కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-3
మదనపల్లి లో విద్యాభ్యాసం –డిగ్రీ పొందటం
ఉయ్యూరు ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టినప్పుడు ‘’నా పాదాలు తప్పనాకు తో తోడువచ్చేవారు లేరు ‘’అన్న వైరాగ్యభావన కలిగింది రామయ్యగారికి .తాను సంప్రదాయ కుటుంబం లో నుంచి వచ్చినవాడిని అయినా అన్ని కట్టు బాట్లు త్రెంచుకొంటున్నాననే గుబులు గుండెలో ఎక్కడో ఒక మూల గూడు కట్టింది .మద్రాస్ లో ఆ ఆంగ్లేయునికి ఇంటికి వెడితే మర్యాద పూర్వక స్వాగతమే లభించింది .కుర్రాడు లోలోపల ఇబ్బంది పడుతున్నాడని గ్రహించి ‘’అలంటి కుగ్రామం నుంచి ఇంత దూరం వచ్చావ్.అంటే నూతన భారత ఉషోదయం జరిగిందన్నమాట .ఇండియా జాగృత మౌతో౦దన్నమాట .కాని ఎలా మలచుకోవాలో తెలీని స్తితిలో ఉంది దేశం .పెద్ద చదువులు చదవాలన్న అభిలాషకు నువ్వు మొదలూ కాదు ,చివరివాడివీకాదు.నా మీద ఆశతో వచ్చావు .ఈ సిఫార్సు ఉత్తరానికిమద్రాస్ లో విలువ ఏమీలేదు .నాకు చేతనైన రీతిలో నీకు సహకరిస్తాను .నువ్వు బాగా చదివే వాడవని అర్ధమైంది .నీకు యూని వర్సిటి లో ఎక్కడా అన్యాయం జరక్కుండా చూసే పూచీ నాది .నువ్వే కాదు ఏ ఇండియన్ కూడా ఆ కమిటీ దగ్గరకు వెళ్లి మాట్లాడే అవకాశం లేనే లేదు .’’అని నిష్కర్షగా చెప్పాడు .గుండె మీదనుంచి కొంత బరువు దిగిపోయింది రామయ్యగారికి .
మదన పల్లి డాక్టర్ అనిబి సెంట్ నేషనల్ యూని వర్సిటి లో 1917 లో 18 ఏళ్ళ వయసులో చేరటానికి పెట్టిన పరీక్షలన్నీ బాగా రాయటం తో యూని వర్సిటిలో చేర్చుకొన్నారు .రామయ్యగారికి క్రీడలు అంటే ఆసక్తి బాగా ఉండేది .పరుగుపందెం లో ఎప్పుడూ బెస్ట్ రన్నర్ .అదే జీవితం లోను బెస్ట్ రన్నర్ ని చేసింది .విశ్వవిద్యాలయ ఎత్లేట్స్ లో అగ్రగామి రామయ్య గారే .ఇవన్నీ ఆయనకు బాగా కలిసి వచ్చాయి .పందాలలోపాల్గొన్నప్పుడు ‘’పరిగెత్తు ఇంకా బాగా పరిగెత్తు ,విజయం సాధించాలి ‘’అని ప్రేక్షకుల చేసే చప్పట్లు అభినందనలే ఆయనకు ఆశీస్సులయ్యాయి .మంచి రన్నర్ ,లాంగ్ జంపర్ అయిన కోచ్ దగ్గర శిక్షణ పొందారు .యూని వర్సిటీకిపేరు తెచ్చే బాచ్ ని తయారు చేయాలని ఆ కోచ్ ఆరాట పడేవాడు .కాని జీవితం అంటే ఆటలే కాదు అంతకు మించి చాలా ఉందని ఆయనతో రామయ్య అనేవారు .’’sports for me is not the meaning but the poetry of body and movement ‘’అని రామయ్యగారి నమ్మకం .