ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -25
—
12-వాక్సినేషన్ ,ఫెర్మెంటేషన్ కనిపెట్టిన ఫ్రెంచ్ మైక్రోబయాలజిస్ట్ –లూయీ పాశ్చర్ -2
పట్టు పరిశ్రమను కాపాడిన తీరు –
ఆ సమయం లో ఫ్రాన్స్ దేశం లో పట్టు పరిశ్రమ పట్టుపురుగుల కు సోకిన వ్యాదులవల్ల బాగా దెబ్బతినిపోయింది .నష్టాలతో బెంబేలెత్తి పోయారు .సుమారు మూడు వేలమంది ‘’సేరి కల్చరిస్టూలు దీనిపై ఆలోచించి పరిష్కారం కనుక్కొనే ప్రయత్నం లో ఉన్నారు .అందులో పాశ్చర్ గురువు. సెనేటర్ పాశ్చర్ ను ఈ కల్లోలం గురించి ఆలోచించమని కోరాడు .దానికి సమాధానం గా పాశ్చర్ వాళ్ళ కోరిక మంచిదేనని ఉన్నతమైనదేనని కాని తానూ అంతవరకూ పట్టు పురుగును చూడనైనా చూడలేదని తెలిపాడు .స్వయం గా రంగం లోకి దిగి పట్టు పరిశ్రమ కేంద్రాలు చూసి పట్టుపురుగుల పెంపకాన్ని వాటికి వచ్చే వ్యాధులకు వారు వాడుతున్న ఫలితాల నివ్వని మందులనీ పరిశీలించాడు . పట్టుగుడ్లను లార్వాను పురుగులను సేకరించి అధ్యయనం సాగించాడు వెంటనే పరిష్కారం సూచించలేదు .ముందుగా జబ్బుపడ్డవాటినుంచి ఆరోగ్యకరమైన వాటిని వేరు చేయించాడు . విత్తన వ్యాపారస్తులు పాశ్చర్ చర్యలను విమర్శించారు .కొందరైతే ఆయనమీద రాళ్ళే విసిరారు .వీటినన్నిటికీ చాలా ఓపికగా భరించి వాళ్ళతో ‘’మీరు సంయమనం పాటించాలి .నాతొ పాటు ఇక్కడే ఉండిచూడండి .’’అన్నాడు .పాశ్చర్ కు నాలుగేళ్ళు పట్టింది వ్యాధికి కారణం కనుక్కోవటానికి .లక్షణాలను రికార్డ్ చేసేవాడు .వ్యాధి సోకినవాటిని వేరు చేసి ఆరోగ్యవంతమైన వాటి నుండి కొత్త విత్తనాలు అభివృద్ధి చేశాడు .చివరికి కదా సుఖాంతమై జబ్బు ల నుండి పట్టుపరిశ్రమను కాపాడగలిగాడు .దీనినే ‘’పాశ్చర్ సీడింగ్ ప్రాసెస్ ‘’అన్నారు .ఏ ఇబ్బందీ జబ్బూ లేని పట్టుకాయలను (కకూన్స్)ఏర్పరచటమే ‘’పట్టు పంట ‘’ అని రుజువు చేశాడు .ఈ పద్ధతిలో పట్టు పురుగులను పెంచి మొదటి సారిగా లాభాలు గడించటానికి 10 ఏళ్ళ సమయం పట్టింది .అదే పాశ్చర్ చెప్పిన రెండవ మంత్రం ‘’wait’’.
కుటుంబం లో విషాదం
‘’. ఈ ఫలితాలు సాధించే కాలం లో ఆతను ఎన్నో కుటుంబ వ్యధలను బాధలను అనుభవించాడు .పెద్దకూతురు జీనే టైఫాయిడ్ తో మరణించింది .రెండేళ్ళ చిన్న పిల్ల కామిల్లీ అంతుపట్టని జ్వరానికి లోనై తే ,పన్నెండేళ్ళ సిసిలీ టైఫాయిడ్ జ్వరం వచ్చి కొన్ని రోజులకే చనిపోయింది .పాశ్చర్ కు ‘’సెరిబ్రల్ హేమరేజ్ వచ్చి పాక్షికం గా పక్షవాతం వచ్చి ఎడమ బుజం కదల్చలేక పోయే వాడు .దాన్ని గురించి చెబుతూ ‘’నా ఎడమ భుజం సీసం ముక్కలా మొద్దుబారి పోయింది ఎవరైనా దాన్ని కోసేస్తే బాగుండును ‘’అన్నాడు అప్పటికే అధికశ్రమ చేసి ఉండటం ఈ కుటుంబ మరణాలు కలత చెందించాయి .కు౦గి పోయాడు .కాని మానసికం గా కుంగిపోకుండా ఉండటానికి స్మైల్ల్స్ రాసిన ‘’సెల్ఫ్ హెల్ప్ ‘’,బాసూట్ రాసిన ‘’ఆఫ్ ది నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అండ్ ఆఫ్ సెల్ఫ్ ‘’గ్రంధాలు చదివి ఉత్తేజం పొందేవాడు .
