|
|
‘ఆ రెండు వ్యాసాలపై ఈ రెండు మాటలు’ (వివిధ, మార్చి 23) అంటూ పి. రామకృష్ణ రాసిన లఘు వ్యాసం చదివిన తర్వాత ఈయనలో ఏ కొంతైనా సాహి త్య రసజ్ఞత ఉన్నదా! అని నాకనిపించింది. ‘అసంబద్ధ నిబద్ధత’- అంటూ ఏ అంశంపట్లా తనకు నిబద్ధత లేదని తన మాటలతోనే రుజువు చేసుకున్నారు.
ఆయన పేర్కొన్న పోలికో లేక ఉపమానమో ఏదైనా కావచ్చు. రాచపాళెం చంద్రశేఖర రెడ్డి అత్తయైుతే కిన్నెర శ్రీదేవి కోడలవుతారా! ఇందులో ఏమైనా ఔచిత్యం ఉందా! సలక్షణమైన మగతనం కలిగిన వ్యక్తిని అత్తతో పోల్చడమా? లక్ష పద్యాలు ధారణ చేసిన డాక్టర్ మేడసాని మోహన్ వంటి విద్వత్కవి రాసిన మాటలకు స్పందించే తీరు ఇదేనా? మరి అవధాన ప్రక్రియను పనిగట్టుకొని విమర్శించడంలో రామకృష్ణ ‘అత్తల’ వరుసలో చేరుతారా? లేక కోడళ్ళ వరుసలో చేరుతారో వారి విచక్షణకే
వదిలేద్దాం.
‘తెలుగు సాహిత్యవేత్తలు మాత్రం అవధానాలు తెలుగు పద్యం గౌరవ ప్రతిష్టల్ని దిగజార్చాయని గుర్తించారు’ – అనడం కేవలం రామకృష్ణ దుస్సాహసం. వారి వాదానికి అనుకూలంగా ఎక్కడో ఒక రాయప్రోలు వారిని ఉదహరిస్తే సరిపోతుందా? ‘వానలో తడువని వారు, మా గురువులు చెళ్ళపిళ్ళవారి అవధాన పద్యధారలో తడవని వారు లేరు’ అన్న తాత్పర్యంతో గురు ప్రశంస చేసిన విశ్వనాథ సత్యనారాయణ గారినీ, ఇంకా ఇదే విధంగా పేర్కొన్న ఎందరో పెద్దల మాటలు ఒక్కసారి గుర్తుచేసుకోగలిగితే సత్యం బోధపడుతుంది.
‘మీడియా క్రికెట్‌కు ఇస్తున్న ప్రచారం అవధానాలకూ ఇవ్వాలన్న మేడసాని కోర్కె కొంత హాస్యాస్పదంగానూ, ఎక్కువ భయపెట్టేదిగానూ ఉంది’ – అంటూ రామకృష్ణ పేర్కొనడం బట్టి వారు భవిష్యత్తులో అవధాన ప్రక్రియకు మరింత ఆదరణ పెరుగుతుందేమో! అన్న భయం, ఆ ప్రక్రియ పట్ల ద్వేషం, అసూయ బాగా పెంచుకున్నట్లు తెలుస్తూ ఉంది. ఇటువంటివారు ఎంత గింజుకున్నా అవధాన ప్రక్రియకు భవిష్యత్తులో మరింత ఆదరణ పెరగడం తథ్యం. ఆ సూచనలు ఇప్పుడే కనిపిస్తున్నాయి. ప్రముఖ అవధానులు డాక్టర్ మేడసాని మోహన్, డాక్టర్ గరికపాటి నరసింహారావు, డాక్టర్ వద్దిపర్తి పద్మాకర్ ప్రభృతులు బుల్లి తెరపై ఏదో ఒక చానెల్లో నిరంతరం తెలుగు వారికి కనిపిస్తూనే ఉన్నారు. వారివారి ప్రతిభా పాండిత్యాలు తెలుగు వారికి రుచి చూపిస్తూనే ఉన్నారు. పైగా సంప్రదాయ సాహితీ ప్రక్రియలెన్నో బహుశ ప్రచారం పొందుతున్నాయి. ఇటువంటి ప్రక్రియలన్నీ అవధాన కళామతల్లి మానస పుత్రికలే. ఇవన్నీ పరిశీలిస్తే అవధాన ప్రక్రియపై రసజ్ఞ లోకంలో దిన దిన ప్రవర్ధమానవమవుతున్న ఆదరాభిమానాలు సువ్యక్తం. కాబట్టి అవధాన ప్రక్రియను పనిగట్టుకొని విమర్శించే వారి ఆలోచనలలో డొల్లతనం ఉండవచ్చు గాని అవధాన పద్యంలో కాదు – అని రసజ్ఞ లోకం గుర్తించగలదు.
చివరగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి మార్క్సిస్టు ధోరణిలో విమర్శలు రాసుకున్నా, రామకృష్ణ వంటి వారు వారిని పైకి విమర్శించినట్లు కనబడుతూ పరోక్షంగా అస్పష్ట విమర్శలు రాసినా – అందులోని మంచి చెడులను రసజ్ఞ లోకం విశ్లేషించుకోగలదు. కానీ పనిగట్టుకొని అవధాన ప్రక్రియను చిన్న చూపు చూడరాదు – అని మా విజ్ఞప్తి.
– శాఖమూరి రవిచంద్రబాబు
|

