ్యాన్ని తెలిసికొని, ఆత్మ తత్త్వాన్ని దర్శించాలని, ధర్మంతో అర్థకామాల్ని అనుభవించాలన్న ఆత్మ తత్త్వాన్ని బోధించిన – ఆత్మారాముడు – శ్రీరామచంద్రుడు. వాల్మీకి, రామాయణం ద్వారా చెప్పదలచుకొన్న దాన్ని రాముడి చేత ఈ సందర్భంలో చెప్పించాడు. శ్రీరామ నవమినాడు మననం చేసికోవలసిన ముఖ్య విషయం. ధూళిలో వాయు భక్షిణియై, ఇతరులకు కనపడకుండా తపమొనర్చుచూ వేయి ఏండ్లు ఆశ్రమమున పంచభూత సదృశముగా ఉన్నది – అహల్య. హల్య కానిది అహల్య. రాముడింకనూ కొంత దూరమున ఉండగానే, అతని మేని గాలి సోకుట వలన, కాలి సవ్వడి వినుట వలన, దేహ పరిమళము వ్యాపించుట వలన, శరీర నీల రత్నకాంతి గోచరించుట వలననూ, శ్రీరామచంద్రుడు ఆతిథ్యము స్వీకరింపవచ్చుట వలన, శబ్ద స్పర్శ రూప, రస, గంధములుగా పంచభూతముల, పంచతన్మాత్ర లనబడే సూక్ష్మ స్థితులతో పంచేంద్రియములను పొంది స్వరూపమును పొందిన మహాసాధ్వి – అహల్య. గుణాతీత అయిన అహల్యకు నమస్కరించిన మహాజ్ఞాని- శ్రీరాముడు. రాముడొక్కడే దిక్కని భావించి, సంపూర్ణ దాసోహ భావంతో, సాత్విక భక్తి విశ్వాసములతో త్రికరణశుద్ధిగా రామచింతనతో కాలము గడుపుతోంది బక్కచిక్కిన శబరి. ‘తుట్టతుది దాక నెండిన చెట్టుకొమ్మ శేఖరంబున యందు పుష్పించినట్లుగా’ ఫల పుష్పములతో కూడిన మెట్టపళ్లిక తల మీద పెట్టుకొని రామునికి అభిముఖంగా వచ్చింది. రాముడు శబరితో ‘అవ్వ నీ తల యింత ముగ్గు బుట్టయినదేమి?’ అంటే, తల అంతా నెరిసిపోయిందన్న భావంతోను, జ్ఞానవృద్ధురాలవు అన్న అంతర్లీన భావంతో అన్నాడు. శబరి ‘ఆ ముగ్గుబుట్ట నీ ఆత్మవాకిట రంగవల్లులు దిద్దుటకయ్యా’ అన్నది. రాముడు ‘అవ్వా, నీ ఆయువంత ఏర్చి ఎండి ఏకైతివేమి? అని అంటే, ‘ఆర్ద్రంబుగ ఆ ఏకును ఇంత వత్తిగ జేసి వెలిగింపవయ్యా’ అన్నది. ఇది జీవాత్మ – పరమాత్మల సంబంధం. ఉదాత్త గంభీర ఆధ్యాత్మికత. రామాయణంలో తెలిసికోవలసిన ముఖ్య అంశం. శ్రీరామ నవమి పండుగకు పూర్తి స్ఫూర్తినిస్తుంది. ‘ఎంతని నే వర్ణింతును శబరీ భాగ్యము’ అన్నాడు త్యాగయ్య, ముఖారి రాగంలో. సీతారాములు – ఆదర్శ దంపతులు. రావణునితో సంభాషించునపుడు, తృణముకన్న హీనుడన్న భావముగా, ఒక గడ్డిపోచను అడ్డముగా పెట్టుకొని మాట్లాడింది – సీత. ‘నీవు పరాక్రమశాలివే అయితే, రామలక్ష్మణులు ఆశ్రమములో లేని సమయంలో, అందునా సాధు వేషంలో మోసగించి, అపహరించవలసిన ఖర్మమేమి