పూర్వం ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేది. నటనలో ఒకరిని మించి మరొకరు చేయాలన్న పోటీతత్వం ఉండేది. అదే ఇప్పుడు చూసుకుంటే ఈర్ష్యాభావంతో ఉంటున్నారు. అవతలి వాడికి సాంగ్ ఉంటే నాకూ సాంగ్ ఉండాలనే రీతిగా ఉంటున్నారే తప్ప ఫలితం బాగుండాలనే వాతావరణం లేదు. దీనికి కొంతవరకు మీడియా కూడా కారణం. ఒకప్పుడు విమర్శ కూడా నిష్కర్షగా ఉండేది. మంచిని మంచిగా, తప్పుల్ని తప్పులుగా చూపించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కలెక్షన్‌కింగ్, రెబల్‌స్టార్, మెగాస్టార్, సూపర్‌స్టార్ ఏంటి ఇవన్నీ… నటీనటులందరూ సమానమే కదా. మంచి ఉంటే పొగడండి, చెడు ఉంటే విమర్శించాలి. అప్పుడే నటులకి మంచి చేసిన వాళ్లవుతారు. అలాకాకుండా అనవసరంగా పొగడడం వల్ల కృషి లేకుండానే పెద్ద వాళ్లని చేసేస్తున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలి.
దాదాపు 800 సినిమాల్లో నటించిన అరుదైన తెలుగు నటుడు కైకాల సత్యనారాయణ. హీరోగా, విలన్‌గా, కమెడియన్‌గా పలు పాత్రల్లో తనదైన ముద్రను వేసిన సత్యనారాయణ తెలుగు సినిమా పరిశ్రమ ప్రస్థానానికి ఒక సజీవ సాక్ష్యమని చెప్పొచ్చు. అప్పటికి ఇప్పటికి సినీరంగంలో వచ్చిన మార్పులపైన ఆయన ‘నవ్య’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ.
మీరు పోషించిన నవరసాల్లో మీకు బాగా నచ్చే పాత్ర ?
ఫలానాదే నచ్చుతుందని చెప్పలేను. అన్నీ బాగానే ఉంటాయి. శృంగార రసం బాగుంటుంది. కానీ మొరటుగా ఉన్నవాళ్లు శృంగార రసం ఒలికిస్తే చూసేందుకు బాగుండదు. హాస్య రసం చూసేందుకు, చేసేందుకు రెండు విధాలా బాగుంటుంది. ఎందుకంటే హాస్యరసం చేసేటప్పుడు బరువుగా అనిపించదు. మరీ బరువైనది భయానకం, రౌద్రం… ఇందులో హావభావాలతోపాటు శారీరకంగా కూడా పలికించాలి. నాకు కరుణరసం (సాత్వికం) అంటే మహా ఇష్టం. నేను నెంబర్ వన్ విలన్‌గా ఉన్న రోజుల్లోనే ‘ఉమ్మడి కుటుంబం’ సినిమాలో పాథటిక్ పాత్ర ఇచ్చారు. ఆ పాత్రకు మంచి ప్రశంసలు వచ్చాయి. ఆ సినిమాలో నా నటన చూసి ‘అత్తగారు కొత్త కోడలు’లో అవకాశం ఇచ్చారు. ‘శారద’ సినిమా అయితే నా జీవితాన్నే మార్చేసింది. ప్రేక్షకుల నుంచి రోజుకి వేల ఉత్తరాలు వచ్చేవి. వాటన్నిటి సారాంశం ఒకటే ‘‘జీవితంలో మాక్కూడా మీలాంటి అన్న ఉంటే ఎంత బాగుండేద’’ని. కరుణ రసం నాకు పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాలో కామెడీ పాత్ర చేశాను. అప్పట్నించి కామెడీ పాత్రలు మొదలయ్యాయి. ఇన్ని రకాల పాత్రలు చేసే అవకాశం లభించడం నా అదృష్టం. దానికంటే కూడా ప్రేక్షకులు నన్ను అన్ని పాత్రల్లో అంగీకరించడం ఆనందించే విషయం.
