తెల్లారి పొయ్యింది. ఆ కోడాలు నిద్దర్లేచి మడిజేతులు కట్టుకోని, ‘అత్తాత్తా! దొడ్డికి వొత్తుగా వొస్తుండాదత్తా! రాయల్ చెరువు కట్టకాడికి-’ అని ఆ అత్తనడిగింది. దీనికి కోడాలి నోట్లో మాట నోట్లో వుండంగానే, ‘నువ్వు ఆరా తీరా దొడ్డికి కుచ్చోనుబోతే ఎద్దల దొడ్డిలో, ఆవల దొడ్డిలో పేడకళ్ళనెత్తి ఎవురు దిబ్బలో పోస్తారు?’ అనింది ఆ అత్త. ఆ కోడాలు ఎద్దల దొడ్డిలో ఆవల దొడ్డిలో పేడకళ్లనెత్తి, దిబ్బలో పోసి, మడిజేతులు కట్టుకోని, ‘అత్తాత్తా! దొడ్డికి వొత్తుగా వొస్తుండాదత్తా! రాయల్ చెరువు కట్టకాడికి-’ అని ఆ అత్తనడిగింది. దీనికి కోడాలి నోట్లో మాట నోట్లో వుండంగానే, ‘నువ్వు ఆరాతీరా దొడ్డికి కుచ్చోను బోతే కయ్యాగాలవ కాడ కష్టం జేసే నీ మొగుడికీ, కూలోళ్లకీ చద్దెవురు పోస్తారు?’ అనింది ఆ అత్త. ఆ కోడాలు కయ్యాగాలవ కాడ కష్టం చేసే మొగుడికీ, కూలోళ్లకీ చద్ది పోసేసి, మడిజేతులు కట్టుకోని, ‘అత్తా త్తా! దొడ్డికి వొత్తుగా వొస్తుండాదత్తా! రాయల్ చెరువు కట్టకాడికి-’ అని ఆ అత్తనడిగింది. దీనికి కోడాలి నోట్లో మాట నోట్లో వుండంగానే, ‘నువ్వు ఆరాతీరా దొడ్డికి కుచ్చోను బోతే ఎసురెవురు పెడతారు, సంగటెవురు కెలకతారు, కయ్యాగాలవ కాడ కష్టం జేసే నీ మొగుడికీ, కూలోళ్లకీ సంగటెవురెత్తక పోయ్ యేస్తారు?’ అనింది ఆ అత్త. ఆ కోడాలు ఎసురుబెట్టి, సంగటి కెలికి, కయ్యాగాలవ కాడ కష్టం చేసే మొగుడికీ, కూలోళ్లకీ సంగటేసేసి, మడిజేతులు కట్టుకోని, ‘అత్తాత్తా! దొడ్డికి వొత్తుగా వొస్తుండాదత్తా! రాయల్ చెరువు కట్టకాడికి-’ అని ఆ అత్తనడిగింది. దీనికి కోడాలి నోట్లోమాట నోట్లో వుండంగానే, ‘చింతకాయల కాలం, చింతపొండుకు యీనెదీసి, గింజిలెవరు కొడతారు?’ అనింది ఆ అత్త. ఆ కోడాలు చింతపొండుకు యీనెదీసి, గింజలు కొట్టి, మడిజేతులు కట్టుకోని, ‘అత్తాత్తా! దొడ్డికి వొత్తుగా వొస్తుండాదత్తా! రాయల్ చెరువు కట్టకాడికి-’ అని ఆ అత్తనడిగింది. కోడాలి నోట్లో మాట నోట్లో వుండంగానే ‘సందల గూకింది. నువ్వు ఆరాతీరా దొడ్డికి కుచ్చోను బోతే రేత్రికి చారూకూడూ ఎవురొండుతారు, నీ మొగుడికీ బిడ్లకీ ఎవురు పెడతారు?’ అనింది ఆ అత్త. ఆ కోడాలు చారూ కూడూ వొండేసి, మొగుడికీ, బిడ్లకీ, చారూ కూడూ పెట్టేసి, మడిజేతులు కట్టుకోని, ‘అత్తాత్తా! రాయల్ చెరువు-’ అని అత్తనడిగింది. ఆ అత్త, ‘యింక బొయ్ చావు!’ అనింది. కంటికి కడవడు నీళ్లు బెట్టుకోని ఆ కోడాలు రాయల్ చెరువు కట్టకాడికి పరిగెత్తి, తూముకు ఆ పక్క వొక కాలూ, యీ పక్క వొక కాలూ పెట్టి దొడ్డికి కూచ్చునింది. ముక్కింది మూలిగింది బొరోమని ఏడ్చింది. ‘ఆరా తీరా దొడ్డికి కుచ్చోను యవది లేని ఆడదాని శాపిని యీ జగానికి తగలాల’ అని చుక్క లకల్లా ఎగజూసి దండం బెట్టుకొనింది. ఇంకంతే. పెళపెళార్బాటాలతో పింటికలు రాతి కూసాల మాదిరి, కాటమరాజు గుండ్లు మాదిరి తూములోకి పడి తూము నిండిపొయ్యింది. వొక్కడుగులో రాయల్ చెరువు మింద చాటంత మబ్బెక్కింది. చెరువు నిండే వాన కొట్టింది. ఏకానికొగటిగా జొరోమని వాన. ఎక్కడుండే వంకలూ రాయల్‌చెరువు మిందికొచ్చి పడిపోతుండాయి. తూము నుంచి వొక్క చుక్క నీరు బైటికి రావడం లా. ‘వొకాడది ఆరాతీరా దొడ్డికి కూచ్చునే సౌక్రం లేని యీ బూమండలాన యింక ఎండలు కాయగూడదు. కొళ్లో జగ!’ అని శాపం బెట్టి తూము మింద కుచ్చున్నది కుచ్చున్నట్టే శిల అయిపొయ్యిందా కోడాలు. శిల మింద వాన, చెరువు మింద వాన. చెరువు నిండింది పొంగింది పొల్లింది కట్ట తెగిపొయ్యింది. వూళ్ల మింద నీళ్లు, యీ ఎండలు కాసే బూమండలమంతా నీళ్లు. కాళాస్ర్తి గోపురం మింద గువ్వొగటి వాలి మోర వంచకుండా నీళ్లు తాగతుండాది.