స్వర్గీయ కవితాప్రసాద్ కు ‘’కవితాంజలి ‘’
మధురకవితా ప్రసాదీయం –గబ్బిట దుర్గాప్రసాద్
బందరు కవుల చేత ,గుంటూరు కులపతుల చేత కనకాభిషేకాలు పొంది
ప్రధమ చతుర్ధ ప్రపంచ తెలుగు సభా నిర్వహణ సామర్ధ్యం చూపి
స్వర్ణ కంకణ ధారియై ,భువన విజయ ‘’రాయలై’’
ఆశుకవితా ఝరి పారించి రసప్లావిత మొనర్చి
అవ్యవధాన అవధాన విద్యలోసాటిలేని మేటియై ,ధారణా బ్రహ్మయై
నవరసావదాన ,సాహిత్య ప్రక్రియావదాన మార్గ దర్శియై
‘’గ్రంధ ముఖి ‘’(ఫేస్ బుక్ )లో లక్ష పద్యార్చనం చేసి
‘’రసవదమృత పద్య రాజీవ బృందమ్ము –బ్రాహ్మికి కావ్య శిరస్సు లిడగ
‘’పద్యాగ్ని శిఖలతో ప్రజ్ఞా మహాయజ్న వేదికి –దివ్య హవిస్సులిచ్చి ‘
‘’ భూమాత హృదయమ్ము పూర్ణ కుంభమై-శ్రీంకార శబ్ద రోచిస్సు లివ్వగా ‘’
ద్విశతావధానం తో బాటు శతాధిక గ్రంధ రచన చేసి
‘’పలకరిస్తే పద్యం’’ తో ఆంధ్రావనిని పులకరింప జేసి
యువతకు అవధాన ప్రక్రియలో స్పూర్తిగా నిలిచి
శ్రీకాదంబినీ మాత’’ వర ప్రసాద రాజమై’’
కలియుగ సార్వ భౌముడు సప్త గిరి ధామునికి
భక్తీ తన్మయత్వం తో ఆత్మ నివేదన చేసి
సాంస్కృతిక శాఖకే వన్నె తెచ్చి
విభజన భజనలో తెలంగణ పాలై
‘’దొర ‘’పెత్తనానికీ ,’’బాస్ ‘’దాస్తీకానికీ బలై ,అనారోగ్యం పాలై
కమ్మని తెలుగు నేలకు ,ఆప్యాయతకు దూరమై
మానసిక క్షోభ ,అవమానం ,పెత్తనాలకు నీరుగారి
దివిజ కవి వరుల గుండియల్ డిగ్గురనగ
దివికేగిన ‘’పెదబాబు ‘’ద్రువతార
మహాకవి –మధురమంజుల రవి
రసమయ కవితా శకటం కవితా ప్రసాద్ కు
కవితాంజలి ఘటిస్తున్నా –వినమ్రంగా .
గబ్బిట దుర్గాప్రసాద్ -2-4-15 –ఉయ్యూరు