పట్టినదన్నది. రామ బాణముతో పనిలేకుండా, తన పాతివ్రత్య ధర్మ నిష్ఠా శక్తితేజము, రావణుని సంహరించగలదని హెచ్చరించింది. ఈ చిన్న కార్యానికి అంత పెద్ద శక్తిని వ్యర్థము చేయదలచలేదన్నది. అదీగాక రామాజ్ఞ కూడా లేదన్న, మహోదాత్త శక్తి స్వరూపిణి – సీతామాత. ఇంద్రియాల్ని జయించినపుడు రావణుడు ముల్లోకాలను, గడగడలాడించాడు. ఆ యింద్రియాలు రావణునిపై పగబట్టినాయి. పగ తీర్చుకోవటానికి తగిన సమయం కోసం వేచి చూస్తున్నాయి. సీతామాతను, సాధు రూపంలో మోసగించి తీసికొని రావటంతో, ఇంద్రియాలకు లోనయినాడు – పతనం చెందాడు. ఈ మాటలన్నది ఎవరో కాదు – సాక్షాత్తు రావణుని భార్య, మహాసాధ్వి – మండోదరి. సర్వసృష్టికి మూలహేతువైన తత్త్వము – బ్రహ్మాస్త్రం. బ్రహ్మాస్త్రంతో రావణ సంహారం జరిగింది. రామ కార్యమును సఫలము చేసిన బుద్ధి మతాంవరిష్ఠుడు, సీతా ప్రాణదాత, రామాయణ మహా మాలకు రూపు వంటివాడు ఆంజనేయుడు. శ్రీరామచంద్రునికి దాసుడై, రాముని ప్రతిబింబమే దాస స్వరూపుడుగా వెలసిన వాడు, వాయునందనుడు – హనుమంతునికి మహోత్కృష్ట స్థానాన్నిచ్చాడు – వాల్మీకి ‘పాహి రామ దూత జగత్ప్రాణ కుమార మాం పాహి’ అన్న వసంత వరాళి రాగ కీర్తనలో ఆంజనేయ తత్త్వాన్ని, ముఖ్యంగా సుందరకాండలోని విశేషాల్ని, హృద్యంగా అందించాడు, నాదయోగి సద్గురు త్యాగరాజస్వామి. ‘గీతార్థము సంగీతానందము నీ తావున చూడరా మనసా సీతాపతి చరణాబ్జము లిడుకొన్న వాతాత్మజునికి బాగ తెలుసురా…’ అన్న సురటి రాగ కీర్తనలో ఆంజనేయుని వైభవాన్ని, దాసభక్తిని అత్యద్భుతంగా వివరించారు త్యాగరాజ స్వామి, సురటి రాగ, ఆదితాళ కీర్తనలో. సీత పరాప్రకృతి, రాముడు పరాత్పరుడు. వారి అనుబంధం సహజసిద్ధం – సర్వలోక రమణీయం. ‘్ధనుర్దర్శయ రామాయ ఇతిహోవాచ పార్ధివం’ అని, విశ్వామిత్రుడు రాజయోగియై, మహాజ్ఞానియైన జనక మహారాజుకి ఆదేశమిచ్చాడు. ‘వత్సరామ ధనుఃపశ్య’ రామా ఈ ధనువును చూడుము’ అని గంభీరంగా పలికాడు. భావమెరిగిన రాముడు శివధనుర్భంగం చేశాడు. ఆ సందర్భంగా శ్రీరాముని ముద్దు మోముపైగల ముంగురులు ‘అలకలు అల్లలాడుట కన్నులార చూచిన విశ్వామిత్రుడు శ్రీరామ ఉపాసనా లక్ష్యసిద్ధిని పొందాడని మధ్యమావతి రాగంలో రూపక తాళ నిబద్ధనలో ‘అలకలల్ల లాడగని ఆరాణ్ముని ఎటు పొంగెనో’ అన్నాడు త్యాగయ్య. ‘ఫెళ్లుమనె విల్లు – గంటలు ఘల్లుమనె, గుభిల్లుమనె గుండె నృపులకు – ఝల్లుమనియె జానకీ దేహ మొక నిమేషమ్మునందె నయము, జయము, భయము, విస్మయము గదురగా’ శివధనుర్భంగము గావించిన ధీరోదాత్తుడు రాముడని హృద్యంగా వర్ణించాడు కరుణశ్రీ – సీతారాముల కల్యాణ ఘట్టంలో. ‘సీత పూజడ వెన్నుగ శిరసు వంచె, చెఱకు గడవోలె నడిమికి విరిగె ధనుస్సు’ అని అద్వైత శృంగార భావాల్ని, అద్భుతంగా ప్రదర్శించాడు విశ్వనాథ – రామాయణ కల్పవృక్షంలో. ‘మనస్సును మంత్రధ్యానంతో లయంచేసి, లక్ష్యాన్ని సాధించాలి. ప్రణవమనే ధనుస్సుతో, బాణమనే మనస్సును సంధించి, ముక్తికాంత అనే లక్ష్యాన్ని సాధించడమనేది – ఉత్తమ తత్త్వం. ఇదే జీవిత ధ్యేయం కావాలి. అదే శ్రీరామచంద్రుడు ధనుర్భంగం గావించి, సీతామాతను పరిణయమాడటంలో గల తత్త్వ రహస్యం’. సీతారాములు ముఖ్యంగా తెలుగు వారికి ఆరాధ్య దైవం. తొమ్మిది రోజుల శ్రీరామ నవమి ఉత్సవం, పదవ రోజు పట్ట్భాషేకంతో కన్నుల పండుగవుతుంది. యోగి, అన్ని వాసనలను వదులుకొని, దశేంద్రియముల చిత్తవృత్తులను రూపుమాపుకున్నపుడు, మోక్షానికి అర్హుడవుతాడని చెప్తుంది – శ్రీరామ సామ్రాజ్య పట్ట్భాషేకం. ‘జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా’ – అని నాటరాగం, ఆదితాళం – ఘన రాగ పంచరత్న కీర్తనలలో మొదటి కీర్తనగా, బ్రహ్మవిద్యా సార్వభౌముడు సద్గురు త్యాగరాజ స్వామి మనకందిస్తే- ‘సీత శ్రీరామచంద్రుని చిత్తపదము, రామచంద్రుడు జానకీ ప్రాణప్రదము, రామ సర్పఫణామణి రమణి సీత, ధరణిజా జీవితా తప తరణిస్వామి’ అని విశ్వనాథవారు సీతారాముల్ని అద్వైత ప్రేమమూర్తులుగా, ఆదర్శ దంపతులుగా అభివర్ణించారు. ‘రాముడు లోకాభిరాముడని’ రామాయణ కథాగానం చేస్తూ ‘అందరికీ రక్షకుడితని దెలిసి కొలువరో’ అని త్రేతాయుగంలోని శ్రీరామచంద్రుని, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరుని యందు చూస్తూ, హరి సంకీర్తనాచార్య అన్నమయ్య చేసిన గానం – శ్రీరామ నవమికి- మనకిస్తుంది – శ్రీరామరక్ష. ……… లక్ష తలంబ్రాల ప్యాకెట్లు సిద్ధం కల్యాణ వేడుకలను తిలకించేందుకు ఈ ఏడాది సుమారు రెండు లక్షల మంది వస్తారని అంచనా వేసి, అందుకు తగ్గట్టుగా సౌకర్యాలను కల్పించినట్లు భద్రాచలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె.జ్యోతి తెలిపారు. భక్తుల కోసం లక్ష తలంబ్రాల ప్యాకెట్లు సిద్ధం చేశారు. అందరికీ ఉచిత భోజనం అందజేస్తారు.

