నరేంద్రుని ‘అరుణ శక్తి’…
- 18/04/2015
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశాలలో జరుపుతున్న పర్యటనలు దౌత్య, వాణిజ్య, రాజకీయ పరిధులను అతిక్రమించి విస్తృత మానవీయ సంస్కృతికి ప్రతీకలుగా మారుతుండడం నడుస్తున్న చరిత్ర. నరేంద్ర మోదీ కెనడా యాత్ర సందర్భంగా ఈ వాస్తవం మరోసారి ధ్రువపడింది. తాము ఒక రాజకీయ వేత్తను కాక ఒక సామాజిక, సాంస్కృతిక ఉద్యమకారుడిని కలుసుకుంటున్నామన్న అనుభూతికి కెనడా ప్రభుత్వ ప్రతినిధులు, ప్రజలు గురికావడం ఆవిష్కృతమైన దృశ్యం…మోదీ కెనడా ప్రధాని స్టీఫెన్ హార్పర్‌తో చర్చలు జరిపారు. అణుశక్తిని శాంతియుత ప్రయోజనాల కోసం ఉపయోగించుకునేందుకు వీలైన ఒప్పందం కుదిరింది. ఇది వాణిజ్య వ్యవహారం. కెనడాకు చెందిన కెమ్‌కో సంస్థవారు ఐదేళ్లలో మనకు మూడువేల టన్నుల యురేనియంను సరఫరా చేస్తారట. విద్యుత్ ఉత్పాదనకు యురేనియం ప్రధానమైన చోదకం. మనకు ప్రపంచంలోనే అత్యధికంగా భూగర్భ, సముద్ర గర్భ థోరియం నిలువలు ఉన్నప్పటికీ యురేనియం సరఫరా కోసం ఇతర దేశాలపై ఆధారపడవలసి వస్తుండడం స్వయం సమృద్ధి భారత్ లక్ష్యానికి విఘాతకరం. కానీ అణు విద్యుత్ ఉత్పాదన థోరియం ప్రాతిపదికగా మొదలయ్యే వరకు యురేనియం కోసం మనం ఇతర దేశాలపై ఆధారపడక తప్పదు. థోరియంను తవ్వితీసి శుద్ధిచేసే ప్రక్రియ వ్యవస్థీకృతం కాకపోవడం మనం విదేశాలపై ఆధారపడడానికి మరో కారణం. కానీ ఈ వాణిజ్య వ్యవహారాన్ని ప్రస్తావించిన మోదీ అణుశక్తి, ఇతర శక్తులను సృష్టిగతమైన అనంత శక్తిగా అభివర్ణించడమే కెనడాలోని భారతీయులను, భారతీయ సంతతి వారిని మాత్రమే కాక, కెనడా ప్రజలను సైతం ఆకట్టుకున్న సంస్కారం. ఇంధన శక్తి విప్లవం గురించి మోదీ చేసిన విశే్లషణ కెనడా ప్రధాన మంత్రిని ఎంతో అబ్బురపరచింది. మోదీ మాటలతో ప్రభావితుడైన స్టీపెన్ హార్పర్ తన ప్రసంగంలో మోదీ చెప్పిన విషయాలను పదే పదే ఉటంకించడం మానవీయ సాంస్కృతిక సంబంధాలు విస్తరిస్తున్నాయన్న దానికి నిదర్శనం. విశ్వ వ్యవస్థలో నిహితమై ఉన్న మూలశక్తి సౌర విద్యుచ్ఛక్తిగా, వాయు విద్యుత్‌గా, జీవరసాయన విద్యుత్‌గా, ఆణు విద్యుచ్ఛక్తిగా ప్రస్ఫుటవౌతోంది. జల విద్యుచ్ఛక్తి గురించి, బొగ్గు ద్వారా ఇంథన వాయువు ద్వారా ఉత్పత్తి అవుతున్న శక్తి గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. ఇదంతా