నా దారి తీరు -93 స్టాఫ్ పరిచయం

నా దారి తీరు -93

స్టాఫ్ పరిచయం

మంగళాపురం లో చేరాను .అప్పటిదాకా హెడ్ మాస్టారుగా ఉన్న జోశ్యులు గారు రిటైర్ అయితే ఆ పోస్ట్ లో నన్ను వేశారు .ఆయన కు చాలా మంచి పేరుఉంది .స్కౌట్ లో రాష్ట్రం లోనే ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నవారు .అయితే స్కూల్ చిన్నదే .అన్నీ సింగిల్ సేక్షన్లే .అంతా వెనకబడిన విద్యార్ధులే  ఎస్ సి ఎస్ టి లు ఎక్కువ .స్కూల్ ఆదాయం ఏమీలేదు .ఇంచార్జ్ గా ఉన్న ఘంటసాల నేటివ్ అయిన సైన్స్ మేస్టార్  పాలు దగ్గర నేను చార్జి తీసుకొన్నాను .ఆయన నంబర్ వన్ బద్ధకిస్ట్  .బయాలజీ వాడు .ఫిజికల్ సైన్స్ తో ఏ ప్రవేశం లేనివాడు .ఇక పిల్లలకేం చెబుతాడు ?లేక్కలాయనా ఘంటసాల వాడే. వెంకటేశ్వర రావు అని జ్ఞాపకం .వీళ్ళిద్దరికీ కుల వైరం .ఒకరితో ఒకరు మాట్లాడుకోరు ఒకరిపై ఇంకొరు చాడీలు చెప్పేవారు .సోషల్ మేష్టారు కూడా వెంకటేశ్వరరావు .చాలాకాలం నుంచి ఇక్కడే  పని చేస్తున్నాడు .ఈయన గౌడ. లేక్కలాయన గొల్ల .జాతివైరం వీరిద్దరికీ .తెలుగు మేష్టారు ముదిగొండ మల్లికార్జున రావు  . బందరునుండి రోజూ టివి ఎస్ మీద వచ్చేవాడు .మంచికవి గాయకుడు ఎక్స్ట్రా కరిక్యులర్ కార్యక్రమాలు బాగా చేసేవాడు బాగా ఆయాసం మనిషి ఊపిరి పీల్చతమే కష్టంగా ఉండేది .బందరు లో  బాలానందం అనే స్కూల్ నడుపుతున్నాడు గొడుగు పేటలో .భార్య సీతారావమ్మ కవి తెలుగుపండిట్ ఆవిడే ఆ స్కూల్ చూస్తుంది . క్రాఫ్ట్ మేష్టారు కూడా మల్లికార్జున రావు .చల్లపల్లి  నుండి వస్తాడు .ఇక్కడ యెన్ డి ఎస్ పోస్ట్ కూడా ఉంది .అర్జున రావు అనే ఆయన ఎం.డి .ఎస్ .దగ్గరే ఉన్న పెదకళ్ళేపల్లి నుండి వస్తాడు .డ్రాయింగ్ మాస్టారు బంగారు పని చేసే వ్రుత్తి పాండురంగా చార్యులు ఈయనా కల్లెపల్లినుండే అప్ అండ్ డౌన్ సైకిల్ మీద .చాలా మంచివారు .డ్రిల్ మాస్టారు ఉమామహేశ్వరరావు కమ్మవారు  .చల్లపల్లిదగ్గర రామాపురం నుండి వస్తాడు.డ్రిల్లుకు ఎండిఎస్ కు పడదు. ఎప్పుడూ పితూరీలే  .సెకండరీ గ్రేడ్ టీచర్ లలో ఒకావిడ సోషల్ మేస్టారి భార్య అని గుర్తు . రెండో ఆవిడ  క్రాఫ్ట్ మేస్టారిభార్య అనిజ్ఞాపకం .గుమాస్తా కరీం –బందరు నుండి వచ్చేవాడు. కాలేఖాన్ పేట వాడు .సీనియర్ అయినా భయస్తుడు . కల్లేపల్లి ఆంజనేయులు నైట్ వాచ్ మాన్ ..ఇతనిది  సర్వీస్ అంతా ఇక్కడే మేనల్లుడికి కూతురు నిచ్చి పెళ్లి చేశాడు వాడు అమాయకుడు తన తర్వాత ఆపోస్ట్ అతనికి వేయించాలనే ఆలోచన .అటెండర్ వెంకటేశ్వరరావు లోగడ వత్సవాయి లో నా దగ్గర పని చేసిన లక్ష్మీ పురం వాడు .మంగళాపురానికి లక్ష్మీపురానికి రెండుకిలో మీటర్ల దూరం .అతనికి అక్కడ ఇల్లు పొలం ఉన్నాయి తల్లి ,భార్యా పిల్లలు ఉన్నారు .దారిలోనే రోడ్డుమీదే ఇల్లు .ఇలాంటి అస్తవ్యస్త పరిస్తితులలో స్కూల్ లో చేరాను .ఇక్కడ శాశ్వతం గా ఉండిపోవాలనే కోరిక కూడా నాకు లేదు .కనుక కాలక్షేపం చేసి బయటపడటమే .కాని ఉన్నన్ని నాళ్ళు నాప్రత్యేకత చూపాలి .అదే నా దారి.

