కశ్మీర్‌లో వరదలు కన్నీరు పెట్టిస్తున్నాయి. ఏడునెలల క్రితం జరిగిన విధ్వంసం నుంచి ఆ రాష్ట్రం ఇంకా కోలుకోకముందే మరోమారు వరదలతో రాష్ట్రం అతలాకుతలమైంది. గత అనుభవం వల్ల, కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షంతో ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన కారణంగా ఈ సారి మృతుల సంఖ్య పెద్దగా లేదు. గత వరదలతో పోలిస్తే తీవ్రత తక్కువ కావడం కూడా మరో కారణం. జీలం నది ఉధృతి తగ్గుతూండటం ఉపశమనాన్ని ఇస్తున్నా, బుధవారం నాటి కుంభవృష్ఠిని చూసినప్పుడు ప్రమాదం తొలగిపోలేదని అనిపిస్తున్నది. మరో మూడురోజుల పాటు వర్షాలు తప్పవనీ, అందులోనూ రాబోయే 24 గంటలు అత్యంత కీలకమైనవని వాతావరణశాఖ చేసిన హెచ్చరిక ముప్పును తెలియచెబుతున్నది.
కశ్మీర్‌లో మార్చినెలలో ఇంతటి భారీ వర్షాలు కురవడం దాదాపు మూడుదశాబ్దాల తరువాత ఇదే మొదటిసారి. గతంలో మాదిరిగానే జీలం నది తీవ్ర విధ్వంసాన్ని సృష్టించింది. ఆ నది పొడవునా ఉన్న పట్టణాలు, గ్రామాల ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. అర్ధరాత్రి కమ్ముకొచ్చిన వరద వారిని భయపెట్టినా, గత అనుభవం దృష్ట్యా అధికశాతం ప్రజలు తమను తాము కాపాడుకోగలిగారు. కానీ, ఇళ్ళు కూలిపోయిన కారణంగా ప్రాణాలు పోతున్న వారి సంఖ్యే ఆందోళన కలిగిస్తున్నది. వరదలో కొట్టుకుపోయినవారు, ఆచూకీ తెలియనివారి లెక్కలు తేలడానికి సమయం పట్టవచ్చు. కొండచరియలు విరిగిపడి ఇళ్ళు ధ్వంసం కావడంతో పాటు, జమ్మూ నుంచి శ్రీనగర్ వరకు జాతీయ రహదారిమీద రాకపోకలు నిలిచిపోయి వందలాదిమంది ఇరుక్కుపోయారు. వరదనీరు నిలిచిపోయిన కారణాన కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. నిజానికి కశ్మీర్‌లో వరదల గురించి ఇంతగా విప్పిచెప్పడం ఇప్పుడు పీడీపీ నాయకులకు ఆగ్రహం కలిగిస్తున్నది. మీడియా ఈ బీభత్సాన్ని వర్ణించడం వల్ల కశ్మీర్‌కు నష్టమే తప్ప లాభం లేదంటున్నారు పీడీపీ ఎంపీ తారిఖ్ హమీద్. ఆయన వాదనలో వేదన లేకపోలేదు. మొన్నటి వరదల వల్ల మిగతా రంగాల్లో తప్పని నష్టంతో పాటు, మీడియా విస్తృత ప్రచారం కారణంగా కశ్మీర్ తన పర్యాటక ఆదాయాన్ని ఎన్నడూ లేనంతగా కోల్పోయింది. ఈ ఏడాది కాస్తోకూస్తో కూడదీసుకోవచ్చనుకుంటున్న తరుణంలో ఇప్పుడు మళ్ళీ ఉపద్రవం ముంచుకొచ్చి పర్యాటకులు పెద్దసంఖ్యలో ప్రయాణాలు రద్దుచేసుకుంటున్నారు. ఆదాయం దెబ్బతింటున్నదన్న ఆయన ఆవేదన అర్ధం చేసుకోదగినదే అయినప్పటికీ, అధికారంలో ఉన్న తాము కర్తవ్యాన్ని నెరవేర్చినదీ లేనిదీ ఓసారి ఆలోచించుకోవడం ముఖ్యం. వేసవి రాజధాని శ్రీనగర్‌లోనే రోజుల తరబడి వరద నీరు నిలిచిపోతున్నప్పుడు పర్యాటకుల రాకమీద దాని ప్రభావం ఉండకుండా పోదు. ఇటువంటి కుంభవృష్టికి దేశవ్యాప్తంగా అనేక ప్రధాన నగరాలే మునుగుతున్న మాట నిజమే కానీ, పర్యాటకులు రావాలనుకున్నప్పుడు దానికీ పరిష్కారాలు చూడక తప్పదు. ఏడునెలల క్రితం నాటి వరదలకు పూడుకుపోయిన డ్రైనేజీ వ్యవస్థను ఇప్పటికీ శుభ్రపరచకుండా వదిలేసి, విమర్శలతో కాలయాపన చేయడం వల్ల ప్రయోజనం ఉండదు.
