ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -24

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -24

12-వాక్సినేషన్ ,ఫెర్మెంటేషన్ కనిపెట్టిన ఫ్రెంచ్ మైక్రోబయాలజిస్ట్ –లూయీ పాశ్చర్

బాల్యం

నిశ్చయమైన పట్టుదల ,అనంతమైన సహనం- కోమల స్వభావి అయిన లూయీ పాశ్చర్ ను ముందుకు నడిపించి అద్భుతాలు సాధించేట్లు చేశాయి .’’will, work ,wait ‘’అనే మూడుమాటలు మంత్రాలుగా అయన కృషికి తోడ్పడ్డాయి .ఫ్రాన్స్ దేశం లో జూరా ప్రాంతం డోల్ లో 27-12-1822 జన్మించిన పాశ్చర్ తండ్రి నెపోలియన్ సైన్యం లో ఒక సాధారణ సైనికుడిగా ‘’పెనిన్సులర్ వార్ ‘’లో పాల్గొన్నాడు .తర్వాత కులవృత్తి అయిన తోళ్ళ పరిశ్రమ(చర్మకార వృత్తి)లోనే ఉండిపోయాడు .తల్లి  తోటమాలి కుటుంబం లోంచి వచ్చింది .ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్ళు పుట్టినా లూయీ ఒక్కడే ఒక్కగానొక్క కొడుకు .కొడుకు పుట్టినతర్వాట కుటుంబాన్ని  ముందు మార్మోజ్ కు తర్వాత  ‘’టేనరింగ్’’పరిశ్రమకు అనుకూలమైన ఆర్బోయిస్ కు తండ్రి మార్చాడు .ఇక్కడికొచ్చాక లూయీ చదువుపై శ్రద్ధ తగ్గి చేపల వేటలో కాలక్షేపం చేసేవాడు .అక్కడి భౌగోళిక పరిస్తితులను అధ్యయనం చేసేవాడు  .అక్కడ ఉన్న నిక్షిప్త నిధి ‘’కోసం అన్వేషి౦చేవాడు .చదువుకంటే బొమ్మలు గీయటం మీద ఆసక్తి ఎక్కువ కనపరచాడు .కొడుకు ఆర్టిస్ట్ అయిపోతాడేమోనని తలిదండ్రులు బాధ పడేవారు .

చదువు

పారిస్ లోని సెయింట్ లూయీ సేకడరీస్కూల్ లో 16 వ ఏట చేరాడు .ఇంటి బెంగ తో ఇబ్బందిపడి ,నిజంగానే జబ్బుపడి ‘’తోళ్ళవాసన ఒక్కసారిపీలిస్తే ఆరోగ్యం కుదుట బడుతుంద’’ చెప్పి ఇంటికొచ్చేశాడు . స్కూల్ మాన్పించేశాడు తండ్రి .మనవాడి చాక్ పీస్ బొమ్మలూ ,ఫిషింగ్,అన్వేషణ  మళ్ళీ మొదలయ్యాయి . మళ్ళీ స్కూల్ కు వెళ్ళాడు .సంతోషించితలిదండ్రులు అభినందించారు  తండ్రికి కొడుకు గిఫ్ట్ పంపాడు కొన్ని రోజుల తర్వాత .అందుకున్న తండ్రి  ‘’నీ గిఫ్ట్ అందింది దీనికోసం  ఖర్చుచేసిన డబ్బు నీదగ్గరే ఉంటె వెయ్యి రెట్లు నీకు ఉపయోగపడేది  .స్నేహితులతో సరదాగా హోటల్ కు వెళ్లి  ఆనందించే వాడివి  ఇలా కొడుక్కి రాసే తలిదండ్రులు లోకం లో అరుదుగా ఉంటారు’’ కన్నా’’.నా సంతృప్తి మాటలతో చెప్పలేనిది అని గ్రహించు ‘’ అని రాశాడు .