పంచభూత భాసితమైన ప్రకృతిక జీవశక్తి. ఈ జీవశక్తి అరుణారుణ-సాఫ్రన్-మైనది. సూర్యుడు అరుణ తరుణ కిరణాలను ప్రసాదించి విశ్వానికి ప్రాణశక్తిని ప్రసాదిస్తున్నాడు. పంచభూతాలలోని అగ్ని అరుణ-కాషాయ-వర్ణంతో వేడిని వెలుతురును ప్రసాదిస్తోంది. ఇలా సృష్టిగత శక్తిని సమాజ స్థితంగా మలచుకునే ప్రకృతి మానవీయ సంస్కృతి. అణుశక్తిని గురించి ప్రసంగించిన మోదీ సృష్టి గతిశక్తిని ప్రస్తావించడం వాణిజ్య పరిధిని అతిక్రమించిన ఆధ్యాత్మిక సంస్కార చిహ్నం. ‘అరుణ- కాషాయ- వర్ణం ఇంధన శక్తికి ప్రతీకం..’ అన్న మోదీ చేసిన విశే్లషణ వివిధ దేశాల మధ్య మాత్రమే కాదు, సమాజానికి సృష్టికీ మధ్య నెలకొన్న సహజ సంబంధాన్ని మరోసారి ఆవిష్కరించింది.
కెనడా పర్యటనలో మాత్రమే కాదు, జపాన్, నేపాల్‌ను, ఆస్ట్రేలియాను, అమెరికాను సందర్శించిన సందర్భంగా కూడ మోదీ భారతీయ సంస్కారాలను పదేపదే ప్రస్తావించారు. ఇలా ప్రస్తావించడం రాజకీయం, వాణిజ్యం, పరమావధులుగా నడచిపోతున్న అంతర్జాతీయ సమాజ జీవన గతికి మానవీయతను అద్దినట్టు అవుతోంది. భారతీయ సంస్కృతికి వౌలికమైన అధారం, పరమలక్ష్యం మానవీయత! భారత దేశపు ప్రధాన మంత్రి కృత్రిమ తాత్కాలిక వాణిజ్య, ఆర్థిక రాజకీయ దౌత్య వ్యూహాత్మక అంశాలతో పాటు శాశ్వత వౌలిక తత్వమైన మానవీయతకు విదేశీ పర్యటనలో ప్రాధాన్యం ఇస్తుండడం నరేంద్ర మోదీ నడుస్తున్న పథం…వాణిజ్య ప్రపంచీకరణ వ్యవస్థీకృతమైన తరువాత ప్రభుత్వ రంగం ప్రాధాన్యం,ప్రభుత్వాల ప్రమేయం క్రమంగా తగ్గిపోతున్నది కానీ ప్రభుత్వాల ప్రమేయం తగ్గడంతో పాటు దేశాల స్వతంత్ర సార్వభౌమ అధికారం కూడ నశించిపోతోంది. బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు వాటి రాజకీయ తాబేదార్లు ప్రచారం చేస్తున్న సరిహద్దులు చెరిగిపోవడం అన్న సిద్ధాంతం వర్ధమాన దేశాలను, సంపన్న దేశాలకు బానిసలుగా మార్చి వేస్తోంది. జనజీవనంలో ప్రభుత్వ ప్రమేయం తగ్గిపోయి, దేశ సార్వభౌమతత్వం సాంస్కృతిక స్వాతంత్య్రం బలపడడం నిజమైన రాజ్యాంగ ఆదర్శం. ఈ ఆదర్శం అనాదిగా భారతదేశంలో ఆచరణాత్మకమైన రాజ్యాంగ పద్ధతి. ‘‘అత్యల్ప ప్రభుత్వ ప్రమేయం…అత్యధిక పాలనా ప్రభావం’’ అని టొరంటోలో మోదీ ప్రస్తావించిన రాజ్యాంగ సత్యాన్ని కెనడా ప్రధాని పునరుద్ఘాటించారు. ‘‘్ధర్మేణ ఏవ ప్రజాఃసర్వే