పాస్చరైజేషన్
నలభైవ పడిలో పాశ్చర్ కనపడటమే ఒక శక్తిగా భావన పొందేవారుజనం .ముఖం లోప్రశా౦తత ,కళ్ళల్లో కాంతి తో రగులుతున్న శక్తి కేంద్రంగా కనిపించేవాడు .పరిశోధనలను కొనసాగిస్తూ’’ మైక్రోస్కోపిక్ జీవులను ‘’కనిపెట్టాడు .అవే సారాయి ఆమ్లాన్ని ,తయారు చేస్తాయని చెప్పాడు .అయితే దాన్ని తాగలేమన్నాడు .వైన్ నువేడి చేసి అన్నిరకాల వ్యాదులనుండి కాపాడతానని చెప్పి ,దాన్ని కొద్దినిమిషాలు 50-60 డిగ్రీల సెంటి గ్రేడ్ వద్ద ఉంచాడు .ఈ ప్రక్రియే తత్వాత ‘’పాశ్చరైజేషన్ ‘’అన్న పేరును పొందింది .దీనితర్వాత ‘’బీరు ‘’లో ఉండే హానికరమైన సూక్ష్మజీవులు వాటివలన మానవులకు కలిగే వ్యాధులు పై ద్రుష్టి సారించాడు .ప్రతి విషయాన్ని నోట్ బుక్ లో వివరంగా రికార్డ్ చేశాడు .ఇలాంటి జీవులు మనుషులలోనూ జంతువులలోను ఉండవచ్చునని ఊహించాడు .కాని తన భావాలను తెలియ జేస్తూ ‘’if we are inclined to believe that it is so because we think it likely ,let us remember before we affirm it ,that the greatest disorder of the mind is to allow the will to direct the belief ‘’ అని జాగ్రత్త పడ్డాడు .
యుద్ధ సైనికుడైన కొడుకును కలుసుకొన్న దృశ్యం
వైన్ లో బీరు లో ,మానవులలో ఉండే వైరస్ లనుండి ఫెర్మేంటే షన్ ను చేసే ప్రక్రియపై అధ్యయనం చేసేముందు 1870 యుద్ధం ఎన్నో అవాంతరాలను కలిగించింది .ఒక్కగానొక్క కొడుకు యుద్ధం లో పాల్గొన్నాడు .ఎక్కడున్నాడో అతని జాడ తెలియ లేదు .తానె స్వయం గా వెదకటానికి బయల్దేరాడు .రోడ్లన్నీ పరాజిత సైనికులతో, క్షతగాత్రులతో నిండి ఉన్నాయి. కాలు కదిపేట్లు లేని దృశ్యం .దారిలో తనకొడుకు పనిచేసే స్టాఫ్ ఆఫీసర్ కనిపించి అబ్బాయి క్షేమంగానే ఉన్నాడన్న వార్త తెలియజేయగా ఊరట కలిగింది .అయినా అతనేక్కడున్నాడో వెతుకుతుంటే దారిలో చచ్చి పడిఉన్న గుర్రాలు ,మనుష్యుల పోగులు హృదయ విదారకం గా ఉన్నాయి .చివరికి నీరసం తో శక్తి కోల్పోయి ,జీవచ్చవంగా ఉన్న కొడుకును కలుసుకొన్నాడు తండ్రీ కొడుకులు విపరీతమైన ఉద్విగ్నత కు లోనైనారు .అది భీకర కల్లోల కాల సముద్రం లో ఒక చిన్న ఆన౦దపు అల లాగా అని పించింది .
స్టెరిలై జేషన్
ఈ యుద్ద సైనికుల అకాల మరణాలు హాస్పిటల్ లో జరిగే మరణాలకంటే వేగం గా తీవ్రంగా ఉన్నట్లు గమనించాడు పాశ్చర్ .దాన్ని ‘’A pin prick is an open door to Death ‘’అన్నాడోక ఫ్రెంచ్ సర్జన్.గాయపడిన వారికి ఆపరేషన్ చేస్తుంటే ఫలి౦చటం లేదు ,మరణిస్తున్నారు .దీనితో అసలు ఆ జోలికే వెళ్ళకుండా డాక్టర్లు నిస్తేజులయ్యారు .ఇన్ఫెక్షన్ ను ఆపలేని పరిస్తితి ఏర్పడింది .పాశ్చర్ ఇప్పుడు దీన్ని గురించే తీవ్రంగా ఆలోచించసాగాడు .గాయాలకు డ్రెస్సింగ్ యెంత ముఖ్యమో ,వాటికి వాడే పరికరాలు బా౦డేజేస్ .లను పెర్ఫెక్ట్ గా’’ స్టెరిలైజేషన్’’ చేయాల్సిందే నని సూచించాడు .లేకపోతె ఇన్ఫెక్షన్ ను అరికట్టలేమని వివరించాడు
మైక్రోబ్స్ గుర్తింపు—ఆధునిక శస్త్ర చికిత్సకు ప్రివెంటివ్ మెడిసిన్ కు మార్గ దర్శనం
.అంతకు ముందే జోసెఫ్ లిస్టర్ పాశ్చర్ కు జాబు రాస్తూ అతని సూక్ష్మక్రిముల పరిశోధనను శ్లాఘిస్తూ ,ప్రస్తుత ఉపద్రవం అయిన ఇన్ఫెక్షన్ పై పాశ్చర్ దృష్టిని బలపరచాడు .దీనిని పూర్తిగా సాధించటానికి ‘’యాంటి సెప్టిక్ సిస్టం ‘’చాలా అవసరమని తెలిపాడు .దీని అంతూ తేల్చాలని తీవ్ర ఆలోచన చేశాడు పాశ్చర్ .ఆక్సిజన్ కాని వేరే ఇతర వాయువుకాని ఈ ఇన్ఫెక్షన్ కు కారణం కాదని ,గాలిలో వేలాడే సూక్ష్మాతి సూక్ష జీవులే దీని వ్యాప్తికి కారణమని పాశ్చర్ కనిపెట్టాడు .ఇదే ‘’ఆధునిక శస్త్ర చికిత్స’’కు ద్వారాలుతెరచింది .’’ప్రివెంటివ్ మెడిసిన్ ‘’కు నాంది పలికింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-4-15 ఉయ్యూరు