యూని వర్సిటీకి వచ్చింది అంతులేని విజ్ఞాన సంపదను మూట కట్టుకోవటానికేకాని గ్రౌండ్ లో గంతులు వేయటానికి కాదు .ఆ యూని వర్సిటి కేమిస్త్రి కంటే స్పోర్ట్స్ లో ము౦దున్నమాట మాత్రం నిజం .ఆటలతో కాలం వృధా అవుతోంది .లాగి వదిలిన బాణం లక్ష్యం చేరుకొన్నట్లే ఎక్కడికో సుదూర తీరాలకు ఎగిరిపోయి ఏదో ఎవ్వరికీ దక్కనిదాన్ని సాధించాలి .ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. అలసత్వం పనికి రాదు .తొందరపడాలి అని అంతరాత్మ ఘోషిస్తోంది .ఒక్కోసారి మనసు నిశ్చేతనమైనప్పుడు ఏదో ఒక అజ్ఞాత శక్తి తన చేయి పట్టుకొని ముందుకు నడిపిస్తుంది అనే బలీయమైన భావం కలిగేది .తాను ఎంచుకోన్నది రాజమార్గమే ననే నమ్మకం కలిగింది .ఇక వెనకడుగు ప్రశ్నే లేదు. ముందుకే ,మును ముందుకే అనుకొన్నారు .ఆంధ్రాలో అయినా ఇంకెక్కడైనా మనిషి తనంతట తాను బ్రతకలేడు .అనుకోని శక్తులేవో మనల్ని నడిపించిగమ్యం చేరుస్తాయి .నాలుగేళ్ల తరువాత 1921 లో బాచలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ పొందారు రామయ్యగారు .మదనపల్లి లోని ఈ యూని వర్సిటి ఆ తర్వాత మద్రాస్ లోని అడయార్ కు మారింది .
తండ్రి మరణం – మలుపు తిరిగిన జీవితం
విదేశాలకు వెళ్లి ఉన్నత విద్య నేర్వాలనే కోరిక మనసంతా నిండి పోయింది .వేరే ఆలోచనే రావటం లేదు .దాని నుంచి తప్పించుకో లేని పరిస్తితి .అందరికంటే తాను భిన్నం అనే భావమూ బాగా ఉంది రామయ్యగారిలో .వెనక్కు మళ్ళని పురోగామి అడుగు వేయాలి .దీనితో జీవితం మలుపు తిరగాలి .ఈ స్తితిలో తండ్రికి బాగాలేదని ఉయ్యూరు నుంచి కబురు తెలిసింది .అప్పుడంటే మద్రాస్ కు నడిచి వచ్చాడుకాని ఇప్పుడా సావకాశం లేదు కదా .స్టీమర్ ఎక్కారు అది నత్త నడక నడుస్తుంటే విసుక్కొన్నారు .మొత్తం మీద ఇంటికి చేరుకొన్నారు అప్పటికే తండ్రి చనిపోయారు ఆఖరి చూపు దక్కలేదన్న బాధ మనసంతా ఉండేది .ఆలస్యం స్టీమర్ వల్లనే అని దాన్ని తిట్టుకొన్నారు .తండ్రి లేకపోయినా ఆయన తాలూకు అనుభూతులు గుండె నిండా ఉన్నాయి వాటినే నెమరేసుకొన్నారు .కానీ తండ్రి మరణించలేదు అనే అనుకొనేవారు తన గుండెల్లో తండ్రి నిలిచే ఉన్నారని మార్గ దర్శకం చేస్తున్నారని భావించేవారు .దినవారాలు అన్నీ శాస్త్రోక్తంగా జరిగిపోయాయి .
