|
|
ఆవుపేడను ఎరువుగా మార్చి సబ్సిడీ రేట్లపై రైతులందరికీ పంపిణీ చేయాలి. దీని వల్ల సేంద్రియ ఎరువుల పట్ల రైతులోకంలో సానుకూలత ఏర్పడుతుంది. గోవులను పెద్ద సంఖ్యలో పోషించడానికి ప్రోత్సాహకంగా పనిచేస్తుంది… గోవులతో సమకూరే ఆర్థిక ప్రయోజనాలను మరింతగా మెరుగ్గా పొందేందుకు తోడ్పడే విధానాలకు ప్రభుత్వం ప్రాధాన్యమివ్వాలి.
గోవులను సంరక్షించడానికి ప్రభుత్వం నిబద్ధమయింది. పచ్చిక బయళ్లను మేయడానికి ఆవులు ఆరాటపడతాయి. పంటల నుంచి ఉత్పత్తయ్యే ఎండుగడ్డిని ఆవులకు ఆహారంగా వేస్తారు. అయితే గడ్డి నుంచి తయారయ్యే ఎరువు భూసారాన్ని శ్రేష్ఠంగా ఉంచడానికి సరిపోదు. పచ్చిక మేత నుంచి ఉత్పత్తయ్యే ఎరువును దీనికి అదనంగా చేర్చుతారు.
మన గ్రామాల్లో ఉమ్మడి పచ్చిక భూములు (మేత పొరంబోకులు) ఉంటాయి. ఆ భూముల్లో గోవులతో సహా అన్ని పశువులు మేత మేస్తుంటాయి. ఎండుగడ్డిరూపంలో వాటికి మరింత ఆహారాన్ని ఇవ్వవలసిన అవసరముండదు. గోవులను ఆ భూములకు తీసుకుకువెళ్ళి, రోజంతా మేసిన తరువాత తిరిగి ఇళ్ళకు తీసుకు వస్తుంటారు. ఈ శ్రమకయ్యే వ్యయం అత్యంత స్వల్పం. రైతులకు, గోవులు, ఇతర పశువులు పాలు, ఎరువును ఎటువంటి ఖర్చులేకుండా సమకూర్చుతాయి. తద్వారా రైతులు ఇతోధిక లబ్ధి పొందేవారు. గోవులు పచ్చిక బీళ్ళను మేయడం, గడ్డిని వినియోగించుకోవడం ద్వారా ఉత్పత్తయ్యే ఎరువు భూసారాన్ని పరిరక్షించడానికి, పరిపుష్ఠం చేయడానికి సరిపోతుంది.
మన గ్రామాల్లో ఇదంతా ఒకనాటి పరిస్థితి. వర్తమానం భిన్నమైనది. ఉమ్మడి పచ్చిక భూములను ఇతర ప్రయోజనాలకు మళ్ళించారు. ఆర్థికంగా, రాజకీయంగా శక్తిమంతులైన వారు ఆ ఉమ్మడి భూములను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వాలు సైతం పాఠశాలల నిర్మాణానికి, ఇతర ఉపయోగాలకు ఆ ఉమ్మడి భూములను విరివిగా ఉపయోగించుకున్నాయి. తత్ఫలితంగా గోవులకు ఇప్పుడు పచ్చిక భూములనేవే లేకుండా పోయాయి. పచ్చికమేత నుంచి ఎరువు తయారీ గణనీయంగా తగ్గిపోయింది. వ్యవసాయక్షేత్రాల నుంచి ఉత్పత్తి చేస్తున్న ఎండు గడ్డి గోవులకు ప్రధాన ఆహారవనరుగా ఉన్నది. గోవులు ఉత్పత్తి చేసే ఎరువులు బాగా తగ్గిపోవడంతో రైతులు రసాయన ఎరువులపై మరింతగా ఆధారపడసాగారు. రసాయన ఎరువుల వాడకానికి బాగా అల వాటు పడి ఆవు పేడను పోగుచేయడం, నిల్వచేయడం, పొలాల్లో ఎరువుగా ఉపయోగించడం మొదలైన పనులపట్ల విముఖత పెంచుకున్నారు. రసాయనఎరువులను వెదజల్లడం చాలా తేలిక. దీంతో పంటలసాగుకు అవసరమైన ఎరువుల ఉత్పత్తికి గోగణాలపై ఆధారపడాల్సిన పరిస్థితి రైతులకు లేకుండా పోయింది.
