నా దారి పక్కదారి అంటున్న గవర్నర్ –


 

నరసింహన్‌ ఇంటికి!

మోత్కుపల్లి, శేషగిరిరావులకు చాన్స్‌!
మినీ మంత్రివర్గ విస్తరణకూ అవకాశం
రామ్‌ మాధవ్‌కు కేబినెట్‌ బెర్త్‌?
స్మృతికి స్థాన చలనం లేదా ఉద్వాసన!
పలువురు సహాయ మంత్రులకు ప్రమోషన్లు
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను కేంద్ర ప్రభుత్వం ఇంటికి పంపనుందా!? యూపీఏ నియమించిన ఆయనను తొలగించాలని ఎన్డీయే భావిస్తోందా!? తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరికి గవర్నర్‌ చాన్స్‌ దక్కనుందా!? కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకూ ముహూర్తం ఖరారైందా!? ఈ ప్రశ్నలు అన్నిటికీ ‘ఔను’ అనే జవాబిస్తున్నాయి ఢిల్లీలోని అత్యంత విశ్వసనీయ వర్గాలు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 9న ఫ్రాన్స్‌ పర్యటనకు వెళుతున్నారు. అక్కడి నుంచే ఆయన నేరుగా కెనడా, జర్మనీ వెళతారు. తిరిగి 16వ తేదీన ఢిల్లీ వస్తారు. ఆ తర్వాత 20వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో, విదేశాలకు వెళ్లడానికి ఒకటి రెండు రోజుల ముందే పలు రాషా్ట్రల్లో గవర్నర్ల మార్పు, కేంద్ర కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. గవర్నర్ల మార్పుల్లో భాగంగా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాషా్ట్రల ఉమ్మడి గవర్నర్‌గా ఉన్న నరసింహన్‌తో రాజీనామా చేయించి, ఆయన స్థానంలో కొత్త వారిని నియమిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి కొత్త గవర్నర్‌ నియామకాన్ని ఖరారు చేస్తారని తెలిపాయి. గత కొద్ది కాలంగా గవర్నర్‌ పనితీరుపై కేంద్రంలోనూ చర్చ సాగుతోందని, దీనికి కొనసాగింపుగానే ఆయన రాజీనామా కోరే అవకాశాలు ఉన్నాయని ఆ వర్గాలు వివరించాయి. మరో 9 రాషా్ట్రలకు కూడా గవర్నర్లను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటిలో పంజాబ్‌, అసోం, హిమాచల్‌ ప్రదేశ్‌, మేఘాలయ, మిజోరం, మణిపూర్‌, బీహార్‌, పాండిచ్చేరి, త్రిపుర ఉన్నాయి. ఇక, కొత్తగా గవర్నర్‌ పదవులు పొందనున్న వారిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ నుంచి టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు పరును చంద్రబాబు కేంద్రానికి సూచించినట్లు చెబుతున్నారు. అలాగే, సీమాంధ్ర నుంచి బీజేపీ సీనియర్‌ నేత ప్రొ ఫెసర్‌ శేషగిరిరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నిజాని కి, గతంలో విద్యాసాగర్‌రావును నియమించినప్పుడే ఆర్‌ఎస్‌ ఎస్‌ వర్గాలు శేషగిరిరావు పేరును మోదీకి సూచించాయి. రాష్ట్రంలో ఏబీవీపీని నిర్మించడమే కాకుండా పలు పుస్తకాలను ఆయన రచించారు. రెండు రాషా్ట్రలకు చెందిన మేనిఫెస్టోలను కూడా ఆయనే రూపొందించారు. గవర్నర్లుగా బీజేపీ, సంఘ్‌ నేపథ్యం ఉన్న వారినే నియమించాలని మోదీ భావిస్తే శేష గిరిరావుకు అత్యధిక అవకాశాలున్నాయి. ప్రధాని మోదీ మంత్రి వర్గంలోనూ మార్పులు జరగనున్నాయి. పాలనను మెరుగుపరచడం, మిత్రులను సంతృప్తిపరచడం అనే ద్విము ఖ లక్ష్యాలతో ఈ మార్పులు చేపడతారని చెబుతున్నారు. మంత్రివర్గం నుంచి మరికొందర్ని తొలగించి వారిని గవర్నర్లు గా పంపవచ్చని తెలు స్తోంది. మైనారిటీ వ్యవహారాల మంత్రి నజ్మా హెప్తుల్లా, చిన్నతరహా పరిశ్రమల మంత్రి కల్‌రాజ్‌ మిశ్రా పేర్లు ఇందు కు వినిపిస్తున్నాయి. ఈనెల 8న మంత్రి వర్గ పునర్వ్యసీ ్థకరణ జరగవచ్చని, శివసేన, పీడీపీ, బీజేపీల నుంచి మరికొంత మందిని చేర్చుకోవచ్చని తెలుస్తోంది. ఎన్ని కలు జరగనున్న బీహార్‌ నుంచి ఒకరికి స్థానం కల్పిస్తారంటున్నారు. జమ్మూ కశ్మీర్‌ ఎన్నికల్లో బీజేపీ గణనీయంగా సీట్లు సాధించడంతోపాటు అనంతరం బీజేపీ-పీడీపీ సంకీర్ణ ప్రభు త్వ ఏర్పాటుకు కీలక పాత్ర పోషించిన రామ్‌ మాధవ్‌ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇక, మానవ వనరుల మంత్రి స్మృతీ ఇరానీకి స్థానచలనమో, ఉద్వాసనో జరిగే అవకాశాలు లేకపోలేదు. శివసేన నుంచి ఆనంద్‌రావు అడ్సుల్‌, లేదా అనిల్‌ దేశాయ్‌, పీడీపీ నుంచి ముజఫర్‌ హుస్సేన్‌ బేగ్‌ లేదా తారిఖ్‌ హమీక్‌ కర్రా, బీజేపీ నుంచి షానవాజ్‌ హుస్సేన్‌లకు అవకాశం లభించవచ్చని సమాచారం. రైల్వే శాఖ సహాయ మంత్రి, యూపీకి చెందిన మనోజ్‌ సిన్హా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వి, నైపుణ్యాభివృద్ధి మంత్రి రాజీవ్‌ ప్రతాప్‌ రూఢీ తదితరులకు కేబినెట్‌ హోదాలో ప్రమోషన్‌ లభిస్తుందని తెలుస్తోంది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్‌ సిన్హాకు అదనంగా కార్పొరేట్‌ వ్యవహారాల శాఖను అప్పగించే అవకాశాలున్నాయి.