గత అనుభవం దృష్ట్యా ఇప్పుడు కూడా ప్రజలే తమ బాధలేవో పడుతున్నారు కానీ, వరద హెచ్చరికల దశ నుంచి ఆశ్రయం అందించే వరకూ అన్ని స్థాయిల్లోనూ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే ఉంది. నిర్దిష్టమైన వ్యూహాలు, ప్రణాళికలు లేని తనం తెలిసిపోతూనే ఉంది. కశ్మీర్‌లోయను తరచూ ఇటువంటి ఉపద్రవాలు ముంచెత్తుతున్నప్పుడు సమస్య పరిష్కారానికి మార్గాలు వెతకడం ముఖ్యం. వందేళ్ళ తరువాత మార్చినెలలో దేశం మొత్తంమీద అసాధారణ రీతిలో వర్షాలు కురిస్తే, కశ్మీర్‌లో ఇది మరింత అధికంగా ఉంది. పర్యాటకాభివృద్ధి పేరిట ఆ రాష్ట్రంలో ఎంతటి ప్రకృతి విధ్వంసం జరిగిందో తెలిసిందే. నదీ మార్గాలు, వరదనీటి మార్గాలు ఆక్రమణలకు, అక్రమ నిర్మాణాలకు నిలయమైపోయాయి. ఇటువంటి ప్రాంతాల్లో మరింత అధిక జాగ్రత్తలు తీసుకోవల్సింది పోయి, గతంలో పడిన గండ్లనే ఇంకా పూడ్చకుండా వదిలివేయడం దుర్మార్గం. వరదలు వచ్చినప్పుడు కనబరిచే ఆదుర్దా, హడావుడీ ఆ తరువాత ఉండవు. గత వరదల్లో నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమిని ముంచేసి అధికారంలోకి వచ్చిన పీడీపీ-బీజేపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు అదే రీతిన చేష్టలుడిగి కూర్చుంది. ఈ ఏడునెలల కాలంలో అధికభాగం అధికారంలోకి రావడానికే సరిపోయింది.
వరదలను ప్రకృతివిపత్తుగా మాత్రమే చూసినప్పుడు రాష్ట్రాన్ని దాని ఖర్మానికి దాన్ని వదిలేయడమే అవుతుంది. కశ్మీర్‌లోయను వరద ప్రాంతంగా మార్చిన పరిస్థితులను చక్కదిద్దడంతోపాటు, ఇటువంటి సందర్భాల్లో సహాయక చర్యలను సత్వరమే అందించేవ్యవస్థలను ప్రత్యేకంగా శాశ్వత ప్రాతిపదికన సమకూర్చుకోవడం అవసరం. గత కాలపు వరదల్లో సామాన్యులతో పాటు సైన్యం కూడా ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొంది. సైన్యం తప్ప ఆదుకోగలిగే వ్యవస్థంటూ అక్కడ లేదు. కేవలం విద్యుదుత్పత్తి కోసమే కాక, వరదల నివారణ కోసం కూడా డ్యాముల వంటివి నిర్మించడం వల్ల నష్టాన్ని తగ్గించగలం. గండం నుంచి గట్టెక్కిన ప్రతిసారీ ఊపిరిపీల్చుకుని కూర్చోకుండా భవిష్యత్తు గురించి కాస్తంతైనా ఆలోచించడం అవసరం.