రక్షన్తిస్మి పరస్పరం’’ ధర్మాన్ని- సహజమైన న్యాయసూత్రాన్ని-పాటించే ప్రజలు పరస్పరం రక్షించుకోవడం’’ ప్రభుత్వ ప్రమేయం తగ్గిపోవడానికి సహజమార్గం. బహుళ జాతీయ వాణిజ్యం చెబుతున్న కృత్రిమ నీతిని ఇలా మోదీ నిరాకరించారు. కెనడా ప్రధాని చేత తన మాటను ఒప్పించగలిగారు. వాణిజ్య సంకుచిత పరిధికి పరిమితం కాని సాంస్కృతిక అంతర్జాతీయ భారతీయత…
వివిధ దేశాలతో కుదురుతున్న శాంతి ప్రయోజనం అణు సహకారపు ఒప్పందాలలోని డొల్లతనం మోదీ కెనడా పర్యటన సందర్భంగా మరోసారి తేటతెల్లమైంది. విదేశాలనుంచి మనదేశపు వౌలిక రంగాలకు పెట్టుబడులు తరలి వస్తాయన్నది ‘ఆర్భాటానికి’ పరిమితమైంది. ఆచరణాత్మకం కాలేదన్నది మోదీ ఐరోపా, కెనడాలలో పర్యటించినప్పుడు మరో సారి ఋజువైంది. 2008లో అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ-ఐఏఇఏ- వారు మనదేశానికి అణు విజ్ఞాన పదార్థ పరికరాలను సరఫరా చేయడానికి వీలుగా ‘అణు ఉత్పాదక వాణిజ్య దేశాల’కు అనుమతినిచ్చారు. అయితే అణు ఇంధనం సరఫరా చేసే దేశాలవారు మన దేశానికి మొండి చెయ్యి చూపిస్తున్నారు. అమెరికాతో ఆర్భాటంగా కుదిరిన అణు ఒప్పందం వల్ల కాని, ఫ్రాన్స్‌తో కుదిరిన ఒప్పందం వల్ల కాని మనకు ప్రయోజనం సిద్ధించలేదు. ఐఎఇఏ అనుమతినిచ్చిన తరువాత 2012లో కెనడాతో ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందం కార్యరూపం ధరించడానికి మూడేళ్లు పట్టింది. అనేక ఏళ్లపాటు ఊరించిన ఆస్ట్రేలియా గత ఏడాది యురేనియం సరఫరా చేయడానికి అంగీకరించింది. ఎప్పుడు సరఫరాలు ఆరంభమవుతాయన్నది తేలలేదు. అందువల్ల కెనడా నుంచి ఇప్పుడు యురేనియం రానుండడం గొప్ప పరిణామం.
యురేనియంతో పాటు విద్యుత్ ఉత్పాదిక వ్యవస్థల-రియాక్టర్లు-ను సరఫరా చేయడానికి కూడ కెనడా ఇప్పుడు అంగీకరించింది. దీనివల్ల మనదేశంలోనే యురేనియం శుద్ధి చేసుకోవడానికి వీలవుతుంది. శుద్ధి చేసిన యురేనియంను భయంకరమైన ధరలు చెల్లించి దిగుమతి చేసుకోనవసరం లేదు. నరేంద్ర మోదీ పర్యటన వల్ల లభించిన వ్యూహాత్మక విజయం ఇది. అయితే రాఫిల్ విమానాల కోసం ఫ్రాన్స్‌కు ఇరవై ఐదువేల కోట్లు, యురేనియం కోసం, రియాక్టర్ల కోసం కెనడాకు రెండు వేల రెండువందల కోట్ల రూపాయలు చెల్లించాలి. పెట్టుబడులు విదేశాలనుంచి ఏమేరకు వస్తాయన్నది తేలలేదు. మన వినియమ ద్రవ్యం తరలిపోతోంది…

