అమెరికాలో మన రేడియో

అమెరికాలో మన రేడియో

ఎన్నో ఆశలు, ఆశయాలతో రెక్కలు కట్టుకుని తెల్లదేశం వెళ్లిన వలసపక్షులు వాళ్లు. తమ

బతుకేదో తాము బతుకుతూ నాలుగు డాలర్లు వెనకేసుకుని.. పెళ్లాం పిల్లలతో సుఖంగా
జీవించాలని మాత్రమే అనుకోలేదు. అమెరికా వెళ్లాక ఒక్కసారి వెనక్కి తిరిగి మాతృదేశం
వైపు చూశారు. దేశం మనకు ఎన్నో ఇచ్చింది. మనం తిరిగి ఆ దేశానికి గోరంత అయినా ఇవ్వకపోతే జీవితానికి సార్థకత ఏముంటుంది? అన్న అంతర్మథనం మొదలైంది. అందులో నుంచి వచ్చిన ఆలోచనే www.nrisamay.com అన్న ఆన్‌లైన్‌ రేడియో. దాని నిర్వాహకులు శ్రీహరి అట్లూరి, శ్రీకాంత్‌ కొచ్చర్లకోట..ముచ్చటించిన విషయాలే ఇవి..

శ్రీహరి : ‘‘మాది మండపేట. నాన్న శివరామకృష్ణయ్య ఒక ఫర్టిలైజర్‌ కంపెనీలో పనిచేసేవారు. ఆయన ఉద్యోగరిత్యా కాకినాడ, తిరుపతి, విజయవాడ, గుంటూరు వంటి ప్రాంతాల్లో చదువుకోవాల్సి వచ్చింది. విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఇంజనీరింగ్‌ పూర్త చేశాక.. ఎంఎస్‌ చేయడానికని అమెరికా వచ్చాను. ఇక్కడ ఉద్యోగం చేస్తూనే ఎంబీఏ కూడా పూర్తి చేశాను. మేమిప్పుడు లాస్‌ ఏంజిల్స్‌లో ఉంటున్నాము. నా భార్య అర్చన. మాకు ఇద్దరు కూతుళ్లు అమూల్య, సిరి.
మన దేశంలో ఎన్నో సమస్యలు. ఈవ్‌టీజింగ్‌, రైతుల ఆత్మహత్యలు, పిల్లలకు చదువు లేకపోవడం.. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడున్నాయి. వీటన్నిటికీ రాత్రికి రాత్రే పరిష్కారం దొరకదు. ఇప్పుడున్న మీడియా కూడా అన్ని సమస్యల మీద దృష్టి సారించడం లేదు. రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలే బ్రేకింగ్‌ న్యూస్‌లు అవుతున్నాయి. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ కొట్టిన క్రీడాకారుని జీవితకథను ఆసక్తిగా చూపించకపోయినా.. ఇటువంటి రాజకీయ వార్తలకే ప్రాముఖ్యం పెరిగిపోయింది. అమెరికాలో ఉంటున్న మాలాంటి వాళ్లం మన దేశానికి ఏదో ఒకటి చేయాలన్న పట్టుదల పెరిగింది. అదే సమయంలో తెలుగువాళ్లు అందరు కలిసి బే ఏరియాలో దండిమార్చ్‌ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే.. నేను కూడా వెళ్లాను. అక్కడ నాకొక స్నేహితుడు పరిచయం అయ్యాడు. అతని పేరు శ్రీకాంత్‌ కొచ్చర్లకోట.

ఆ సంఘటనతోనే ఆలోచన..