గోల భక్తులది.. వేడుక నరసింహన్‌ది!

క్యూ లైన్లలోనే మగ్గుతున్న భక్తులు
అధికారులు, ప్రోటోకాల్‌ అధికారుల యాతన
తిరుపతి, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారికి సంబంధించి ‘గోల గోవిందుడిది.. వేడుక వెంకన్నది’ అనే సామెత ఉంది! భక్తులు ‘గోవిందా గోవిందా’ అనుకుంటూ వెళ్లి ముడుపులు వెంకన్నకు వేస్తారని, అక్కడ ఆయనకే కల్యాణం జరుగుతుందనే అర్థంలో ఈ నానుడి పుట్టింది! కానీ, గవర్నర్‌ నరసింహన్‌ పుణ్యమా అని ఈ నానుడికి మరెన్నో పేరడీలు పుట్టాయి! ‘గోల భక్తులది.. వేడుక నరసింహన్‌ది’ అని అంటున్నారు. ఇందుకు కారణం.. గవర్నర్‌ నరసింహన్‌ రాచమర్యాదలతో శ్రీవారి దర్శనం చేసుకుంటుంటే.. క్యూలైన్లలో గంటల తరబడి భక్తులు అవస్థలు పడుతున్నారు! అలాగే, ‘గోల అధికారులది.. వేడుక గవర్నర్‌ది’ అనే పేరడీ కూడా ఉంది! గవర్నర్‌ వస్తున్నారంటే తహసిల్దార్‌ కార్యాలయంలో ఆర్‌ఐ నుంచి తిరుమల జేఈవో వరకూ అటెన్షన్‌లో ఉండాల్సి రావడమే ఇందుకు కారణం! అంతేనా.. ‘నిధులు ప్రజలవి.. వేడుక నరసింహన్‌ది’ అని కూడా ప్రచారంలో ఉంది. ప్రజా ధనాన్ని ఆయన తన వ్యక్తిగత విశ్వాసాలకు పెట్టుబడిగా వాడుకోవడమే ఇందుకు కారణం! తిరుమల శ్రీనివాసుడి దివ్యరూపాన్ని ఎన్నిసార్లు.. ఎంతసేపు చూసినా తనివి తీరదని చెబుతూ ఉంటారు. అందుకే, తిరుమల కొండకు భక్తులు పోటెత్తుతూ ఉంటారు. అయితే, ఏడాదికో ఆరు నెలలకో ఒకసారి చుట్టం వస్తే ఆ కుటుంబ సభ్యులకు ఆనందం. కానీ, అదే పనిగా వస్తూ ఉంటే ఎంత దగ్గరి వాళ్లకు అయినా విసుగు పుడుతుంది. గవర్నర్‌ నరసింహన్‌ తిరుమల పర్యటనలకు సంబంధించి ఉద్యోగులు, భక్తుల్లో ఇటువంటి భావనే వ్యక్తమవుతోంది. సంప్రదాయబద్ధంగా తిరుమలకు వచ్చే నరసింహన్‌ను తొలి రోజుల్లో భక్తులు ఆసక్తిగా గమనించారు. శ్రీవారిపై ఆయనకున్న అచంచల భక్తిని చూసి మురిసిపోయారు. అయితే, ఆయన పదే పదే తిరుమలకు వస్తుండడంతో సేవలు చేయలేక కొందరు, గంటలకొద్దీ నిరీక్షించలేక మరికొందరు నొచ్చుకుంటున్నారు. రాష్ట్ర చరిత్రలో ఇప్పటి దాకా ఏ గవర్నరూ రానన్నిసార్లు తిరుమలను దర్శించుకున్న గవర్నర్‌గా నరసింహన్‌ రికార్డు సృష్టించారు. దేవదేవుడిపై ఆయనకున్న భక్తి ఎంత తీవ్రమైనదంటే ఒకే నెలలో మూడు నాలుగుసార్లు తిరుమలకు వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. ఇటీవల ఒకసారి గవర్నర్‌ తిరుమలకు వచ్చి వెళ్లారు. ఆ తర్వాతి రోజు అప్పట్లో బెంగాల్‌ గవర్నర్‌, నరసింహన్‌కు సన్నిహితుడు ఎంకే నారాయణన్‌ వచ్చారు. దాంతో తర్వాత రోజు మళ్లీ నరసింహన్‌ తిరుమల వెళ్లి ఆయనతోపాటు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. భక్తులు పోటెత్తే పర్వదినాల్లోనూ మందీ మార్బలంతో ఆయన శ్రీవారిని దర్శించుకున్న సందర్భాలున్నాయి.
