నలభై దాటితే.. నటన అక్కర్లేదా?
- -రమ్య
- 30/04/2015
నలభై ఏళ్లు దాటిన నటీమణులను తల్లిపాత్రలకు ఎంపిక చేస్తున్నారే తప్ప నటనపరంగా అవకాశం లేకుండా పోతోందని ప్రఖ్యాత నటి, దర్శకురాలు రేవతి (48) ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఎలాంటి వైవిధ్యం లేని తల్లిపాత్రలు ఒకటి, రెండు సన్నివేశాలకే పరిమితం కావడంతో నడివయసు హీరోయిన్లు అసంతృప్తికి లోనవుతున్నట్లు ఆమె చెబుతోంది. కోచి (కేరళ)లో 1966లో జన్మించి, 1983లో సినీరంగ ప్రవేశం చేసిన ఆశా కుట్టి (రేవతి) మూడు సార్లు జాతీయ ఉత్తమనటిగా, ఆరు సార్లు ‘్ఫల్మ్‌ఫేర్’ అవార్డులను కైవసం చేసుకుంది. దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేసుకున్న ఈ నటి ప్రస్తుత సినీరంగ పోకడలపై తీవ్ర అసంతృప్తి చెందుతోంది. వయసుతో సంబంధం లేకుండా నటనను ఆవిష్కరించే పాత్రలు లభిస్తే సినిమా రంగానికి తాను ఎప్పుడూ దూరం కానంటోంది.
35- 45 ఏళ్ల వయసు కలిగిన నటీమణులకు తగిన పాత్రలను సృష్టించడంలో ఈకాలపు రచయితలు ఆసక్తి చూపడం లేదని రేవతి ఆరోపిస్తోంది. వయసుకు తగ్గ పాత్రలు వేస్తున్నప్పటికీ అందులో నటనకు అవకాశం లేకుంటే సినిమాలు చేయడం ఎందుకని ఆమె ప్రశ్నిస్తోంది. వృత్తిని సవాల్‌గా తీసుకుని, మంచి పాత్రలో నటించేందుకు ఎంతోమంది నడివయసు హీరోయిన్లు సిద్ధంగా ఉన్నారని అయితే- అందుకు తగ్గ పాత్రలే లేవని ఆమె అంటోంది. హిందీ, తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో మంచి నటిగా, దర్శకురాలిగా తనకు గుర్తింపు దక్కినప్పటికీ, ఇప్పటి సినిమాల్లో నటనకు చోటు లేకుండా పోయిందని చెబుతోంది. మంచి పాత్రలు లభించక పోవడంతో తాను గత రెండేళ్లలో ఒకే ఒక సినిమాలో నటించానని ఆమె గుర్తు చేస్తోంది. ఎక్కువ సినిమాల్లో నటించాలన్న తపన తనకు లేదని, మంచి పాత్ర లభిస్తే ఏ భాషలోనైనా నటించేందుకు సిద్ధమేనని అంటోంది. సినిమా అన్నది వినోదాత్మకమే అయినప్పటికీ నటనకు కూడా అవకాశం ఉండాలని, సామాజిక స్థితిగతుల్ని ప్రతిబింబించాలని ఆమె అంటోంది. కళాత్మకత, వినోదం సమపాళ్లలో మేళవిస్తేనే నటీనటులు, సాంకేతిక నిపుణుల శ్రమకు సార్థకత చేకూరుతుందని చెబుతోంది.
మహిళా సమస్యలను స్పృశిస్తూ తాను గతంలో పలు సినిమాలకు దర్శకత్వం వహించానని, అయితే- తాను నటించే పాత్రలన్నీ అలాగే ఉండాలని ఇతర దర్శకులపై ఒత్తిడి తెచ్చిన సందర్భాలు లేవంటోంది. మగ దర్శకుల్లా ఆలోచించి, వాణిజ్యపరమైన సినిమాలకు దర్శకత్వం చేయడం అంత సులభం కాదని, అనేక విషయాల్లో శిక్షణ, అవగాహన ఉంటే తప్ప అలాంటి సాహసాలు చేయలేమని రేవతి చెబుతోంది. ప్రేక్షకులు ఎప్పుడూ వైవిధ్యాన్ని కోరుకుంటారని, నటనకు అవకాశం లేని తల్లిపాత్రలు ఎవరికీ గుర్తు ఉండవంటోంది. ఎలాంటి పాత్రకైనా గుర్తింపు రావాలంటే అది రచయితల వల్లనే సాధ్యమవుతుందని ఆమె విశే్లషిస్తోంది. ఆధునిక యుగంలో అన్ని వయసుల మహిళలూ అనేక రకాల ఒత్తిళ్లను, సమస్యలను ఎదుర్కొంటున్నారని, వారి మనోభావాలకు అద్దం పట్టేలా పాత్రలను సృష్టిస్తే నటీమణులకు వృత్తిపరమైన సంతృప్తి దక్కుతుందని రేవతి చెబుతోంది.

