’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-6

’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-6

‘’మన ‘’ అమెరికా న్యూయార్క్ లో  కాలు పెట్టిన సీతారామయ్యగారు

న్యూయార్క్ ఓడ రేవు చేరగానే అక్కడ ఉన్న మంచు ను చూసి కంగారు పడ్డారు. దూది పింజలులాగా ఆకాశం నుండి భూమి మీద ,సముద్రం పైనా పడే స్నో  తమాషా అనిపించింది .సముద్రం పై పడి అదృశ్యమయ్యే మంచు ఆకర్షించింది . మంచు దుప్పటి న్యూయార్క్ నగరాన్ని కప్పేసింది అనిపించింది .భూమిమీద పడ్డ మంచు కుప్పలో చెయ్యి పెట్టి చూశారు .చుట్టూ ఉన్నవారు నవ్వారు ఈ పిచ్చి మారాజును చూసి .అందులో ఒకడు ‘’నెత్తిన టోపీ పెట్టుకో కోతీ !లేక పొతే మంచు లో గడ్డ కట్టుకు పోతావ్ సన్నాసీ ‘అన్నాడు .ఈ మాటలేవీ ఆయన్ను బాధ పెట్టలేదు నొచ్చుకోలేదు కూడా .ఆనందం ,ఆశ్చర్యం కలిసి చుట్టూ ఉన్న ప్రపంచాన్నే మర్చిపోయారు ఆయన .

ఇంతలో ఒక నీగ్రో ‘’మన అమెరికాలో చలి బాగా ఉందికదూ ‘’అన్నాడు ఆయనతో .’’మన అమెరికా అని ఆతను అనటం రామయ్యగారిని మళ్ళీ ఆలోచనలో పడేసింది ..’’మన అమెరికా ‘’అనే మాట పై ఆయన చాలా వితర్కి౦చు కొన్నారు .మాత్రు దేశం అంటే ఏమిటి ?అని ఆలోచించారు .ఆఫ్రికా లో మూలాలున్న ఈ నల్లవాడు ఇది తన అమెరికా అంటున్నాడు .నిజంగా నీగ్రోలకు అమెరికా భూతల స్వర్గమేమీ కాదు .ఎన్నో బాధలు కస్టాలు అవమానాలు అనుభవిస్తున్నారు అమెరికాలోని నీగ్రోలు .అక్కడ వారికి అత్యుష్ణత, కాని ఇక్కడ అతి శీతలం .బానిస వంశ సంజాతుడైనా అతనికి అమెరికా మాత్రు దేశమే .మరొక ప్రపంచం లో కాలు పెట్టానని జాగ్రత్తగా అడుగులు వేయాలని ని,అన్నిటికీ సిద్ధపడాలని నిర్ణ యించుకొన్నారు .

న్యూయార్క్ నగరం లోని ఆకాశ హర్మ్యాలు పరమాశ్చర్యం కలిగించాయి .వాటికి మొదలు చివరా ఉన్నట్లు అనిపించలేదు .ఇక్కడ మనుష్యలు మహా వేగం గా ,దూకుడుగా దూసుకు పోతున్నారు .ఇదొక మానవ మహా సముద్రమే అనిపించింది .ఇక్కడ నిలకడ పనికి రాదు పరుగో పరుగు అయితేనే రాణిస్తాను అనుకొన్నారు .’’జీవితం ఒక విస్త రించే పుష్పం ‘’అని గుర్తించారు .ఇక్కడి ఈ జన సముద్రం మానవతకు ప్రతీక అనిపించింది .ఇందులో వేగం ,శక్తి ,అవిశ్రా౦తత కనిపించాయి .హాస్యం కనిపించలేదు .సీరియస్ నెస్ సర్వ వ్యాపకం గా ఉంది .    ఓడలో కస్టపడి పని చేశారు రామయ్యగారు .దానికి కెప్టెన్ ఒక్క పెన్నీ కూడా ‘’చేపలేదు’’ ..ఏమైనా డబ్బు ముట్ట జెబుతాడేమోనని ఆశగాఎదురు చూశారు .తెలివిగా కెప్టెన్ ‘’నిన్ను పోలీసుల కంట పడకుండా అమెరికా చేర్చటమే బ్రహ్మ ప్రళయమైంది .ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్ల బారిన నిన్ను పడెయ్యకుండా న్యూ యార్క్ చేర్చాను .సంతోషించు ‘’అని మరో గుణ పాఠం నేర్పాడు . చేసేదేమీలేదు కదా .ఇక ఇక్కడే ఉండాలి .అందుకని పొట్ట పోసుకోవటానికి దొరికిన అడ్డమైన పనీ చేశారు .కొంత డబ్బు సమకూడిన తర్వాత చికాగో చేరారు .