అధికారుల వేల పని గంటలు వృధా
ప్రొటోకాల్‌ ప్రకారం గవర్నర్‌కు జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత ఉంటుంది. ఆయన కాన్వాయ్‌లో మూడు బుల్లెట్‌ ఫ్రూఫ్‌ కార్లు, ఒక పైలెట్‌ వాహనం, రెండు టైలెండ్‌ వాహనాలు, రెండు ఎస్కార్ట్‌ వాహనాలు ఉంటాయి. వీటిలో పోలీసులు, రిజర్వు పోలీసులు, సీఐ స్థాయి అధికారులు ఉంటారు. ఒక అంబులెన్స్‌, ఒక రక్తనిధి వాహనం ఉంటుంది. వీటిలో 12 మంది డాక్టర్లు, ఆరుగురు స్టాఫ్‌నర్సులు, ఇద్దరు ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఇద్దరు అటెండర్లు ఉంటారు. గవర్నర్‌ రాత్రి బస చేస్తే పదిమంది గార్డులు కాపలా ఉంటారు. ఒక్కో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులకు గవర్నర్‌ వచ్చినప్పటి నుంచీ తిరిగి వెళ్లే వరకు మరో పని ఉండదు. టీటీడీలో ఈవో లేదా జేఈవో స్థాయి అధికారులు గవర్నర్‌ వెంట ఉంటారు. తహసీల్దార్‌, ఆర్‌ఐ వరకు అందరూ ఒకరోజు ముందు నుంచే తిరుమలలో తిష్టవేసి గవర్నర్‌ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. గవర్నర్‌ వరుస పర్యటనల కారణంగా అత్యంత బిజీగా ఉండే ఈ అధికారుల పని గంటలు అన్నీ వృథా అవుతున్నాయి. గవర్నర్‌ పర్యటన సందర్భంగా సుమారు 70 మంది రాష్ట్ర ఉద్యోగులు ప్రొటోకాల్‌ విధుల్లో ఉంటారు. పరోక్షంగా ఈ సంఖ్య మరీ ఎక్కువ. వీరందరికీ టీఏ, డీఏ చెల్లించాలి. వాహనాలకు ఆయిల్‌ ఖర్చులు ఇవ్వాలి. తిరుమలలో బస, భోజన ఖర్చులు అదనం. గవర్నర్‌ వచ్చారంటే డాక్టర్లు, స్టాఫ్‌ నర్సులు, ల్యాబ్‌ అసిస్టెంట్లు రుయా ఆస్పత్రి నుంచే వెళ్లాలి. అసలే డాక్టర్ల కొరతతో కునారిల్లుతున్న రుయా ఆస్పత్రిలో వీవీఐపీలు వచ్చారంటే ఇక ఆరోజుకు ఓపీలకు హాలిడే ప్రకటించినట్లే!
ఈ విషయం తెలియక ఆస్పత్రికి వచ్చే రోగులకూ ఇబ్బందులు తప్పవు. ఇక, రుయా ఆస్పత్రికి ఉన్నది ఒక్కటే అంబులెన్స్‌. అది కాస్తా వీవీఐపీల వెంట వెళితే ఇక ఆరోజు ప్రాణాపాయ స్థితిలోని రోగులు ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. ఇక ట్రాఫిక్‌ ఆంక్షల కారణంగా వాహనదారుల ఇక్కట్లు చెప్పాల్సిన పని లేదు. నగరంలో ఎక్కడైనా రోడ్డు బ్లాక్‌ చేస్తే, ‘గవర్నర్‌ వచ్చాడేమో’ అని అంటున్నారంటే ఆయన రాక జనం దృష్టిలో ఎంత అసహనాన్ని సృష్టిస్తోందో ఊహించుకోవచ్చు.
తిరుమలకు 37 సార్లు.. దర్శనానికి 60 సార్లకుపైగా