శ్రీకాంత్‌ : నేను చెన్నైలోని కల్పక్కంలో పుట్టాను. తిరుపతి, విజయవాడల్లో చదివాను. అనంతపురంలోని జెఎన్‌టియులో ఇంజనీరింగ్‌ చదివాను. 2007లో అమెరికా వచ్చాను. భార్య సింధు, కూతురు సరయులతో కలిసి లాస్‌ఏంజిల్స్‌లో ఉంటున్నాను. ఇక్కడికి వచ్చిన తరువాత – మన దేశాన్ని బయటి నుంచి చూసే అవకాశం దొరికింది. మన దేశంలో ఎన్నో సమస్యలు. వాటన్నిటికీ పరిష్కారం చూపలేము. అయితే వెలుగులోకి తీసుకురావచ్చు. చర్చకు పెట్టొచ్చు. ఇటువంటి ఆలోచనల్లో భాగంగానే – బే ఏరియాలో దండిమార్చ్‌ను నిర్వహించాము. అందులో భాగంగా కవరేజ్‌ ఇవ్వమని అడిగేందుకు అక్కడున్న ఒక మీడియా ప్రతినిధి వద్దకు వెళ్లాను. మాది ప్రజా ఉద్యమం కవర్‌ చేయండి అనడిగితే ‘‘మీది మంచి కార్యక్రమం. ఇది ఎయిర్‌టైమ్‌. డొనేషన్లు భారీగానే వస్తాయి. వచ్చిన మొత్తంలో మీడియాకు కూడా కొంత కేటాయిస్తే.. మీకు ఆశించిన కవరేజ్‌ వస్తుంది’’ అని చెప్పి పంపాడు. నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు.
 

ఆన్‌లైన్‌ రేడియో పెట్టాలనుకున్నాం..

శ్రీహరి : దండి మార్చ్‌లో శ్రీకాంత్‌ను కలిశాను అని చెప్పాను కదా! మేము చాలా విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు.. ప్రజల సమస్యలను ఎంతమంది పట్టించుకున్నా ఇంకా మిగిలే ఉన్నాయనిపించింది. మనలాంటి వాళ్లు చేయాల్సింది ఎంతో ఉంది అన్నది మా ఇద్దరి ఆలోచన. మంచి పని చేసేవాళ్ల గొంతును కూడా వినిపించాలి అన్న తాపత్రయం కూడా కలిగింది. ఇద్దరం మాట్లాడుతున్నప్పుడు.. మనమే ఒక మీడియాను పెడితే ఎలా ఉంటుంది? అనుకున్నాము. కాని అప్పటికి మా వద్ద అంత డబ్బు లేదు. మా దగ్గరున్న కొద్దిపాటి ఆర్థిక వనరులతో అందుబాటులో ఉన్న టెక్నాలజీని వాడుకోవడం ఒక్కటే మా ముందున్న అవకాశం. కొన్ని రోజుల తరువాత మా ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన ఆన్‌లైన్‌ రేడియో ఎన్‌ఆర్‌ఐ సామే.

పాజిటివ్‌ స్టోరీలకు పట్టం..

శ్రీకాంత్‌ : ప్రస్తుతం మన దేశం మీడియాలో వస్తున్నంత చెడ్డది కాదు. మంచి కూడా ఎంతో ఉంది. ఆ మంచిని కనక చూపగలిగితే మనకన్నా గొప్ప దేశం మరొకటి ఉండదు. ఒక సానుకూల వాతావరణం కూడా ఏర్పడుతుంది. అటువంటి ఎన్నో కథనాలకు మా రేడియో వేదికైంది. మణిపూర్‌లో బీనలక్ష్మి అనే ఒక మహిళ.. కాల్పుల్లో భర్తలను పోగొట్టుకున్న మహిళలకు ఉపాధి అవకాశాలను చూపిస్తోంది. కొత్త జీవితానికి మార్గం చూపిస్తున్నది. ఇది ఎంత గొప్ప కథ. మిజోరాంలో ఒక వ్యక్తి కృషి వల్ల ఆ రాషా్ట్రనికి నేషనల్‌ ఫుట్‌బాల్‌ ఛాపింయన్‌షిప్‌ వచ్చింది. కాని ఆయన గురించి స్థానిక మీడియా పట్టించుకోలేదు. అరుణాచల్‌ప్రదేశ్‌లో ఒక ఐఏఎస్‌ అధికారి పట్టుబట్టి ఒక ఊరికి 120 కిలోమీటర్ల రోడ్డు వేయించారు. త్రిపుర అక్షరాస్యతలో కేరళను మించిపోతున్నది. సిక్కిం మరో రెండేళ్లలో ఆర్గానిక్‌ పంటలు పండించే రాష్ట్రంగా ఎదగబోతోంది. ఇటువంటి విషయాలన్నింటినీ మా రేడియో ఫోకస్‌ చేస్తోంది. ఇవన్నీ ప్రసారం చేయడం వల్ల మన దేశం పట్ల మనకు పాజిటివ్‌ దృక్పథం పెరుగుతుందన్నది మా ఉద్దేశ్యం.

