ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -27
13-వాస్తవికత పిత ,ఆధునికత కు ఆద్యుడైన నార్వేజియన్ నాటక రచయిత- ఇబ్సెన్
పరిచయం
ఆదునికులకు ఇబ్సెన్ రచనలలో సమకాలీన సమాజం లో పాతుకు పోయిన వాటిని కూల్చే సెన్సేషన్ కనిపించాడు ఆయన తీర్చిన పాత్రలు తన ప్రభావానికి లోనైన బెర్నార్డ్ షా ,చెకోవ్ ,పిరా౦డేల్లో సృస్టించిన పాత్రల్లకు భిన్నం గా సర్వ సాధారణం గానే ఉంటాయి . సంప్రదాయానికి బద్ధుడుగా కనిపిస్తాడు అంగీకరించిన నిజాలకు నిజరూపాలుగా మాత్రలను మలిచిన నేర్పు ఇబ్సెన్ స్వంతం .కాని19 వ శతాబ్దపు చివరి భాగం లో ఇవే మిరుమిట్లు గొలిపాయి ఊహాతీత విజయాలకు కారణమయ్యాయి .
సంకీర్ణ కుటుంబనేపధ్యం
హెన్రిక్ ఇబ్సెన్ 20-3-1828ననార్వే దేశపు దక్షిణభాగాన ఉన్న స్కీన్ లో జన్మించాడు .అతని కుటుంబం స్కాండినేవియన్, ట్యుటోనిక్, గేలిక్ మిశ్రమ సంజాతం .తండ్రి తరపు పూర్వీకుడోకాయనడేనిష్ జాతికి చెందిన నౌకా కెప్టెన్ .ఇంకోకాయన స్కాటిష్ రక్త సంబంధీకుడు.తల్లి జర్మన్ జాతికి చెందింది .మొదటి నుండీ ఇబ్సెన్ కుటుంబం సంపన్న తరగతికి చెందిన వారే . ఇబ్సెన్ తండ్రి సమాజం లో గౌరవ ప్రతిష్టలున్న ముఖ్య వ్యక్తీ .ఆర్ధికంగా సుస్తిరుడు .
తండ్రి దివాలా –కుటుంబ ఆర్ధికం చిద్రం
దురదృష్ట వశాత్తు ఇబ్సెన్ ఎనిమిదవ ఏట తండ్రి దివాలా తీశాడు .భవిష్యత్తు కోసం వేసిన ప్రణాలికలు దెబ్బతిని జీవితం అంధకార బందురమైంది .గత్యంతరం లేక విలాస వంతమైన భవనం నుండి కుటుంబాన్ని మురికి కూపం గా ఉండే వ్యవసాయ క్షేత్రానికి మార్చాల్సి వచ్చింది . కుర్రాడైన ఇబ్సెన్ మనస్సులో ఈ ఆర్ధిక కల్లోలం ,అసమానత ముద్రగా పడ్డాయి .వీటినే ఆధారం గా చేసుకొని తార్వాతి కాలం లో .’’డాల్స్ హౌస్ ‘’,జాన్ గేబ్రియల్ బార్క్ మన్ ‘’’’దివైల్డ్ డక్ ‘’నాటకాలు రాశాడు .
మందులషాపు లో పని –సెటైర్ కవిత్వ రచన
తండ్రి అసమర్ధత పై ఇబ్సెన్ కు కోపంగా ఉండేది. కుటుంబ పునాదులు కూలి పోవటానికి తండ్రే కారణం గా భావించాడు .