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా నరసింహన్‌ బాధ్యతలు చేపట్టి దాదాపు ఐదున్నరేళ్లు అవుతోంది. ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం గవర్నర్‌ హోదాలో నరసింహన్‌ 37 సార్లు తిరుమలలో పర్యటించారు. ఒకే నెలలో వరుసబెట్టి రెండు, మూడు సార్లు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే, ఒకే పర్యటనలో రెండుసార్లు (సాయంత్రం, ఉదయం), ఒక్కోసారి మూడుసార్లు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. మొత్తంమీద ఇప్పటి వరకు ఆయన 60 సార్లకుపైగా శ్రీవారిని దర్శించుకున్నారు. అత్యధిక సందర్భాల్లో సతీసమేతంగా వస్తే, కొన్నిసార్లు మాత్రం బంధుమిత్ర సపరివార సమేతంగా వచ్చారు. నరసింహన్‌ సాధారణంగా సాయంత్రం, ఉదయం దర్శనాలకు వెళుతూ ఉంటారు. దాంతో, ఆరోజు రాత్రి ఆలయం మూసివేసేలోగా శ్రీవారిని దర్శించుకొని బయటపడాల్సిన వేలాదిమంది భక్తులు… గవర్నర్‌ వంటి వీవీఐపీల కోసం క్యూలైన్లు నిలుపు చేయడంతో ఆ రాత్రికి దేవదేవుని దర్శనం కాకపోగా మరుసటి రోజు ఉదయం సర్వదర్శనం ఆరంభమయ్యే వరకు (శని, ఆది, సోమ వారాల్లో 7 గంటల వరకు, మంగళ, బుధ, గురు వారాల్లో 9 గంటల వరకు, శుక్రవారం 10 గంటల వరకు) క్యూలైన్లలోనే ఉండాల్సి వస్తోంది. ఇక, గవర్నర్‌ వస్తే ఘాట్‌ రోడ్డు ప్రయాణికులకూ ఇబ్బందులు తప్పవు. గవర్నర్‌ వాహనం కొండెక్కే వరకు అలిపిరి వద్ద వాహనాలను నిలిపివేస్తారు. కొండ దిగే సమయంలోనూ ఇంతే. అలిపిరిలో అర్ధగంట వాహనాల రాకపోకలు నిలిపితే ఆ ప్రభావం కొండెక్కే యాత్రికులపై సుమారు గంటన్నర ఉంటుంది. అప్పటికే పెద్ద సంఖ్యలో వాహనాలు బారులు తీరతాయి. తనిఖీలు ముగించుకొని టోల్‌గేటు దాటే సమయానికి కొండ కిందే యాత్రికులకు దేవుడు కనిపిస్తాడు!