మీ అభిరుచులు…
పాత సినిమాలు చూస్తాను, సరదాగా స్నేహితులతో కలిసి పేకాట ఆడతాను. ఈ మధ్య కాలంలో పవన్‌కల్యాణ్ సినిమా టీవీలో వస్తుంటే చూశాను. థియేటర్‌కి వెళ్లి సినిమా చూడాలంటే ప్రైవసీ ఉండదు. అందుకే వెళ్లను. పూర్వం సినిమా నిర్మాణం పూర్తయ్యాక ఇండస్ర్టీలో ఉన్న ప్రొడ్యూసర్లని, దర్శకులని, నటీనటుల్ని పిలిచి ప్రివ్యూ వేసేవారు. కాని ఇప్పుడు… ఉన్న కొద్దిమంది పాత ఆర్టిస్టుల్ని పిలిచి గౌరవంగా సినిమా వేసి చూపిద్దామని ఏ ఒక్క నిర్మాతకి గాని, హీరోకి గాని లేదు. ఆఖరికి మేం నటించిన సినిమాలు కూడా మాకు చూపించడంలేదు. ఇంట్లోనే పాత సినిమాలు చూస్తుంటాను. ఆ సినిమాల్లో చక్కటి సెంటిమెంట్, మోరల్, మంచి సంగీతం ఉంటాయి. మైథాలజీలు చూస్తుంటే కళ్లకి, చెవులకి విందు. పాతాళభైరవి సినిమాలో ‘కలవరమాయె మదిలో…’ పాటను ఆరు షాట్లతోనే చిత్రీకరించారు. ఆ ఆరు షాట్లలో నటీనటుల ముఖ కవళికలు, హావభావాలు, అందచందాలు ఎంత చక్కగా చూపించారు. పాట వింటే మంచిగా అర్థమవుతుంది. ఇప్పుడొస్తున్న సినిమా పాటల్లో ఒక్క ముక్కా వినిపించదు. అర్థం కాదు. అసలు సినిమాకి ఎందుకు వెళ్తాం? చూసి ఆనందించడానికే కదా. అంతేగాని హత్యలు, కేకలు, పెట్రోల్ పోసి తగలబెట్టడాలు, గొడ్డళ్లతో నరుక్కుంటుంటే చూసేందుకా వెళ్లేది. మిగతా వాళ్ల సంగతేమో గాని నేను మాత్రం అలాంటివి చూడను. సినిమా ఈజ్ మెంట్ ఫర్ ఎంటర్‌టైన్‌మెంట్. అంతే ఉండాలి కాని జుగుప్స కలిగించే విధంగా, భయంకరంగా, భీకరంగా ఉండకూడదు. చూసినంత సేపు ఎంజాయ్ చేసి రిలాక్స్ అవ్వాలి.
ఆరుతరాల నటీనటులతో కలిసి నటించారు కదా. అప్పటికి… ఇప్పటికి ఏమైనా తేడాలు కనిపించాయా?