రసాయన ఎరువులపై ప్రభుత్వం సమకూరుస్తున్న సబ్సిడీలు రైతులకు అంతగా తోడ్పడడం లేదు. 1960వ దశకంలో కరువులు, కాటకాలు విజృంభించినప్పుడు రైతులను ఆదుకోవడానికి ఈ సబ్సిడీలను ప్రవేశపెట్టారు. అప్పటి విపత్కర పరిస్థితిని బట్టి ఆ సబ్సిడీలు అత్యావశ్యకమయ్యాయి. అయితే ఆ క్లిష్ట పరిస్థితిని అధిగమించిన తరువాతకూడా ఆ సబ్సిడీలను కొనసాగిస్తున్నారు. దీంతో రసాయన ఎరువుల ఉపయోగమే బాగా లబ్ధికరంగా ఉం దనే విషయాన్ని రైతులు గ్రహించారు. పొలానికి అవసరమైన పరిమాణంలో ఎరువును ఉత్పత్తిచేసేందుకు పెద్ద సంఖ్యలో ఆవు లను పోషించే సంప్రదాయానికి స్వస్తి చెప్పారు వాజపేయి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చెందిన దేశాల నుంచి పేడను దిగుమతి చేసుకోవాలనే ప్రతిపాదన ఒకటి పరిశీలనకు వచ్చింది. అయితే ఆ ప్రతిపాదనకు ప్రతిపక్షాల నుంచే కాక ప్రభుత్వంలోని కొన్ని వర్గాల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. ఆవు పేడ దిగుమతికి ప్రభుత్వం తిరస్కరించింది. ఆ నిర్ణయం పెద్ద పొరపాటని నేను భావిస్తున్నాను. ఆవుపేడ నుంచి తయారయ్యే సేంద్రియ ఎరువులు భూసారాన్ని పరిరక్షించడంలోను, పరిపుష్ఠం చేయడంలోనూ అత్యంత ప్రభావశీలంగా ఉంటాయి. ఎన్-పి-కె వంటి కృత్రిమ ఎరువులు భూసారానికి తోడ్పడే (భూమిలోని) సూ రక్ష్మపాణులను హరించి వేస్తాయి. తత్ఫలితంగా భూసారం క్షీణిస్తుంది. రసాయన ఎరువుల వాడకాన్ని మనం బాగా తగ్గింంచివేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆవుపేడను దిగుమతి చేసుకొని దాన్ని ఎరువుగా మార్చి సబ్సిడీ రేట్లపై రైతులందరికీ పంపిణీ చేయాలి. దీనివల్ల సేంద్రియ ఎరువుల పట్ల రైతులోకంలో సానుకూల అభిప్రాయమేర్పడుతుంది. గోవులను పెద్ద సంఖ్యలో పోషించడానికి ప్రోత్సాహకంగా పనిచేస్తుంది. వెరసి భూసారాన్ని బాగా కాపాడడానికి ఇతోధిక మేలు జరుగుతుంది.
గ్రామీణ ఉపాధిహామీ పథకంవల్ల వ్యవసాయ కూలీలకు పెద్ద మొత్తంలో కూలీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు పిల్ల లందరికీ విద్యను సమకూర్చడానికి తల్లితండ్రులు అధిక శ్రద్ధచూపుతుండడం వల్ల గోవులను మేతకు తీసుకువెళ్ళే బాలల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ఈ పరిస్థితిలో గోవులను పోషించడమనేది రైతులకు పెద్ద భారంగా పరిణమించింది. గోవుల కంటే గేదెలను పోషించడం లాభదాయకమని రైతులు భావిస్తున్నారు. గేదెలను రోజంతా చావిడిలోనే కట్టివేసి ఇంత ఎండు గడ్డి పడేస్తే చాలు. అవి భారీగా పాలను ఉత్పత్తి చేస్తాయి. జెర్సీ లాంటి విదేశీ సంతతి ఆవుల కూడా మన గేదెల వలే స్థాన బద్ధంగా ఉంటాయి. ట్రాక్టర్ల మూలంగా ఎద్దుల అవసరం లేకుండా పోయింది. ట్రాక్టర్ సహాయంతో వంద ఎకరాలనైనా అతి తక్కువ సమయంలో దున్నే సదుపాయం, సౌలభ్యం లభించింది. తత్ఫలితంగా సాగుచేసే భూమి విస్తీర్ణం గణనీయంగా పెరిగింది.
అయితే దీనివల్ల గోవుల పురుష సంతానం సమస్యాత్మకంగా పరిణమించాయి. అవి ఆర్థికంగా ఉపయోగకరమైనవి కావు. అయితే వాటిని హతమార్చడానికి వీలులేదు. కాగా గేదెలకు సంతానాన్ని ఆహారానికి ఉపయోగించుకోవడంపై ఎటువంటి ఆంక్షలు లేవు. కనుకనే రైతులు గోవులకు బదులు గేదెలను పెంచి పోషించడానికి మొగ్గుచూపుతున్నాడు. చెప్పవచ్చిన విషయమేమిటంటే గోవులతో సమకూరే ఆర్థిక ప్రయోజనాలను మరింత మెరుగ్గా పొందేందుకు దోహదం చేసే విధానాల రూపకల్పన, అమలుకు ప్రభుత్వం ప్రాధాన్యమివ్వాలి.
|

