’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-5

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-5

కొలంబో  ప్రయాణం లో పదనిసలు

మద్రాస్ నుండి బయల్దేరిన షిప్ కొలంబో చేరింది .అక్కడ’’ ఆ మలయాళీ చోర్ ‘’ గురించి వాకబు చేశారు .కనిపించలేదు .ఒక మంచి గుణ పాఠం నేర్చుకోన్నాననుకొన్నారు .మద్రాస్ –కొలంబో ప్రయాణం జీవితం లో మరపురాని అనుభూతిగా మిగిలిపోయింది .దేశానికి వీడ్కోలు చెప్పారు కొత్త దేశం లో అడుగు పెట్టటం కోసం .ఏంతో విశాలమైన భూభాగాన్ని వదిలేసి వేడుతున్నట్లుగా ఉంది .మన్నారు జలసంధిని దాటటానికి ఫెర్రీ ఎక్కారు .అప్పుడు రామాయణం గుర్తుకొచ్చింది .ఈ ప్రదేశం లో రాముడు సంచరించాడని తానూ శ్రీరామ సంతతి వాడినని అభిప్రాయమేర్పడింది .రాముడు లంకకు వెళ్ళినట్లు తానూ లంక చేరుకొన్నారు .

తన స్నేహితుడి ఇల్లు వెతికి పట్టుకొని ఇంటి తలుపు తట్టారు రామయ్య .భయం తో ఒకావిడ తలుపు తెరిచింది .అతని తల్లి కావచ్చు .కొడుకు అమెరికా వెడుతున్న సంగతి ఆమెకు రామయ్య చెప్పారు .అతని ఆలోచనలేవీ ఆమెకు తెలియవు .అమెరికా ఎందుకు అనిమాత్రం అడిగింది . తనకొడుకును భగవంతుడు క్షమించాలని వేడుకొన్నదామే . కొందరు అక్కడికి వస్తే  తాను  పోగొట్టుకొన్న డబ్బు సంగతి వారికి చెప్పుకొన్నారు. వారు నిజమే నని నమ్మి సానుభూతి చూపించారు .తల్లిమాత్రం కొడుకు పాపాలను యేసు క్రీస్తు ప్రక్షాళనం చేయాలనీ అన్నది .మిగిలిన వారూ దానికే తలూపారు కానీ తను పోగొట్టుకున్న డబ్బు సంగతి ఎవరికీ పట్టినట్లు లేదు .స్నేహితుడి తల్లి ‘’రేపటి గురించి బెంగ వద్దు .దేవుడే అన్నీ చూస్తాడు .అలా చూడమని మేమంతా ప్రార్ధన చేస్తాం ‘’అని ఓదార్చి రామయ్య గారిని  పంపెసింది  .అంతా అయి పోయింది .పూర్తిగా మునిగిపోయాను అని అర్ధమైంది .మనసులో ఇప్పటి దాకా ఉన్న శ్రీలంక సౌందర్యం ఒక్క సారి ద్వంసమయినట్లు అనిపించింది ..

బొగ్గు గదిలో కూర్చుని అమెరికాకు ప్రయాణం –

యెర్ర సముద్రంపై అనుభవం

ఓడ దగ్గరకు చేరి కెప్టెన్ కు జరిగిన విషయమంతా పూస గుచ్చి చెప్పారు .’’దౌర్భాగ్యుడా ! వెళ్లి ,బొగ్గు నిలవ ఉండే గదిలో (కోల్ స్టాక్)ఉండి చావు .’’అన్నాడు కోపం తో అన్నా రామయ్యగారిమీద సానుభూతి కనబరుస్తూ .చాలా చాలా భయంకరమైన పరిస్తితి అది .బొగ్గు నెగడు అతి దగ్గరలోనే ఉంది. వేడి భరించటం మహా కష్టంగా ఉంది .చావ టానికైనా సిద్ధపడ్డారు కాని ఆ బాధలను ఏకరువు పెట్టటానికి ఒప్పుకోలేదు.వెనకడుగు వేసే ప్రశ్నే లేదు  .ఎర్ర సముద్రం పై ప్రయాణం మహాద్భుతమని పించింది  .ఎటు చూసినా కెంపు వర్ణ శోభ అద్వితీయం .మనసులో నిలిచిపోయింది ఆ అనుభూతి .డెక్ మీద కూర్చున్నా ఓడ వేడి సెగలు ఆయన్ను వదిలి పెట్టలేదు .షిప్ లోపల మంట ,బయట సముద్రమూ యెర్ర తోలు కప్పుకున్న మృగం లాగా భయంకరం గా ఉంది .యెర్ర సముద్రం పై ప్రయాణం చేసింది కొద్ది రోజులే అయినా అనంతకాలం ప్రయాణం చేసినట్లు అనిపించింది .ఇ౦త భయంకర వాతావరణం లో కూడా అంగుళం కూడా జంకలేదు .అరనిమిషం కూడా ఇండియా  వెళ్లి పోదామని పించానూ లేదు అన్నిటికి తట్టుకొని స్థిత  ప్రజ్నుడిగా నిలబడ్డారు రామయ్యగారు . అయన సంకల్ప బలం అంట గొప్పది . తరువాత ఎప్పుడో ఒక రష్యా పాట లో బొగ్గు బాయ్ చావు గురించి విన్నారు .నిజంగా కోల్ స్టాక్ లో ఉండి చావ కుండా  బయట పడటం ఎనిమిదో వింతయే .

