|
ప్రతి ఏడాది వైశాఖ మాసం శుక్ల పంచమినాడు మనం శ్రీ శంకర భగవత్పాదుల జయంతి జరుపుకుంటాం. శ్రీశంకరులు చిన్న వయస్సులోనే భరతఖండమంతా సంచారం చేసి తత్త్వప్రచారము చేశారు. ఆదిశంకరుల తత్వ ఉపదేశాలను సంక్షిప్తంగా చెప్పటం చాలా కష్టం. కానీ ప్రధాన ఉపదేశాల సారాంశాన్ని తెలుసుకోవటం వల్ల చాలా ప్రయోజనాలు చేకూరతాయి.
శ్రీ శంకరులకు పూర్వమే మనకు దర్శనకారులైన తత్త్వవేత్తలు ఉన్నారు. వీరిలో వేద ప్రమాణాన్ని అంగీకరించిన వారిని ‘‘వైదిక దర్శనకారులు’’ అని అంటారు. వేదం చివరి భాగాలైన ‘‘వేదాంతములు’’ అనబడే ఉపనిషత్తులలోని తత్త్వ విచారాన్ని అంగీకరించినవారిని ‘‘శ్రీ బాదరాయణులు’’ అంటారు. ఈ బాదరాయణులు బ్రహ్మసూత్రాలు రచించారు. శ్రీ శంకరులు వ్రీ బాదరాయణుల సూత్రాలకి ఉపనిషత్ ప్రతిపాద్యమైన పరబ్రహ్మతత్త్వాన్ని వారి భాష్య గ్రంథాలలో శ్రుతి యుక్తి అనుభవాలతో ప్రతిపాదించారు. ఉపనిషత్‌లలో ఉన్న ప్రక్రియను అనుసరించి మెలుకువ- కల- నిద్ర అనే మూడు అవస్థల అనుభవంలో మిగతా అన్నిటిని ఇమిడ్చి మనందరికీ ఒక్క పరమేశ్వరుడే ఆత్మగా ఉన్నాడని, అతడే సర్వసాక్షి అని, మనందరి అనుభవసారమ్ అతడని ప్రతిపాదించారు. ఈ పరమాత్మను తెలుసుకోవటమే మానవ జీవన లక్ష్యం. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే – వేదసారాన్ని గ్రహించాలి. సర్వసమానత్వం..
శ్రీ శంకరులు కుల, మత, వర్ణ, లింగ బేధ రహితంగా తత్త్వ ఉపదేశముచేశారు. ‘‘సర్వ కాలీనమైన’’ అంటే అన్ని కాలములకు ఒకే విధంగా అన్వయించే, ‘‘సర్వజనీనమైన’’ అంటే జాతి,దేశ, వర్ణ, కుల,మత, లింగ, వయస్సు భేదములు లేని సత్యములను వెలికితీశారు. శంకరులు వేదములను కేవలం నమ్మకంతో అనుసరించలేదు. దానిని యుక్తియుక్తంగా, అనుభవసారంగా విచారించి తాత్పర్యమును తెలియజేశారు. శ్రీ శంకరులు వేద ప్రమాణాన్ని పూర్తిగా విశ్వసించారు. వేదం మొదటి భాగమైన కర్మకాండ విశ్వాసానికి సంబంధించినదనీ, చివర భాగాలైన ఉపనిషత్తులలో ఉపదేశించిన తత్వం విషయంలో అనుభవం ప్రామాణికమని పేర్కొనారు.. ఇక్కడ అనుభవమంటే- లౌకికానుభవం, ఇంద్రియానుభవం, మానసికానుభవం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. తేడా ఇదీ..
ఇతర తత్త్వ విచారకులకు మనసుపైనే ప్రధానంగా దృష్టి పెట్టి అంతర్ముఖులయ్యారు. ఇదే మనఃశాస్త్రం. శ్రీ శంకరులు మాత్రం-మనసుతో పాటుగా దానిని ఉపయోగించే, విచారించే వ్యక్తి ఎవరు? ఆ విచారము ఎలా పుడుతుంది? అది కేవలం కల్ఫనా? లేక నిజమా? ఈ విచారము పుట్టడానికి ముందున్న తత్వమేమిటి? మొదలైన ప్రశ్నలకు సమాధానం తెలియజేయగలిగారు. శ్రీ శంకరులు తెలియ చేసిన జ్ఞాన మునకు సంప్రదాయ శ్రద్ధ కావాలి. అంధ విశ్వాసములు పోగొట్టుకునే ధైర్యము ఉండాలి. ఇప్పటి కాలము, స్థితి, విచార సరళి, సమాజవ్యవస్థలను దృష్టిలో పెట్టుకుని చూసినా కూడా ఆయన ఉపదేశాలు సర్వజనీనమై ఉంటాయి. శంకరుల బ్రహ్మసూత్ర భాష్యంలో- పూర్వజన్మలో కలిగిన ఉత్తమ సంస్కార వశం చేత విదురుడు, ధర్మవ్యాధుడు మొదలైన వారు ఆత్మజ్ఞానులయ్యారని పేర్కొంటారు. అంటే కుల, వర్ణ. జాతి, లింగ భేదాలకు అతీతంగా జ్ఞానాన్ని పొందవచ్చనేది ఆయన భావన. శ్రీ శంకరులు తత్వజ్ఞానులు. వారిని మతస్థాపకులగానో, వర్ణాశ్రమ ఉద్ధారకులుగానో, మఠాధిపతులుగానో నిర్వచించటం సంకుచిత దృష్టి అవుతుంది. విశ్వం అంతా అద్వితీయ బ్రహ్మమునందు కల్పనయే అని ఉపదేశించిన శ్రీ శంకరులు జగద్గురువులనటం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఆయన జన్మదినాన్ని శంకర జయంతిగా అధికారికంగా గుర్తించి.. ఆ రోజు సెలవుదినంగా ప్రకటించటం శంకరుడికి మనం అర్పించే నిజమైన నివాళి.
స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి
విశాఖ శారదా పీఠాధిపతి |