ఇంగ్లీషు, సైన్సు బోధన

మెయిన్ బిల్డింగ్ లో  హెడ్ మాష్టారి రూమ్  సైన్స్ రూమ్ ఉన్నాయి . మిగిలిన క్లాసులన్నీ రేకుల షెడ్ లోనే . స్కూల్ కు గేటు కాంపౌండ్ వాల్ కూడా లేవు .వ్యవసాయ భూములున్న ప్రదేశం కనుక పశువులన్నీ పాఠ శాలలోనే ఉండేవి వీటిని రాకుండా చేయటానికి చాలా శ్రమ పడాల్సి వచ్చేది .అటెండర్ మంచివాడేకాని జాదూ .అర్జునుడు కస్టపడతాడుకాని కబుర్ల పోచికోరు కోటలు దాటతాయి మాటలు .భారీ పర్సనాలిటీ .ముందు పిల్లలను దారిలో పెట్టాలనుకొన్నాను .నేనే పదవ తరగతికి ఫిజికల్ సైన్స్ ,ఇంగ్లీష్  వేసుకొని బోధించటం ప్రారంభించాను .సాధారణం గా హెడ్ మాస్టర్లు ఒక అయిదు పీరియడ్లు టెన్త్ పోయిట్రీ వేసుకొని కాలక్షేపం చేస్తారు .నేను దీనికి విరుద్ధం గా ఫిజికల్ సైన్స్ కూడా తీసుకొని చాలేన్జీగా పని చేశాను .పిల్లలకు అసలు ఫిజిక్స్ మీద అవగాహన లేదు .అందుకని చాలాకస్టపడాల్సి వచ్చేది.చెప్పటం చెప్పించటం అప్పగించుకోవటం బ్రీఫ్ గా నోట్స్ డిక్టేట్ చేయటం చేసి గాడిలో పెట్టాను .క్లాసుకు వెడితే సబ్జెక్ట్ రాకపోతే ఊరుకొనే వాడిని కాను. రోజూ ఒకటి ర్రెండు ప్రశ్నలకు సమాధానాలు ఇంటి దగ్గర రాసుకొచ్చి చూపాల్సిందే  .రెండు నెలలు ఆయె సరికి అందరూ దారికోచ్చారు .నెమ్మదిగా మాస్టార్లు కూడా గాడిలోపడ్డారు కంప్లైంట్లు పోయి పని చేయటం మొదలుపెట్టారు .నెలకు రెండుసార్లు స్టాఫ్ మీటింగ్ పెట్టి క్లుప్తం గా ప్రసంగించి కర్తవ్యమ్ చెప్పి చేయిన్చేవాడిని .’’బేఫరవా’’ జీవితం లోంచి మామూలు జీవితం లోకి వచ్చారు అందరూ .ఐకమత్యం సాధించాను .విద్యార్ధులలో గౌరవం పెరిగింది .వాళ్ళు నేనేది చెబితే అది చేసే స్తితికి వచ్చారు .స్కూల్ కు మంచి చేస్తున్నారు హెడ్ మాస్టారు ఇదివరకు ఎవరూ చేయని పనులు చేస్తున్నారని కొత్తపద్ధతులతో ఆకర్షణీయం చేస్తున్నారని వాళ్ళ మనస్సుల్లో పడిపోయింది .కొట్టినా తిట్టినా కిమిన్నాస్తిగా ఉన్నారు .లేక పొతే ఇక్కడ చాలా ప్రమాదం. ఇది కమ్యూనిస్ట్ అగ్రనాయకుడు చండ్ర రాజేశ్వర రావు గారి స్వగ్రామం .ఆయన ఇల్లు స్కూలుకోచ్చేదారిలోనే ఉంది .చండ్ర వారి కుటుంబాలున్నాయి .మైనం పాటి వారూ బాగా సంపన్నులు .

