మనుషుల కోరికలు అనంతంగా ఉంటాయి. ఈ కోరికలకే సంస్కృతంలో ‘పురుషార్థాలు’ అని ఒక పెద్ద పదం ఉంది. మనుషులు అర్థించే విషయాలు అనగా కోరుకునే విషయాలు అని దీని అర్థం.
జీవించడానికి అన్నింటికన్నా ముఖ్యమైనవి ఆహారం, ఇల్లు, సమాజంలో భద్రత. వీటి తర్వాతనే అదనపు కోరికలు మొదలవుతాయి. ఉదాహరణకు ఉద్యోగం వచ్చేవరకూ దానికోసం కష్టపడటం, వచ్చిన తర్వాత పెళ్లి, కారు మొదలైన కోరికలు. అవి తీరిన తర్వాత మరిన్ని కోరికలు. ముసలితనం వచ్చే కొద్దీ పైవాడి గురించి, వాడిని మెప్పించే పద్ధతి గురించి ఆలోచనలు, కోరికలు. వీటన్నింటినీ నాలుగు భాగాలుగా మన ప్రాచీనులు విశ్లేషించి చెప్పారు. వీటికే ధర్మం, అర్థం, కామం, మోక్షం అని పేర్లు. ఈ చెప్పిన వరుస కూడా ముఖ్యమైనది. ధర్మం తర్వాతనే మిగతా మూడూను.
మన దేవుళ్లకు సాధారణంగా నాలుగు చేతులు చూస్తూంటాం. ఈ నాలుగూ పై చెప్పిన నాలుగు పురుషార్థాలకూ చిహ్నం. ఒక చేతిలో గద లేదా ఏదో ఒక ఆయుధం, ఒక చేతితో అభయముద్ర, ఒక చేతితో వరదముద్ర. మరొక చేతిలో ఒక పద్మం లేదా మరొక పువ్వు చూస్తాం. మనిషి ధర్మాన్ని పాటించకపోతే దానికి తగిన శిక్ష ఉంటుందని చెప్పడానికి గద. మనిషికి జ్ఞానాన్ని ఇచ్చి మోక్షమార్గం వైపు నడిపించేది అభయముద్ర. సంపదల్ని ఇవ్వడాన్ని సూచించేది వరదముద్ర. చేతిలో ఉన్న పువ్వు కామాన్ని సూచించేది. మనిషికున్న అన్ని విధాల కోరికలను సూచించే ముద్ర. సృష్టి వ్యవస్థనంతటినీ నడిపించేవి ఈ నాలుగూను.
మొదటి ధర్మం. ఒక వస్తువును జాగ్రత్తగా ధరించి ఉండేది అని ఈ పదానికి అర్థం. సమాజం విడిపోకుండా, ముక్కలు కాకుండా పట్టి ఉంచేది అని చెప్పవచ్చు. దీనికి ఇంగ్లీషులో సరైన పర్యాయపదం చెప్పలేం. నైతిక విలువలు, వాటిని అనుసరించాల్సిన విధానాలు, మతవిశ్వాసాలు మొదలైనవాటన్నింటినీ ఈ పదం సూచిస్తుంది. భారతీయ సంస్కృతిలో ధర్మానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. రాముణ్ణి ‘విగ్రహవాన్ ధర్మః’(మూర్తీభవించిన ధర్మం) అన్నారు. అలాగే భారతంలో ముఖ్యపాత్ర ధర్మరాజు, ధర్మానికి ప్రతీక.
