|
ఒక కథలో పోలీసు శాఖలోని లొసుగులను ప్రశ్నిస్తారు. ఇంకో కథలో చట్టంలోని లొసుగుల్ని వెలికి తీస్తారు. నాటకం ఏదైనా ఆయన కథా వస్తువు అంతా చట్టం, న్యాయం చుట్టూనే తిరుగుతుంది. వృత్తిపరంగా న్యాయవాది కావడం ఆయనకు కలిసొచ్చే అంశం. మూడు దశాబ్దాలుగా తన రచన, నటనా పటిమతో ఎన్నో బహుమతులు సొంతం చేసుకున్న దిట్ట విశాఖపట్టణానికి చెందిన పి.టి.మాధవ్.
‘‘మాది తూర్పుగోదావరి జిల్లా భీమవరం. విశాఖపట్టణంలో పుట్టి పెరిగాను. చదువంతా ఇక్కడే సాగింది. పదో తరగతి నుంచి నాటకాలు వేయడం ప్రారంభించాను. ఆ ఆసక్తితోనే దర్శకత్వం, నటనలో శిక్షణ తీసుకున్నాను. కేవలం నటనకే పరిమితం కాకుండా రచయితగా సమాజానికి మేలు చేసే అంశాలను జోడించి.. ప్రదర్శించాలన్నది నా ఆలోచన. ఒక వైపు నటిస్తూనే రాయడం మొదలు పెట్టాను. న్యాయవాదిగా పట్టా పుచ్చుకుని 1988లో ప్రాక్టీస్ ప్రారంభించాను. నగరమంతా నిద్రపోయాక రచనకు పూనుకునేవాడిని. న్యాయశాస్త్రంలోని అంశాలతో సమాజానికి మెసేజ్ ఇచ్చేలా రచనలు చేశాను. చట్టంలోని లొసుగులు, దర్వినియోగం అవుతున్న తీరు తదితర అంశాలతో ప్రజల్ని చైతన్యపరిచే నాటికలను రచించి సొంత దర్శకత్వంతోపాటు, పాత్రధారుడిగా కూడా బాధ్యతను నిర్వర్తించేవాడిని. అలాగే విశాఖ రత్నం అవార్డు, కూరెళ్ల సోమేశ్వరరావు ట్రస్టు ద్వారా ఉత్తమ రచయిత పురస్కారం, కళా జగతి పత్రిక ద్వారా ఉత్తమ రచయిత పురస్కారం ఎంతో సతృప్తినిచ్చాయి. స్వర్గీయ సుత్తివేలు, రాధాకుమారి, సాక్షి రంగారావు, పొట్టిప్రసాద్ వంటి ప్రముఖ నటులతో కలిసి ‘లేదు దుఃఖం జగతిలో’ పేరిట రూపొందించిన టీవీ సీరియలో నటించడంతోపాటు ఓ ఎపిసోడ్‌కు దర్శకత్వం వహించడం గర్వంగా భావిస్తాను.
విశాఖలో మోడ్రన్ థియేటర్
కళారంగానికి జీవం పోయాలని, నా ఊపిరి ఉన్నంత వరకు నాటక రంగానికి సేవ చేయాలని మోడ్రన్ థియేటర్‌ను స్థాపించాను. ఇప్పటి వరకు ఎంతో మందికి నటనలో శిక్షణ ఇచ్చాను. యాక్టింగ్‌లో ఓనమాలు రానివారిని కూడా ఉత్తమ నటులుగా తీర్చిదిద్దాను. నాటికల్లో చట్టపరమైన సమస్యలను చర్చిస్తూ పరిష్కార మార్గాలను చూపుతూ, కథా గమనాన్ని అనుసరించి ఖర్చుకు వెనుకాడకుండా అవసరమైన ఆర్టిస్టులతో ప్రదర్శించడం మా మోడ్రన్ థియేటర్ ప్రత్యేకత. అందుకే ప్రజలంతా దీనిని ‘నేచురల్ థియేటర్’ అని పిలుస్తారు. ఇప్పటి వరకు ఇరవై నాటికలను రాశాను. నాలుగు నాటకాలు, ఏడు రేడియో నాటకాలు, నాలుగు టీవీ నాటికలు కూడా రచించాను. మొత్తంగా వెండితెరపై నాలుగు తెలుగు చిత్రాల్లో కూడా నటించాను. నేను కథ, మాటలు సమకూర్చిన ‘కోయిల’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఏడాదికి కనీసం 60 ప్రదర్శనలకు తక్కువ లేకుండా సుమారు 30 ఏళ్లపాటు రాష్ట్రమంతటా ప్రదర్శనలు ఇచ్చాను. ఇప్పుడు ఆ సంఖ్య తగ్గినా ప్రదర్శనలు కొనసాగిస్తున్నాను. హైదరాబాద్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి నాటక పోటీల్లో ఉత్తమ నటుడు, రచయిత, హాస్యనటుడు, వంటి అవార్డులు దక్కాయి. ‘నన్కెక్కించండి బోను’ నాటకానికి యువకళావాహిని అక్కినేని పరిషత్‌లో ఉత్తమ రచయితగా పలుమార్లు అవార్డులు రావడం సంతోషకరం.
‘నన్నెక్కించండి బోను’
పోలీస్ శాఖలో ఉండే లొసుగులు తెలియజేస్తూ స్టాక్ విట్నె్‌సల మీద వారు ఎందుకు ఆధారపడుతున్నారో, సెర్చి వారెంట్ వారి చేతుల్లో ఎలా రూపుమారిపోతుందో, గ్రామీణ వాతావరణంలో యధార్థ సంఘటనల ఆధారంతో రాసిన నాటకం.
నల్లకోటు నవ్వింది..’
ప్రామిసరీ నోటుకున్న కాలపరిమితి, చట్టపరమైన లావాదేవీల గురించి తెలియకుండా అప్పుచేస్తే ఎన్ని పాట్లు పడాలో.. తెలిపే హాస్య నాటిక ఇది.
‘వెళ్లిపోకే చిన్నమ్మ…’
ఐపీసీ 498ఎ సెక్షన్ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నందున ఎన్ని కుటుంబాలు నాశనమవుతున్నాయో తెలియజేసే నాటిక ‘వెళ్లిపోకే చిన్నమ్మ’. అన్ని ప్రముఖ రేడియో స్టేషన్లలో నాటకంగా ఇది ప్రసారమైంది.
|