చికాగో చదువు

గ్రేట్ లేక్స్ భూ భాగం లో  చికాగో నగరం ఉంది .వివేకానందుడు ధర్మ భేరి మ్రోగించిన ప్రదేశం ఇదే .చికాగో యూని వర్సిటి లో ‘’ఆగ్దన్ స్కూల్ ఆఫ్ సైన్స్ ‘’లో 1922 ఆటం క్వార్టర్ (శరదృతువు ) కు దరఖాస్తు చేశారు .మద్రాస్ లో రామయ్యగారు చదివిన సెయింట్ బీసెంట్ యూని వర్సిటీ నుండి ఏ విద్యార్దీ ఇక్కడి ఈ యూని వర్సిటీలో ఇంతవరకు చదవ లేదు .రామయ్యగారే  ప్రధములు .అయన శక్తి సామర్ధ్యాలమీద అంతనమ్మకం లేని యూని వర్సిటి అధికారులు ‘’అన్  క్లాసి ఫైడ్ ‘’విద్యార్ధిగా రిజిస్టర్ చేసుకొన్నారు ..చాలా తీవ్రంగా కస్టపడి చదివి ఫిజిక్స్ ,కేమిస్ట్రి, గణితం లో  నాలుగు మేజర్  క్వార్టర్స్ లో  ప్రావీణ్యత చూపారు . ఈ శాఖలలో ఇన్ఫార్మల్ పరీక్షలు నిర్వహించారు .అన్నిటా అద్వితీయంగా నిలిచారు .డిపార్ట్ మెంట్ ఆఫ్ ‘’కంపారటి వ్ పైలాలజి ‘’వారు రామయ్యగారికి సంస్కృతం లో మిగిలిన విద్యార్ధుల కంటే ప్రతిభ ఎక్కువగా ఉందని .ఈ ప్రావీణ్యత ఏ చార్టర్డ్ యూని వర్సిటీ ‘’లో చదివిన విద్యార్ధి ప్రావీణ్యం కన్నా చాలా ఎక్కువగా బాగుందని రిపోర్ట్ ఇచ్చారు .రామయ్య ఎంచుకొన్న విషయాలపై అనుభవం ,శిక్షణ సాధారణం గా ఉండాల్సిన కనీస జ్ఞానం కంటే చాలా  అధికం గానే  ఉన్నాయని ఏంతో సంతృప్తి చెందారు .వెంటనే 1924 జనవరి 1 న రామయ్యగారిని గ్రాడ్యుయేట్ స్కూల్ కు బదిలీ చేశారు .ఇది సుదూర దేశం లో రామయ్యగారు సాధించిన మొట్ట మొదటి ఘన విజయం ..      ఒక రోజు ఆయనకు దారిలో పరిచయం ఉన్న వ్యక్తీ తారసిల్లాడు .అతనే పొన్నాంబళం.శ్రీలంక వాడు .ఇద్దరం హిందువులమే అనుకొన్నారు రామయ్య .ఇద్దరూ విదేశం అమెరికా చేరటం యాదృచ్చికం . అయిదు వేల తొమ్మిది వందల తొంభై ఏళ్ళ క్రితం తమ కుటుంబాలు తమిళనాడు నుండి లంక కు వచ్చి చేరాయని ,అప్పటి నుండి అక్కడే ఉండిపోయామని ,తాము శ్రీలంక పౌరులం ,సింహళీయులం అని గర్వంగా చెప్పాడు .అప్పటి నుండి తాము శాపగ్రస్త విదేశీయులుగానే లంకీయులు వివక్ష చూపుతున్నారని పొన్నాంబలం వివరించాడు .రామయ్య గారి మనసులో బౌద్ధం మీద సాఫ్ట్ కార్నర్ ఉంది .సిద్ధార్ధుడు బుద్ధుడు అయి ,బోధలు చేసినా ఆయన్ను విషం పెట్టి చంపిన సంగతి గుర్తుకు వచ్చింది .మరణిస్తూ కూడా బుద్ధుడు శిష్యులను దగ్గరకు పిలుచుకొని తానూ ఈ భూమి మీద పుట్టిన పని పూర్తీ అయిందని తానిప్పుడు మళ్ళీ స్వర్గానికే చేరుకొంటు న్నానని  చెప్పిన  విషయం జ్ఞాపకమొచ్చింది .ఆయన కాలం లోనే కత్తులు దూసుకొన్న రాజులున్నారని అన్నారు. బుద్ధ నిర్యాణం తర్వాత  ఆ మతం లో  లో రూప విక్రియ(మెటా మార్ఫసిస్ ) చోటు చేసుకొన్నది జపాన్ లో సమురాయ్ బౌద్ధాన్ని అంగీకరించారు .మనవ గర్వాన్ని అణచుకొని తర్వాత శత్రువుల పీచం అణచాలన్నది వారి ధ్యేయం అయింది .భారత దేశం లో బుద్ధుడిని దేవుడినే చేసి ఆరాధించటం మొదలు పెట్టారు . అనేక విధాల విగ్రహాలు నిర్మించి పూజాదికాలు నిర్వహిస్తున్నారు .క్రమంగా బౌద్ధ సిద్ధాంతాలు కనుమరుగైపోయాయి .వేదాంతం బౌద్ధాన్ని దెబ్బ తీసింది .ఒక్క శ్రీలంక లోనే అసలైన బౌద్ధం సజీవంగా నిలిచి ఉంది అని తెలుసుకొన్నారు రామయ్యజీ .సెయింట్ ‘’ఎక్సూపరి’’ బోధించిన ‘’to love each other means to look together in one direction ‘’ అన్న సూక్తి నచ్చి ,నరనరాల్లో నిలిచిపోయింది రామయ్య గారికి .అలాగే హిక్మేట్ చెప్పిన ‘’love is not separated from the struggle for happiness of people ‘’కూడా బాగా నచ్చింది .