విజ్ఞత అంటే అదీ..!

తిరుమల వేంకటేశ్వరస్వామి పేరు చెప్పగానే ఆ వెనువెంటనే గుర్తుకొచ్చే పేరు మరొకటి ఉంది. అదే శంకర్‌ దయాళ్‌ శర్మ. ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా, దేశానికి ఉప రాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా విశిష్ఠ సేవలందించిన వివాదరహితుడు ఆయన. తన పదవీ కాలంలో అనేక పర్యాయాలు తిరుమలేశుని దర్శించుకుని రికార్డులకెక్కారు. ఒకరోజు ఆయన రాష్ట్రపతి హోదాలో తిరుమలేశుని దర్శించుకుని, తిరిగి వెళుతూ తిరుపతి విమానాశ్రయంలో విలేకరులను హడావుడిగా పిలిపించారు. ఇందుకు కారణం అంతకు ముందురోజు ఒక ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనమే. శంకర్‌ దయాళ్‌ శర్మ తరచూ తిరుమలకు వస్తుండడంతో భక్తుల ఇబ్బందులను అందులో వివరించారు. దాంతో, సదరు పత్రిక ప్రతినిధి తనంతట తానే సంజాయిషీ ఇచ్చారు. ఆ వార్తను తామంతట తాము రాయలేదని, వార్తా సంస్థ ఇచ్చిన కథనాన్నే ప్రచురించామని, మన్నించాలని కోరారు. అందుకు శంకర్‌ దయాళ్‌ శర్మ చిరునవ్వుతో స్పందిస్తూ.. ‘‘నేను ఫలానా అన్నిసార్లు తిరుమలకు వచ్చారని రాశారు. అది తప్పనుకుంటున్నా. ఇంకా ఎక్కువసార్లే వచ్చాను. బహుశా, మీరు గమనించలేదేమో! ఇప్పుడు నేను మీడియాను పిలిచింది ప్రజలకు క్షమాపణ చెప్పడానికి. స్వామివారంటే నాకు వల్లమాలిన భక్తి. రాకుండా ఉండలేను. చనిపోయాక ఎలాగూ రాలేను కదా! బతికున్నన్నాళ్లు ఆయనకు సేవ చేసుకుందామనే వస్తున్నా. అధికారం ఉందని దర్పం చెలాయించడం లేదు. నావల్ల భక్తులకు ఇబ్బంది కలుగుతోందన్న విషయాన్ని నేను గుర్తించాను. అందుకే మీ ద్వారా భక్తకోటికి క్షమాపణ చెప్తున్నా. అలాగే, టీటీడీ అధికారులకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా. నేను దర్శనానికి వచ్చినప్పుడు క్యూను ఆపవద్దు. మహా అయితే, గర్భ గుడిలో ఉన్న రెండు మూడు నిమిషాలు మాత్రం ఆపి, మిగతా సమయాల్లో యథావిధిగా భక్తులను అనుమతించండి. ఘాట్‌ రోడ్డులోగానీ, క్యూలోగానీ భక్తులెవరికీ అసౌకర్యం కలిగించవద్దు. దయచేసి ఇకపై నా కారణంగా భక్తులను ఇబ్బంది పెట్టవద్దని వినమ్రంగా అభ్యర్థిస్తున్నాను’’ అని వ్యాఖ్యానించారు. తాను మాత్రమే కాకుండా తన సతీమణి విమల కూడా భక్తులకు అసౌకర్యం కలుగుతోందని తెలిసి నొచ్చుకున్నారని, ఇకపై భక్తులకే ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. శర్మ ఆ మాటలు అన్నప్పుడు అక్కడ ఉన్న అందరూ చప్పట్లు కొట్టి అభినందనలు తెలిపారు. అదీ ఒక విజ్ఞత గల రాజనీతిజ్ఞుడికి ఉండాల్సిన లక్షణమని వ్యాఖ్యానించారు.


 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.