ఉద్యోగం

19 వయసులో ‘’స్టూడెంట్- టీచర్ ‘’ అయ్యాడు పాశ్చర్ .జులాయితనం పోయింది. తన జీవితానికి  విజయాన్ని నిర్దేశించు కొన్నాడు .ఇదే మొదటిమంత్రం ‘’విల్ ‘’.అక్కలకు ఉత్తరం రాస్తూ ‘’మనసులో భావించటం గొప్ప విషయం .అప్పుడే కార్యాచరణ ,పని అనుసరిస్తాయి .పని ని విజయం అనుసరిస్తుంది .’’will open the doors –work passes them –and success is waiting to crown one;;s efforts ‘’ఇదీ పాశ్చర్ జీవితం లో అనుసరించి విజయాలు సాధించటానికి కీలక మైనాయి .ఇరవైవ ఏట ప్రసిద్ధ కెమిస్ట్ జే బి డ్యూమాస్ ఉపన్యాసాలు విని ప్రభావితుడయ్యాడు .బీసంకాన్ లోని రాయల్ కాలేజ్ లో అసిస్టంట్  మాధమాటికల్  ఇంస్ట్రక్టర్ గా చేరాడు .అక్కడే చదివి సైన్స్ లో  డిగ్రీ పొందాడు .అతని కేమిస్ట్రి ఆసక్తి దీనికి సరిగ్గా సరిపోయింది .25 వయసులో పారిస్ లోని ఈకోల్ నార్మేల్ నుండి గ్రాడ్యుయేట్ అయ్యాడు .1848లో డిజియన్ లో ఫిజిక్స్ ప్రొఫెసర్ అయి ,తర్వాత స్ట్రాస్ బర్గ్ యూనివర్సిటీలో కెమిస్ట్రీ ప్రొఫెసర్ గా చేరాడు .

ప్రేమాయణం –పెళ్లి

ఈ యూనివర్సిటీ లో చేరినతర్వాట రెక్టార్ మారెంట్ ప్రభావం లోనూ , ఆయన కూతురు మేరీ ప్రేమలోనూ పడ్డాడు .ఆమెకు తన కుటుంబ విషయాలను ఏమాత్రం దాచకుండా తండ్రి చర్మకారుడని  తల్లి చనిపోయిందని అక్కయ్యలె తండ్రిని కనిపెట్టుకొని స్వగ్రామం ఆర్బోయిస్ లో ఉంటున్నారని తమది దురదృష్టవంతమైన కుటుంబమని ,తమ కుటుంబ ఆస్తి యాభై వేల ఫ్రాంకులు మాత్రమె నని ,తనకు వచ్చే వాటాను తన అక్కయ్యలకే  ఇచ్చేయాలని   ఏనాడో నిర్నయి౦చు కోన్నానని  ,కనుక ప్రస్తుతం అదృష్ట హీనుడినని తనకున్నవి ప్రస్తుతం మంచి ఆరోగ్యం ,కొద్దిగా ధైర్యం ,యూనివర్సిటిలో ఇప్పుడున్న ఉద్యోగం మాత్త్రమే నని,భవిష్యత్తులోపారిస్ లో  కెమికల్ రిసెర్చ్ చేయాలనే సంకల్పం లో ఉన్నానని ,తాను  అందులో ఏదైనా ఘనత సాధిస్తే తన తండ్రి తన దగ్గరకు వచ్చి స్ట్రా బెర్గ్ లో ఉంటాడని ,అప్పుడు తన వివాహ విషయం మాట్లాడుతాడని ,తనదగ్గర అమ్మాయి ప్రేమించటానికి తగిన ప్రత్యేక విషయ౦  ఏదీ లేదని పూస గుచ్చినట్లు దాపరికం ఏ మాత్రం లేకుండా ఉత్తరం రాశాడు .

ఈ ఇరవై ఆరేళ్ళ కుర్రాడు ఆ అమ్మాయికంటే ఆమె తండ్రి అయిన రెక్టార్ కు బాగా నచ్చాడు .తండ్రి అనుమతితో ఆమె ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేది .అందులో మనవాడు తనను తానూ కొంచెం కి౦చపరచుకొంటూ రాసేవాడు .తొందరాపడి నిర్ణయం తీసుకోవద్దని ,తననుఅపార్ధం చేసుకోవటమూ తగదని కాలమే తమనిద్దరిని కలుపుతుందని అంతదాకా ఓపిక పట్టటం మంచిదని రాసేవాడుపాస్చర్ .మామగారు లైన్ క్లియర్ ఇచ్చి పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు .29-5-1848  ముహూర్తం నిర్ణయించారు .మన కుర్ర సైంటిస్ట్ ‘’ప్రయోగం చేస్తూ సగం లో వదిలి పెట్టి రావటానికి ఇష్టపడక ‘’పెళ్లి ముహూర్తానికి ఆలస్యం గా వచ్చి చరిత్ర సృస్టించాడు .