డిగ్నిటీ ఆఫ్ లేబర్

చికాగో లో చదువుకోవాలి అంటే చదువుకొంటూ పని చేయాల్సిందే అన్న సత్యం తెలిసింది .బరువులు మోసేవారు .రెస్టారెంట్  కిచెన్ లో పని చేశారు .ఏ పని ఎప్పుడు దొరికితే ఆ పని చేసి డబ్బు సంపాది౦చు కోనేవారు.అది నీచం అనే భావన ఎన్నడూ ఆయన మనసులో రాలేదు . ‘’డిగ్నిటీ ఆఫ్ లేబర్ ‘’అంటే ఇదే అని గ్రహించారు .అలాగే చదువు కొన సాగించారు .ఇక్కడ బతికి సాధించాలికనుక తిండి తినేవారు .ఆకలితో అలమటించటం లేదు .తాను  యువకుడు ,బల సంపన్నుడు కనుక అనారోగ్యం తన జోలికి వచ్చేదికాదు. కొవ్వొత్తి కరిగినట్లు రామయ్య గారిని చూసి జబ్బులు కరిగి మాయ మయ్యేవని చెప్పుకొన్నారు .తాను  విజ్ఞానాన్ని పొందాలి సైన్స్ ను జయి౦చాలన్నదే రామయ్య గారి ధ్యేయం .

చికాగో లో రామయ్యగారు చదివిన యూనివర్సిటి ఫోటో పెట్టాను చూడండి .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-4-15- ఉయ్యూరు

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.