|
ప్రభుత్వ పరిశీలనలో చారిత్రక పట్టణం
ఈ పేరు వైపే ముఖ్యమంత్రి చంద్రబాబు మొగ్గు
ఆంధ్రుల రాజధాని, పంచారామం,
బౌద్ధ నగరం కూడా
ఎన్టీఆర్ పేరును ఎలా కలపాలని అంతర్మథనం
ఇంకా కొలిక్కిరాని ఆలోచన
త్వరలో అధికారిక ప్రకటన
జూన్ 2లోపు ఖరారు చేసే అవకాశం
హైదరాబాద్, గుంటూరు, అమరావతి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): అమరావతి..! పంచారామాల్లో ప్రధానమైన ఆరామం! ఆంధ్రుల (శాతవాహనుల) రాజధాని! చింతపల్లి జమీందార్ వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు రాజధాని! భారతదేశంలో బౌద్ధుల రాజధాని! అంతర్జాతీయ బౌద్ధ పర్యాటక క్షేత్రం! స్వర్గ లోకాధిపతి ఇంద్రుడి రాజధాని పేరు కూడా ఇదే! ఇప్పుడు అమరావతి మరో ప్రత్యేకతను సంతరించుకోనుంది. నవ్యాంధ్రప్రదేశ్ రాజధానికి ‘అమరావతి’ అనే పేరు పెడితే ఎలా ఉంటుందన్న అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. రాజధానికి రెండు, మూడు పేర్లు ప్రతిపాదనకు వచ్చినా, చారిత్రక ప్రాశస్త్యం దృష్ట్యా అమరావతి పేరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు మొగ్గు చూపుతున్నారు. విజయవాడ- గుంటూరు నగరాల మధ్య కృష్ణా నది ఒడ్డున కొత్త రాజధాని నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం భూ సేకరణ చేసిన విషయం తెలిసిందే. ఇదే ప్రాంతంలో పూర్వ కాలంలో ఆంధ్రుల రాజధాని నగరం ధాన్య కటకం విలసిల్లినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. తర్వాత దాని పేరు అమరావతిగా మారింది. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతమైన తుళ్లూరుకు అతి సమీపంలోనే అమరావతి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే, కొత్త రాజధానికి అమరావతి పేరు పెడితే చారిత్రక ప్రాధాన్యం కల్పించినట్లు అవుతుందని, తెలుగువారి గత కీర్తిని చాటినట్లు అవుతుందన్న ఆలోచనలో ప్రభుత్వ వర్గాలు ఉన్నాయి. అయితే, ఈ ప్రాంతానికి దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పేరును కూడా జోడించాలన్న అభిప్రాయంతో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. తెలుగువారి కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింపచేసిన ఎన్టీఆర్ పేరును కొత్త రాజధానికి ఏదో రూపంలో పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిలషిస్తున్నారు. అది ఏ రూపంలో అన్న విషయం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. కోర్ రాజధాని ప్రాంతాన్ని ఒక జిల్లాగా చేసి దానికి ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టాలని, రాజధాని పేరును అమరావతిగా నిర్ణయించాలని కొందరు సూచించారు. తారకరామ పురి అన్న పేరు పెట్టాలని మరికొందరు ప్రతిపాదించారు. కొత్త రాజధాని నిర్మాణానికి ఈ ఏడాది జూన్ రెండో తేదీన శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. అప్పటికి రాజధాని పేరును ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. కొత్త రాజధానికి అమరావతి పేరు పెడితే బాగుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిలషిస్తున్నారని, ఇది ఆయన మనసులో ఉన్న అభిప్రాయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అసెంబ్లీ లాబీల్లో సోమవారం ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా చర్చిస్తూ ఈ విషయం చెప్పారు. ఒక దశలో, రాజధాని ప్రాంతంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లోనే ఈ పేరు ప్రకటిస్తే ఎలా ఉంటుందని ముఖ్యమంత్రి భావించారని, కానీ, దీనిపై మరి కొంత అధ్యయనం అవసరమన్న అభిప్రాయంతో వాయిదా వేసుకొన్నారని తెలిపారు. కొత్త రాజధానికి దివంగత ఎన్టీఆర్ పేరును ఎలా జోడించాలన్న దానిపై ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారని ఆయన చెప్పారు.