అనుక్షణ ప్రయోగ శీలి

ప్రయోగాలే జీవిత పరమావధి అయ్యాయి పాశ్చర్ కు .స్పటికాలమీద సూక్ష్మాతి సూక్ష జీవులమీద ప్రయోగాలు పరిశోధనలు చేస్తున్నాడు .29 లో’’ టార్టారికాసిడ్ ‘’,’’రేసిమిక్ యాసిడ్ ‘’లపై తీవ్రంగా అధ్యయనం చేశాడు .’’I shall go to the end of the world .I must discover the source of racemic acid .i must follow up the tartars to their origin ‘’అని నిశ్చయ సంకల్పం తో ఉన్నాడు .ఈ ప్రయోగ పరంపరలోనే ‘’కిణ్వన ప్రక్రియ ‘’అంటే ఫెర్మెంటేషన్(పులియుట )పై  ద్రుష్టి కూడా సారించాడు .1854 లో లిల్లీ లోని న్యూ ఫాకల్టి ఆఫ్ సైన్స్ కు ప్రొఫెసర్ అయ్యాడు పాశ్చర్ .ఇక్కడ చేసిన ప్రయోగాలే అద్భుత ఫలితాలనిచ్చి రసాయన శాస్త్ర గమనాన్నే మార్చేశాయి .

జీవావిర్భావం యాదృచ్చిక సంఘటన అన్న సంప్రదాయ వాదం

ఈ ప్రయోగ ఫలితాలకు పూర్వం ‘’జీవం అనేది యాదృచ్చిక ఆవిర్భావం –life could originate by spontaneous generation ‘’అన్నదే యదార్ధం అనే నమ్మకం గా ఉండేది .చనిపోయిన లేక కుళ్ళిన పదార్దాలనుండే జీవులు పుడతాయని నమ్మారు .పూర్వమేదావులైన ఓవిడ్ ,ప్లిని ,లూక్రేటస్ ,విర్జిల్ వగైరా అందరూ ‘’స్పాంటేనియస్ జెనరేషన్ ‘’నే నమ్మారు .అదే తిరుగు లేని నిజం అని చెప్పారు .ఎద్దు మృత కళేబరం నుండి ‘’బీస్ ‘’పుట్టినట్లు వర్జిల్ చెప్పాడు .బ్యునాన్ని అనే ఇటాలియన్ శిధిలమైన కర్ర లో నుంచి సీతాకోక చిలుకలు ఆవిర్భవి౦చి నట్లు చెప్పాడు .వాన్ హేల్మాంట్ ఒక జార్ లో కుళ్ళిన గుడ్డముక్కల్ని వేసి కొంచెం గోధుమలు ,జున్నుముక్కలు కలిపి  అందులోంచి ఎవరైనా సరే ఎలుక పిల్లల్ని (మైస్)  సృష్టించవచ్చు నన్నాడు .ఇవన్నీ పాశ్చర్ మనసులో సుళ్ళు తిరుగుతున్నాయి .

ఒక బిల్డింగ్ కొని దాన్ని పరిశోధనాలయం గా మార్చాడు .మెట్ల కింద ఒక ఒక స్టవ్ ఏర్పాటు చేశాడు .అక్కడే పగలూ రాత్రీ జీవుల సృష్టికోసం ఎదురు చూశాడు .ఫెర్మెంటేషన్ కు సహకరించే పదార్ధం కోసం అన్వేషిస్తున్నాడు .ఆల్ప్స్ పర్వతాలు ఎక్కి ఎత్తు పెరిగిన కొద్దీ జీవరాశి తక్కువగా ఉన్నట్లు పరిశోధించి తెలియ జేశాడు .

జీవం నుండే జీవం పుడుతుంది అన్న పాశ్చర్

వయసు నలభై లో యెడ తెగని పరిశోధనలలో మునిగి తేలాడు .’’జీవరాసి ఆవిర్భావం యాదృచ్చిక సంఘటన కాదు ‘’అని రుజువు చేయటమే లక్ష్యం గా ఉన్నాడు .జీవం అంటే ఒక సూక్ష్మ జీవి (జేర్మ్) ,కనుక జీవించిన దానినుండే మరొక జీవి ఆవిర్భవిస్తుంది అని భావించాడు .సంప్రదాయ వాదులు ఈ సిద్ధాంతాన్ని అంగీకరించ లేదు .పాశ్చర్ పరిశోధనా ఫలితాలు ఒక మాకరి అంటే ఎగతాళి ,వెక్కిరింపు అని ఈసడిం చారు .వీటిని వేటినీ లెక్క చేయలేదు .అమితమైన ఓపిక పట్టాడు .సంయమనం పాటించాడు .ఈ లోగా తన సంకల్ప బలాన్ని నమ్మి ముందుకే వెళ్ళాడు .’’A man of science may hope for what may be said of him in the future but he can not stop to think of the insults –or the compliments –of  his  own day ‘’అన్న జీవిత సత్యాన్ని చెప్పాడు .ఇది అందరికి ఆదర్శనీయం ,అనుసరణీయం .

Louis Pasteur, foto av Félix Nadar Crisco edit.jpg

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -31-3-15- ఉయ్యూరు

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.