సిఎ్‌సఆర్, నాగయ్యగారు. ఎన్టీఆర్, ఏఎన్నార్. కృష్ట, శోభన్ బాబు, జగ్గయ్య, కాంతారావు. చిరంజీవి, సుమన్. బాలయ్య, నాగార్జున, వెంకటేష్. ఎన్టీఆర్, మహే్‌షబాబు. ఇలా మొత్తం ఆరు తరాలతో కలిసి నటించాను. ముఖ్యంగా చెప్పాలంటే ముందు తరాల వాళ్లలో అంకితభావం కనిపించేది. ఒక పాత్ర ఇస్తే అందులో లీనమైపోయేవారు. కళని దైవంగా భావించేవారు. పూర్వం నటనను ప్రకృతికి ప్రతిబింబంలా భావించే వాళ్లు. ఇప్పుడంటే అంతా స్పీడుమయం. రోజుకి నాలుగైదు సీన్లు చేయిస్తుంటారు. అదే పూర్వం రోజుల్లో తీసుకుంటే ఎల్వీప్రసాద్, బిఎన్‌రెడ్డి, కెవిరెడ్డిగార్లు ఒక రోజుకి ఒక సీన్‌ని ప్లాన్ చేస్తే ఆ ఒకటే చేయించేవాళ్లు. దాని తాలూకు షూటింగ్ నాలుగ్గంటలకల్లా పూర్తయితే ప్యాకప్ చెప్పేసేవాళ్లు. టైం ఉంది కదా అనడిగితే… ‘‘రేపు చేద్దాం ఏంపోయింది. చక్కగా తీసుకుందాం’’ అనేవాళ్లు. ఆ తరం వాళ్లకు కళ పట్ల తపన ఉండేది. సహజత్వం ఉండేది. అలాగే టైంకి మేకప్ వేసుకుని సెట్‌లో ఉండేవాళ్లం. పొద్దున్నే నాలుగున్నరకి లేపి టీ ఇచ్చి వెళ్లేవాళ్లు. మళ్లీ అరగంటకి వచ్చే వాళ్లు. ఆ అరగంటలోపులో స్నానం చేసి, పది నిమిషాలు వ్యాయామం చేసి సిద్ధంగా ఉండేవాళ్లం. ఐదుంబావుకల్లా బయల్దేరి స్టూడియోకి వెళ్లిపోయి మేకప్, డ్రస్సింగ్ చేసుకునేవాళ్లం. టిఫిన్ చేసి సెట్‌లోకి వెళ్లే వాళ్లం. అప్పట్లో ఎవరు పెందలకడ వస్తే వాళ్లు గొప్ప ఆర్టిస్టులు. ఇప్పుడు ఎంత లేటుగా వస్తే అంత పెద్ద ఆర్టిస్టులు కదా. అంత తేడా ఉంది అప్పటికి ఇప్పటికి. నటనాపరంగా కూడా ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేది. ఒకరికంటే ఒకరు బాగా చేయాలనుకునేవాళ్లు. ఇప్పుడు ఈర్ష్యాభావంతో ఉంటున్నారే తప్ప ఆరోగ్యకర వాతావరణం కనిపించడం లేదు.
మీ కుటుంబ సభ్యులకి మీరు పోషించిన పాత్రల్లో వేటిని ఎక్కువగా ఇష్టపడతారు?
ఆవిడకి సెంటిమెంట్ ఉన్న పాత్రలు నచ్చేవి. మా అమ్మాయిలయితే అవి చూసి కన్నీళ్లు పెట్టుకునేవారు కూడా. విలన్ పాత్రలు నచ్చేవి కావు. ఇప్పుడు నా సినిమాలు నా మనవళ్లు, మనవరాళ్లు చూస్తారు. మాకు ఇద్దరమ్మాయిలు ఇద్దరబ్బాయిలు. పెద్దమ్మాయి మద్రాసులో ఉంటుంది. పెద్దబ్బాయి హైదరాబాద్‌లో ఉంటాడు. రెండో అబ్బాయి బెంగళూరులో, రెండో అమ్మాయి రెండేళ్లక్రితం వరకు అమెరికాలో ఉండి ఇప్పుడు హైదరాబాద్‌కి వచ్చేసింది. మా కుటుంబం నుంచి నటనా రంగంవైపు ఎవరూ రాలేదు. మా తమ్ముడు, అబ్బాయిలు నిర్మాతలుగా ఉన్నారు. ‘రమ ఫిల్మ్స్’ పేరిట ఎనిమిది సినిమాలు తీశాం. మా రెండో అబ్బాయి కన్నడ సినిమాలు, సీరియల్స్ తీస్తున్నాడు. ఈ మధ్య మా రెండో అమ్మాయి కొడుకు నటనపట్ల ఆసక్తి కనబరుస్తున్నాడు. కాని పిల్లలు కదా వాళ్ల ఆలోచనలు ఎప్పుడెలా ఉంటాయో తెలియదు. నా వరకు మాత్రం మంచి కథతో, నాకు తగ్గ పాత్ర వస్తే నటించేందుకు సిద్ధం.