ఇంటి దగ్గర ఉండాలనిపించలేదు .ఇల్లు వదిలి వెళ్లి పోయాడు .మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చిన దాఖలాలు లేవు .16 ఏళ్ళ వయసులో గ్రిం స్టాడ్ చేరాడు .ఇది నార్వే లో దక్షిణ తీరపు చిన్న నౌకాశ్రయం .అక్కడ మందుల దుకాణం లో అప్ర౦టిస్ గా చేరాడు. అయిదేళ్ళు అక్కడే ఉండి కవిత్వం రాశాడు .అందులో గ్రామస్తుల ప్రవర్తనపై సెటైర్ దట్టించేవాడు .పోయిన కుటుంబ ప్రాభవం మరలా దక్కాలని ఆశించేవాడు .తనకన్నా పదేళ్ళ పెద్దదైన పని అమ్మాయికి కడుపు చేసి ఒక బిడ్డకు తన 18 ఏట జన్మనిచచ్చి తండ్రి అయ్యాడు .ఇది తెలిసిన కుటుంబం మండిపడింది .ఉత్తర ప్రత్యుత్తరాలు బందయ్యాయి .ఇబ్సెన్ ను సాంఘిక బహిష్క్రుతుని చేసింది కుటుంబం . బిడ్డ సంరక్షణ బాధ్యత స్వీకరించినా జీవితాతం ఈ తప్పు అతన్ని వెంబ డిస్తూనే ఉంది గిల్టీగా ఫీల్ అయ్యేవాడు
తిరుగు బాటు –నాటక ప్రక్రియ –దర్శకత్వం
సంప్రదాయ జీవనం లో ఇబ్సెన్ చేసింది తప్పు అయింది. అందరు అతన్ని ద్వేషించ సాగారు దీ.నితో సంఘం పై తిరుగు బాటు చేశాడు మెజారిటీ తీరకుండానే .ఈ భావాలతో తాను కీర్తి పొందాలని ‘’కేటిలిన్ ‘’అన్న నాటకం రాశాడు .పెద్దగా ఆదరణ పొందక పోయినా అతని భావావేశాలకు నిలయమైంది .ఒక స్నేహితుడు దీన్ని ప్రింట్ చేశాడు .ఎవరూ కొనలేదు .చిత్తుకాగితాల క్రింద అమ్మేయాల్సోచ్చింది .దీనిపై స్పందిస్తూ ఇబ్సెన్ ‘’ఒక రచయిత ఈ రకంగా కూడా డబ్బు సంపాదించి పోతట్టగడుపుకోవచ్చునని ఆడబ్బుతో తర్వాత పుస్తకాన్ని ప్రింట్ చేసుకో వచ్చు నని తెలిసింది ‘’అని చమత్కరించాడు . ఈ సంఘటన అతనిని క్రిస్టియానా కు వెళ్ళేట్లు చేసి యూని వర్సిటీలో చేరటానికి దోహద పడింది .పరీక్ష’’గుంట కొట్టి గంట వాయించింది ‘’లాభం లేదని జర్నలిజం వైపు కదిలాడు .ఇరవై మూడవ ఏట నార్వీజియన్ నాటకశాల మేనేజర్ గా ఉద్యోగం లో చేరి బీదరికపు అ౦చులనుండి బయటపడ్డాడు ఇబ్సెన్ .క్రమంగా డైరెక్టర్ అయ్యాడు .34 ఏళ్ళు వచ్చేదాకా ఇక్కడే అదే పదవిలో క్రిస్టి యానాలో ఉన్నాడు .
పెళ్లి-నాటక ప్రయోగం –నేచురల్ రైటర్
29 వ ఏట సుసానా తోరేసేన్ ను పెళ్లి చేసుకొన్నాడు .ఆమె ఒక గొప్ప రచయిత కు మారుటి కూతురు .ఇబ్సెన్ నాటక రచనలో ప్రయోగాలతో బిజీ గా 25 ఏళ్ళ వయసు నుండి 34 వ ఏట వరకు గడిపాడు .అరడజను జానపద నాటకాలు రాశాడు .దీనితో స్వాభావికత కు అద్దంపట్టి ‘’నేచురల్ రైటర్ ‘’గా పేరు తెచ్చుకొన్నాడు . వీటిలో హీరోయిజం ఎక్కువ .రొమాంటిక్ టచ్ కూడా జోడించాడు .వీటిలో ‘’లవ్స్ కామెడి ‘’ఒక్కటి మాత్రమె ఇబ్సెన్ ప్రతిభకు నిదర్శనం గా నిలిచింది .ఇదులో ప్రేమ ,పెళ్లి ల ఐరని ఉండటం కొత్త గా అనిపిస్తుంది .సెటైర్ ,సెంటిమెంట్ ,త్యాగం వగైరాలన్నీ ఉన్నాయి .
దియేటర్ ,ఆదాయం లేని డైరెక్టర్ ,రచయిత
35 ఏళ్ళు వచ్చాయి .డైరెక్టర్ అని పించుకోన్నాడుకానిస్వంత దియేటర్ మాత్రం లేదు . దాని వలన నాలుగు వేళ్ళూ నోట్లోకి వెళ్ళే పరిస్తితి మాత్రం పూజ్యం .తండ్రిగా ,పుట్టిన కొడుకు పోషణ,రచయితగా ఏది రాసినా చూసే వారు కరువైన స్థితి .ఇక ఇక్కడ ఉండటం నిరర్ధకం అనుకొన్నాడు .జెండా పీకాలని పించేసింది .తన సృజనకు ఇక్కడ ఆదరణ లేదని ఇక్కడి జనం హృదయాలు ఇరుకు మురికి కూపాలని అనిపించింది .సరాసరి రోమ్ నగరానికి చేరుకొన్నాడు .