హంగులు ఉండవు…

శ్రీహరి : మా రేడియోకు నెలకు అయ్యే ఖర్చు చాలా తక్కువ. మాకంటూ కొంతమంది దాతలు ఉన్నారు. వాళ్లు అందించే సాయంతోనే ఈ రేడియో నడుస్తుంది. మా వెబ్‌సైట్‌లో ఎటువంటి హంగులు ఆర్భాటాలు ఉండవు. మంచి పని చేయడానికి ఇవేవీ అవసరం లేదు. మేము కడపకు చెందిన విజయకుమార్‌ అనే రైతును ఇంటర్వ్యూ చేశాము. అతను సేంద్రీయ రైతు. గాయకుడు, సామాజిక కార్యకర్త కూడా. మా రేడియో ద్వారానే ఆర్గానిక్‌ వ్యవసాయంలో మెళకువలను వినిపించారు. ఇంటర్వ్యూను విన్నవాళ్లు ఎంతోమంది విజయకుమార్‌ను కలుస్తూనే ఉన్నారట. ఇలా మారుమూల గ్రామాల్లోని అరుదైన వ్యక్తుల్ని పదిమందికి చూపిస్తున్నాం.

గద్దర్‌ సలహాలు ఇచ్చారు..

శ్రీకాంత్‌ : మా రేడియో మొదలు పెట్టేముందు ప్రజాగాయకుడు గద్దర్‌తో మాట్లాడాం. ఆయన అందించిన సూచనలు, పంచుకున్న ఆలోచనలు ఎంతో ఉపయోగపడ్డాయి. గద్దర్‌ ఇంటర్వ్యూకు చక్కటి స్పందన వచ్చింది. మా రేడియో నుంచి ప్రముఖులకు ఫోన్లు చేసి ఇంటర్వ్యూలు అడిగినప్పుడు.. ఆశ్చర్యపోయేవారు. ‘‘అమెరికాలో మీరు అంత బిజీగా ఉండికూడా మంచి పని చేస్తున్నారు’’ అనేవారు. ఒకసారి గణిత మేధావి శకుంతలా దేవితో ఇంటర్వ్యూ చేశాము. ఆవిడని చాలాసార్లు అడిగాము. చాలా బిజీగా ఉండేవారామె. మాతో మాట్లాడేందుకు సమయమే దొరకలేదు. ఒక రోజు హఠాత్తుగా మాకు ఫోన్‌ చేసి.. వెంటనే ఇంటర్వ్యూ చేయమని అడిగారు. అప్పటికప్పుడు చేశాము. ఇంటర్వ్యూ వచ్చిన 20 రోజుల్లోనే శకుంతలాదేవిగారు చనిపోయారు. ఇది మరపురాని సంఘటన. అలాగే సైమేర్‌ అనే భాషను మన దేశంలో నలుగురే మాట్లాడుతున్నారు. ఈ అంశం మీద స్టోరీ వినిపించాము. ఇలా మేము చేయాల్సింది ఎంతో ఉంది. ఆసక్తికలిగిన యువత మాతో చేతులు కలిపితే మాకు మరింత శక్తి వస్తుంది.

ఒకసారి గణిత మేధావి శకుంతలాదేవితో ఇంటర్వ్యూ చేశాము. ఆవిడని చాలాసార్లు అడిగాము. చాలా బిజీగా ఉండేవారామె. మాతో మాట్లాడేందుకు సమయమే దొరకలేదు. ఒక రోజు హఠాత్తుగా మాకు ఫోన్‌ చేసి.. వెంటనే ఇంటర్వ్యూ చేయమని అడిగారు. అప్పటికప్పుడు చేశాము. ఇంటర్వ్యూ చేసిన 20 రోజుల్లోనే శకుంతలాదేవిగారు చనిపోయారు.
  • స్వాతి శ్రీరామ్‌, న్యూజెర్సీ నుంచి

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.