ఎప్పుడో అంతర్జాతీయ ఖ్యాతి
అమరావతి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మాత్రమే కాదు.. ప్రపంచ పర్యాటక కేంద్రం కూడా. క్రీస్తుశకం రెండో శతాబ్దంలో ఇది ఆంధ్రుల రాజధానిగా విలసిల్లింది. ధాన్యకటకం పేరుతో శాతవాహనుల చివరి రాజైన గౌతమీపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి దక్షిణ భారతావనిని పరిపాలించారు. 1795లో చింతపల్లి జమీందార్ వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు ధరణి కోటలో ఉన్న అమరేశ్వరస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసి దానికి సమీపంలో అమరావతి అనే నూతన రాజధానిని నిర్మించారు. శాతవాహనుల రాజధానిగానూ ప్రపంచ ప్రఖ్యాత బౌద్ధారామంగానూ అమరావతికి అంతర్జాతీయంగా ప్రఖ్యాతి ఉంది. ఇప్పుడు ఇది నవ్యాంధ్ర రాజధానిగా మారితే, ఆసియా ఖండంలోని వివిధ దేశాలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే అవకాశం ఉంది. నవ్యాంధ్ర రాజధానికి అమరావతి పేరు పెడితే బౌద్ధ మత గురువు ద లైలామా ద్వారా ప్రత్యేక నిధులు వస్తాయనే ప్రచారం గతంలో జరిగిన విషయం తెలిసిందే.
అమరావతి పురాణ గాథ
హిరణ్యాక్షులు, బలి చక్రవర్తి, నరకాసురుడు, రావణుడు తదితర రాజులను మహా విష్ణువు వివిధ అవతారాలతో సంహరించాడు. తమ పూర్వీకులందర్నీ మహా విష్ణువు సంహరించినందున, ఆయనపై పగ సాధించాలని అదే వంశానికి చెందిన తారకాసురుడు నిర్ణయించుకున్నాడు. మహా విష్ణువుతో యుద్ధం చేయడానికి తన బలం చాలదని గ్రహించి పరమశివుడి కోసం ఘోర తపస్సు చేశాడు. పరమేశ్వరుని మెప్పించి ఎవరితోనూ, ఎట్టి ఆయుధముతోనూ, ఎప్పుడూ సంహరించకుండా ఉండేలా వరం కోరాడు. దాంతో, దేవదానవులు సముద్రాన్ని మథించినప్పుడు ఉద్భవించిన అమృత లింగాన్ని ఈశ్వరుడు తారకాసురుడికి ఇచ్చాడు. అది యథాతథంగా ఉన్నంత వరకు నీ ప్రాణానికి ముప్పు లేదని వరమిచ్చాడు. అనంతరం తారకాసురుడు దేవతలపై యుద్ధం ప్రకటించాడు. అతడి నుంచి కాపాడాలని దేవతలు మొరపెట్టుకున్నారు. వారికి సైన్యాధిపతిగా కుమారస్వామి తారకాసురునిపై దండెత్తి అతని కంఠంలో వేలాడుతున్న అమృత లింగాన్ని ఛేదించాడు. దాంతో, అమృత లింగం ఐదు ప్రదేశాల్లో పడింది. వాటిలో పెద్ద ముక్క పడిన ప్రదేశమే అమరావతి. ఇక్కడ స్వర్గలోకాధిపతి ఇంద్రుడు లింగాన్ని ప్రతిష్టించడంతో దానికి అమరారామంగా, ఆయన రాజధాని అయిన అమరావతిగా పేరు వచ్చింది. కాగా, ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి పేరు పెట్టాలని ప్రభుత్వం యోచిస్తుండడంపై గుంటూరు జిల్లాలో హర్షం వ్యక్తమవుతోంది.
అమరావతి పేరు హర్షణీయం: మాజీ మంత్రి డొక్కా
ఏపీ నూతన రాజధానికి అమరావతి పేరు పెట్టాలనుకోవటం హర్షణీయం. క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్దం నుంచి క్రీస్తు శకం 12వ శతాబ్దం వరకు అమరావతి వైభవోపేతంగా అలరారింది. అలాగే, అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా నిర్మించనున్న అసెంబ్లీ భవనానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టాలి. అసెంబ్లీ ఎదుట జాతిపిత మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేసి, రాజధాని భవన సముదాయానికి ఎన్టీఆర్ ప్రాంగణంగా నామకరణం చేయాలి.
ప్రవాసాంధ్రుల హర్షం
బెంగళూరు, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ఏపీ రాజధానికి అమరావతి పేరు పెట్టాలని ప్రభుత్వం భావిస్తుండడంపై ప్రవాసాంధ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చారిత్రక అమరావతి పేరు నవ్యాంధ్రకు అన్ని విధాలా సరిపోతుందని కర్ణాటక తెలుగు ప్రజా సమితి అధ్యక్షుడు బొందు రామస్వామి పేర్కొన్నారు. భూగోళం ఉన్నంతవరకు చంద్రబాబు కీర్తి వర్ధిల్లాలని కోరుతున్నట్లు తెలిపారు.
|