‘’ నాఅన్నయ్యతో ‘’ తమ్ముడు సీతారామయ్యగారి సంభాషణ
అన్న అనంత రామయ్య గారినితమ్ముడు సీతా రామయ్యగారు’’నా అన్నయ్య ‘’అని బహుగౌరవం గా చెప్పుకొనేవారు . ఒక రోజు ఉదయం అన్న అనంత రామయ్య గారి దగ్గర కూర్చుని తానుఉన్నత విద్యకోసం ఇండియా వదిలి ఇతర దేశాలకు వెడతానని చెప్పారు .ఎప్పుడు అంటే ఆ రోజే నని స్పష్టం గా చెప్పారు .బ్రాహ్మణుడు సముద్రం దాటి వెళ్ళటమా అని అన్న ప్రశ్నిస్తే మౌనమే సమాధానం .కాని మనసులో తమిళనాడు ఆంధ్రకు విదేశం కాదా ,?ఇప్పుడు ఇరుగుపొరుగు రాష్ట్రాలుగా ఉండటం లేదా?ఇప్పుడు అంతా ఇండియాయే కదా ..ప్రపంచం ఇప్పుడు సంకోచించి పోయి౦ది కదా .అదంతా ఈ కాలం లో ఒక్కటే అని పిస్తోందికదాఅని తనకు తాను సమాధానం చెప్పుకొన్నారు ..’’హూణ దేశానికి వెడతావా ?’’ వాళ్ళు కిరాతకులు హంతకులు అక్కడికి వెళ్ళాలా ?అని అడిగితె ‘’నేను వెళ్ళటానికే నిశ్చయించుకొన్నాను .తాసీల్దార్ కావాలనే ఆలోచన నాకు లేదు. సైంటిస్ట్ కావాలన్న తపన నాలో ఉంది .అయినా తెల్లవారందరూ హూణులు కారు .’’అని నెమ్మదిగా నిర్భయం గా నిస్సంకోచంగా చెప్పేశారు .’’వాళ్ళు నిన్ను కుక్కలాగా చీదరించుకొంటారు ,ద్వితీయ శ్రేణి పౌరునిగా అవమాన పరుస్తారు .హూణులంటే హూణులే .మనకు గొప్ప సంస్కృతీ సంప్రదాయం ఉంది అవన్నీవదిలేసి అక్కడికి వెడితే మట్టిలో కలిసిపోతాయి .నువ్వు వెళ్ళద్దు .నీకు నా ఆశ్రీర్వాదం ఉండదు ‘’అన్నారు అంతకంటే తీవ్రంగా అన౦త రామయ్యగారు .చీకటి పడింది. మళ్ళీ అన్నగారిని చేరి నిలబడే తాను వెళ్లి పోతున్నానని తేల్చి చెప్పేశారు .ఆయన ఏమంటారో నని వొణుకు వస్తోంది .ఆయన వెళ్ళద్దు కూచోమని చెయ్యిపట్టుకోని కూచో పెట్టారు .
తండ్రికి ముందే తెలిసిన కొడుకు జీవితం
అన్న అనంత రామయ్యగారు శాంతంగా ‘’ఇలా జరుగుతుంది అని నాకు తెలుసు .మనకుటుంబం లో నువ్వొక్కడివే వరప్రసాదివి లేక శాపోపహతుడవు .నువ్వు ఈ లోకానికి చెందిన వాడివి కావని నాన్న గారు నిన్ను అమితంగా ప్రేమించారు .నాకూ అలానే అనిపిస్తోంది .నీ చిన్నతనం లోనే నాన్నగారు కృష్ణ స్వామి అనే జ్యోతిశాస్త్ర వేత్త దగ్గర నీ జాతక చక్రం వేయించారు .నిన్ననే నాకు ఆ జాతక చక్రం కనపడింది .అది చాలా భయంకర సత్యాలు చెప్పింది .’’అని చెప్పి తల అడ్డంగా ఆడించారు వెళ్ళ వద్దన్న భావం తో ..దాన్ని తమ్ముడు సీతారామయ్యగారికి ఇవ్వటానికి అసహ్యమేసింది ఆయనకు .ఆయనా తట్టుకో లేక పోతున్నారు .లాల్ గోవింద్ మొండిపట్టుదల చిన్నప్పటి నుండి తెలిసిన వారేకదా .తాపీగా తమ్ముడితో ‘’జాతక చక్రం వేయించాటానికన్నా ముందే నాన్నగారికి నీ సంగతి బాగా తెల్సు . నువ్వు ఈ దేశం వదిలి వెళ్ళిపోతావని ఒక్కసారి మాత్రమే వచ్చి కనిపిస్తావని తెలుసు .ఇదిగో నీ కోసం రెండు వేల రూపాయలు దాచి ఉంచారు .నీకు ఇవ్వమన్నారు ‘’అన్నారు .