చల్లపల్లి టు మంగళాపురం టు కళ్ళే పల్లి

మంగళాపురం కు ఉయ్యూరు నుండి రావాలంటే అవనిగడ్డ బస్ ఎక్కి చల్లపల్లి లో దిగి అక్కడ ప్రైవేట్ బస్ ఎక్కి రావాలి ఈ బస్సు చల్లపల్లిలో బయల్దేరి లక్ష్మీ పురం మీదుగా మంగళా పురం వచ్చి అక్కడినుండి పెదకళ్ళీ పల్లి వెడుతుంది .ఇరుకు దారి చిన్న వంతెనలు .బస్ ఎప్పుడూ రద్దీ .కల్లేపల్లి లో ఒరిఎంటల్ హైస్కూల్ ఉంది .హెడ్మాస్టారు సైన్స్ మేస్టారే నాకు పరిచయం ఉంది ఎప్పుడూ ముక్కుపొడి పీలుస్తూ పంచ అంతా  ముక్కుపొడి తో కనిపిస్తారు .రామభాద్రాచార్యులు ఇంగ్లీష్ లో నిధి అ తర్వాత చాలా ప్రమోషన్లు పొంది హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు ఇంగ్లీష్ఓరి ఎంటేషన్క్లాసులు చెప్పేవారు టీచర్స్ కు. చల్లపల్లిలో బస్సు ఒక్కోసారి సమయానికి బయల్దేరదు .ఇది లేకపోతె చల్లపల్లిలో  బందరు బస్ ఎక్కి లక్ష్మీ పురం దిగి అక్కడ ఆతోలేక రిక్షా ఎక్కి మంగళా పురం రావాలి .చల్లపల్లి నుండి ఇక్కడికి రావటం చాలా ప్రయాస తో కూడి ఉండేది సమయానికి ఏవీ అందేవికావు .నేను లక్ష్మీపురం ఏదో రకం గా చేరి అక్కడ అటెండర్ వెంకటేశ్వర రావు ఇంటికి వెళ్ళేవాడిని వాళ్ళ ఇంట్లో కఫీకాని మజ్జిగ కాని ఇచ్చేవారు తాగి అతని సైకిల్ మీద మంగళాపురం చేరేవాడిని .ఉదయం తోమ్మిదిన్నరకల్లా స్కూల్ లో ఉండటం  నాధ్యేయం .అసెంబ్లీ జరిపించి పిల్లల్ని క్లాసులకు పంపటం అలవాటు .దానికే ఇబ్బందీ రాకుండా జాగ్రత్త పడేవాడిని .మేస్టార్లు కూడా సమయానికే వచ్చేవారు .వేసవికాలం లో ఒంటిపూట బడులలో మరీ ఇబ్బందిపడాల్సి వచ్చేది .ఉయ్యూరులో తెల్లవారుజామున మూడింటికే లేచి ప్రభావతి అన్నం వండి కూరలు చేసి కారేజి సర్ది ఇస్తే తీసుకొని హైదరాబాద్ అవనిగడ్డ బస్  ఉదయం నాలుగున్నరకే ఉయ్యూరులో ఎక్కి అయిదున్నరకు చల్లపల్లి చేరి అక్కడినుండి ప్రైవేట్ బస్ కోసం ఎదురు చూపులు చూడటం సరిపోయేది .విసుగొచ్చేది ఎందుకు అడిగాన్రా బాబూ మంగలపురం అనుకొనే వాడిని .

