ఆనంద రామాయణ
శ్రీరాముని దిన చర్య
శ్రీరాముడు ఉదయాన్నే లేచి కాలోచిత విధులు నిర్వహించి పల్లకీ ఎక్కి సరయూ నదికి మహా వైభవం గా వెళ్ళేవాడు .నదిని పరిశుద్ధి చేయాలనే సంకల్పం తో ఇసుకపై కాలి నడకన ప్రవాహం ఉన్న చోటికి చేరేవాడు .బ్రాహ్మణులు చెప్పినట్లు స్నానాదులు పూర్తీ చేసి నిత్య కర్మలను అనుస్టించేవాడు .గోవులను బంగారాన్ని ధాన్యాలను బెల్లాన్ని డబ్బును మొదలైన దానాలతో సరయూ నదికి ,విప్రులకు పూజ చేసి సమర్పించేవాడు .
బంగారు గొలుసులతో అలంకరింపబడ్డ ,పట్టు బట్టలు బంగారు త్రాళ్ళు ఉన్న గుర్రాలు లాగే రధమెక్కి స్నానం చేసి మడికట్టుకొన్న సారధి తోలుతుండగా పురజనులు చూస్తుండగా రాజమార్గం లో ప్రయాణించేవాడు .నగర స్త్రీలు పుష్ప వృష్టి కురిపిస్తుండగా నిజ మందిరం చేరే వాడు .సీత ఇచ్చే అర్ఘ్య పాద్యాదులను స్వీకరించేవాడు .అగ్ని హోత్ర శాలకు చేరుకొని ధర్మ పత్ని సీతతో కలిసి అగ్ని హోత్రునికి ఆహుతులను సమర్పించేవాడు .’’గత్వాగ్ని హోత్ర శాలాయాం సీతాయాసన సంస్థితః –అగ్ని హోత్రాది విధినా వహ్నిం హుత్వా తతః పరం ‘’.
లోక శిక్ష కోసం విధి విధానంగా శ్రీ సాంబశివ శంకరుని ఆరాధించేవాడు .సీత చేసిన నైవేద్యాన్ని సమర్పించేవాడు .విప్రులకు దానాలిచ్చి సంతోష పెట్టేవాడు .వారి ఆశీర్వాదాలు గ్రహించి గోపూజ చేసి ,అశ్వత్థ వృక్షాన్ని అర్చి౦చేవాడు .తర్వాత సూర్యారాధన చేసి బ్రహ్మ యజ్ఞాన్ని విధి విధానం గా పూర్తీ చేసేవాడు .వసిస్టమహర్షి పురాణ ప్రవచనం చేస్తుంటే శ్రద్ధగా సీతా సమేతం గా విని మహర్షిని సత్కరించేవాడు .బంధుమిత్రులు చేరగా వారితో సరస సల్లాపాలు ఆడేవాడు .సీతాదేవి అనేక సార్లు కోరిన మీదట దివ్య మైన నేతితో చేసిన పక్వాన్నాన్ని ,ఫలాలను ఉపాహారంగా తీసుకొనేవాడు .భార్య ఇచ్చిన తాంబూలాన్ని స్వీకరించి ,దివ్య వస్త్రాలు కట్టుకొని ,అద్దం లో చూసుకొనే వాడు .జానకీదేవి కటాక్షాన్ని పొంది రధమెక్కి మంత్రులు ,దూతలు పరి వేష్టించి ఉండగా మాత్రు మందిరాలకు వెళ్లి తల్లులను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు చేసి దీవెనలు పొందేవాడు .
తీర్ధ రూపుల వారి రాజమందిరం చేరి సింహాసనాధిస్టు డైన తండ్రి దశరధ మహా రాజును సందర్శించి ,ప్రణామం చేసి ,అక్కడకు చేరిన పురజనుల విన్నపాలు విని పరిష్కరించేవాడు .ప్రతి క్షణం రాజు గారి గౌరవ మర్యాదలను కాపాడేవాడు .తర్వాత తన మందిరం చేరేవాడు .పత్ని ఇచ్చిన అర్ఘ్య పాద్య ఆచమనాదులు స్వీకరించి ,ఆమెతో సరసోక్తులతో కాలక్షేపం చేసేవాడు .పిమ్మట సరయూ నదిలోమధ్యాహ్న స్నానం చేసేవాడు .ఆయన స్నానించిన ఘట్టాలకు ‘’రామ తీర్ధం ‘’అనే పేరు వచ్చింది .ఇక్కడ చైత్రమాసం లో స్నానం చేస్తే విశేష ఫలితం వస్తుంది –‘’నిత్యం యత్రా కరోత్ స్నానం సరయ్వాం నిర్మలే జలే –తదాఖ్యాయా భవాత్తీ ర్ధం -రామ తీర్ధ మితి స్పుటం ‘’.
తర్వాత మాధ్యాహ్నిక ఇష్టులు నిర్వహిస్తాడు .బ్రాహ్మణులు మంత్రులతో కలిసి మూడుకాళ్ల పీటల మీద స్వర్ణ పాత్రలలో భోజనాలు చేస్తాడు .సీతాదేవి కంకణ మంజీర కింకిణీ నూపురాదుల కలస్వనం కమ్మగా వినిపిస్తుండగా సీతా దేవి వడ్డన చేస్తుండగా అందరితో కలిసి భోజనం చేసే వాడు .చేతులు కడుక్కొని ,తాంబూలం వేసుకొని సంతోషిస్తాడు .కొద్దికాలం నిద్రపోయి విశ్రాంతి తీసుకొంటాడు .లేచి నూత్న వస్తధారణ చేసి ధనుర్బాణాలు ధరించి శస్త్రాలు తీసుకొని రధమెక్కి ,వైభవం గా పుష్ప ఉద్యానవనం చేరుకొంటాడు .అక్కడ విహరించి మంగళ వాద్య ధ్వనులు విని పిస్తుండగా తన మందిరం చేరుకొంటాడు .
సాయం స్నానం చేసి సంధ్యావందనాదులు పూర్తీ చేస్తాడు .అగ్నిని ఉపాసిస్తాడు .పరమేశ్వరుని పూజిస్తాడు .నైవేద్యాదులు సమర్పిస్తాడు .ఆహరం తీసుకొంటాడు .దివ్య పర్యంకం చేరుకొని సీతా సాధ్వి తో కలిసి హాస్య ,వినోద గీత సంగీత నృత్య వినోదాలు చూస్తాడు .ఆ తర్వాత సుఖం గా నిద్రిస్తాడు .ఇలా అయోధ్యలో సీత దేవితో పన్నెండేళ్ళు సఖ జీవితం గడిపాడు రాముడు .దిన కృత్యం లో మార్పేమీ ఉండేదికాదు .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -17-4-15 –ఉయ్యూరు