నోటి వెంట మాట రావటం లేదు రామయ్యగారికి .తన కోసం తండ్రి అంతటి త్యాగం చేశారా అని పించింది .తన గురించి అన్ని విషయాలు తెలుసుకోన్నారా అని ఆశ్చర్యమేసింది .తండ్రిపై ఆరాధనాభావం మరింత పెరిగింది .ఏ దేశానికి వెడతావు అని అడిగితె అమెరికా అని చెప్పారు. ముందు కెమిస్ట్రీ కి నిలయమైన జెర్మని వెళ్లాలని ఉంది .కాని ప్రస్తుత పరిస్తితులలో అక్కడ జనాలకు తిండి కూడా దొరకటం లేదు .తిండి లేకపోతే స్పోర్ట్స్ మన్ అయిన తాను బలహీనుడి నౌతాననే భయమేస్తోంది ‘’అన్నారు .మళ్ళీ అన్నగారు ‘’ఎప్పుడు నీ ప్రయాణం ?’’అని అడిగితె ‘’ఇప్పుడే ‘’అని ఠక్కున సమాధానం చెప్పారు .’’దేవతలు నిన్ను క్షమించర్రా’’అన్నగారి చివరి హితావు లాటి హెచ్చరిక .ఇద్ద్దరిమధ్య సుదీర్ఘ మౌనం రాజ్యమేలింది .అప్పుడు అన్నగారు చొరవ తీసుకొని ‘’ఇంతదాకా వచ్చింది కనుక నాన్న చెప్పినవి అన్నీ చెప్పేస్తాను విను .’’నువ్వు కులాన్ని వదిలేయాలి .ఇదే ఆత్మ స్వాతంత్రానికి మొదటి మెట్టు .సంప్రదాయాల్ని పెద్దలను సారించిన పద్ధతుల్ని విసర్జించాలి అప్పుడే ఆయన మనసుకు శాంతి ,ఆనందం .సంతోషంగా ఉండటమే కాదు దీవి౦చె వారి సంతోషాన్ని కూడా చూడాలి ‘’అని చివరిమాటగా అనంత రామయ్య గారు బోధించారు .అమాంతం ‘’నా అన్నయ్య ‘’అని చెప్పుకొనే అన్న గారు అనంత రామయ్యగారి రెండు పాదాలకు వంగి రామయ్య గారు నమస్కరించారు .చలించిపోయారు అన్నగారు .తమ్ముడు దూరమవుతున్నాడనే బాధ ,బెంగా ఆయన్ను నిలవ నీయటం లేదు .
ఆచరించాల్సిన మూడు సూత్రాలు
తమ్ముడిని అప్యాయం గా దగ్గరకు తీసుకొని ‘’ఇందాక చెప్పిన మాటలేకాదు –నాన్న గారు కొన్ని ఆజ్ఞలు జారీచేశారు .వీటిని నువ్వు ఆచరి౦చకపోయినా ఫవాలేదు కాని ‘’మూడిటిని’’మాత్రం తప్పకుండా ఆచరణలో పెట్టమని నాన్నగారు చెప్పమన్నారు .1-మద్యం తాగరాదు 2-పొగ త్రాగరాదు 3-తెల్లజాతి అమ్మాయిని పెళ్లి చేసుకో కూడదు ‘’అని తెలియ జేశారు .వాటిని తాను మనస్పూర్తిగా అంగీకరించి త్రికరణ శుద్ధిగా అమలు చేస్తానని హామీ ఇచ్చారు .తానూ వాటిని పాటిస్తున్నాననీ కాని తనకు దేవునిపై నమ్మకం లేదని చివరిమాటగా అన్నగారు మనసులోని మాట తమ్ముడికి చెప్పి ఆశీర్వ దించి విశాల విశ్వం లోకి సీతారామయ్యగారిని పంపించేశారు . నిజమే అనంత రామయ్యగారి ముఖాన వీబూది కాని బొట్టు కాని ఎప్పుడూ పెట్టుకోగా నేనెప్పుడూ చూడలేదు నాకు ఆశ్చర్య మేసేది .ఆయన నిరీశ్వర వాదికాదు .లోకాతీత ఉత్తమ భావాలున్న ప్రజ్ఞా మూర్తి .బ్రహ్మ జ్ఞాని అనంత రామయ్యగారు .అలాంటివారికి ఈ భౌతిక జంజాటాలు అక్కర్లేదు .
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -24-4-15 –ఉయ్యూరు