వ్యక్తిని మంచి మార్గంలో పెట్టడానికి ధర్మశాస్త్రాలు ఒక జీవన విధానాన్ని నిర్దేశిస్తాయి. ప్రతి వ్యక్తికీ మొత్తం జీవితకాలానికి అన్వయించే టైం టేబుల్‌ను ధర్మశాస్త్రం ఇస్తుంది. ఒక వ్యక్తి నియమం తప్పకుండా చెయ్యాల్సిన నిత్యకర్మలు, కొన్ని సందర్భాల్లో తప్పకుండా చెయ్యాల్సిన నైమిత్తిక కర్మలు మొదలైనవాటిని చెబుతుంది. (కర్మల్ని గూర్చి చెప్పిన మునుపటి వ్యాసంలో వివిధ రకాల కర్మల్ని తెల్సుకున్నాం). ఇలా చేయకుంటే మనిషి తన ఇష్టం వచ్చిన పనులు చేసే అవకాశం ఉంది. ధర్మాన్ని మనం ప్రేమతో కోరుకోం, భయంతోనే కోరుకుంటాం. ఎదుటివాడు మన సొమ్ము దోచుకొనిపోకుండా, మనపై దౌర్జన్యం చేయకుండా ఉండాలంటే అతన్ని ఏదో ఒక శక్తి ఆపాలి. అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ధర్మాన్ని కోరుకుంటాం. మన రక్షణ కోసమే దాన్ని కోరుకుంటాం. అందుకే ‘ధర్మో రక్షతి రక్షితః’ అనే మాట వచ్చింది. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అని దీని అర్థం. ఇది ఎలాగ అని మనకు వెంటనే అర్థం కాదు. వ్యక్తి తన సుఖం కోసం తన స్వతంత్రాన్ని కొంత వరకూ తగ్గించుకుని తనను నియంత్రించే బాధ్యత సమాజానికి ఇస్తాడు. ధర్మాన్ని తాను రక్షించడం అంటే ఇదే. ధర్మమనే భావన మనిషి బలహీనతలో నుండి పుట్టినది అని ఫ్రెడ్ రిక్ నీషే అనే జర్మన్ వేదాంతి చెపుతాడు. కాని ఇది సరైన సిద్ధాంతం కాదు.
ధర్మాన్ని పాటించకపోతే చట్టం చర్య తీసుకోకపోవచ్చు. ఉదాహరణకు పెద్దల్ని, గురువుల్నీ గౌరవించకపోవడం చట్టప్రకారం నేరం కాదు కానీ సమాజం నిందిస్తుంది. పుణ్యం, పాపం అనే మత విశ్వాసాలు కూడా దీన్ని గర్హిస్తాయి. దాన ధర్మాలు చేస్తే అలాంటి పనిని సమాజం ప్రశంసిస్తుంది.
ఎట్టి పరిస్థితులలోనైనా ధర్మాన్ని అనుసరించడం ముఖ్యమని చెప్పడానికే మొట్టమొదటిగా ధర్మం చెప్పబడింది. దీని తర్వాతే, ఇది అనుమతించిన మార్గంలోనే సంపదను పోగు చేసుకోవడం, కోరికల్ని తీర్చుకోవడం గూర్చి చెప్పారు. అందుకే ధర్మం, మోక్షం ఈ రెండింటి మధ్య అర్థం, కామం చెప్పబడ్డాయి. ప్రతి మనిషికీ అన్వయించేవి మొదటి మూడూను. మోక్షం అన్నింటికన్నా శ్రేష్ఠమైన మార్గం అని సిద్ధాంతం చెప్పినా దీన్ని మనం సాధారణంగా కోరుకోం. వేలాది మందిలో ఒకరు మాత్రమే దీనికై ప్రయత్నిస్తారని శ్రీకృష్ణుడు గీతలో చెబుతాడు.