దాదాపు 800 సినిమాల్లో నటించిన మీ నటనా జీవితంలో మర్చిపోలేని సంఘటనలేవైనా…
మద్రాసులో ఉండి సినిమాల్లో ప్రయత్నిస్తున్న రోజుల్లో ఇంటి దగ్గర నుంచి తిరిగి వచ్చేయమని ఒత్తిడి ఉండేది. నాకేమో ఏం సాధించకుండా వెనక్కి తిరిగి వెళ్లాలనిపించలేదు. ఒక సాయంత్రం పనిపిల్లని పంపించి కాఫీ తెప్పించుకుని తాగాను. ఆఖర్న చూస్తే కాఫీ గ్లాసు అడుగున చచ్చిన సాలీడు కనిపించింది. నాతోపాటు రూమ్‌లో ఉన్న వాళ్లు సాలీడు విషంతో సమానం. డాక్టర్ వద్దకు పోదామన్నారు. డాక్టర్ దగ్గరకి రానన్నాను. తెల్లారి లేచేసరికి బతికుంటే భవిష్యత్తు ఉన్నట్టు. ఒకవేళ పోయానా ప్రాణంతో పాటు నా కష్టాలూ పోయినట్టేనని నిద్రపోయాను.
యుగపురుషుడు సినిమా షూటింగ్‌లో రామారావుతో ఫైటింగ్ సీన్. ఆయన నాగలి వంటి ఆయుధంతో నన్ను కొడతారు. నేను తప్పుకుంటే అది పిల్లర్‌లో గుచ్చుకుపోవాలి. కాని ఆయన రాంగ్ టైంలో రావడంతో నా కణత పక్కగా దెబ్బ తగిలింది. అంతటితో అయిపోయిందనుకున్నాను. కాని డాక్టర్ వచ్చి మందు ఇచ్చాక కోలుకున్నాను.
అప్పట్లో సినిమా నిర్మాణం పూర్తయ్యాక ఇండస్ర్టీలో ఉన్న ప్రొడ్యూసర్లని, దర్శకులని, నటీనటుల్ని పిలిచి ప్రివ్యూ వేసేవారు. కాని ఇప్పుడు… ఉన్న కొద్దిమంది పాత ఆర్టిస్టుల్ని పిలిచి గౌరవంగా సినిమా వేసి చూపిద్దామని ఏ ఒక్క నిర్మాతకి గాని, హీరోకి గాని లేదు. ఆఖరికి మేం నటించిన సినిమాలు కూడా మాకు చూపించడంలేదు.
ఇప్పుడొస్తున్న సినిమా పాటల్లో ఒక్క ముక్కా వినిపించదు. అర్థం కాదు. అసలు సినిమాకి ఎందుకు వెళ్తాం? చూసి ఆనందించడానికే కదా. అంతేగాని హత్యలు, కేకలు, పెట్రోల్ పోసి తగలబెట్టడాలు, గొడ్డళ్లతో నరుక్కుంటుంటే చూసేందుకా వెళ్లేది. మిగతా వాళ్ల సంగతేమో గాని నేను మాత్రం అలాంటివి చూడను.
సినిమా ఈజ్ మెంట్ ఫర్ ఎంటర్‌టైన్‌మెంట్. అంతే ఉండాలి కాని జుగుప్స కలిగించే విధంగా, భయంకరంగా, భీకరంగా ఉండకూడదు. చూసినంత సేపు ఎంజాయ్ చేసి రిలాక్స్ అవ్వాలి.
నటనను ప్రకృతికి ప్రతిబింబంలా భావించే వాళ్లు. ఇప్పుడంటే అంతా స్పీడుమయం. రోజుకి నాలుగైదు సీన్లు చేయిస్తుంటారు.
అప్పట్లో ఎవరు పెందలకడ వస్తే వాళ్లు గొప్ప ఆర్టిస్టులు. ఇప్పుడు ఎంత లేటుగా వస్తే అంత పెద్ద ఆర్టిస్టులు కదా.
పూర్వం నటనాపరంగా ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేది. ఒకరికంటే ఒకరు బాగా చేయాలనుకునేవాళ్లు. ఇప్పుడు ఈర్ష్యాభావంతో ఉంటున్నారే తప్ప ఆరోగ్యకర వాతావరణమే కనిపించడం లేదు