|
ఇంతలో మరొకరికి ఉత్సుకత కలిగింది. ‘‘తెర వెనుక గురువుగారు ఏం చేస్తున్నారో నేను చూడాలి’’. ఇక ఉత్కంఠ భరించలేక తెర పైకెత్తి చూశాడు. మరుక్షణమే అక్కడ ఉన్న 999 మంది శిష్యులూ కాలి బూడిదైపోయారు. దాంతో పతంజలి చాలా విచారించాడు. తన జ్ఞానాన్ని సంపూర్ణంగా వారికి తెలియజేయాలని అతడు ఆశించాడు. తీరా చూస్తే ఇలా జరిగింది.
అదే సమయంలో, లఘుశంకకు బయటకు వెళ్ళి కుర్రవాడు తిరిగివచ్చాడు. నువ్వెక్కడికి వెళ్లావని
అతడిని పతంజలి అడుగగా, ఆ కుర్రవాడు జరిగింది చెప్పి క్షమించమని వేడుకున్నాడు. పతంజలి దయతో అతడిని క్షమించి, ఈ ఒక్కడైనా మిగిలాడని అనుకున్నాడు. యోగ సూత్రాలలోని మిగిలిన భాగమంతా పతంజలి ఆ శిష్యునికి బోధించాడు. అక్కడికి విద్య పూర్తి అయింది కాని, ఈ శిష్యుడు నియమాన్ని అతిక్రమించి తప్పు చేశాడనే విషయం పతంజలి మర్చిపోలేదు. దానికి శిక్ష అనుభవించాల్సి ఉంది. కాబట్టి ‘‘నువ్వు బ్రహ్మరాక్షసుడిగా మారి ఆ చెట్టుకు వేలాడు’’ అని ఆదేశించాడు. తన జ్ఞానాన్ని మరొక శిష్యునికి బోధించినపుడు అతడికి శాపవిముక్తి కలుగుతుందని చెప్పి పతంజలి మహర్షి అదృశ్యమైనాడు.
ఇక బ్రహ్మరాక్షసుడు ఆ చెట్టుకు వేలాడుతూ ఉండి దారిన పోయేవారిని ఒక ప్రశ్న అడిగేవాడు. వారు సమాధానం చెప్పలేకపోతే వారిని తినివేసి తన ఆకలిని తీర్చుకునేవాడు. అంతకంటే వేరే గత్యంతరం లేకపోయింది. కొన్ని వేల సంవత్సరాల పాటు ఇదే కథ సాగింది. అతడి వద్ద విద్య నేర్చుకునేందుకు ఎవరూ సాహసించలేకపోయారు. అతడు బ్రహ్మరాక్షసుడిగానే చాలా కాలం ఉండిపోవలసి వచ్చింది. ఈ కథనుండి మనం నేర్చుకునే నీతి ఏమిటి? గొప్ప జ్ఞానం కలిగినవారు ఎవరైనా తప్పు చేసినపుడు బ్రహ్మరాక్షసుని వంటి స్థితిని పొందుతారు. తెలివితేటలు బాగా ఉన్నవారు నేరస్తులు కావటం అనేది అమాయకులు నేరం చేయటం కంటే ఎక్కువ ప్రమాదకరం. మరి విజ్ఞానం అంతా తెలుసుకున్న మనిషి నేరాలు చేయటం మొదలుపెడితే అది చాలా చాలా హానికరం కదా.
అలా చాలాకాలం పాటు బ్రహ్మరాక్షసుడు శాపవిమోచనం కోసం ఎదురుచూస్తూ ఉండటం చూసి దయాహృదయుడైన పతంజలి మహర్షి తానే ఒక శిష్యుని రూపంలో వచ్చి అతని వద్ద విద్య నేర్చుకుని దానిని తాళపత్రాలపై రాశాడు. ఒక్కో శిష్యుని ఉద్ధరించడానికి సాక్షాత్తూ గురువే శిష్యుని రూపంలో వస్తాడని దీని భావం.
బ్రహ్మరాక్షసుడు ఏ చెట్టుపైనైతే కూర్చొని ఉన్నాడో ఆ చెట్టుపైనే పతంజలి కూడా కూర్చొని యోగసూత్రాలను లిఖించాడు. రాక్షసులు నిశాచరులు కాబట్టి పాఠం రాత్రిపూటే సాగేది. బ్రహ్మరాక్షసుడు చెప్తూ ఉండగా పతంజలి ఒక్కో ఆకునూ కోసి, తన చేతిపై చిన్న గాటు పెట్టుకుని స్రవించిన రక్తంతో ఆ ఆకుపై రాసేవాడు. ఇలా ఏడురోజుల పాటు విద్య సాగింది. పూర్తయ్యేసరికి పతంజలి అలసిపోయాడు. అప్పటివరకూ రాసిన ఆకులన్నిటిని ఒక గుడ్డలో చుట్టి చెట్టుకింద పెట్టి తాను స్నానానికి వెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి ఒక మేక ఆ ఆకులను చాలా భాగం తినివేస్తూ కనిపించింది. చేసేదేమీ లేక పతంజలి ఆ మిగిలిన ఆకులనే తీసుకుని వెళ్ళాడు. ఆ కొద్ది భాగమే మనకు లభించిన పతంజలి యోగ. అదీ కథ!
![]() శ్రీశ్రీశ్రీ రవి శంకర్
ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు
|
|
||||||