రోమ్ నగర అనుభవం
రోమ్ చేరి అయిదేళ్ళున్నాడు.జీవన భ్రుతికోసం నాటకాలు రాసిపారేస్తూనే ఉన్నాడు .డ్రమాటిక్ పోయెం ,పోయేటిక్ డ్రామా లను రాశాడు .ఇబ్సెన్ కొత్త ఆగంతకుడు . అతని వేషం ఆహార్యం జనాలకు నచ్చాయి .’’నత్త తన గుల్ల లోకి శరీరాన్ని ముడుచుకున్నట్లు ‘’కనిపించేవాడని చూసిన వారన్నారు .బిగ్గరగా మాట్లాడితే మాత్రం చీకటి లో చెట్టు మీద కూర్చుని బిగ్గరగా కూసే గుడ్ల గూబ అరుపులా వినిపించేదిట.రోమ్ చేరిన కొత్తలో రెండు ప్రసిద్ధ నాటకాలు’’ బ్రాండ్ ‘’ పీర్ గింట్ ‘’లు రాసి ప్రదర్శించి మాస్టర్ పీసెస్ అని పించుకొన్నాడు .ఇదే మొట్టమొదటి విజయం .రెండిటిని వచనం లోనే రాశాడు .కాని ఆర్ధికం గా గిట్టుబాటు కాలేదు .తర్వాత ‘’ఆల్ ఆర్ నధింగ్ ‘’కర్క్ గార్డ్ రాసిన ‘’యైదర్ ఆర్’’కు సమానం అన్నారు .కొందరు బ్రాండ్ నాటకం కర్క్ గార్డ్ ను దృష్టిలో పెట్టుకొని రాసిందే అన్నారు .పీర్ గింట్ మాత్రం బ్రాండ్ కు వ్యతిరేకం .ఇది చట్టం న్యాయం లేని మనసుకు ఏది తోస్తే అది చేసే పాత్ర . బ్రాండ్ మాత్రం ఇబ్సెన్ నడవడికలో ఉన్నదే అన్నారు .ఆయనా దాన్ని ఒప్పుకొన్నాడు. బ్రాండ్ తన భావాలను ఆడ మగా అందరిపై రుద్దే స్వభావం ఉన్న పాత్ర .పీర్ గింట్ మాత్రం తన భావాలను తనలోనే ఉంచుకొనే పాత్ర .
జర్మనీ యాత్ర- ప్రపంచ చారిత్రాత్మక నాటకం
రోమ్ వదిలి నలభై వ ఏట జెర్మనీ చేరాడు ఇబ్సెన్ .మ్యూనిచ్ లో కాపురం .అప్పుడప్పుడు ఇటలి వెళ్లి వచ్చ్చేవాడు .డ్రెస్ డ్రెయిన్ లో మూడవ కవిత్వ రచన చేశాడు .రోమ్ లో ఉండగా ప్రారంభించిన ‘’ఎమ్పరర్ అండ్ గలీలియన్ ‘’జర్మనీలో పూర్తీ చేశాడు .ఇందులో నాలుగవ శతాబ్దానికి చెందిన పాగానిజం –క్రిష్టియానిటి మతాల మధ్య ఉన్న విద్వేషమే కద.దీన్ని ‘’ప్రపంచ చారిత్రాత్మక నాటకం ‘’అన్నాడు ఇబ్సెన్ .(world historic al drama ) .చారిత్రక నేపధ్యం ఉన్నా నైతిక ఐక్యతను బోధించాడు ఇందులో .మనిషి తనను తానూ నమ్మనంత వరకు ఇతరులను నమ్మలేడు అన్న సిద్ధాంతాన్ని తెలిపాడు .ఇందులోని పాత్రలన్నీ తమను తాము మోసం చేసుకొని అపరాదులైనవే .Ibsen was a self divided person .,an idealist who distrusted abstract ideals ,an iconoclastic truth –teller who forced himself to see the destructive power of the truth .’’ అని ఇబ్సెన్ ను ఆవిష్కరించాడోక విమర్శకుడు .
యాభై వయసులో ఈ రకమైన రేటరిక్ రొమాంటిక్ కవిత్వ డ్రామాలను వదిలేశాడు .వాస్తవిక వచన రచనలపై ద్రుష్టి పెట్టాడు .ఆధునిక ప్రపంచ జీవితం లోని విషయాలను కదా వస్తువులుగా స్వీకరించాడు .ఈ మార్పునే బెర్నార్డ్ షా ‘’exposing the mischief of idealism ‘’అన్నాడు .ఇక్కడి నుండి ఇబ్సెన్ రచనా ప్రస్తానం కొత్త పుంతలు తొక్కి మార్గ దర్శనం చేసింది.
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-4-15 –ఉయ్యూరు