ధర్మం తర్వాత మనం కోరుకునేది సంపద. దీన్నే అర్థం అన్నారు. భారతీయులంతా ఆధ్యాత్మిక చింతనలో ఉంటారనీ, వీరికి సంపద పొందాలని మాత్రమే చెప్పారు గానీ, సంపద అనవసరం అని చెప్పలేదు. విద్యను, ధనాన్నీ ఆజన్మాంతం సాధిస్తూనే ఉండాలని మన పుస్తకాలన్నీ చెబుతాయి. ధర్మం పర్యవేక్షణలో లేని సంపద వ్యసనాలకు దారి తీయవచ్చు. కానీ ధర్మాన్ని అనుసరించడానికీ, ప్రతి మనిషీ విధిగా చేయాల్సిన పనులు చేయడానికి (అతిథుల్ని ఆదరించడం, దానధర్మాలు మొదలైన వాటికి) సంపద చాలా అవసరం. సంపద జ్ఞానానికి అడ్డురాదని గీతలో గమనిస్తాం. జనకుడు మొదలైన అనేక రాజర్షుల గూర్చి అందులో చూస్తాం. ఒక వైపు రాజ్యపాలన చేస్తూ, మరొకవైపు జ్ఞానులుగా ఉన్న వ్యక్తులు రాజర్షులు.
మూడవ పురుషార్థం కామం. శారీరకమైన కోరికలతో పాటు అన్ని రకాల కోరికలూ ఇందులో చెప్పవచ్చు. కామమంటే ఒక నీచమైన విషయమని భావించనక్కర్లేదు. ధర్మానికి విరుద్ధం కాని కామం దైవస్వరూపమని గీతలో చూస్తాం (7-11). భార్యాభర్తల మధ్య శృంగారం ఒక పవిత్రమైన విషయమనీ, యజ్ఞంతో సమానమైనదనీ పెళ్లి మంత్రాలు చెపుతాయి. ఇది ధర్మ రక్షణ కోసం నిర్మించబడిన సామాజిక వ్యవస్థ. మన సంస్కృతిలో గృహస్థుడయినవాడికే అనేక బాధ్యతలు చెప్పబడ్డాయి. అతిథుల్ని గౌరవించడం(అతిథి యజ్ఞం), జంతువులకు ఆహారం ఇవ్వడం(భూతయజ్ఞం) మొదలైన పనులన్నీ ఇతనికే కానీ బ్రహ్మచారికీ, సంన్యాసికీ కాదు. గృహస్థుడు సమాజానికి మూలస్తంభం లాంటి వాడు. ధర్మం, అర్థం, కామం ఈ మూడింటిలో భార్యాభర్తలు కలిసి ఉంటారు. మోక్షం మాత్రం ఒంటరి ప్రయాణం. అందుకే ధర్మేచ, అర్థేచ, కామేచ, నాతిచరామి అని పెళ్లి మంత్రాలు వింటూంటాం.
నాలుగవది మోక్షం. దీన్ని గురించి ఒక సంపర్ణం వ్యాసంలో ఇది వరలో తెలుసుకున్నాం. సమాజం మనకు అంటించిన కులం, మతం, Social Status, మొదలైన అన్నింటికీ అతీతంగా వెళ్ళి అన్నింటినీ సమభావంతో చూసే స్థితికి ఎదగడం. తనను తాను ఎలా ప్రేమించుకుంటాడో అలాగే అందరినీ ఎలాంటి స్వార్థభావన లేకుండా ప్రేమించగలగడం. దీన్ని గీతలో సర్వాత్మభావం అన్నారు. మోక్షమనేది స్వార్థం లేని స్థితికి, ఒక Personal Identity లేని స్థితికి ఎదగడం.
పాశ్చాత్య మనస్తత్వ శాస్త్రం ఇటీవలే మనిషి కోరికల్ని విశ్లేషించి ‘The Hierarchy of Human Needs’ అని చెప్పాయి. Maslow అనే శాస్త్రవేత్త వీటిని వివరించాడు. తిండి, రక్షణ మొదలైన శారీరకకోరికలతో ప్రారంభమై సామాజిక, సాంస్కృతిక స్థాయిల్లో ఎలాగ మనిషి పూర్ణత్వాన్ని కోరుకుంటాడు అన్నదే ఇందులోనూ విషయం.

డాక్టర్ కె. అరవిందరావు
రిటైర్డు డీజీపీ
ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను navya@andhrajyothy.comకు పంపండి