‘’నవ్యాంధ్ర ప్రదేశ్ ‘’ పై సరసభారతి 15-3-15 ఆదివారం నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనం –కవితలు-3
14-పారిపో కోయిలా పారా హుషార్ –శ్రీమతి గుడ్లవల్లేటి కామాక్షి –కోసూరు
అమ్మమ్మ చెప్పింది చిట్టికి –కాకి పిచ్చుక కధ
చిట్టికి వచ్చింది సందేహం –పిచ్చుక అంటే కాకి కంటే పెద్దదా చిన్నదా ఏ రంగు అని ?
చిన్న బోయిన అమ్మమ్మ మనసు వెళ్ళింది –తన చిన్ననాటి పిచ్చుక గూటికి
పూరింటి చూరుల్లోని పిచుక గూళ్ళు –వసారాలో కట్టిన వరి కంకులు తినే పిచ్చుక
గదిలో అద్దం లో ప్రతి బింబాన్ని పొడిచే పిచ్చుక
పెరటి తోటలో ఆహారపు వేటలో పిచ్చుక
చిన్ని పిచ్చుకపిల్ల నోటిలో ఆహారం పెట్టె తల్లి పిచ్చుక
నేడు ఏదీ ఏదీ ఏదీ ఆ పిచ్చుక ?
యేమని చెప్పను ?నాగరక ఆధునిక మానవుడి చర్యలే
అయ్యాయి నేడు పిచ్చుక పై బ్రహ్మాస్త్రాలు
కోయిలమ్మ కుహూ కుహూ లతో ఉలికి పడి అరచి౦ది అమ్మమ్మ
‘’పారిపో కోయిలా పారా హుషార్ ‘’
ఆమని రాకను తెలిపే నీ కమ్మని గొంతు
నేటి మావి చిగురు తింటే ఏమవుతుందో ?
నీ కుహూ కుహూలు వినక పోయినా ఆనందిస్తా నీవు క్షేమమని
పోనీలే —సరసభారతి కవికోయిలల కుహూ కుహూలతో పరవశిస్తా
పారిపో కోయిలా పారిపో పారాహుషార్ .
15-నవ్యాంధ్ర తేజం–విద్వాన్ శ్రీ నవులూరి రమేష్ బాబు –ఉయ్యూరు
శా-శ్రీ మన్మధ వత్సరాద్భుత శుభాశీర్వాద సౌభాగ్యతన్ -ప్రామాన్యైక నిబద్ద నిత్య నికషా ప్రాగాల్భ్యమున్ బెంచగా
దీమంతోజ్వల కార్య తంత్ర తతులన్ దేదీప్య మానంబుగా –సీమంతోద్వహ శోభలం దనరుచున్ సీమాంధ్ర వేల్గొందుతన్.
కం –జయ సంవత్సర మిచ్చే ,విజయ మీ సీమాంద్రకు –భువి జయకేతనమై
రయముగ దలుచును సహజ –దయయను గుణముబెరుగుచు ధన్యత నొందన్ .
తీ.గీ.-వీర బొబ్బిలి సీమయై వెల్గు సీమ –పచ్చనౌ కోనసీమయు ,పట్టిసీమ
రాయలేలిన సీమ ,పల్నాటి సీమ –పరగ ‘’దివి సీమ ‘’ఏకమై భవ్య రీతి
ఎన్న సీమాంధ్ర పేరున సన్నుతి గనె .
తే గీ –ఇట్టి సీమాంధ్ర యాత్మయై కట్టే విడచి శుభ్ర సుందర యౌవన శోభ దనరు
నూతన శరీరమున జేరే నాతత శత –పూర్ణ సంకాశ శీర్ణ సంపూజ్య గాగ .
సీ-కలకల కూయు కోకిలములే గలవిట-ఖిలము వెదికేడి గబ్బిలము లేదు –
చివ్వకు జే సాచు సింహమ్ము లే గాని -అదరెడు గ్రామ సింహాలు లేవు
ప్రతిభ ప్రదర్శించు ప్రజ్ఞానులేగాని –మంకుతనమనెడు మాట లేదు
త్యాగ ధనము గణన భాగ దేయులే గాని –లేకి మూకల గోల లేనే లేదు
తీ.గీ –ఇన్ని సుగుణమ్ములచ్చటేయేక మగుచు –పుణ్య గణ్య మౌ నవ్యాంధ్ర పూత చరిత
స్వచ్చ భారత నిర్మాణ సౌరభంబు –పంచి పెట్టుత నింక ప్రపంచమునకు .
మత్తకోకిల –మంద మారుత సస్య పూర్ణత మాన్యతన్ గలిగి౦చ గా –ఎంద రేడ్చిన గాని నిత్యము నేపుగా జనువృక్షమై
అంద గించెడి పుణ్య భూమిగ నాంధ్ర సీమ నమేయమౌ –సుందరమ్ముగ సంతరి౦చగ సోదరా !ఇక లెమ్మురా!
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-3-15- ఉయ్యూరు