మళ్ళీ ఒకే గదిలో’’అమ్మాయి ఇంట్లో ‘’కాపురం

మామూలు రోజుల్లో స్కూల్ అవగానే కళ్ళేపల్లి  బస్ సాయంత్రం అయిదింటికి వచ్చేది .అది ఎక్కి చల్లపల్లి సెంటర్ లో దిగి బెజవాడ బస్ ఎక్కి ఉయ్యూరు చేరేవాడిని ఒక్కోసారి రాత్రి ఏడున్నర దాటేది .ఎందుకైనా మంచిదని అర్జునుడితో దగ్గరలో ఎక్కడైనా మంచి రూము దొరుకు తుందేమో చూడమన్నాను .చూశాడు మైనం పాటి వేణుగోపాల రావు గారిల్లు స్కూల్ కు అతి దగ్గర .అక్కడ ఒక రూమ్ నాకు ఇస్తామన్నారు .వెళ్లి చూశాను .వేణు భార్య విజయ అతని తండ్రి ఇద్దరు పిల్లలు ఉన్న కుటుంబం చాలా మంచిగా ఉన్నారు. నేను వాళ్ళ ఇంట్లో ఉండటం ఏంతో గొప్ప అనుకొన్నారు .నెలకు యాభై లేక అరవై రూపాయల అద్దె  .పాలిష్ రాయి .విశాలమైన గది .సెప్టిక్ లెట్రిన్ బాత్ రూమ్ .వరండా .చాలాబాగా నచ్చింది .వంట సామాను తెచ్చుకొని దిగాను .నాకు ఉదయమే కాఫీ ,పెరుగు ,మధ్యాహ్నం టీ సాయంత్రం టీ వాళ్ళ ఇంట్లో ఏ టిఫిన్ చేసుకొంటే నాకు అది తెచ్చిపెట్టటం దొడ్లో పండిన కూరలు ఇవ్వటం విజయ నన్ను కన్న తండ్రి ని చూసినట్లు చూసింది .అందుకే విజయను’’ మా అమ్మాయి ‘’అనే అందరికీ చెప్పేవాడిని  చాలా మర్యాదగల వాళ్ళు భార్యా భర్తలు ఏంతో ఆప్యాయతను చూపారు .వేణు తండ్రిగారు కూడా ఏంతో మర్యాదగా ఉండేవారు .వ్యవసాయం పాడి అన్నీ ఉండేవి .వీరి ఇంటికి అటూ ఇటూ కజిన్ బ్రదర్స్ ఇళ్ళునాలుగూ ఒకే మోడల్ గా ఉండేవి .వారూ నేనంటే ఆత్మీయత ప్రదర్శించేవారు .ఒకాయన సంజీవరావు లక్ష్మీపురం షుగర్ ఫాక్టరీలో ఉద్యోగం .ఇంత అన్నం స్టవ్ మీద ఒండుకొంటే చాలు అన్నీ అమరిపోయేవి .అర్జునుడు పొద్దున్న సాయంత్రం వచ్చి ఇల్లు ఊడ్చి అంట్లు తోమి వెళ్ళేవాడు .స్వంత ఇంట్లో ఉన్నానన్న ఫీలింగ్ నాకు ఇక్కడ ఉండేది .వత్సవాయిలో పుల్లయ్య నాయుడు ,ఇల్లు పెనుగంచిప్రోలులో బాబుగారిల్లు ,ముప్పాళ్ళలో  సీతారావమ్మగారిల్లు ,గండ్రాయి లో భారతమ్మగారిల్లు ,ఇప్పుడిక్కడ ‘’మా అమ్మాయి ఇల్లు’’  నాపాలిటి గొప్ప ఆశ్రయాలవటం నా అదృష్టం కంటే వారి  సౌజన్యం అనే నేను భావిస్తాను .

లక్ష్మీపురం ఫాక్టరీ –చల్లపల్లి రాజా

ఈ ఫాక్టరీ ఉయ్యూరు కే సిపి వారి అధీనం లోనే నడుస్తోంది .ఫాక్టరీ లక్ష్మీపురం లో ఉంది .చిన్నదే .ఒకప్పుడు చల్లపల్లి రాజా శ్రీమంతు రాజా యార్ల గడ్డ శివరాం ప్రసాద్ బహద్దూర్ గారిది .వేలాది ఎకరాలలో చెరుకు పండించేవారు .తర్వాత ఉయ్యూరు షుగర్ ఫాక్ట రీకి అమ్మేశారు .శివగంగ అనే చల్లపల్లి బందరు రోడ్డులో బందరుకు దగ్గర గొప్ప శివాలయం రాజావారిదే .శివరాత్రి ఉత్సవాలు వైభవం గా జరిపేవారు .రాజావారు ఏనుగు అంబారీపై ఊరేగేవారు .గొప్ప రాజ ఠీవి దర్జా ఉన్నవారాయన జిల్లా బోర్డ్ ప్రెసిడెంట్ గా  కూడా పని చేశారు .రాష్ట్ర ప్రభుత్వం లో ఆరోగ్య శాఖా మాత్యులుగా సేవలందించారు .గొప్ప వితరణ శీలి .ఆయన దగ్గర పని చేసి బాగుపడని కుటుంబమే లేదు .తిరుపతి వేంకటకవులు ఇక్కడికి వచ్చి రాజాగారి సన్మానాలు అందుకోనేవారు .గరికపాటి కోటయ్య ,వగైరా సంగీత విద్వాంసులకు నెలవు చల్లపల్లికోట .కల్లేపల్లి శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి ఆలయం మహిమాన్వితమైనది .కృష్ణానది ఒడ్డునే ఉంటుంది .ఉత్సవాలు చాలాఘనం గా నిర్వహిస్తారు కదళీ వనమే కళ్ళే పల్లి అయింది .వేటూరి ప్రభాకర శాస్త్రిగారిది ,సంగీత విద్వాంసులు పారుపల్లి  వారిది సినీ సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణా మూర్తిగారిది ఈ ఊరే .దీని దగ్గరలోనే ఉన్న టేకు పల్లి లో సుస్వరాల హేల ఘంటసాల వెంకటేశ్వర రావు జన్మించారు .ఆయన శిలా విగ్రహాన్ని బాల సుబ్రహ్మణ్యం ఆవిష్కరించాడు .వేటూరి సుందర రామ మూర్తిగారిడీ ఈ ఊరేనండోయ్ .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -27-3-15 –ఉయ్యూరు

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.