ఈ’’ యెర్ర తివాచీ ‘’యే ఆ తర్వాత రష్యా జీవితం లో అద్భుత విజయాలకు  రెడ్ కార్పెట్ పరచిందేమో ? ఇందులోనే కొన్ని ఆసక్తికరమైన విషయాలూ ఉన్నాయి .సముద్రం లోంచి పెద్ద పెద్ద చేపలు ఒక్క ఉదుటున నీటిని చీల్చుకొని పైకి యెగిరి వచ్చి మళ్ళీ మునగటం భలే మజా అనిపించేది .తానుకూడా ఒక ఎగిరే మీనం అనుకొన్నారు .భూమి మీద పుట్టి ,ఆకాశం లోకి ఎగరటం .అలాగే ఆకాశం లో పుట్టి ,నక్షత్రాలను చేరుకోవటం మనసులోకి వచ్చి ఏదో గూఢ మైన అర్ధం గోచరించేది .మరోజన్మలో  యెర్ర సముద్రం లో ఎగిరే చేపగా పుట్టాలని పించింది .

సూయజ్ కాలువ దాటి న తర్వాత బ్రహ్మాండమైన తుఫాన్ పట్టుకొంది..దాదాపు జిబ్రాల్టర్ జలసంధి దగ్గరకొచ్చారు .ఓడలో సగం మందికి ‘’ సీ సిక్ నెస్ ‘’ వచ్చి అల్లల్లాడి పోయారు .వాళ్ళను కెప్టెన్, బోటు సిబ్బంది కాళ్ళతో తన్ని లేపుతున్నారు .దేవుడున్నాడో లేదోకాని తన జోలికి సీ సిక్ నెస్ రాలేదు .అదృష్ట వంతుడిని అనుకొన్నారు .చాలాకాలం తర్వాత అమెరికా నుండి యూరప్ వెడుతూ మధ్యధరా సముద్రం లో అంతా తుఫానులోనే గడిపిన రోజులు ఉన్నాయని  గుర్తు చేసుకొన్నారు .ఒక ముసలి  బొగ్గుపనివాడు ‘’ఈ వెధవకేమీకాలేదు బానే ఉన్నాడు ఈ ఇండియన్ ‘’అనటం విన్నారు రామయ్య .ఓడ కెప్టెన్ ఉదార హృదయానికి తోటి పనివారి సహకారానికి రామయ్యగారు మనసులో కృతజ్ఞతలు తెలియ జేసుకొన్నారు .

జిబ్రాల్టర్ జలసంధి దాటి అనంత అట్లాంటిక్ సాగరం పై పయనం

ఓడ  జిబ్రాల్టర్ దాటి అంతులేని జలరాశి లోకి చేరి ప్రయాణం సాగిస్తోంది .మొదట్లో తేడా ఏమీ కనిపించలేదు. స్పెయిన్ తీరం ,ఈజిప్ట్ తీరాలు కనుమరుగైనాయి .కుడి, ఎడమ, ముందు ,వెనక అట్లాంటిక్ సముద్రపు అనంత జలరాశి ..ఇక్కడికే ఒకప్పుడు కొలంబస్ వచ్చాడు .నాగా జాతివారు తాము ఏ లోకాన్నించి అంటే భూమికి అవతలి వైపు నుంచి రాలేదని  చెబుతారు .మన నాగాలను  చూస్తె అమెరికా ఇండియన్లు గుర్తుకొస్తారు .మహత్తర పురానుభావాలను కాలం యెంత త్వరగా ఊడ్చి పారేస్తుందో అనిపించింది .మధ్య అమెరికాలో మనదేశం లో ఉండే హిందూ దేవాలయాలు కనిపిస్తాయి బంధాలు శాశ్వతమైనవీ ,ద్రుఢమైనవి అని పించాయి .కొలంబస్ కన్నా ముందే ఈ ప్రాంతాలలో మానవులు ప్రయాణం చేశారని ,ఆంధ్రులు బాలీ ద్వీపానికి ఎప్పుడో చేరుకోన్నారని గుర్తు చేసుకొన్నారు .జపాన్ లో సంప్రదాయ నాట్యంలో  మన దేశ నృత్యపు చాయలున్నాయని ,ఎందుకు మనం ఒకరి దేశాన్నించి ఇంకోకరి  దేశానికి వెళ్ళ లేదో అర్ధం కాలేదాయనకు .మనసంతా చీకాకుగా ఉంది .తానూ అమెరికా వెడుతున్నాడు కాని అది తనకు వరం అవుతుంది అన్న గ్యారంటీ లేదు . ఇలాంటి వివిధ భావాలు మనసంతా ముసురుకొన్నాయి .’’ఈ డామ్ ఇండియన్ ‘’మొత్తం మీద అమెరికాలో కాలు పెడుతున్నాదన్న మాట అనుకొన్నారు .అక్కడ తనకు ఏది లభించినా దాన్ని తిరిగి ఇచ్చేయాలని ,అక్కడ గౌరవం మాత్రమేకాదు నవ్వులు కావాలని ఆశించారు రామయ్య .తన కోసం ఎవరూ ఎదురు చూడని దేశానికి తాను  చేరుకొంటున్నాడు అనిపించింది .రామయ్య గారు న్యూయార్క్ నగరం చేరుకొన్నారు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -26-4-15 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.